రివ్యూ: ఆడు మగాడ్రా బుజ్జి
రేటింగ్: 2/5
బ్యానర్: ఎస్.ఎన్.ఆర్ ఫిలింస్ ప్రై.లి.
తారాగణం: సుధీర్ బాబు, అస్మిత సూద్, అజయ్, పూనమ్ కౌర్, నరేష్, కృష్ణభగవాన్ తదితరులు
సంగీతం: శ్రీ
కూర్పు: తమ్మిరాజు
ఛాయాగ్రహణం: శాంటోనియో టెర్జియో
నిర్మాతలు: ఎం. సుబ్బారెడ్డి, ఎస్. ఎన్. రెడ్డి
కథనం, దర్శకత్వం: కృష్ణారెడ్డి గంగదాసు
విడుదల తేదీ: డిసెంబర్ 7, 2013
‘ప్రేమకథా చిత్రమ్’తో సక్సెస్ సాధించిన సుధీర్ బాబు ఇక కమర్షియల్ హీరోగా తన అదృష్టం ఎలాగుందో పరీక్షించుకోడానికి ‘ఆడు మగాడ్రా బుజ్జి’తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ‘ఆడు మగాడ్రా’ అనిపించుకోడానికి సుధీర్‌బాబు తన వంతుగా జిమ్‌లో బాగా కష్టపడి కండలు పెంచాడు. అతని ఎయిట్ ప్యాక్ ఫిజిక్ ఈ చిత్రం ప్రమోషన్స్‌కి బాగా వాడుకున్నారు. మరి ఆ కష్టానికి తగ్గ ఫలితం ఈ చిత్రంతో వచ్చే అవకాశముందా?
కథేంటి?
అల్లరి చిల్లరగా తిరిగే సిద్ధు (సుధీర్) తొలిచూపులోనే ఇందు (అస్మితా సూద్) ప్రేమలో పడతాడు. ఆమె చదువుతున్న కాలేజ్ తెలుసుకుని అక్కడే జాయిన్ అవుతాడు. కానీ ఆమె అన్న చెర్రీ (రణ్‌ధీర్) తన చెల్లి జోలికి వచ్చిన వారినల్లా చితగ్గొడుతుంటాడు. చెర్రీని ప్రేమిస్తుంటుంది అంజలి (పూనమ్ కౌర్). అంజలితో చెర్రీ ప్రేమలో పడేట్టు చేస్తే తన లైన్ క్లియర్ అవుద్దని అనుకుంటాడు సిద్ధు. కానీ అంజలి మేనమామ శంకర్ (అజయ్) ఆ ఊళ్లోనే పెద్ద రౌడీ. శంకర్‌ని బోల్తా కొట్టించి చెర్రీ, అంజలి పెళ్లి చేయడంతో పాటు తన లవ్ సక్సెస్ చేసుకోవడం కూడా సిద్ధు లక్ష్యం.
కళాకారుల పనితీరు!
సుధీర్‌బాబు మొదటి రెండు సినిమాల కంటే మెరుగయ్యాడు. కానీ ఇంకా చాలా బెటర్ అవ్వాలి. కెమెరా ముందు కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు కానీ ఎక్స్‌ప్రెషన్స్ పరంగా వీక్‌గా ఉన్నాడు. అంత కష్టపడి పెంచిన బాడీని పాటల్లో ప్రదర్శించి, యాక్షన్ సీన్స్‌లో దాచిపెట్టాడు… అదేంటో మరి! తనకి ఎయిట్ ప్యాక్ ఉంది అని చూపించడానికి చొక్కా విప్పినట్టు ఉంది కానీ ఈ క్యారెక్టర్‌కి అంత అవసరం లేదు. అస్మితా సూద్ గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు.
అజయ్‌కి ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ విలన్‌గా మరో అవకాశం దక్కింది. అతను గతంలో చేయనిది, కొత్తగా చేసింది ఇందులో ఏమీ లేదు. నరేష్‌ది రొటీన్ క్యారెక్టర్. ‘ఢీ’లో చంద్రమోహన్ చేసిన క్యారెక్టర్ యాజిటీజ్‌గా ఇందులో నరేష్ చేసాడు. పూనమ్ కౌర్‌కి పెద్దగా స్కోప్ లేదు. సుమన్, రణధీర్ తదితరులంతా తమ పరిధుల్లో నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
చిన్న చిత్రాలకి క్వాలిటీ అవుట్‌పుట్ ఇవ్వవచ్చునని నిన్న రిలీజ్ అయిన ‘ప్రేమ ఇష్క్ కాదల్’ రుజువు చేసింది. కానీ ‘ఆడు మగాడ్రా బుజ్జి’ మాత్రం సగటు లో బడ్జెట్ సినిమాలా కనిపించింది. సాంకేతికంగా చెప్పుకోతగ్గదంటూ ఏమీ లేదిందులో. ఈమధ్య డైలాగ్స్ రాయడమంటే ప్రాస ఉంటే చాలని రచయితలు ఫిక్స్ అయిపోయారు. ఆ ప్రయాస ఇందులోను డామినేట్ చేసింది. సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. ఒక్క పాట కూడా వినడానికి బాలేదు. నేపథ్య సంగీతం కూడా పాత కాలం పద్ధతుల్లో సాగింది.
