Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: హార్ట్‌ ఎటాక్‌

సినిమా రివ్యూ: హార్ట్‌ ఎటాక్‌

రివ్యూ: హార్ట్‌ ఎటాక్‌
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌
తారాగణం: నితిన్‌, అదా శర్మ, అజాజ్‌ ఖాన్‌, నికోల్‌, బ్రహ్మానందం, అలీ తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్‌
ఛాయాగ్రహణం: అమోల్‌ రాథోడ్‌
కథ, మాటలు, కథనం, నిర్మాత దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
విడుదల తేదీ: జనవరి 31, 2014

గత రెండు చిత్రాలతో నిరాశ పరిచిన స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, గత రెండు చిత్రాలతో ఘన విజయాలు అందుకున్న నితిన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హార్ట్‌ ఎటాక్‌’ ఇటు పూరికి ఫ్లాప్‌ హ్యాట్రిక్‌ అవుతుందా లేక నితిన్‌కి హిట్‌ హ్యాట్రిక్‌ అవుతుందా అనే విషయంలో ఆసక్తి రేకెత్తించింది. మరి ఈ ఎటాక్‌ హార్ట్స్‌ని దోచుకునేదో, లేక నిజంగానే హార్ట్‌ ఎటాక్‌ ఇచ్చేదో చూడండి...

కథేంటి?

వరుణ్‌ (నితిన్‌) ఒక హిప్పీ. ఈ కంట్రీ, ఆ కంట్రీ తిరుగుతూ, రేపటి మీద ఆశ లేకుండా ఏ రోజుని ఆ రోజు ఎంజాయ్‌ చేసే క్యారెక్టర్‌. చూడగానే హయాతిని (అదా శర్మ) ఇష్టపడతాడు. ఆమెని ఓ ముద్దిమ్మంటూ వెంటపడతాడు. తనని ప్రేమించడం లేదని, ముద్దిస్తే చాలని వేధిస్తుంటాడు. ఈ ప్రాసెస్‌లో వరుణ్‌ని హయాతి లవ్‌ చేస్తుంది. కానీ ఆమెని తాను ప్రేమించిన విషయాన్ని తెలుసుకుని వరుణ్‌ వచ్చేలోగా ఆమెకి వేరే వాడితో పెళ్లి ఫిక్స్‌ అవుతుంది. 

కళాకారుల పనితీరు!

నితిన్‌ రొటీన్‌కి భిన్నంగా లాంగ్‌ హెయిర్‌తో, అప్పుడప్పుడూ పోనీ టెయిల్‌తో తన హిప్పీ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా కనిపించాడు. రెండు హిట్లతో వచ్చిన కాన్ఫిడెన్స్‌తో తన క్యారెక్టర్‌ని చాలా ఈజీగా క్యారీ చేసాడు. అదా శర్మ పర్‌ఫార్మెన్స్‌ బాగానే ఉంది. విలన్‌ రోల్‌ చేసిన ఖాన్‌ రొటీన్‌ అనిపిస్తాడు. బ్రహ్మానందం అక్కడక్కడా నవ్వించాడు. అలీ క్యారెక్టర్‌ కథలో రోల్‌ ప్లే చేసినా కామెడీకి ఏమీ హెల్ప్‌ అవలేదు. మిగిలిన తారాగణం అంతా దర్శకుడు చెప్పినట్టు చేసారు. ఎవరి గురించి ప్రత్యేకించి పేర్కొనే పర్‌ఫార్మెన్సెస్‌ లేవు. 

సాంకేతిక వర్గం పనితీరు:

అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌ ఓకే. రెండు పాటలు వినడానికి బాగున్నాయి. అయితే ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలకి అందించినట్టు హిట్‌ మ్యూజిక్‌ని అయితే అతను ఇవ్వలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సోసో అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్‌గా సినిమా చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ చాలా రిచ్‌గా కనిపించింది. ఎడిటింగ్‌ సినిమాకి స్టయిలిష్‌ లుక్‌ ఇచ్చింది. స్పెయిన్‌ని ‘ఇద్దరమ్మాయిలతో’ తర్వాత మరోసారి పూరి చాలా అందంగా చూపించడం జరిగింది. ఈసారి నిర్మాత కూడా తనే అయినా కాంప్రమైజ్‌ కాలేదు. సినిమా చాలా లావిష్‌గా తెరకెక్కింది. సంభాషణా రచయితగా పూరి తన పూర్వపు చమక్కులు కొన్ని చూపించాడు. ఫన్నీ డైలాగ్స్‌ కొన్ని ఉన్నాయి. అయితే పూరి బెస్ట్‌ వర్క్‌ అయితే ఖచ్చితంగా కాదని చెప్పాలి. కథకుడిగా మరోసారి విషయంలేని కథతో ఎంటర్‌టైనర్‌ని తయారు చేయడానికి చూసాడు. స్క్రీన్‌ప్లే చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. ఎలాంటి హైస్‌ లేకుండా ఫ్లాట్‌గా సాగిపోతుంది. దర్శకుడిగా పూరి ఇంతకుముందు చేయనిదంటూ ఇందులో ఏమీ చేయలేదు. పూరి బ్రాండ్‌ ‘బ్లాండ్‌’ ఎంటర్‌టైనర్‌ అని చెప్పొచ్చు. 

