cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: బందిపోటు

సినిమా రివ్యూ: బందిపోటు

రివ్యూ: బందిపోటు
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: ఇ.వి.వి. సినిమా
తారాగణం: అల్లరి నరేష్‌, ఈష, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్‌, సంపూర్ణేష్‌ బాబు, శుభలేఖ సుధాకర్‌, సప్తగిరి తదితరులు
సంగీతం: కళ్యాణ్‌ కోడూరి
కూర్పు: ధర్మేంద్ర కాకరాల
ఛాయాగ్రహణం: పి.జి. విందా
నిర్మాతలు: రాజేష్‌ ఈదర, నరేష్‌ ఈదర
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
విడుదల తేదీ: ఫిబ్రవరి 20, 2015

తమ సినిమాలకి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్లు పెట్టుకుని వస్తారనేది చాలా మంది హీరోలకే తెలీదు. సదరు సినిమా టైటిల్‌ని బట్టి, ఆ సినిమా ట్రెయిలర్లని బట్టి, లేదా దర్శకుడిని బట్టి.. ఇలా ఏదో ఒక దానిని బట్టి అంచనాలు ఏర్పడుతుంటాయి, మారుతుంటాయి. అందుకే వాటిని అందుకోవడమెలాగో తెలీక ఇబ్బంది పడుతుంటారు. అందుకోలేక అపజయం పాలవుతుంటారు. కానీ అల్లరి నరేష్‌ చాలా లక్కీ. ఎందుకంటే తన సినిమాపై ఆడియన్స్‌కి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయనేది అతనికి క్లియర్‌గా తెలుసు. ఆ ఎక్స్‌పెక్టేషన్లు ఏ సినిమాకీ మారే అవకాశం కూడా లేదు. తననుంచి ఏం ఆశిస్తారనేది తెలిసిపోయిన హీరో పని ఈజీ. జస్ట్‌ ఆ అంచనాలకి తగ్గట్టు కథలు ఎంచుకుని, తన ఇమేజ్‌కి కట్టుబడి ఉండడమే. 

ఒక స్టార్‌ హీరో ప్రతి సినిమాలోను విలన్ల మీద పగ తీర్చుకునే పని మీదే ఉంటున్నాడనుకోండి.. అన్నిట్లో ఇదే చేస్తున్నాడని విమర్శకులు, ప్రేక్షకులు పెదవి విరిచేస్తారు. కానీ అల్లరి నరేష్‌ అన్ని సినిమాల్లోను కామెడీ చేస్తున్నాడనే కంప్లయింట్‌ ఉండదు. ఎందుకంటే అతడి నుంచి మనకి కావాల్సిందే అది కాబట్టి. అంచనాలు లేని జాబ్‌ చేయడం ఓ విధంగా అదృష్టమే అయినా... అది అంత తేలికైన పని కాకపోవడం నరేష్‌కి ఉన్న కష్టం. ఎందుకంటే కామెడీ చేయడం అనుకున్నంత తేలికేం కాదు. అన్నిట్లోకీ జనాన్ని నవ్వించడమే కష్టమైన పని. మామూలు సినిమాల్లోనే కామెడీ తక్కువ ఉంటే వినోదం లేదని విసిగిపోతుంటారు తెలుగు సినీ ప్రేక్షకులు. ఇక అచ్చంగా కామెడీ సినిమా అని ఫిక్స్‌ అయి వచ్చినపుడు వారిని మెప్పించే స్టాండర్డ్స్‌ అన్ని సినిమాల్లోను మెయింటైన్‌ చేయడమంటే మాటలు కాదు. 

కామెడీని నరనరాన జీర్ణించేసుకున్న ‘హాస్య బ్రహ్మ’ ఇ.వి.వి. సత్యనారాయణ ఉన్నంత కాలం నరేష్‌కి ప్రేక్షకుల్ని ఎలా మెప్పించాలనే దిగులుండేది కాదు. తనకి అవసరం పడ్డప్పుడల్లా ఇవివి తనతో ఒక నిఖార్సయిన కామెడీ తీసి పాస్‌ చేయించేసేవారు. ఈమధ్య తనని అలా గట్టెక్కించే దర్శకులు దొరకడం లేదు. ప్రేక్షకులు కోరుకునే స్థాయి వినోదం ఉన్న కథలు అతని దాకా వెళ్లడం లేదు. ఫలితంగా నరేష్‌ కొంత కాలంగా ఫెయిలవుతూ వస్తున్నాడు. 

