విభజన అంకం యిక గంటల్లోకి వచ్చింది. ఇటువంటి గందరగోళ సస్పెన్సు నాటకం ఎన్నడూ, ఎవరూ చూసి వుండరు. ఏ పాత్ర స్వభావమూ అర్థం కాదు. పైకి ఏం చెప్పినా మనసులో విభజన కోరుకుంటున్నారో, లేదో తెలిసి చావదు. అందరూ అయోమయంగా మాట్లాడతారు. తెలంగాణలోని విభజన సెంటిమెంటు గౌరవించాలి అంటారు. సీమాంధ్రులకు అన్యాయం జరగకూడదంటూ మాట్లాడతారు. అన్యాయం జరుగుతూంటే ఎలా ఎదుర్కోవాలో ఉపాయం చెప్పరు. తెలంగాణ నాయకులు, కొందరు ఉద్యమకారులు చాలామంది ''విభజన ఎవరూ ఆపలేరు. ఇప్పటికైనా సీమాంధ్ర నాయకులు తమ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడం మానేసి, తమకేం కావాలో స్పష్టంగా చెప్పాలి'' అంటున్నారు. సీమాంధ్ర నాయకులు తమ ప్రాంత ప్రజలను మోసగిస్తూ వుంటే వీరు చాలా బాధపడిపోతున్నారని మనం నమ్మాలి. ఇప్పటిదాకా సీమాంధ్ర నాయకుల డబ్బుమూటలకు లొంగిన తమ నాయకులు తమ బాగోగులు పట్టించుకోలేదని ఫిర్యాదు చేసినది వీరే. ఏ ప్రాంతం వారైనా సరే, నాయకులు ఎప్పుడూ అంతే అని తెలిసినపుడు యీ రోజు ప్రత్యేకంగా సీమాంధ్ర ప్రజల పట్ల జాలిపడడం దేనికో తెలియదు.
సీమాంధ్ర కాంగ్రెసు నాయకుల్లో చీలిక వుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా విభజనకు ఒప్పుకోకూడదని కొందరు, అబ్బే యిదే అదనుగా మనకు కావలసినవి అడిగేసి పుచ్చేసుకుందాం అని మరికొందరు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు 'అధిష్టానం మాట వినకపోతే ఎలా, వింటూనే మనకి కావలసినవి అడిగి పట్టుకుని వస్తాం' అని సీమాంధ్రులను మభ్యపెట్టి చేంతాడంత లిస్టు యిచ్చారు. హైదరాబాదును యూటీ చేయాలని, ప్రత్యేక రాష్ట్రం చేయాలని, శాశ్వత రాజధాని చేయాలని దగ్గర్నుంచి తమ ప్రాంతాలకు ఏమేం కావాలో అన్నీ చెప్పారు, రాసి యిచ్చారు. కాంగ్రెసు అధిష్టానం అవేమీ పట్టించుకోకుండా పొమ్మంది. చివరకు వీళ్లు ఏదీ సాధించుకుని రాలేకపోయారు. ఈ రోజు యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ మంత్రులు పురంధరేశ్వరి, కావూరి, చిరంజీవి కూడా వెల్‌లోకి వెళ్లారు. ఇన్నేళ్లగా నోరెత్తకుండా కూర్చున్న సమైక్యవాదులు యిప్పుడు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. సబ్బం హరి వంటి గంభీర రాజకీయవేత్త కూడా పార్లమెంటులో ప్రాణత్యాగం చేస్తానని ప్రకటించడం శోచనీయం. టిడిపి లింగారెడ్డి పార్లమెంటుకు నిప్పు పెట్టేస్తాననడం శోచనీయం. ఇలాటి మాటలు రాజకీయాలకు శోభ నీయవు. వీళ్లు ఏం మొత్తుకున్నా అధిష్టానం వినదలచుకోలేదు. సీమాంధ్ర నాయకులు తమకు ఏం కావాలో అడగాలని హితవు చెప్పేవారికి యివేమీ కనబడవా? వినబడవా?
