డయానా ఆఖరి ప్రియుడు

పదహారేళ్ల క్రితం డయానా కారు ప్రమాదంలో మరణించిందని, అప్పుడు ఆమె పక్కన కారులో డోండి ఫయాద్‌ అనే ప్రియుడు వున్నాడనీ అందరికీ తెలుసు. డోండీ కంటె ముందు ఆమె హస్నత్‌ ఖాన్‌ అనే హార్ట్‌…

పదహారేళ్ల క్రితం డయానా కారు ప్రమాదంలో మరణించిందని, అప్పుడు ఆమె పక్కన కారులో డోండి ఫయాద్‌ అనే ప్రియుడు వున్నాడనీ అందరికీ తెలుసు. డోండీ కంటె ముందు ఆమె హస్నత్‌ ఖాన్‌ అనే హార్ట్‌ సర్జన్‌తో రెండేళ్లపాటు ప్రేమ వ్యవహారం నడిపింది. వారిద్దరి మధ్య నడిచిన ప్రేమకథ ఆధారంగా కేట్‌ స్నెల్‌ అనే రచయిత్రి 2001లో ''డయానా- హెర్‌ లాస్ట్‌ లవ్‌'' అనే పుస్తకం రాశారు. దాని ఆధారంగా యీ నెలలో సినిమా విడుదలైంది. ఆ సినిమాలో వాస్తవమెంత? కల్పన ఎంత? అన్నది ఆసక్తికరంగా మారింది. 

మామూలుగా అందరికీ తెలిసిన విషయాలేమిటంటే – 1995 ఆగస్టు 31న డయానా స్నేహితురాలు ఊనా భర్త జో టఫోలోకు బైపాస్‌ సర్జరీ జరిగింది. ఆమె డయానాకు ఫోన్‌ చేసి ఆసుపత్రికి రమ్మనమంది. లండన్‌లో రాయల్‌ బ్రాంప్‌టన్‌ హాస్పటల్‌కు వచ్చిన డయానా ఆ ఆపరేషన్‌ చేస్తున్న కార్డియో థొరాసిక్‌ సర్జన్‌ హస్నత్‌ ఖాన్‌ను చూసి ముచ్చటపడింది. పాకిస్తాన్‌కు చెందిన ఖాన్‌ ఇంగ్లండులో స్థిరపడి గుండెమార్పిడి ఆపరేషన్లలో ౖప్రావీణ్యత సంపాదించాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న అతను నిజానికి డయానా కంటె చాలా తక్కువ స్థాయిలో వున్నాడు. కానీ అతని మర్యాద, గాల్ఫ్‌ ఆట, జాజ్‌ సంగీతాన్ని ఆస్వాదించడం యివన్నీ చూసి డయానా యిష్టపడింది.  అప్పుడు ఆమె వయసు 34. ఇతని వయసు 36. బ్రహ్మచారి. పదిహేను రోజుల్లో అతని కలిసి డేట్‌ చేసింది. 'మా మేనత్త యింటికి వెళ్లి పుస్తకాలు తెచ్చుకోవాలి. కూడా వస్తావా?' అని అడిగాడతను. ఆమె వెళ్లింది. నవంబరు నెలాఖరులో ఆసుపత్రి నైట్‌ డ్యూటీ చేస్తున్న అతనివద్దకు ఆమె వెళ్లింది. 