ఈ నేపథ్యంలో అష్టాచమ్మా, అంతకుముందు ఆ తరువాత లాంటి చిత్రాలు తీసి వినోదం పండించడంలో తనదైన శైలి చూపించిన మోహనకృష్ణ ఇంద్రగంటిపై నమ్మకం ఉంచాడు. తననుంచి జనం కోరుకునే వినోదాత్మక చిత్రాన్ని ఇతనైతే అందించగలడని బలంగా నమ్మాడు. అందుకే తన సొంత బ్యానర్‌లోనే ‘బందిపోటు’ తీసాడు. ఇంతకు ముందు ఇ.వి.వి. సినిమా బ్యానర్లో వచ్చిన చిత్రాల్లో ఉన్నదీ... ఈ ‘ఇ.వి.వి. సినిమా’లో లేనిది ‘ఇ.వి.వి’! 

Watch Bandipotu Public Talk

‘బందిపోటు’ సినిమాలో అన్నీ ఉన్నాయి... హీరో, మేకింగ్‌ వేల్యూస్‌, కేపబుల్‌ డైరెక్టర్‌, గుడ్‌ స్టార్‌కాస్ట్‌. కానీ లేనిది కడుపుబ్బ నవ్వించే కామెడీ... కానరానిది చివరి వరకు చూడాలనిపించే ఆసక్తి. మిగతావెన్ని ఉన్నా అల్లరి నరేష్‌ సినిమాలో ఈ రెండూ లేకపోతే ఆస్వాదించడం కష్టం. తననుంచి ఎక్స్‌పెక్ట్‌ చేసేవే అవి అయినపుడు... అవే లేకపోతే ఇక ఎలా సంతృప్తి చెందడం? 

ధనికులకి టోకరా ఇచ్చే విశ్వనాథ్‌ (నరేష్‌) ఒక అసైన్‌మెంట్‌ టేకప్‌ చేస్తాడు. జాహ్నవి (ఈష) తన తండ్రిని మోసం చేసిన ముగ్గురు బడా బాబులకి టోపీ పెట్టి బుద్ధి చెప్పమని విశ్వనాధ్‌ని అడుగుతుంది. ఆమె అడిగిన ప్రకారం మకరందం (తనికెళ్ల భరణి), శేషగిరి (రావు రమేష్‌), భలే బాబులకి (పోసాని కృష్ణమురళి) విశ్వనాధ్‌ తనదైన శైలిలో ఎలా బుద్ధి చెప్పాడనేది కథ. విలన్లని తెలివిగా మోసం చేసి పగ తీర్చుకోవడమనేది కొత్త కాన్సెప్ట్‌ ఏమీ కాదు. గతంలో పలు చిత్రాల్లో వాడేసిన ఫార్ములానే. ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ‘అతడే ఒక సైన్యం’ చిత్రానికి, ఈ బందిపోటుకీ దగ్గరి పోలికలున్నాయి. కానీ అందులో ఉన్న కామెడీలో సగం కూడా ఇందులో లేదు. 

జోకు మీద జోకులేస్తూ గిలిగింతలు పెట్టేసే స్టయిల్‌ ఇంద్రగంటిది కాదు. మాస్‌ జనాలు ఎంజాయ్‌ చేసే మొరటు కామెడీ కూడా అతని సినిమాల్లో ఉండదు. ఆహ్లాదకర సంభాషణలతో, ఆకట్టుకునే సన్నివేశాలతో పెదవులపై చిరు మందహాసం చెదరకుండా చూసుకోవడం తన శైలి. అల్లరి నరేష్‌ సినిమాలు అచ్చంగా దీనికి ఆపోజిట్‌గా ఉంటాయి. కాబట్టి అతని వరకు ఇది ఖచ్చితంగా వేరియేషనే. ఇంతకుముందు అతను చేసిన చిత్రాలకీ, దీనికీ చాలా వ్యత్యాసముంది. అలా అని ఇంద్రగంటి స్టయిల్లో క్లాస్‌ కామెడీ పండిందని చెప్పడానికీ లేదు. ఎక్కడో ఒకటీ అరా సందర్భాల్లో మినహా ‘బందిపోటు’ నవ్వించదు. విలన్లకి బుద్ధి చెప్పే ప్రాసెస్‌ని చాలా ఫన్నీగా తీసి ఉండవచ్చు. రావు రమేష్‌కి ఎదురయ్యే అనుభవంలో కాస్తయినా కామెడీ పండింది. కానీ పోసానితో పెట్టుకున్న వ్యవహారమంతా నస పెట్టింది. రాజకీయాల నేపథ్యంలో హీరో వేసే ఎత్తులు, చేసే జిత్తులు ఆకట్టుకోవు. బలవంతంగా నవ్వుదామన్నా నవ్వలేని పరిస్థితిలోకి బందిపోటు నెట్టేస్తుంది. 