సీమాంధ్ర నాయకులు తమ ప్రజలకు యిప్పటికి కూడా ఏవేవో హామీలు యిచ్చేస్తున్నారు. బ్రహ్మాస్త్రాలు, బైరాగి చిట్కాలూ అంటూ. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును రాష్ట్రపతి పార్లమెంటుకి పంపకుండా ఆపేస్తారన్నారు. ఆయన గొప్ప పార్లమెంటేరియన్, సోనియా చెప్పింది కదాని గుడ్డిగా సంతకం పెట్టకుండా న్యాయనిపుణులను సంప్రదిస్తారన్నారు. ఆ కారెక్టరు బొత్తిగా డమ్మీ కారెక్టరుగా తేలింది. అసెంబ్లీకి పంపినది ముసాయిదా బిల్లా, అసలు బిల్లా, ఆర్థిక పత్రాలు జోడించలేదేం వంటి ప్రశ్నలు ఏమీ వేయలేదు. రాజ్యసభలో పెట్టాలా? ఓకే అని సంతకం పెట్టేశారు. కాదు.. లోకసభలో పెట్టాలట, మళ్లీ సంతకం పెట్టండి అంటే మళ్లీ యింకో సంతకం. సుదీర్ఘ అనుభవం వున్న ప్రణబ్‌కు ఏ బిల్లు రాజ్యసభలో పెట్టాలో, ఏది లోకసభలో పెట్టాలా తెలియకుండా వుందా? కళ్లు మూసుకుని సంతకం పెట్టాలని నిశ్చయించుకుంటే యిలాగే వుంటుంది. ఆయన మూడు అంశాలపై మాత్రం వివరణ కోరి గంటల్లో సమాధానం తెప్పించుకుని సంతకం పెట్టేశారు. ఆ మూడు అంశాలు ఏమిటో పేపర్లో రాలేదు. బహుశా 'పొట్టి సంతకమా, పొడుగు సంతకమా?', 'నల్ల యింకు పెన్నా? ఎఱ్ఱ యింకు పెన్నా?' 'మా స్టాఫ్ చేత పంపించమంటారా? మీ వాళ్లే వచ్చి పట్టుకెళతారా?' అని అడిగి వుండవచ్చు. రాష్ట్రపతి పాత్ర యాక్షన్ మర్చిపోతే ఉపరాష్ట్రపతి పాత్ర అనుకోకుండా చురుగ్గా కదిలింది. ''మీరు రాజ్యసభలో పెట్టమంటే పెట్టేయడమేనా? ఫైనాన్షియల్స్ సంగతేమిటి?'' అని చెడామడా ప్రశ్నలేసి పార్లమెంటరీ శాఖను, హోం శాఖను చికాకు పెట్టేసింది. వాళ్లు న్యాయశాఖను సంప్రదిస్తే రాజ్యసభలో కాదు, లోకసభలో పెట్టండన్నారు. అంటే ఏ బిల్లు ఎక్కడ పెట్టాలో కూడా నిర్ధారించుకునే ఆ కనీసకసరత్తు కూడా చేయకుండా కమల్‌నాథ్ స్టేజి ఎక్కేశారన్నమాట.