ఆ తర్వాత వాళ్ల మధ్య సాన్నిహిత్యం మరింత బలపడింది. ఖాన్‌ తన గురువు మాగ్డీ యాకూబ్‌తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూంటాడు. 1996లో బీరూట్‌లో వున్న పాలస్తీనా శరణార్థుల శిబిరానికి వెళ్లినపుడు డయానా కూడా అతని కార్యక్రమాలకు సహాయపడింది. 1996 జూన్‌ నాటికి ప్రిన్స్‌ ఛార్లెస్‌తో విడాకులు తీసుకోవడం ఖాయం అని తేలిపోయాక డయానా తన స్నేహితులతో ఖాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పింది. 1997 మేలో తమ పెళ్లి గురించి ఆమె పాకిస్తాన్‌లో వున్న అతని కుటుంబంతో మాట్లాడింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆమె డోండీకి దగ్గరైంది. అతనితో కలిసి హాలీడేయింగ్‌కు వెళ్లింది. తిరిగి వచ్చాక జులై 28 న లండన్‌లోని బట్టెరెసా పార్క్‌లో ఖాన్‌ను కలిసి, తమ మధ్య రెండేళ్లగా నడిచిన ఎఫైర్‌ ముగిసిపోయిందని చెప్పింది. 'ఈమెకు వేరే ఎవరితోనో స్నేహం కుదిరింది' అనుకున్నాడు ఖాన్‌. కొన్ని రోజులు పోయాక ఆమె మరణం గురించి విన్నప్పుడు 'ఓహో ఆ ప్రియుడు డోండీ అన్నమాట' అని యితనికి తెలిసింది. 2006లో ఖాన్‌కు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. భార్య ఆఫ్గన్‌ కులీన కుటుంబానికి చెందినది. 18 నెలల తర్వాత వాళ్లు విడాకులు తీసుకున్నారు. అప్పటినుండి ఒంటరిగానే వున్నాడు. ఇప్పుడాయన ప్రభుత్వ సర్వీసు నుండి సెలవు తీసుకుని ఇథియోపియాలో హృద్రోగులైన పిల్లలకు వైద్యం చేస్తున్నారు. 

ఈ టైములో ఆ సినిమా వెలువడడం, తనను ఒక ప్రేమికుడిగా చూపుతూ సినిమా పోస్టర్లు వెలయడం అతనికి యిబ్బందిగా వుంది. అతను సినిమా చూడలేదు. చూసినవారిని కలవనూ లేదు. ఈ సినిమా వాస్తవాలకు దగ్గరగా వుంది అని అతను సర్టిఫై చేస్తే చిత్రవిజయానికి దోహదపడుతుంది కదాని నిర్మాతదర్శకుల ఆశ. కానీ వాళ్లు ఖాన్‌ను యీ ప్రాజెక్టు విషయంలో ఎప్పుడూ సంప్రదించలేదు. మెలోడ్రామా కోసం వాళ్లు కొన్ని ఘట్టాలు సినిమాలో చొప్పించారు. ఓ సీనులో ఖాన్‌ మేనమామ పాకిస్తాన్‌నుండి వచ్చి 'డయానా మన ముస్లిం కుటుంబంలో యిమడలేదు. నువ్వు కుటుంబాన్నో, డయానానో ఎవరో ఒకర్ని ఎంచుకోవాలి.' అని చెప్తాడు. 'ఇది పూర్తిగా అభూతకల్పన. నా తలిదండ్రులే కాదు, మా నాయనమ్మ కూడా డయానా అంటే యిష్టపడ్డారు. మా వ్యవహారానికి వాళ్లు అభ్యంతరం చెప్పలేదు.'' అంటున్నాడు ఖాన్‌. 
'అయితే నిజంగా జరిగినదేమిటో చెప్పవచ్చు కదా' అంటే 'అది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. ప్రతీవాడికీ రసవత్తరమైన విషయాలు కావాలి. అవి నేను ఎవరికీ చెప్పను. అత్యంత సన్నిహితులైన నా స్నేహితులకు తప్ప మా విషయం ఎవరికీ తెలియదు.  డయానా ప్రియుణ్ని కానని చెప్పలేను. ఎందుకంటే అది చరిత్ర కెక్కిన విషయం. కానీ రాబోయే తరాలు నన్ను ఒక మంచి డాక్టరుగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నాకు వేరే రకమైన గుర్తింపు తెస్తోంది. అదే నాకు బాధగా వుంది.' అంటాడు ఖాన్‌.  

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]