Advertisement

Advertisement


Home > Movies - Reviews

Rama Banam Review: మూవీ రివ్యూ: రామబాణం

Rama Banam Review: మూవీ రివ్యూ: రామబాణం

చిత్రం: రామబాణం
రేటింగ్: 2/5
తారాగణం: 
గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతిబాబు, ఖుష్బూ, నాజర్ తదితరులు
కెమెరా: వెట్రి పళనిస్వామి 
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి 
సంగీతం: మిక్కీ జె మేయర్ 
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల  
దర్శకత్వం: శ్రీవాస్ 
విడుదల తేదీ: 5 మే 2023

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన సినిమా అంటే కొన్ని అంచనాలుంటున్నాయి. కార్తికేయ2, ధమాక చిత్రాల తర్వాత వచ్చిన చిత్రం కనుక మరిన్ని ఆశలు కలగడం సహజం. గోపీచంద్ హీరోగా ఈ బ్యానర్ మీద ఈ సినిమా నేడు విడుదలయ్యింది. దర్శకుడు గతంలో ఐదారు కమెర్షియల్ సినిమాలు తీసిన శ్రీవాస్ కి గోపీచంద్ తో ఇది మూడవ సినిమా. ఆల్రెడీ "లక్ష్యం", "లౌక్యం" తీసారు. 

ఇంతకీ విషయంలోకి వెళితే రఘుదేవపురం అనే ఊరిలో ఆర్గానిక్ పంటల ద్వారా వచ్చే కాయగూరలు, ధాన్యాలతో మాత్రమే వండిపెట్టే హోటల్ నడుపుతూ ఉంటాడు ఒకాయన (జగపతిబాబు). అతనికొక టీనేజ్ తమ్ముడు (పెద్దయ్యాక గోపీచంద్). ఆ హోటల్ కి ఎదురుగా ఉండే మరొక హోటల్ యజమాని (నాజర్) ఈ ఆర్గానిక్ హోటల్ వల్ల తన వ్యాపారం దెబ్బతింటోందని కుట్రలు పన్నుతుంటాడు. అందులో భాగంగా ఆ హోటల్ లైసెన్స్ ని రుబాబు చేసి పట్టుకుపోతాడు. దాంతో తమ కుటుంబ వ్యాపారానికి అడ్డొస్తున్న అతని గోడౌన్ కాల్చేసి ఆ లైసెన్స్ ని వెనక్కి తీసుకొచ్చేస్తాడు టీనేజ్ తమ్ముడు. కానీ హింసవైపు అడుగేసిన తన తమ్ముడిని మందలిస్తాడు అన్న. ఎప్పటికైనా ఏదో ఒకటి అయ్యి వెనొక్కొస్తానని చెప్పి కలకత్తా రైలెక్కేసి పారిపోతాడు తమ్ముడు. అలా వెళ్లిన వాడు కలకత్తాలో క్రమంగా పెద్ద డాన్ అయిపోతాడు. కానీ ఒక కారణం వల్ల మళ్లీ బంధాలని వెతుక్కుంటూ ఇంటికొస్తాడు. ఆ కారణమేంటి? వచ్చాక ఏమౌతుంది? అది మిగతా కథ. 

ఇంతవరకు కథ చెప్పాక తక్కినది చెప్పమంటే వందలాది సినిమాలు చూసిన ప్రేక్షకులు ఊహించి చెప్పేయొచ్చు. సరిగ్గా అదే ఉంటుంది తెరమీద. "శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్" లో చిరంజీవి తన హింసని తన తండ్రి దగ్గర దాచినట్టు, "బాషా"లో రజనీకాంత్ తన తమ్ముడి దగ్గర దాచినట్టు ఇక్కడ గోపీచంద్ తన అన్న దగ్గర దాస్తుంటాడు. ఆ అన్న అతి మంచితనం వల్ల విలన్లు ఏర్పడడం, వాళ్లని అన్నకి తెలియకుండానే తమ్ముడు చావచితక్కొట్టడం చివరికి మూస పద్ధతిలో సినిమా ముగియడం జరుగుతాయి. 

ఈ కథలో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉండడం, హీరోకి సైడ్ కిక్కులు ఉండాలి కాబట్టి ఇద్దరు కమెడియన్స్ (గెటప్ శ్రీను, సత్య) ఉండడం కూడా ఫార్ములాలో భాగమే. 

