Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కాష్మోరా

సినిమా రివ్యూ: కాష్మోరా

రివ్యూ: కాష్మోరా
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, పివిపి సినిమా
తారాగణం: కార్తీ (ద్విపాత్రాభినయం), నయనతార, వివేక్‌, శ్రీదివ్య, శరత్‌ లోహితశ్వ, మధుసూదన్‌, మధుమిత తదితరులు
సంగీతం: సంతోష్‌ నారాయణ్‌
కూర్పు: వి.జె. సాబు జోసెఫ్‌
ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్‌
నిర్మాతలు: పర్ల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కవిన్‌ అన్నే, ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు
కథ, కథనం, దర్శకత్వం: గోకుల్‌
విడుదల తేదీ: అక్టోబరు 28, 2016

ట్రెయిలర్‌లో కత్తులు, గుర్రాలు, యుద్ధాలు, చక్ర వ్యూహాలు వగైరా చూపించేసరికి ఇదేదో 'బాహుబలి' మాదిరి సినిమాలా ఉందే అనిపించిన కాష్మోరాలో నిజానికి ఆ ఎపిసోడ్‌ ఉన్నది కొన్ని నిమిషాలు మాత్రమే. అది కూడా బాహుబలి కాకుండా మగధీర, అరుంధతి చిత్రాలని గుర్తు తెచ్చే ఎపిసోడ్‌ అంతే. కనుక అలాంటి అంచనాలతో కాష్మోరాకి వెళుతున్నట్టయితే, ఇది ఒక హారర్‌ కామెడీ అనేది తెలుసుకుని వెళితే మంచిది. లేదంటే నిరాశ పడాల్సి వస్తుంది. 

ఈమధ్య కాలంలో మరీ ఎక్కువైపోయిన హారర్‌ కామెడీ సినిమాల కోవలోనే 'కాష్మోరా' కూడా మొదలవుతుంది. ఎప్పుడయితే కాష్మోరా (కార్తీ) ఒక ఫేక్‌ అని తెలుస్తుందో అప్పట్నుంచీ ఈ చిత్రం కామెడీ టర్న్‌ తీసుకుంటుంది. అంత వరకు లేని దెయ్యాలని వదిలించిన కాష్మోరాకి నిజంగా దెయ్యం ఎదురు పడ్డప్పుడు ఆ కామెడీ ఇంకో లెవల్‌కి వెళుతుంది. కామెడీ పరంగా కాష్మోరా స్కోర్‌ చేసింది. చాలా సందర్భాల్లో హాయిగా నవ్వుకోవచ్చు. కేవలం హారర్‌ కామెడీగానే తీసినట్టయితే ఈ చిత్రం పాస్‌ అయిపోయేదేమో. 

కానీ దర్శకుడు ఈ చిత్రానికి సోషియో ఫాంటసీ కోణాన్ని తగిలించి, ట్రెయిలర్స్‌లో దానినే హైలైట్‌ చేశాడు. దాంతో ఆ ఎపిసోడ్‌పై అంచనాలు భారీగా ఉండడంతో దాని కోసమే ఎదురు చూస్తారెవరైనా. ఈ చిత్రానికి హైలైట్‌ అవ్వాల్సిన ఆ ఎపిసోడ్‌ పూర్తిగా నీరుగార్చేసింది. 'అరుంధతి' చిత్రాన్ని తలపించడం వల్ల తెలుగు సినీ ప్రేక్షకులైతే ఆ ఎపిసోడ్‌ని అస్సలు ఇష్టపడలేరు. రాజ్‌ నాయక్‌, రత్నమహాదేవి (కార్తీ, నయనతార) నడుమ కాన్‌ఫ్లిక్ట్‌ సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేదు. ఆ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ మొత్తంలో ఒక సీన్‌ ఏమో నాయక్‌ బలం చూపించడానికి, మరో సీన్‌ అతని బలహీనత చూపించడానికి వాడుకున్నారు. ఒక సీన్‌లో అతని వీరత్వం, ఒక సీన్‌లో అతని క్రూరత్వం చూపించి ముగించేసారు. 

ఈ సీన్స్‌ అన్నీ కూడా మగధీర, బాహుబలి, అరుంధతి తదితర చిత్రాలనే తలపించడంతో, పైగా ఆ సినిమాల్లోని సీన్లు ఎన్నో రెట్లు బాగుండడంతో కాష్మోరాకి కీలకమైన ఈ ఎపిసోడ్‌ తేలిపోయింది. కార్తీ తన అద్భుతమైన నటన, ఆంగీకంతో ఆట్టుకున్నప్పటికీ ఈ పార్ట్‌ని సేవ్‌ చేయలేకపోయాడు. పతాక సన్నివేశాలు పేలవంగా ఉండడంతో 'కాష్మోరా' ద్వితీయార్ధం బలహీనంగా అనిపిస్తుంది. వివిధ జోనర్స్‌ని ఒకే దాంట్లో మిక్స్‌ చేయాలని చూడడం వల్ల దర్శకుడు దేనికీ న్యాయం చేయలేకపోయాడనిపించింది. అతను పూర్తిగా కామెడీపై దృష్టి పెట్టినట్టయితే ఇది కూడా లారెన్స్‌ 'కాంచన' సిరీస్‌ మాదిరిగా మాస్‌ని అలరించి ఉండేది. 

కార్తీ రెండు పాత్రలనీ చాలా బాగా పండించాడు. రాజ్‌ నాయక్‌గా అతని హావభావాలు, వేషధారణ, నడక అన్నీ పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. కార్తీ అని చెప్పకపోతే గుర్తు పట్టడమే కష్టమన్నట్టున్నాడు. డూప్లికేట్‌ భూత వైద్యుడిగా కూడా కార్తీ తన కామెడీతో నవ్వించాడు. ప్యాలెస్‌లోకి ఫస్ట్‌ టైమ్‌ వెళ్లే సీన్‌, చివర్లో తనలో రత్నమహాదేవి ఆవహించింది అన్నట్టు నటించే సీన్‌లో కార్తీ నవ్వులు పూయించాడు. అతనికి వివేక్‌ నుంచి మంచి సహకారం లభించింది. నయనతార పాత్రని ఇంకా ఎఫెక్టివ్‌గా తీర్చిదిద్దాల్సింది. శ్రీదివ్యతో పాటు మిగతా వారంతా ఓకే అనిపిస్తారు. 

నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం బాగున్నాయి కానీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అప్పుడప్పుడూ మెప్పించి, కొన్ని చోట్ల మరీ టీవీ సీరియల్‌ తరహాలో ఉన్నాయి. ఖర్చు పరంగా నిర్మాతలు రాజీ పడలేదు. దర్శకుడు గోకుల్‌కి మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉంది. ఫేక్‌ బాబా సెటప్‌, అతని ఫ్యామిలీ అన్నీ బాగా కుదిరాయి. కామెడీని బాగా పండించినా కానీ అతి కీలకమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ విషయంలో రాజీ పడిపోయాడు. కాకపోతే రెగ్యులర్‌ హారర్‌ కామెడీల మధ్య కొత్తదనం అందించాలనే అతని తపనని అయితే మెచ్చుకోవచ్చు. 

కాష్మోరా చూస్తున్నంతసేపు వేరే చిత్రాలు తలపుకి రావడం దీనికున్న అతి పెద్ద బలహీనత. ఫేక్‌ ఘోస్ట్‌బస్టర్స్‌ సెటప్‌ మొత్తం సూర్య నటించిన 'రాక్షసుడు' చిత్రాన్ని గుర్తు చేస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో రాజ్‌ నాయక్‌ క్యారెక్టరైజేషన్‌, రత్నమహాదేవిపై అతనికుండే ఇంట్రెస్ట్‌ అరుంధతిని తలపిస్తుంది. సేనాధిపతిగా అతని పాత్ర, ఒక కొండపై జరిగే పోరాట దృశ్యం మగధీరని గుర్తుకి తెస్తాయి. మళ్లీ క్లయిమాక్స్‌ సీన్‌ యథాతథంగా అరుంధతిని పోలి ఉంటుంది. ఇలా ఎక్కడికక్కడ వేరే చిత్రాల స్ఫూర్తి ఉండడంతో 'కాష్మోరా'కి సొంత ఐడెంటిటీ లేకుండా పోయింది. సినిమాలో క్లిక్‌ అయిందంటూ ఉంటే అది కామెడీ పార్ట్‌ ఒక్కటే. అదే విధంగా నూటికి నూరు శాతం ఎఫర్ట్స్‌ పెట్టి తన రెండు పాత్రలని అద్భుతంగా పోషించిన కార్తీ కష్టం కూడా ఈ చిత్రాన్ని చూడబుల్‌గా మార్చాయి. 

ఒక సగటు సినిమా అనిపించే అనుభూతిని మిగిల్చిన కాష్మోరా నిజానికి ఇంకా చాలా బెటర్‌ ఫిలిం అయి ఉండేది. దర్శకుడు ద్వితీయార్ధాన్ని టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌గా తీసుకోకుండా ఇంటెన్స్‌గా తీసి ఉన్నట్టయితే హారర్‌ కామెడీ జోనర్‌లో ఒక ప్రత్యేకమైన సినిమాగా ఇది నిలిచిపోయేది. ట్రెయిలర్‌తో పుట్టించిన ఆసక్తితో ఓపెనింగ్‌కి ఢోకా ఉండదు. సోమవారం నుంచి సక్సెస్‌ దిశగా నడిపించడానికి ఇందులో ఉన్న కామెడీ మాత్రం సరిపోతుందా లేదా అనేది చూడాలిక. 

బాటమ్‌ లైన్‌: కార్తీ షో!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?