అసలు యీ పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసినది ఎందుకు? అవినీతి బిల్లులున్నాయి, రైల్వే బజెట్, మామూలు బజెట్ ఓట్ ఆన్ ఎకవుంట్ పెట్టాలి. మొత్తం 39 బిల్లులున్నాయి. ఇన్ని పనులు పెట్టుకుని తెలంగాణ తప్ప దేశంలో వేరే సమస్య ఏదీ లేదన్నట్టు మొదటిరోజు నుండి అదే గోల. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేయడానికి ప్రభుత్వమే కుయుక్తులు పన్నింది. ఈ రోజు ప్రధాని, కమలనాథ్ ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టినందుకు మొసలి కన్నీరు కార్చారు. వాళ్లు ఏదీ పద్ధతి ప్రకారం చేయరు. పారదర్శకంగా చేయరు. అంతా గూడుపుఠాణీ. ఎలా ప్రతిఘటించాలో తెలియక అడ్డు తిరిగితే వాళ్లని అరాచకవాదులంటున్నారు. తమ పార్టీకే చెందిన సీమాంధ్ర ఎంపీలను, తెలంగాణ ఎంపీలను ఒకరిపై మరొకర్ని ఎక్కవేసి కాంగ్రెసు అడిస్తోంది. ఆత్మగౌరవం, స్వయంపరిపాలన వంటి మాటలు వల్లిస్తూనే తెలుగువాళ్లం వాళ్లు చెప్పినట్లు ఆడుతున్నాం. ఈ సమావేశాల్లో పార్లమెంటు ఎన్నిసార్లు వాయిదా పడిందో చూడండి. సరే, తెలంగాణ బిల్లు సవరిస్తాం అని కాంగ్రెసు ఒక్కసారైనా అందా? బిల్లంతా చిల్లులే, తప్పుల తడకే, కోర్టు కొట్టి పడేస్తే పార్లమెంటుకే అప్రదిష్ట అని ఆడ్వాణీ వాపోయారట. ఏదీ చూసుకోరు, వివరాలు ఎవరికీ చెప్పరు. ముగ్గురు నలుగురు తమిళులు కూర్చుని మొత్తం వ్యవహారం కానిచ్చేస్తున్నారు. సోనియాకు యింత మూర్ఖత్వం ఎందుకో తెలియదు.
ఇవాళ నినాదాల మధ్య రైల్వే బజెట్ 10 నిమిషాల్లో ముగించేశారు. రేపు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి మూజువాణీ ఓటుతో గంటల్లో పాస్ చేయించేస్తారట. అసెంబ్లీలో డిస్కషన్ చేసేదేముంది తొక్క, అది ఎలాగూ పట్టించుకోం. మేం యిక్కడ అన్నీ చూసుకుంటాం అని యిన్నాళ్లూ చెప్తూ వచ్చారు. ఇదేనా చూసుకోవడం? యథార్థ స్థితిని వివరించిన శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు కాపీలు అందరికీ పంచారా? లేదే! పొడిపొడిగా వున్న ముసాయిదా బిల్లు కాపీలు మాత్రం యివాళ పంచి రేపే చర్చకు పెడతారట. బిజెపితో మాట్లాడక 32 సవరణలు చేద్దామనుకుంటున్నారట. అవి సర్క్యులేట్ చేయరు కదా. ప్రధాని విందులో బిజెపి చదివిన చిఠ్ఠా చాలా పెద్దది. మూడు రోజుల క్రితం సీమాంధ్రను తృప్తి పరచడానికి ఫలానా ఫలానా చర్యలు చేపట్టాలి అని వెంకయ్యనాయుడు లిస్టు యిస్తే, వాటిమీద కమిట్‌మెంట్ ఏమీ లేకుండా 'చూస్తాం, పరిశీలిస్తాం' అని రాసుకుని వచ్చి జైరాం రమేశ్ 'మీరు చెప్పినవన్నీ చేసేశాంగా' అన్నారు. రాబోయే ఫైనాన్సు కమిషన్ చూడాలి అంటే కమిట్ అయినట్టు లెక్క అవుతుందా? సీమాంధ్రకు రాజధాని ఎక్కడ అనేది చాలా వివాదాస్పదమైనది. ప్రతీ వూరూ మాకే రాజధాని కావాలంటూ ఆందోళన చేపడుతుంది. హైకోర్టు బెంచి కావాలంటూ గుంటూరు వాళ్లు కొన్నాళ్ల క్రితం సమ్మె చేస్తే యింకో పది వూళ్ల నుండి అదే రకమైన డిమాండు వచ్చింది. ఇప్పుడు కోట్ల పెట్టుబడితో ముడిపడిన రాజధాని ఎవరు వదులుకుంటారు? ఆ సమస్య లేవనెత్తగానే కొన్ని నెలలపాటు సీమాంధ్ర అగ్నిగుండంగా మారడం ఖాయం. ఆ అంశాన్ని ఓపన్‌గా వదలకుండా యీ బిల్లులోనే రాజధాని ఫలానా అని చెప్తే పద్ధతిగా వుండేది. ఓ కమిటీ వేస్తాం, అది 45 రోజుల్లో చెపుతుంది అని ముసాయిదా బిల్లులో అన్నారు. సవరణల్లో దాన్ని 6 నెలలు చేశారు. ఇప్పుడు బిజెపి రాజధాని విషయం వెంటనే చెప్పమంటోంది. అయ్యే పనేనా? అసలు బిజెపి చెప్పిన సవరణలన్నీ ఒక్క రోజులో బిల్లులో ఎలా చేరుస్తారో తెలియదు. అసలు చేర్చారో లేదో ఎలా తెలుస్తుంది? పార్లమెంటులో ఏ మంత్రయినా చదివినా పోటాపోటీ నినాదాల మధ్య, గందరగోళం మధ్య అది వినబడదు కూడా.
