రివ్యూ: హమ్ తుమ్
రేటింగ్: 0.5/5
బ్యానర్: ఆపిల్ స్టూడియోస్
తారాగణం: మనీష్, సిమ్రన్, నిఖిల్ చక్రవర్తి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, నాగినీడు తదితరులు
సంగీతం: మహతి
కూర్పు: నందమూరి హరి
ఛాయాగ్రహణం: జి. శివకుమార్
నిర్మాత: ఎమ్. శివరామిరెడ్డి
మాటలు, దర్శకత్వం: రామ్ భీమాన
విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2014
వాలెంటైన్స్ డే గిఫ్ట్ అంటూ విడుదల చేసిన ఈ లవ్‌స్టోరీ చూసేందుకు వచ్చిన ప్రేమికులకి ఈ చిత్రం జీవితంలో మర్చిపోలేని గాయం చేస్తుంది. ఇంకోసారి వాలెంటైన్స్ డేకి సినిమాకి వెళ్లాలంటేనే కాళ్లు, చేతులు వణికిపోయేలా జీవిత కాలం గుర్తుండి పోతుంది.
కథేంటి?
ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్క వల్ల గుండెపోటుకి గురైన తన తండ్రికి తానెప్పటికీ అలాంటి తప్పు చేయనని మాటిస్తాడు చరణ్ (మనీష్). తన జూనియర్ పల్లవి (సిమ్రన్) తొలి చూపులోనే చరణ్‌ని ప్రేమించేస్తుంది. తన ప్రేమని అతడికి వ్యక్తం చేయకుండానే మూడేళ్లు గడిచిపోతాయి. తర్వాత తన ప్రేమ గురించి చరణ్‌కి చెప్పినా కానీ అతనేమీ రియాక్ట్ అవడు. అలా విడిపోయిన ఇద్దరూ ఎలా కలుస్తారు, ఎప్పటికి కలుస్తారు అనేదే హమ్ తుమ్.
కళాకారుల పనితీరు!
ప్రేమకథలు క్లిక్ అవ్వాలంటే… ముందుగా ప్రేమికుల పాత్రలు పోషించిన వారు ఇద్దరూ మంచి ఇంప్రెషన్ వేయాలి. కానీ ఇందులో సిమ్రన్ తన మెడలో ‘నేనే హీరోయిన్’ అని బోర్డు వేసుకుని తిరిగితే తప్ప హీరోయిన్ అనుకోలేనట్టు కనిపిస్తుంది (అదృష్టం కొద్దీ ఆ గెటప్ ఫస్ట్ హాఫ్ వరకే పరిమితం చేసారు). హీరో మనీష్‌కి అయితే అతనిచ్చే ప్రతి ఎక్స్‌ప్రెషన్‌కీ ‘ఆరాధనగా చూసాడు’, ‘బాధ పడుతున్నాడు’, ‘ఆనందంగా ఉన్నాడు’ అంటూ ‘వాయిస్ ఓవర్’ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక ఈ జంట పెట్టే ప్రేమ హింసకి తోడు వారి స్నేహితుల బృందం, కాలేజ్‌లోని ఇతర మిమిక్రీ కళాకారుల బృందం కలిసి ‘హమ్ తుమ్’ చిత్రం చూస్తున్న వారికి పదే పదే తమ పల్స్ తామే టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కల్పిస్తారు. సీనియర్ కమెడియన్స్ ఉన్నా కానీ ఎవరూ కూడా ఈ హింస నుంచి ఉపశమనం ఇవ్వలేకపోయారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఇందులో అవసరానికి మించి చాలా పాటలున్నాయి. వాటి వల్ల థియేటర్‌లో మరో అరగంట ఎక్కువ టైమ్ ఉండాల్సి వస్తుందే తప్ప రిలీఫ్ అయితే ఖచ్చితంగా దొరకదు. సినిమాటోగ్రాఫర్ మాత్రం కొన్ని సందర్భాల్లో తన టేస్ట్ చాటుకున్నాడు. ఎడిటర్‌ని మెచ్చుకోవాలి. ఏ సీన్ ఎందుకుందో తెలియనంత గందరగోళంగా ఉన్న ఈ అతుకుల బొంతని కలిపి ‘కుట్టినందుకు’.