కెమెరా పనితనం, ఎడిటింగ్ వగైరా ఏవీ కూడా చెప్పుకోతగ్గట్టు లేవు. నిర్మాతలు సినిమాకి అవసరమైనంత మేరకు ఖర్చు పెట్టారు. దర్శకుడు కృష్ణారెడ్డి ఒక మూస సినిమా తీయడానికే ప్రాధాన్యమిచ్చాడు. కొత్తదనం కోసం అస్సలు ప్రయత్నించలేదు. సినిమా అంతటా సేఫ్ ఆడాలనే చూశారు. ఇలాంటి ముతక కథలకి కనీసం ఆకట్టుకునే కథనం అయినా ఉండాలి. కానీ కృష్ణారెడ్డి అదీ రాసుకోలేదు.
హైలైట్స్:
- కుక్క కామెడీ
డ్రాబ్యాక్స్:
- స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్
విశ్లేషణ:
ఎన్నో సినిమాలు చూసేసిన సీన్లని తెచ్చి మళ్లీ ఒక సినిమాగా తీశారు ‘ఆడు మగాడు బుజ్జి’ బృందం. విలన్ ఇంట్లోకి ఏదో ఒక కారణంతో హీరో చేరడం, విలన్‌తో హీరో ఒక ఆట ఆడుకోవడం, అతడిని చివరిదాకా జోకర్‌ని చేయడం శ్రీను వైట్ల ఫార్ములా. ‘ఆడు మగాడ్రా బుజ్జి’కి యాజిటీజ్‌గా అదే ఫాలో అయిపోయారు. శ్రీను వైట్ల తీసినా కానీ ఇప్పుడు ఈ ఫార్ములా వర్కవుట్ కాదేమో అన్నంతగా జనానికి బోర్ కొట్టేసింది.
ఇలాంటి నాసి రకం ఊర కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఇప్పుడు ఇంపాజిబుల్. కామెడీ పరంగా కూడా క్వాలిటీ ఉంటేనే నవ్వుతున్నారు కానీ ఏదో ఒకటి చేసేసి నవ్వేసుకోమంటే కుదరదు. ఫస్టాఫ్‌లో కుక్కతో చేయించిన కామెడీతో దర్శకుడు ఇందులో ఆరోగ్యకరమైన హాస్యం పుట్టిస్తున్నాడేమో అనుకుంటే, ఆ తర్వాత కుక్కతో చేయించిన పనులు కూడా చీప్‌గా అనిపించాయి. అయినప్పటికీ కామెడీ పరంగా కుక్క ట్రాక్ ఒక్కటే క్లిక్ అయింది.
ఫస్టాఫ్ వరకు ఏదో అలా రొటీన్ గోలతో సాగిపోయినా, ద్వితీయార్థంలో మాత్రం కామెడీ కూడా సరిగా పేలకపోవడంతో ‘బుజ్జి’ టార్చర్ పెడతాడు. సెకండాఫ్ స్టార్ట్ అయిన దగ్గర్నుంచి శుభం కార్డు కోసం వేచి చూడడం మినహా ఎంజాయ్ చేయడానికి ఏమీ ఉండదు. ఇలాంటి రొటీన్ కథలతో కమర్షియల్ హీరోగా నిలబడడం కష్టమని సుధీర్‌బాబు గుర్తించాలి. పెద్ద స్టార్ అయినా కానీ ప్రతి సినిమాకీ క్యారెక్టర్స్ పరంగా వేరియేషన్స్ చూపించే తన బావ మహేష్‌బాబునుంచి కథల ఎంపిక చేసుకోవడమెలాగో నేర్చుకోవాలి.
కామెడీ పేరిట తెరపై ఎలాంటి చిల్లర పనులు చేసినా, సన్నివేశాలు లాజిక్‌కి అతీతంగా ఎంత హాస్యాస్పదంగా ఉన్నా కాలక్షేపమైపోతుందనే వారికి తప్ప ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సెన్సిబుల్ ఆడియన్స్‌కి భరించలేని హింసలా అనిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద ఈ బుజ్జి సేఫ్ కాగలిగితే నిజంగానే ఈడు మగాడ్రా బుజ్జి అని ప్రశంసించాలి.
బోటమ్ లైన్: పరమ రొటీన్రా బుజ్జి!
– జి.కె