ఎమ్బీయస్‌ : జైనులు యిక మైనారిటీలు – 2

మరి ఈ గుర్తింపు వలన వారికి కొత్తగా లభించే సౌకర్యం ఏమిటి అంటే – విద్యాలయాలపై, దేవాలయాలపై నియంత్రణ! ఇకపై వారి దేవాలయాల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. జైనమందిరాలకు చాలా…

మరి ఈ గుర్తింపు వలన వారికి కొత్తగా లభించే సౌకర్యం ఏమిటి అంటే – విద్యాలయాలపై, దేవాలయాలపై నియంత్రణ! ఇకపై వారి దేవాలయాల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. జైనమందిరాలకు చాలా నిధులున్నాయి. అనేకమంది విరాళాలు యిస్తారు. ఏదైనా వివాదం వచ్చి ప్రభుత్వం జోక్యం చేసుకోబోతే 'అదిగో మైనారిటీల జోలికి వెళ్లకూడదు' అంటారు. దీనితో బాటు స్కూళ్లు, కాలేజీల నిర్వహణలో వాళ్లకు చాలా లాభం ఒనగూడుతుంది. మామూలుగా అయితే 25% సీట్లు ప్రభుత్వం చెప్పిన బలహీనవర్గాలకు కేటాయించాలి. కానీ మైనారిటీలు నడిపే కాలేజీలకు యీ నిబంధన వర్తించదు. ఆ సీట్లు కూడా వాళ్లకు యిష్టం వచ్చినవారికి యిచ్చుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు. విద్య నానాటికి వ్యాపారంగా మారుతున్న యీ రోజుల్లో యింతకు మించిన సౌకర్యం వేరే ఇంకేమి కావాలి? అందుకే వీరికి మైనారిటీ గుర్తింపు యివ్వగానే కర్ణాటకలోని వీరశైవులు, బహాయిలూ కూడా మాకూ గుర్తింపు యివ్వండి అని మొదలుపెట్టారు. 

హిందువులు, జైనుల మధ్య సఖ్యత బాగానే వున్నా కొన్ని విషయాల్లో తగాదాలున్నాయి. గుజరాత్‌లోని గిర్నార్‌ పర్వతంపై వున్న పాదముద్రలు దత్తాత్రేయుడివని హిందువులు, 22 వ తీర్థంకరుడైన నేమినాథుడివని జైనులు వాదించుకుని కోర్టుకి వెళ్లారు. 2007లో గుజరాత్‌ హై కోర్టు ఆ గుడికి వెళ్లే జైనులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. కానీ 2013లో ఒక జైన సాధువు కత్తి పోట్లకు గురయ్యాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కూడా ఋషభదేవుడి ఆలయంలో యిలాటి తగాదేయే వుంది. సుప్రీం కోర్టు జైనుల పక్షాన తీర్పు యిచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు జైనులకు మైనారిటీలుగా గుర్తింపు వచ్చాక హిందువుల పరిస్థితి బలహీనపడుతుంది. ఏమైనా అంటే మైనారిటీలను హింసించిన కేసులు ఎదుర్కోవలసి వస్తుంది. జైనుల్లో రెండు శాఖలున్నాయి – శ్వేతాంబరులు, దిగంబరులు అని. శ్వేతాంబరులు విగ్రహాలను అలంకరిస్తారు. దిగంబరులు అలంకరించరు. ఉదయపూర్‌ గుడి విషయంలో, పారస్‌నాథ్‌ పర్వతం పై వున్న శిఖర్‌జీ దేవాలయం విషయంలో రెండు శాఖలూ కలహిస్తున్నాయి. 24 తీర్థంకరుల్లో 20 మంది మోక్షం పొందిన శిఖర్‌జీ విషయంలో యిద్దరూ మరీ పట్టుదలగా వున్నారు. 

ఇదొక్కటే కాదు, జైనుల్లో ఉత్తరాది, దక్షిణాది ఫీలింగులు కూడా వున్నాయి. తెలుగు జైనులు ఎవరూ నాకు తారసపడలేదు. కర్ణాటకలో గోమఠేశ్వరుడి విగ్రహం వున్న ప్రాంతాల్లో కన్నడ జైనులు కనబడ్డారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కూడా వున్నారని తెలుసు కానీ వాళ్లు స్థానికులో లేక రాజస్థాన్‌, గుజరాత్‌నుండి వెళ్లి స్థిరపడినవారో తెలియదు. మద్రాసులో నా తమిళ సహోద్యోగి పేరు 'పుష్యమిత్రన్‌'. అదేం పేరని అడిగితే 'మేం జైనులం' అన్నాడు. 'తమిళనాడులో జైనులు యింకా వున్నారా?' అని ఆశ్చర్యపడ్డాను. అప్పుడతను చెప్పుకొచ్చాడు – ఉత్తరాదివాళ్లు తమను జైనులగా గుర్తించరని. వారూ వీరూ కలవరు. చెన్నయ్‌లో ఉత్తరాది జైనులవి 100 ఆలయాలదాకా వుంటే తమిళ జైనులకు 18 వున్నాయి. 1500 కుటుంబాలు ఆ గుళ్లకు వెళుతూంటారు. ఉత్తరాది జైనుల ఆలయాలు పాలరాతితో కడతారు. తమిళులవి ద్రావిడశైలిలో రాతితో కడతారు.

క్రీ.పూ.300 లోనే జైనం తమిళనేలకు వచ్చింది. జైనులు రాజులు కూడా అయ్యారు. తమిళసంస్కృతిని రూపొందించడంలో జైనుల పాత్ర అద్వితీయం. తమిళులు గొప్పగా చెప్పుకునే కావ్యాలు ఐదు. వాటిలో మూడు – శిలప్పదికారం, జీవక చింతామణి, వలయాపతి  జైనులు రాసినవే. క్రీ.శ. 470లో ద్రవిడ సంఘం ఏర్పాటు చేశారు. కులరహిత సమాజం ఏర్పడాలని, అందరికీ విద్య అందాలని, స్త్రీల పట్ల గౌరవం చూపాలని వారు బోధించారు. తెలుగునాట జరిగినట్లే తమిళనాట కూడా శైవులకు, జైనులకు క్రీ.శ. 700 ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. పల్లవుల కాలంలో యివి ప్రారంభమై చోళుల కాలానికి పరాకాష్టకు చేరాయి. గత వెయ్యి సంవత్సరాలుగా వారి ప్రాభవం క్షీణించింది. ఇప్పుడున్న జైనులు తమిళనాడు గ్రామీణప్రాంతాల్లో వున్నారు. పేదలు, రైతులే ఎక్కువ.   అందువలన అక్కడ జైనులున్నారంటే నాబోటి వాళ్లు ఆశ్చర్యపడే స్థితి వచ్చింది.         

ఇక మన రాష్ట్రానికి వస్తే – హైదరాబాదు నుండి 70 కి.మీ.ల దూరంలో వున్న కొలనుపాకలో ప్రాచీన జైన దేవాలయం వుంది. దీన్ని 11 వ శతాబ్దంలో రాష్ట్రకూటులు కట్టించారు. ఋషభనాథుడిగా పిలవబడే ఆదినాథ భగవాన్‌ విగ్రహం మధ్యలో వుండగా ఒక పక్క మహావీరు జినుడి విగ్రహం, మరో పక్క నేమినాథుని విగ్రహం వుంటాయి. పక్కనే ధర్మశాల వుంటుంది. కళ్యాణ చాళుక్యుల కాలంలో కూడా యీ గుడి బాగా వెలిగింది. పోనుపోను కాకతీయుల కాలంలో తెలుగునాట జైనమతం వెనకబడడంతో యీ గుడి ప్రాభవం తగ్గింది. ఉత్తరాది జైనులు దాని పేరు కుల్‌పాక్‌జీగా మార్చేసి వారి మతగ్రంథాలలో అలా రాసేసుకున్నారు. ఒక గుజరాతీ జైన్‌ మా కలకత్తా బ్రాంచ్‌లో పెద్ద కస్టమర్‌. నేను హైదరాబాదులో పని చేస్తూండగా వచ్చి కలిశాడు. ''నేను కుల్‌పాక్‌జీని చూద్దామని ఎంతో అనుకున్నాను. ఎవర్ని అడిగినా చెప్పలేకపోయారు.'' అని వాపోయాడు. ''యాదగిరి గుట్టకు వెళ్లే దారిలో కొలనుపాక అని అడిగితే  చెప్పి వుండేవారు. మీ పుస్తకాల్లో మీరు పేరు మార్చేసుకుని ఆ పేరుతో అడిగితే యిక్కడేం తెలుస్తుంది?'' అన్నాను. ''ఊళ్లోకి రాగానే మిమ్మల్ని కలవాల్సింది. ఇవాళ సాయంత్రమే వెళ్లిపోతున్నాను. మళ్లీ ఎప్పుడొస్తానో'' అంటూ ఫీలయిపోయాడు.

ఇటీవలి కాలంలో ఆ గుడిని పునరుద్ధరించాలని సంకల్పించారు. ఆలయనిర్మాణశైలిని యథాతథంగా వుంచి మళ్లీ కట్టిస్తే బాగుండేది. కానీ పునర్నిర్మాణం చేపట్టినవాళ్లు మా కస్టమర్‌ వంటి ఉత్తరాదివారు కాబట్టి దాన్ని నాగర శైలిలో కట్టించారు! రేపోమాపో తమ పలుకుబడి వుపయోగించి ఊరిపేరు కూడా మార్పించేస్తారేమో! ఆ విధంగా చూస్తే దక్షిణాది జైనులు మైనారిటీల్లో మైనారిటీ లన్నమాట! (సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2014)

[email protected]

Click here For Part-1