Advertisement


Home > Movies - Reviews
సినిమా రివ్యూ: బాబు బంగారం

రివ్యూ: బాబు బంగారం
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: వెంకటేష్‌, నయనతార, సంపత్‌ రాజ్‌, పృధ్వీ, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, జయప్రకాష్‌, మురళి శర్మ, షావుకారు జానకి, ప్రియ తదితరులు
కథ, మాటలు: మారుతి, 'డార్లింగ్‌' స్వామి
సంగీతం: జిబ్రాన్‌
కూర్పు: ఎస్‌.బి. ఉద్ధవ్‌
ఛాయాగ్రహణం: రిచర్డ్‌ ప్రసాద్‌
సమర్పణ: ఎస్‌. రాధాకృష్ణ
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్‌
కథనం, దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: ఆగస్టు 12, 2016

'భలే భలే మగాడివోయ్‌'తో 'భళా' అనిపించుకున్న మారుతి 'బాబు బంగారం'తో 'బాబోయ్‌' అనిపిస్తాడని ఎవరు ఊహించగలరు? తన పంథా మార్చుకుని కథాబలం వున్న చిత్రాలకే ప్రాధాన్యమిస్తోన్న వెంకటేష్‌ ఓ బలహీనమైన కథకి పచ్చ జెండా ఊపి ఉంటారని ఎవరు మాత్రం పసిగడతారు?

పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ తీయాలనే మారుతి తపన తెలుస్తూనే ఉన్నప్పటికీ, తనకి అనిపించిన 'కామెడీ' మనకి కామెడీగా అనిపించకపోవడం, తనకి స్ట్రాంగ్‌ అనిపించిన ఎమోషన్లు మనకి వీక్‌గా తోచడం, హిట్‌ సినిమా తీస్తున్నాననే భ్రమలో తనకి తెలీకుండానే 'ఆగడు' వెర్షన్‌ 2.0 తీర్చిదిద్దడం... ఒకటీ, రెండూ అని కాదు తొలి సీన్‌లోనే ట్రాక్‌ తప్పిన సినిమా అసలు పట్టాలెక్కనే లేదు. ఆదిలోనే పక్కదారి పట్టిన సినిమా అంతకంతకీ పాతాళానికి పడిపోయిందే తప్ప ఒక్కసారైనా గ్రాఫ్‌ పైకి లేవలేదు. 

ఇంతకు ముందు తన కథల ఎంపికలో వైవిధ్యం కోసం తపించిన మారుతి ఈసారి 'భలే భలే' హ్యాంగోవర్‌లో ఈ కథ రాసుకున్నాడని అనిపిస్తుంది. అందులో హీరో పాత్రకి మతిమరపు క్యారెక్టరైజేషన్‌ పెట్టినట్టే ఇందులో హీరోకి 'జాలి' అనే బలహీనత పెట్టాడు. అయితే 'భలే భలే' కథకి హీరో మతిమరపే సినిమాని నడిపించే ఇంధనమైంది. కానీ ఇక్కడ హీరోకి 'జాలి' అనేది కేవలం కామెడీ పండించడానికి చేసిన డెస్పరేట్‌ అటెంప్ట్‌లా అనిపిస్తుందే తప్ప కథకి దాని వల్ల ఒరిగిందేమీ లేకుండా పోయింది. హీరోకి జాలి గుణం తన తాత దగ్గర్నుంచి వచ్చిందంటూ మొదటి సీన్లో వెంకీని 'సూర్యవంశం' గెటప్‌లో చూపించారు. ఆ సీన్‌ పేలవంగా ఉండడంతో 'బాబు బంగారం'కి ఓపెనింగే మిస్‌ఫైర్‌ అయిపోయింది. పది నిమిషాలు గడిచినా ఒక్క సీన్‌ కూడా పండకుండా చప్పగా సాగిపోతుంటేనే ఆసక్తి కరిగిపోతూ ఉంటుంది. ఒక అరగంట గడిచే సరికి ఇది 'మారుతి' సినిమాయేనా అనే అనుమానం కూడా వచ్చేస్తుంది. గుర్తుండే ఒక్క కామెడీ సీన్‌ కానీ, నవ్వించే ఒక్క డైలాగ్‌ కానీ లేకుండా కేవలం ఇంటర్వెల్‌ కోసం కాలక్షేపం చేస్తోన్న సినిమాలా మాటిమాటికీ పాటలోకో, ఫైట్‌లోకో జంప్‌ చేస్తూ ఉంటుంది.

