రివ్యూ: గడ్డం గ్యాంగ్
రేటింగ్: 2/5
బ్యానర్: శివాని శివాత్మిక మూవీస్
తారాగణం: రాజశేఖర్, షీనా, అచ్చు, నరేష్, సీత, నోయెల్, సత్యం రాజేష్, నాగబాబు, గిరిబాబు, ముమైత్‌ఖాన్ తదితరులు
సంగీతం: అచ్చు
కూర్పు: రిచర్డ్ కెవిన్
ఛాయాగ్రహణం: డేమిల్ గ్జావియర్ ఎడ్వర్డ్స్
నిర్మాతలు: శివాని, శివాత్మిక
సమర్పణ: జీవిత రాజశేఖర్
దర్శకత్వం: సంతోష్ పీటర్ జయకుమార్
విడుదల తేదీ: ఫిబ్రవరి 6, 2015
చాలా కాలంగా సక్సెస్ లేని డా॥ రాజశేఖర్ తమిళంలో విజయవంతమైన ‘సూదుకవ్వుం’ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో ‘గడ్డంగ్యాంగ్’ పేరిట రీమేక్ చేసాడు. ఈసారి అయినా ఆయనకి అదృష్టం కలిసి వచ్చిందో లేదో చూద్దాం.
కథేంటి?
గడ్డం దాస్ (రాజశేఖర్) తన గ్యాంగ్‌తో కలిసి పంచ సూత్ర ప్రణాళికతో చిన్న చిన్న కిడ్నాపులు చేస్తుంటాడు. ఎవరినీ నొప్పించకుండా తక్కువ మొత్తాల్లో డబ్బులు వసూలు చేస్తూ పోలీసులకి చిక్కకుండా దాస్ తన ప్లాన్ అమలు చేస్తుంటాడు. అయితే ఓ మంత్రి కొడుకుని కిడ్నాప్ చేస్తే రెండు కోట్లు రాబట్టవచ్చునని గడ్డం గ్యాంగ్‌కి తెలుస్తుంది. తన సూత్రాలకి విరుద్ధమైనా కానీ ఆ కిడ్నాప్‌కి దాస్ రెడీ అవుతాడు. ఆ నిర్ణయమే సాఫీగా సాగిపోతున్న గడ్డం గ్యాంగ్‌ని సమస్యల్లో పడేస్తుంది.
కళాకారుల పనితీరు:
రాజశేఖర్ ఈ పాత్రని రక్తి కట్టించడానికి చాలా ప్రయత్నించాడు కానీ దీనికి ఆయన సూట్ కాలేదు. ఈ క్యారెక్టర్‌కి కావాల్సిన అండర్ ప్లేని ఒరిజినల్‌లో విజయ్ సేతుపతి చేసినట్టుగా రాజశేఖర్ చేయలేకపోయాడు. క్యారెక్టర్ ఎసెన్స్ ఏంటనేది గ్రహించడంలో దర్శకుడి పొరపాటు కూడా ఉండడం వల్ల రాజశేఖర్ ‘గడ్డం గ్యాంగ్’ని సరిగా లీడ్ చేయలేకపోయాడు. రాజశేఖర్ ‘ఊహాసుందరి’గా షీనా గ్లామరస్ రోల్ చేసింది. ఈ పాత్రకి సంబంధించిన సన్నివేశాలు కొన్ని మరీ అతిగా అనిపిస్తాయి. గడ్డం గ్యాంగ్ బృందంలో అచ్చు, రాజేష్ ఫర్వాలేదనిపించారు. నాగబాబు, నరేష్ లాంటి సీనియర్లు ఈ చిత్రానికి పెద్దగా హెల్ప్ కాలేదు. కామెడీతో పాటు సెంటిమెంట్ పండించాల్సిన క్యారెక్టర్‌కి సీత యాప్ట్ అనిపించలేదు. క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న మినిష్టర్ కొడుకుగా నోయల్ పర్‌ఫార్మెన్స్ బాగుంది. సింగిల్ డైలాగ్ లేని పోలీస్ పాత్రలో యోగ్ జప్పే మెప్పించలేదు. ఒరిజినల్‌లో ఈ క్యారెక్టర్‌ని ఇతనే చేసినా చాలా ఎఫెక్టివ్‌గా చేసాడు. ఇందులో ఈ పాత్ర తేలిపోయిందంటే దర్శకుడిదే తప్పు అనుకోవాలి.