ఇక దీనికి తోడు హై వోళ్టేజ్ ఫైట్స్, హీరో బిల్దప్పులు, "అతడు" సినిమాలో మహేష్ బాబుని గుర్తు తెచ్చేలాగ సింగిల్ క్లిక్కులో రూ 50 కోట్లు మొబైల్ ట్రాన్స్ఫర్ చేయడాలు (అఫ్కోర్స్.."అతడు"లో లక్షల్లోనే అనుకోండి), అత్యంత పేలవమైన కామెడీ ట్రాక్, ఊకదంపుడు లవ్ ట్రాక్ అన్నీ కలగలిపి పెదవి విరిచేలా చేస్తాయి. 

కథాకథనాలు తేలిపోయినా తెర మీద ప్రొడక్షన్ వేల్యూస్ మాత్రం బరువుగానే ఉన్నాయి. 

"నా ప్రాణమాగదు పిల్లో బెంగాలి రసగుల్ల" పాటొక్కటీ క్యాచీగా ఉంది తప్ప గుర్తుపెట్టుకోవడానికి సంగీతపరంగా ఏదీ లేదు. కెమెరా, యాక్షన్ కోరియోగ్రఫీ భారీగా ఉన్నాయి.

శ్రీవాస్ దర్శకత్వం పరమ వీక్. ఏ దర్శకుడైనా తలచుకుంటే సాధారణ కథని కూడా మేజికల్ గా తెరకెక్కించొచ్చు. బహుశా ఆ "తలచుకోవడం" లేక మూస కథకి పరమమూస దర్శకత్వం తోడయ్యింది. 

గోపీచంద్ తన పని వరకు బాగానే చేసాడు. ఒక పాటలో డ్యాన్స్ మూవ్మెంట్స్ కూడా బాగున్నాయి. 

డింపుల్ హయాతి ఉండడానికన్నట్టుగా ఉంది. సగటు బిలో ఏవరేజ్ కమెర్షియల్ సినిమాలోని హీరోయిన్ లాగ మూసగా రాయబడింది ఆమె పాత్ర.  

జగపతిబాబు గాంధీయిజం బోధించి చివరికి మాస్ ప్రేక్షకుల కోసం అన్నట్టుగా ట్రాకు మారుస్తాడు. 

ఖుష్బూ చేయాల్సినంత కొంత, చేయాల్సినదానికంటే ఎక్కువగా ఇంకొంత చేసి తన ఉనికిని చాటుకుంది. 

రాజారవీంద్ర సెకండాఫు మధ్య వరకు ప్యాడింగ్ ఆర్టిస్టులా ఉండి "ఓకే సార్" అని ఒక డైలాగ్ కొడతాడు. తర్వాత ఒక డైలాగ్ సీనుతో అతని క్యారెక్టర్ అయిపోయిందనిపిస్తుంది. 

వెన్నెల కిషోర్ మీద పెట్టిన కామెడీ లాంటి ట్రాకు చిరాకు తెప్పిస్తుంది. సత్య, గెటప్ శ్రీను, సప్తగిరి, ఆలి ఒక్కసారి కూడా సరిగ్గా నవ్వించలేకపోయారంటే కామెడీ రైటింగ్ ఎంత బ్యాడ్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

ఇవాళ యూట్యూబులో పాత సినిమాల నుంచి బోలెడన్ని కామెడీ సీన్స్ దొరుకుతున్నాయి. కావల్సినన్ని లవ్ ట్రాక్స్, ఫైట్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు కొత్తగా తీసిందేంటి? ఈ రకం సినిమా తీసి జనాన్ని హాలుకి రప్పించగలమన్న ధైర్యం ఏమిటి? ఏం నమ్మి ఈ కథని ఓకే చేసారో నిర్మాతలకే తెలియాలి. 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి సినిమాలంటే కరెమ్షియల్ ఫార్ములాలో ఉంటూనే కథలో ఎంతోకొంత కొత్తదనం ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. బహుశా ఆ ఇమేజ్ నుంచి బయటపడాలనుకుంటున్నారు కాబోలు..తాము కూడా సాదాసీదా బ్యానరే అని అనిపించుకోవాలని ఈ సినిమాని చేసినట్టు అనిపిస్తుంది. లేకపోతే ఎప్పటి కథ ఇది? కనీసం పదేళ్ల క్రితం తీసున్నా అప్పటికే పదేళ్ల నాటి పాత కథ అని అనేవాళ్లేమో. కళ్లు మూసుకుని పది పాత సినిమాల్ని తలచుకుని అందులో కొంత, ఇందులో కొంత లేపేసి ఈ కథ రాసేసినట్టు ఉందంతే. 

అనవసరంగా "రామబాణం" లాంటి మంచి టైటిల్ ని ఈ తుప్పుబాణానికి వాడేశారు. 

బాటం లైన్: తుప్పుబాణం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?