హీరో జాలి గుణం చూపించడానికి రాసుకున్న సీన్లేవీ పండలేదు. రౌడీలని కొట్టి వారికి మెడికల్‌ ఖర్చులు భరించడం, నయనతారకి నష్టం రాకూడదని రోడ్డు మీద ట్రాఫిక్‌ ఆపి భోజనాలు పెట్టించడం లాంటి సీన్లు తేలిపోయాయి. హీరోయిన్‌ ట్రాక్‌ ఎమోషనల్‌గా ఉండాలో, కామెడీగా అనిపించాలో తనకే తెలియని అయోమయంలో ఉండి రాసుకున్నట్టు ఉంటుంది. విలన్‌ క్యారెక్టర్స్‌ పరంగా కూడా ఆ కన్‌ఫ్యూజన్‌ నడుస్తూనే ఉంటుంది. సంపత్‌రాజ్‌ వెనుక సంగీత వాయిద్యాలు వాయిస్తూ నలుగురు నిలబడతారు. అది చూసి అతనో మ్యూజిక్‌ లవర్‌ అనుకోవాలి. అది పెట్టినందుకు కనీసం దానిని రిజిష్టర్‌ చేయడానికి కూడా మారుతి ప్రయత్నించలేదు. 'భలే భలే మగాడివోయ్‌' కథనం ఎంత పకడ్బందీగా ఉంటుందో, 'బాబు బంగారం' స్క్రీన్‌ప్లే అంత డొల్లగా అనిపిస్తుంది. కేవలం టైమ్‌ ఫిల్లింగ్‌కి మాత్రమే చాలా సీన్లని, పాటలని వాడుకున్న ఫీలింగ్‌ కలుగుతుంది. 'బత్తాయిల బాబ్జీ'గా పృధ్వీ ఎంటర్‌ అయినప్పుడు అతను చేసే కామెడీతో అయినా చలనం వస్తుందేమో అనుకుంటే, ఆ క్యారెక్టర్‌ కూడా లౌడ్‌ కామెడీతో ఎలాగైనా నవ్వించడానికి నానా పాట్లు పడుతుంటుంది. నాన్నకు ప్రేమతో స్పూఫ్‌తో సహా చాలా చేసినా పృధ్వీ కామెడీ 'బాబు బంగారం' ఫేటు మార్చేంతగా క్లిక్‌ కాలేకపోయింది.

హీరోయిన్‌ నాన్న ఓ హత్యకేసులో చిక్కుకుని కుటుంబానికి దూరంగా బతుకుతుంటాడు. అతని ఆచూకీ తెలుసుకోవడానికి తన ఐడెంటిటీ మార్చుకుని హీరోయిన్‌కి హీరో దగ్గరవుతాడు. ఈ లైన్‌ వింటే నాగార్జున, ప్రియదర్శన్‌ల 'నిర్ణయం' గుర్తొస్తుంది. ఆ కథనుంచే స్ఫూర్తి పొందారో, కొత్త కథ అనుకునే రాసుకున్నారో కానీ 'నిర్ణయం' కథకి 'ఆగడు' తరహా ట్రీట్‌మెంట్‌ ఇస్తే ఎలా తయారవుతుందనే దానికి ఆన్సర్‌గా 'బాబు బంగారం' నిలుస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ చాలా నాసిరకంగా సాగిపోయినా, ఇంటర్వెల్‌ తర్వాత అయినా మారుతి మార్కు కామెడీ ఉంటుందేమో అని ఎక్స్‌పెక్ట్‌ చేస్తే... తన దగ్గర కనీసం 'హాఫ్‌ బేక్డ్‌' కథ కూడా లేదనే సంగతి స్పష్టం చేయడానికి మారుతి ఎక్కువ టైమ్‌ తీసుకోలేదు. తాతయ్య నుంచి జాలిగుణం అబ్బిందని చెప్పడానికో సీన్‌ పెట్టుకున్న మారుతి... సెకండ్‌ హాఫ్‌లో ఆ జాలిగుణాన్ని వదిలేసుకుంటున్నానని అంటూ తన తాత ఫోటోని చూస్తూ హీరో అతడిని దూషించే సీనొకటి పెట్టాడు. అసలు ఈ సీన్‌ ఇంతమంది కళ్లుగప్పి ఫైనల్‌ కట్‌లోకి ఎలా చేరిందా అనిపిస్తుంది. రాసినప్పుడు, తీసినప్పుడు తెలియకపోవచ్చు, కనీసం తెరపై చూసినప్పుడు అయినా ఇది ఎంత సిల్లీగా ఉందనేది తెలిసుండాలిగా!