దర్శకుడు రామ్ భీమాన ఈ చిత్రంతో ఏం చెప్దామనుకున్నాడో అర్థం కాదు. ఈ సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాతకి ఇందులో అంత ఎక్సయిటింగ్‌గా అనిపించిందేంటో అంతు చిక్కదు. ఫేస్‌బుక్ వాల్స్‌లో, ఎస్‌ఎంఎస్‌లలో ఫార్వర్డ్ అయ్యే జోకులతో కామెడీ చేయాలని చూసారు. అసలు కథ విషయానికి వస్తే పురాతన కాలం నుంచీ జనం నెత్తిన రుద్దుతున్న అదే నాసి రకం ప్రేమకథ. అవడానికి ప్రేమకథా చిత్రమే అయినా కానీ ఎక్కడా ఆ అనుభూతి కలిగించలేకపోయాడు దర్శకుడు. తెరమీద జరిగే నాన్సెన్స్‌తో మన పేషెన్స్ టెస్ట్ చేసుకోవడానికి మినహా ఈ సినిమా మరెందుకూ పనికి రాదు.
హైలైట్స్:
- ఈ సెక్షన్‌లో ఏదైనా రాసుకోడానికి డైరెక్టర్ కూడా మొహమాట పడతాడు!
డ్రాబ్యాక్స్:
- ఈ సెక్షన్‌ని ఖాళీగా వదిలేయడానికి ప్రొడ్యూసర్ కూడా వెనకాడతాడు!
దురదృష్టాన్ని జేబులో వేసుకుని తిరిగే వారి కోసమే ‘హమ్ తుమ్’!
కొన్ని సినిమాలు ఎందుకు తీస్తారో, వాటితో ఎలాంటి ఫలితం వస్తుందని ఆశిస్తారో అర్థం కాదు. ఏటా అలాంటి సినిమాలు పదుల కొద్దీ వచ్చి పోతుంటాయి. అయితే దురదృష్టవంతులు కొందరు మాత్రమే వాటిలో కొన్నిటికి బలవుతుంటారు. ఇలాంటి సినిమాలు తీసేది అలాంటి దురదృష్టవంతుల కోసమేనా అని కూడా అనిపిస్తుంటుంది. సినిమాకొస్తుంటే బైక్ స్కిడ్ అయి ఏ కాలో విరిగి హ్యాపీగా హాస్పిటల్‌లో పడొచ్చు. ట్రాఫిక్‌లో స్ట్రక్ అయి గంటలకొద్దీ ఎర్రటి ఎండలో హాయిగా మాడిపోయి ఉండొచ్చు. ఏ ముష్కరులో వచ్చి చితగ్గొట్టి ఉన్నదంతా ఊడ్చుకుపోతే రోడ్డు పక్కన ఎంచక్కా పడుండొచ్చు. ఈ ముప్పు తప్పించుకోడానికి ఇన్ని రకాల ఛాన్స్‌లున్నా… అవేవీ జరగకుండా థియేటర్‌లో ల్యాండ్ అవ్వాల్సి వచ్చిందంటే అది దురదృష్టం కాక మరేమనుకోవాలి?
హీరో హీరోయిన్ల నటన కానీ, నటీనటుల సంభాషణలు కానీ, పాటలు కానీ, కామెడీ సీన్లు కానీ… ఏదైనా సరే.. ‘ఎంతసేపు కూర్చోగలరో చూద్దాం’ అన్నట్టు సవాల్ చేస్తుంటే తట్టుకుని చివరి వరకు చూసారంటే వారికున్న సహనానికి భూదేవి చిన్నబోతుంది. ప్రేమికుల రోజున రిలీజ్ అయిన సినిమా కావడంతో థియేటర్లలో ఎక్కువగా ప్రేమ పక్షులే వాలి ఉంటాయి. వారిలో ఎన్ని జంటలు ఈ సినిమా వల్ల బ్రేకప్ అవుతాయో మరి. ఎవరైతే ఈ సినిమా చూద్దామని సజెస్ట్ చేసి తీసుకొచ్చారో… వారిని వాళ్ల లవర్ లైఫ్‌లాంగ్ క్షమించే అవకాశముండదు. దీనికంటే హుస్సేన్ సాగర్‌లో స్విమ్మింగ్‌కి తీసుకెళ్తే అంతో ఇంతో ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఈ సినిమాకి తీసుకొస్తే మాత్రం ఒక మాదిరి హత్యాయత్నం చేసినట్టే అనుకోవచ్చు. ఇలాంటి సినిమాకి పాయింట్ ఫైవ్ రేటింగ్ ఎందుకిచ్చామనే డౌట్ రావచ్చు. మిగతా వాళ్లలా బూతులతో నింపేసి క్యాష్ చేసుకోవాలని చూడకుండా ఈకాలం ప్రేమని కలుషితం చేయకుండా చూపించారు కాబట్టే జీరో రేటింగ్ తప్పించుకున్నారు.
బోటమ్ లైన్: టార్చర్ ప్లస్ టార్చర్ హోల్ స్క్వేర్ ఇంటూ టార్చర్ క్యూబ్ ఈజీక్వల్ టూ హమ్ తుమ్!
-జి.కె.