ఇప్పుడు బిజెపి చెప్పిన షరతుల ప్రకారం రాయలసీమకు ప్యాకేజీ, సీమాంధ్ర ప్రాంతంలో నాలుగు నగరాలను ముఖ్యనగరాలను అభివృద్ధి చేయడానికి నిధులు యిప్పుడే కేటాయించడం, ప్రభుత్వ సంస్థలు అక్కడ పెట్టడం వంటివి ఒప్పుకుంటే ఆ ఘనత బిజెపికి పోతుంది. 'సీమాంధ్రకు కాంగ్రెసు అన్యాయం చేయబోతే బిజెపి అడ్డుకుని న్యాయం చేసింది' అని సీమాంధ్ర ప్రజలు నమ్మితే కాంగ్రెసుకేం లాభం? అందువలన ఆఖరి నిమిషంలో ఏదో ఒక గోల్‌మాల్ చేసి, బిల్లు పాస్ చేయలేని పరిస్థితి కల్పించి 'అదిగో బిజెపి సహకరించలేదు కాబట్టే తెలంగాణ యివ్వలేకపోయాం' అని అనడానికే చూస్తోందేమో తెలియదు. బిల్లు గట్టెక్కేదాకా అంతా సస్పెన్సే.
భావితరాలను ప్రభావితం చేసే రాష్ట్రవిభజన వంటి అతి ముఖ్యమైన విషయాన్ని యింత అడ్డగోలుగా డీల్ చేయడం ఏ చట్టసభలోనూ జరిగివుండదు. విభజన కోరుకునేవారు యీ ప్రాసెస్‌ను హర్షిస్తున్నారో లేదో తెలియదు కానీ బహిరంగంగా ఖండించటం లేదు. ఎలాగోలా, ఏదో ఒక పద్ధతిలో తమకు రాష్ట్రం వస్తే చాలనుకుంటూ మౌనం పాటిస్తున్నారు. అది దురదృష్టకరం. ఈ రోజు మొదలుపెట్టిన యీ ఆట ఎక్కడ ఆగుతుందో! ఇదే పద్ధతిలో రేపు ఏ రాష్ట్రాన్నయినా ఏ పార్టీ అయినా చీల్చి ముక్కలు చేయవచ్చు. మేధావుల మౌనం దేశానికి అరిష్టం అంటారు. ఇప్పుడు అదే పట్టింది. తెలంగాణ అభివృద్ధి చెందలేదు, వారికి అన్యాయం జరిగింది, రాష్ట్రం విభజిస్తేనే మేలు అని పుష్కరం పాటు అసత్యప్రచారం జరిగితే దాన్ని ఖండించకుండా సీమాంధ్ర మేధావులు, సమైక్యవాదులు మౌనం పాటించారు. ఇప్పుడు యీ అప్రజాస్వామిక పద్ధతి పట్ల తెలంగాణ మేధావులు, విభజనవాదులు మౌనం పాటిస్తున్నారు. దీనికి మనం రాబోయే రోజుల్లో తప్పక మూల్యం చెల్లించవలసి వస్తుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)