కామెడీ చేయడానికి స్కోప్‌ ఉన్నా, అది చేసే ఆర్టిస్టులు అంత మంది ఉన్నా కానీ ఇంద్రగంటి మోహనకృష్ణ రాసుకున్న బలహీన సన్నివేశాలు, వినోదం లేని కథనం ద్వితీయార్థంలోకి వచ్చేసరికి బాగా విసిగిస్తుంది. ప్రథమార్థంలో అయినా అక్కడక్కడా కొన్ని చమక్కులున్నాయి కానీ సెకండాఫ్‌లో వచ్చే ఆ రాజకీయ ప్రహసనాన్ని భరించడం చాలా కష్టం. ఫస్ట్‌ హాఫ్‌ని గంటకి సరిపెట్టారు... మరి ఇంత సాగదీసిన ద్వితీయార్థంలో ఏది బాగుందని అంత సేపు ఉంచేసారో మరి. అల్లరి నరేష్‌ రెగ్యులర్‌గా చేసే పాత్రలకి భిన్నంగా స్టయిలిష్‌గా కనిపించాడు. కానీ ఇందులో తను ఉన్నా ఒకటే... ఇంకెవరున్నా ఒకటే అన్నట్టుగా అసలు తన మార్కు కామెడీ కాస్తయినా లేదు. సంపూర్ణేష్‌ బాబుని చూపిస్తే నవ్వేస్తారని భ్రమ పడ్డారేమో ఎవరైనా అనుభవమున్న నటుడైతే అంతో ఇంతో ఉపయోగపడి ఉండేవాడు. ఇతను పూర్తిగా వృధా అయ్యాడు. రావు రమేష్‌, తనికెళ్ల భరణి మాత్రం తమ అనుభవాన్ని జోడించి మెప్పించారు. ఈమధ్య లౌడ్‌ కామెడీతో బాగానే నవ్విస్తోన్న పోసాని కృష్ణమురళి కూడా తేలిపోయాడు. ఈషది ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌.. అంతకుమించి తనగురించి చెప్పడానికేం లేదు.

Watch Bandipotu Public Talk

అల్లరి నరేష్‌ సినిమాల్లో పాటల అవసరం ఎంత అనేది డిబేటబుల్‌. పాటల్ని రిచ్‌గా చిత్రీకరించారు. తమ బ్యానర్‌పై సినిమాకి క్వాలిటీ ఉండాలని ఈదర బ్రదర్స్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. అదే రాజీ పడని ధోరణి కథని ఎంపిక చేసుకోవడంలోను చూపించి ఉంటే ఫలితముండేది. విందా సినిమాటోగ్రఫీ బాగుంది. నరేష్‌ సినిమాల్లో ఇలా కలర్‌ఫుల్‌ విజువల్స్‌ చాలా చాలా అరుదుగా కనిపిస్తాయి. 

నరేష్‌కి ఇది డిఫరెంట్‌ మూవీ కావచ్చునేమో కానీ ఇప్పుడతనికి అత్యవసరమైన సినిమా అయితే కాదిది. తననుంచి ఆశించే లక్షణాలు బొత్తిగా లేని ఈ చిత్రం వీక్‌ స్క్రిప్ట్‌తో, ఆ కాస్త కామెడీతో నెగ్గుకురావడం కష్టమైన పని. ఈ బందిపోటు కథలో విలన్లని దోచుకోవడమేమో కానీ తన విన్యాసాలు చూద్దామని వచ్చిన వారి విలువైన సమయాన్ని మాత్రం బాగానే దోచుకున్నాడు. మరి ఇన్ని బలహీనతలతో బాక్సాఫీస్‌ని దోచుకోగలడో లేదో అనేదే చూడాలి. 

బోటమ్‌ లైన్‌: బంది‘పోటు’ - నవ్వులు తక్కువ.. నస ఎక్కువ!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!