దాసరి సీనియర్ దర్శకుడే కాదని అనేది లేదు. అనుభవం పండిన పెద్దాయినే. అందులో అసత్యం లేదు. అంత మాత్రం చేత ఆయన సర్టిఫికెట్ ఏమన్నా ఐఎస్ఐ మార్కా? పూరి జగన్నాధ్ కొత్తగా మెగాఫోన్ పట్టారా? ఇప్పటికి ఎన్నో సినిమాలు తీసారు. మంచి పేరు సంపాదించారు. ఆయనకు కొత్తగా సర్టిఫికెట్ ఇచ్చేదేమిటి? దానిని పట్టుకుని, ఫేస్ బుక్, ట్విటర్, మీడియాకు హడావుడి ఎందుకు?
' నేను వారసుడు లేకుండా వెళ్లిపోతా అనుకున్నా..నువ్వు దొరికావ్..నా వారసుడివి నువ్వే' అన్నారట పెద్దాయిన దాసరి. అంటే దాసరి హిట్ సినిమాలు తీయడం ఆగిపోయిన దగ్గర నుంచి ఇంతవరకు ఆయన కంటికి ఏ డైరక్టర్ ఆనలేదన్నమాట. ఆయన ఎప్పుడో..అల్లప్పుడెప్పుడో హిట్ సినిమా తీసారు. తరువాత అన్నీ డిజాస్టర్లే. కానీ ఈ లోగా ఎందరో కొత్త వాళ్లు, సీనియర్లు మంచి మంచి సినిమాలు తీసారు. అయినా ఆయనకు వాళ్లలో వారసుడు కనిపించలేదు. ఇప్పుడు పూరిలో కనిపించారు. సంతోషం.
సినిమా రంగంలో ఇలాంటి మెచ్చుకోలు ప్రకటనలు చాలా వినిపిస్తూనే వుంటాయి. ఆడియో ఫంక్షన్లలో భజనలు మామూలే. వీటిని ఎవరూ సీరియస్ గా తీసుకోరు. కానీ పూరి మాత్రం దాసరి కాంప్లిమెంట్ ను సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అవును ..ఇంతకీ పూరి మెంటర్ లాంటి వర్మ కూడా పనిలో పనిగా ' నా వారసుడివి నువ్వే' అని ఓ కితాబు ఇచ్చేస్తే పోలా?