సాంకేతిక వర్గం పనితీరు:
అచ్చు స్వరపరిచిన పాటలు ఆకట్టుకోలేదు. పాటలకి తగిన సందర్భాలు కూడా కుదర్లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్ అనిపిస్తుంది. డైలాగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ సెకండాఫ్‌లో గాడి తప్పింది. క్లయిమాక్స్ మరీ సాగదీయకుండా.. సింపుల్‌గా తేల్చేసి ఉండాల్సింది. తమిళ చిత్రాన్ని మార్పులేం చేయకుండా యథాతథంగా తీసినా కానీ ఆ దర్శకుడు చూపించిన కమాండ్‌ని సంతోష్ చూపించలేకపోయాడు. కథాపరంగా సాధారణంగా అనిపించే ఈ చిత్రానికి ఫన్నీ సిట్యువేషన్స్‌తో కూడిన స్క్రీన్‌ప్లేనే అసలు బలం. స్క్రీన్‌ప్లేని యాజిటీజ్‌గా ఫాలో అయినా కానీ ఆ ఫన్‌ని రీక్రియేట్ చేయడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. లీడ్ యాక్టర్స్ పర్‌ఫార్మెన్స్‌తో పాటు గ్యాంగ్‌లో ఒకరిని ఒకరు కాంప్లిమెంట్ చేసుకునే విధానం కూడా ఒరిజినల్ సక్సెస్‌కి కారణమైంది. కానీ గడ్డం గ్యాంగ్‌లో ఆ కెమిస్ట్రీ పూర్తిగా లోపించింది.
హైలైట్స్:
- కాన్సెప్ట్
- కొన్ని కామెడీ సీన్స్
డ్రాబ్యాక్స్:
- లౌడ్ కామెడీ
- వీక్ డైరెక్షన్
- లీడ్ యాక్టర్స్ పర్‌ఫార్మెన్స్
విశ్లేషణ:
కమర్షియల్ ఫార్ములా సినిమాల్ని రీమేక్ చేయడం ఈజీ వ్యవహారమే కానీ.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్ని రీమేక్ చేయడం ఆషామాషీ విషయం కాదు. ఒరిజినల్‌లోని కథని, సంభాషణల్ని, సన్నివేశాల్ని ఏమాత్రం మార్చకుండా అచ్చు గుద్దేసినా కానీ విజయానికి దోహదపడిన మిగిలిన అంశాలని సరిగ్గా పునఃసృష్టించలేకపోతే… ఒరిజినల్‌కి ఎంత లాయల్‌గా ఉన్నా కానీ ఫలితం దక్కదు. ‘గడ్డంగ్యాంగ్’ చిత్రంలో అదే జరిగింది. ఒరిజినల్ స్క్రిప్ట్‌కి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి తొంభై తొమ్మిది శాతం దానిని డిస్టర్బ్ చేయకుండా లాయల్‌గా రీమేక్ చేసారు.
కానీ ఆ చిత్ర విజయానికి అసలు కారణమైన ఎసెన్స్‌ని మాత్రం రాబట్టలేకపోయారు. సూదుకవ్వుంలో సహజత్వం ప్రధానంగా ఆకర్షిస్తుంది. స్టార్ కాస్ట్ అంతా కూడా పాత్రలకి తగినట్టు కనిపిస్తారు. ఎక్కడా ‘యాక్ట్’ చేస్తున్న ఫీల్ రాదు. సిట్యువేషన్స్ అన్నీ స్పాంటేనియస్‌గా జరిగిపోతున్నట్టు అనిపిస్తాయి కానీ సినిమాటిక్‌గా కనిపించవు. ఆ సహజత్వమే తమిళంలో ఆ చిత్రం అంతటి ఘన విజయం సాధించడానికి కారణమైంది. ఈ తరహా బ్లాక్ కామెడీస్ సక్సెస్ అవ్వాలంటే ఆ స్పాంటేనిటీ చాలా కీలకం. బహుశా ఒరిజినల్‌ని డైరెక్ట్ చేసిన దర్శకుడికే రీమేక్ బాధ్యతలు అప్పగించినట్టయితే గడ్డంగ్యాంగ్‌కి హెల్ప్ అయి ఉండేదేమో.
కథాపరంగా, పాత్రల పరంగా ఈ చిత్రం రొటీన్ సినిమాలకి భిన్నంగా ఉండడమే కాకుండా… సిట్యువేషనల్ కామెడీతో అక్కడక్కడా బాగానే నవ్విస్తుంది కూడా. కానీ నేచురల్‌గా సాగిపోతున్నట్టు అనిపించాల్సిన సినిమా ఆర్టిఫిషియల్‌గా తయారయ్యేసరికి… ఫైనల్‌గా రావాల్సిన ఇంపాక్ట్ రాలేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఫర్వాలేదనేట్టు సాగిపోయినా కానీ సెకండ్ హాఫ్‌లో పూర్తిగా ట్రాక్ తప్పేసింది. చివర్లో కథలోకి ఆ పోలీస్ ఎంటర్ అయ్యాక కాస్తయినా టెన్షన్ కలగాలి. కానీ అదంతా సాగతీసినట్టు అనిపించిందే తప్ప ఆసక్తి కలిగించలేదు. ఏ పాత్రతోను ఆడియన్స్ రిలేట్ చేసుకోలేకపోవడం, జరుగుతున్నదంతా డ్రామాని తలపించడంతో ‘గడ్డంగ్యాంగ్’ అటు ఎంటర్‌టైన్ చేయలేక, ఇటు ఎంగేజ్ చేయలేక టోటల్‌గా మిస్‌ఫైర్ అయింది.
బోటమ్ లైన్: గాడి తప్పిన గడ్డం గ్యాంగ్!
గణేష్ రావూరి