హైలైట్స్‌:

  • కొన్ని డైలాగ్స్‌
  • సినిమాటోగ్రఫీ

డ్రాబ్యాక్స్‌:

  • స్టోరీ
  • స్క్రీన్‌ప్లే

విశ్లేషణ:

కథ మొదలైన విధానం కానీ, హీరో పాత్ర పరిచయ సన్నివేశం కానీ, ఆ తర్వాత హీరోయిన్‌ని చూసి హీరో ప్రేమలో పడడం కానీ... అంతా ఎలాంటి ఆసక్తి కలిగించకుండా, అలా అని బోర్‌ కొట్టించకుండా జరిగిపోతుంది. హీరో హీరోయిన్ల మధ్య లవ్‌స్టోరీకి టైమ్‌ కేటాయిస్తారనుకుంటే... సైడ్‌ క్యారెక్టర్స్‌ లవ్‌స్టోరీపై ఫోకస్‌ ఎక్కువ పెట్టారు. దీంతో హీరో హీరోయిన్లిద్దరూ కేవలం పాటలు పాడుకోవడం మినహా మరే విధమైన కెమిస్ట్రీ ఉండదు. లవ్‌స్టోరీలో ఉండాల్సిన సోల్‌, ఫీల్‌ రెండూ లేకపోవడంతో ఒక మోస్తరు కామెడీతో హార్ట్‌ ఎటాక్‌ ఫ్లాట్‌గా ఇంటర్వెల్‌ చేరిపోతుంది. తాడూ బొంగరం లేని హీరో... ఏ బంధాలు వద్దని చెప్పేవాడు హీరోయిన్‌ని ముద్దు పెట్టమంటూ వెంటపడడం ఏమిటో బోధ పడదు. అతడిని హీరోయిన్‌ ఎందుకు ప్రేమిస్తుందనే దానికి కారణం కనిపించదు. 

ఫస్టాఫ్‌ ఎండ్‌ అయిన విధానం వల్ల సెకండాఫ్‌లో అయినా స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా మారుతుందనే నమ్మకం ఏర్పడదు. ఊహించినట్టుగానే హీరో తనకి హీరోయిన్‌పై ఉన్న లవ్‌ని రియలైజ్‌ కావడం, అతను ఆమెని వెతుక్కుని వచ్చేసరికి విలన్‌ ఎదురవడం జరిగిపోతాయి. సగటు కమర్షియల్‌ సినిమాలానే రొటీన్‌గా సాగిపోయే ఈ చిత్రం ఏ దశలోను ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా ఇన్‌వాల్వ్‌ చేయదు. హీరోయిన్‌ తండ్రి కోణంలో ఒక సెంటిమెంట్‌ యాంగిల్‌ ఉన్నా కానీ పూరి దానిపై ఎక్కువ కాన్సన్‌ట్రేట్‌ చేయలేదు. హీరోతో చెప్పించే తన మార్కు సంభాషణలు మినహా ఏస్‌ డైరెక్టర్‌ పూరి ఈ సినిమాపై తన స్టాంప్‌ వేయలేకపోయాడు. 

ఒకప్పుడు వరుసగా సూపర్‌హిట్స్‌ ఇచ్చిన పూరి జగన్నాథ్‌లోని స్పార్క్‌ అక్కడక్కడా లీలగా కనిపించినా కానీ ఓవరాల్‌గా మాత్రం మరోసారి ఆయననుంచి వచ్చిన బిలో యావరేజ్‌ మూవీ ఇది. కొంచెం ఎక్కువ కాన్సన్‌ట్రేట్‌ చేసినట్టయితే ఇప్పటికీ పూరి నుంచి ఒక డీసెంట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చు. హార్ట్‌ ఎటాక్‌ అయితే మాత్రం పూరి హార్ట్‌ పెట్టి చేయని చిత్రాల జాబితాలోనే చేరిపోతుంది తప్ప ఆయనని తిరిగి ట్రాక్‌ మీదకి తీసుకురాదు.  

బోటమ్‌ లైన్‌:  హార్ట్‌ మిస్‌ అయింది.. ఎటాక్‌ మిగిలింది!

- జి.కె.

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను