ఎమ్బీయస్‌ : జైనులు యిక మైనారిటీలు – 1

జైనమతం మన దేశంలో ఎప్పణ్నుంచో వుంది. దేశజనాభాలో  జైనుల సంఖ్య 42 లక్షలే అయినా ఆర్థికంగా చాలా బలమైన స్థాయిలో వున్నారు. అయినా వారిలో కొందరు జనవరి 19 న రాహుల్‌ గాంధీ వద్దకు…

జైనమతం మన దేశంలో ఎప్పణ్నుంచో వుంది. దేశజనాభాలో  జైనుల సంఖ్య 42 లక్షలే అయినా ఆర్థికంగా చాలా బలమైన స్థాయిలో వున్నారు. అయినా వారిలో కొందరు జనవరి 19 న రాహుల్‌ గాంధీ వద్దకు వెళ్లి మైనారిటీలుగా గుర్తించమని తాము చాలాకాలంగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. మనసు కరిగిన యువరాజాగారు కీలుబొమ్మ ప్రధానికి ఆదేశాలు జారీ చేశారు. వారం తిరిగేసరికి జనవరి 27 న జైనులను మైనారిటీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ప్రకటన వెలువరించింది. అంటే ఏమటన్నమాట? నిర్ణయం ముందే తీసుకుని అది రాహుల్‌ చెప్పడం బట్టి అయిందన్న కలరింగ్‌ యిచ్చారు. అసలు ఇలాటి నిర్ణయం తీసుకోవడం దేనికి అన్నదానిపై వూహాగానాలు చెలరేగుతున్నాయి. 

జైనులలో చాలామంది రాజస్థాన్‌, గుజరాత్‌లలో వున్నారు. వారిలో అధికశాతం మంది వ్యాపారస్తులే. చాలాకాలంగా బిజెపిని సమర్థిస్తూ వచ్చారు. ఈ గుర్తింపు ద్వారా వారిని ఆకట్టుకుని తమవైపుకి తిప్పుకుందామని కాంగ్రెసు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే యిది జరిగింది అంటున్నారు. దీని వెనక్కాల వున్న కేంద్ర మంత్రులు ముగ్గురు. మైనారిటీ ఎఫయిర్స్‌ మినిస్టర్‌ కె.రహమాన్‌ ఖాన్‌ కర్ణాటక నుండి  ఎన్నికయ్యాడు. అక్కడ జైనుల జనాభా బాగానే వుంది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రదీప్‌ కుమార్‌ జైన్‌, స్వయంగా జైన్‌. ఇక కమ్యూనికేషన్స్‌ మంత్రి కపిల్‌ సిబ్బల్‌ ప్రాతినిథ్యం వహించే ఢిల్లీ చాందినీ చౌక్‌ నియోజకవర్గంలో జైనులు ఎక్కువ సంఖ్యలో వున్నారు. వీళ్లందరూ కలిసి అటార్నీ జనరల్‌ వాహనవతి మెడలు వంచి దీనికి ఒప్పించారట. అసలు జైనులకు యీ రకమైన గుర్తింపు అవసరమా అన్నది ముందుగా చూడాలి.

బౌద్ధమతం లాగే జైనమతం కూడా అహింసను ప్రబోధిస్తుంది. బౌద్ధం కంటె ప్రాచీనమైనది. దేవుణ్ని కొలవమని చెప్పదు. విగ్రహాలకు కొబ్బరికాయలు, హారతులు, మొక్కుబడులు యివేమీ వుండవు. మోక్షప్రాప్తి చెందిన తీర్థంకరులు అనే గురువుల ఆదేశాలను అనుసరించి వెళ్లమని చెప్తుంది. 24వ తీర్థంకరుడైన మహావీరుడి కాలంలో జైనమతం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆయన గౌతమబుద్ధుడి కంటె ప్రాచీనుడు. ఒక కాలంలో జైనమతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. మన తెలుగునాట అనేకమంది రాజులు, రాణులు జైనమతాన్ని అవలంబించారు. రాజు హిందువై, రాణి జైనమతస్థురాలైన సందర్భాలు కూడా చాలా వున్నాయి. అయితే ఒక థలో బౌద్ధులు, జైనులు, వారి ఆలయాలు హిందూమతం దాడికి గురయ్యాయి. వారంతా హిందువులుగా మారిపోయారు. వ్యవసాయం వంటి వృత్తులలో వున్నవారికి జైనం చెప్పే అహింసను పాటించడం కష్టం. క్రమేపీ అది వ్యాపారస్తులు మాత్రమే అవలంబించే మతంగా పరిమితమై పోయింది. జైనులు హిందువులను పెళ్లి చేసుకోవడం యిప్పటికీ సాగుతోంది.

బ్రిటిషువారు వుండే రోజుల్లో జైనులను వేరే మతస్థులుగా గుర్తించేవారు. కానీ భారతదేశపు రాజ్యాంగం రాసే సమయంలో వారిని హిందువుల్లో ఒక శాఖగా గుర్తించారు. అప్పట్లో కొందరు జైనులు నెహ్రూ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయగా, ఆయన చూస్తానని హామీ యిచ్చాడు కానీ ఏమీ జరగలేదు. కలకత్తాలో మా గుజరాతీ సహోద్యోగి తన మతం అనే చోట 'హిందూ-జైన్‌' అని రాయగా చూసి 'అదేమిటి, వేదప్రమాణాన్ని అంగీకరించని జైనులు హిందువులు ఎలా అవుతారు? నువ్వు జైన్‌ అనే రాయాలి కదా' అని అడిగాను. 'ఏమో, మేం యిలాగే రాస్తాం. మా మతం హిందూ, కులం – జైన్‌' అన్నాడతను. ఏడిసినట్టుంది. 'జైన్‌ కులం ఏమిటి, మతం కదా!' అనుకున్నాను. 1992లో జాతీయ మైనారిటీ కమిషన్‌ వేసి ఎవరెవరు మైనారిటీలో తేల్చమన్నారు. ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జొరాస్ట్రియన్లు (పార్శీలు) అంది ఆ కమిషన్‌. సిక్కులను కూడా కొంతకాలం హిందువుల్లో అంతర్భాగంగా చూసేవారు. కొన్నాళ్లకు విడిగా గుర్తించారు. సిక్కులు, హిందువులు పెళ్లి చేసుకునే సంప్రదాయం వుంది. 7 రాష్ట్రాలలో (కొందరు 12 అంటున్నారు) జైనులను మైనారిటీలుగా గుర్తించారు. జాతీయ స్థాయిలో కూడా మైనారిటీలుగా గుర్తించబడాలని జైనులు అప్పుడప్పుడు కోర్టులో కేసులు వేస్తూ వచ్చారు. 1998లో వాజపేయి ప్రభుత్వాన్ని అడిగారు. ఆయన పరిశీలిస్తామన్నాడు కానీ ప్రభుత్వం పడిపోయింది. కొందరు జైనులు మైనారిటీ గుర్తింపు కోసం ఆందోళన చేస్తూనే వున్నారు. 2005లో సుప్రీం కోర్టుకి వెళ్లారు. ఏం చేసినా లాభం లేకపోయింది. ఇప్పుడు కాంగ్రెసు దీనిలో రాజకీయప్రయోజనం చూసింది. అంతే, రోజుల్లో పని పూర్తయిపోయింది.

మైనారిటీల సంక్షేమానికై ప్రభుత్వం ఏటా రూ.3000 కోట్ల రూ.లు వెచ్చిస్తుంది. ఈ ఏడాది జైనులు కూడా చేరారు కాబట్టి, యీ ఖర్చు మరింత పెరగవచ్చు. జైనులకు యిది అవసరమా అని కొందరు అడుగుతున్నారు. జైనుల్లో అక్షరాస్యత 94% (జాతీయ సగటు 65%), మహిళా అక్షరాస్యత 90% (జాతీయ సగటు 54%), వారు ఎంత ధనికులంటే దేశంలోని యిన్‌కమ్‌టాక్సులో  20% చెల్లించేది వారే! విదేశాల్లో కూడా వారు వ్యాపించారు. ఒకప్పుడు తాకట్టు వ్యాపారం, వడ్డీ వ్యాపారం, ట్రేడింగ్‌ మాత్రం చేసేవారు. ఇప్పుడు వాళ్లు విస్తరించని రంగం లేదు. ఐటీ, రియల్‌ ఎస్టేట్‌, మీడియా – ఒకటా రెండా? వాళ్లు  భూమి కింద పండే ఉల్లిపాయ, బంగాళాదుంప వంటివి తినరు. అయినా మహారాష్ట్రలో ఉల్లి వ్యాపారమంతా వారి చేతుల్లోనే వుంది. ఇక మీడియా విషయానికి వస్తే టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, లోక్‌మత్‌, మలయాళ మాతృభూమి వంటి అనేక మీడియా సంస్థలు వారివే! (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2014)