పెన్‌డ్రైవ్‌ పేరిట పోసానితో కావాల్సినవన్నీ చేయించుకునే సీన్లు కానీ, బ్రహ్మానందంతో చేయించిన మ్యాజిక్‌ మైసమ్మ క్యారెక్టర్‌ కానీ 'బాబు బంగారం' దైన్య స్థితిని ఏమాత్రం మార్చలేకపోయాయి. పైగా ఒక టైమ్‌లో 'ఆ వీడియోనే నా దగ్గరుంటే కమెడియన్లతో కాలక్షేపం చేస్తూ ఎందుకు కూర్చుంటా' అని వెంకటేషే అంటాడంటే, ఇదంతా క్లయిమాక్స్‌కి ముందు 'పొద్దు పుచ్చే' వ్యవహారమే అనే సంగతి మారుతికీ తెలుసునని మనకి తెలిసిపోతుంది. 'టైగర్‌ వెజ్‌ తింటే వెటకారంగా చూసారు కదా... ఇప్పుడు నాన్‌వెజ్‌ తినడం స్టార్ట్‌ చేసింది. ఇక నరకమే ఒక్కోడికీ' అంటే క్యారెక్టరైజేషన్‌లో వేరియేషన్‌ ఇచ్చారేమో అనుకుంటాం కానీ 'నరకమే ఒక్కోడికీ' అంటూ మనకే ఏదో హింటిచ్చిన సంగతి కాస్త లేట్‌గా రీచ్‌ అవుతుంది. 

వెంకటేష్‌ శాయశక్తులా కృషి చేసినా ఈ కంచు... కనకం కాలేకపోయింది. నయనతార సైతం తేలిపోయింది. పృధ్వీ, పోసాని చాలా బలంగా ప్రయత్నిస్తే కొంత నవ్వించగలిగారంతే. బ్రహ్మానందం నవ్వించలేకపోతున్నారంటే అది ఆయనకి ఇలాంటి పాత్రలిస్తున్నవారిదీ, రాస్తున్నవారిదీ తప్ప ఆయనది కాదు. బిల్డప్‌ తప్ప బిజినెస్‌ లేని విలన్‌ క్యారెక్టర్‌లో సంపత్‌ రాజ్‌ యాడ్‌ చేసిన వేల్యూ ఏమీ లేదు. 

సంభాషణలు పేలవంగా అనిపిస్తాయి. జిబ్రాన్‌ పాటలు ఎక్కడో విన్న భావన కలిగిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా సందర్భాల్లో సీన్‌తో సంబంధం లేకుండా వినిపిస్తుంది. విజువల్స్‌ బాగున్నాయి. క్వాలిటీ పరంగా నిర్మాతలు రాజీ పడలేదనేది ప్రతి ఫ్రేమ్‌లో తెలుస్తుంది. 

షూటింగ్‌ మొదలైన దగ్గర్నుంచీ 'ఎప్పుడొస్తుందా' అని ఎదురు చూసేలా చేసిన 'బాబు బంగారం', తెరపై మొదలైనప్పట్నుంచీ 'ఎప్పుడైపోతుందా' అని పడిగాపులు పడేట్టు చేసింది. మారుతి సినిమాల్లో వినోదం ఎలాగుంటుందనేది మనకింతకు ముందే తెలుసు, అతని సినిమాలు విసిగిస్తే ఎలా ఉంటుందనే దానికి ఇది ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. 

బోటమ్‌ లైన్‌: గిల్టు బంగారం!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri