రివ్యూ: నీ జతగా.. నేనుండాలి
రేటింగ్: 2/5
బ్యానర్: పరమేశ్వర ఆర్ట్స్
తారాగణం: సచిన్ జోషి, నజియా హుస్సేన్, రావు రమేష్, శశాంక్ తదితరులు
సంగీతం: జీత్ గంగూలి, మిథున్, అంకిత్`అంకుర్
కూర్పు: ఎం.ఆర్. వర్మ
ఛాయాగ్రహణం: ఏ. వసంత్
కథ, కథనం: షాగుఫ్తా రఫీక్
మాటలు: మధుసూదన్
పాటలు: చంద్రబోస్
నిర్మాత: బండ్ల గణేష్
దర్శకత్వం: జయ రవీంద్ర
విడుదల తేదీ: ఆగస్ట్ 22, 2014
బిజినెస్‌మేన్‌గా కోట్లు గడిస్తోన్న సచిన్ జోషి అడపాదడపా తన సరదా తీర్చుకునేందుకు వెండితెర మీదకి దండెత్తుతుంటాడు. తెలుగు బొత్తిగా రాకపోయినా మన ప్రేక్షకుల అదృష్టం కొద్దీ తన గజిని మొహమ్మద్ దండయాత్రలకి టాలీవుడ్‌నే ప్రధానంగా ఎంచుకున్నాడు. అందులో భాగంగా అతను ఆషికీ 2 అనే హిందీ హిట్‌ని నీ జతగా నేనుండాలి పేరుతో రీమేక్ చేసాడు. దాని కథాకమామీషు…
కథేంటి?
రాఘవ జయరామ్.. అలియాస్ ఆర్జే (సచిన్) ఒకప్పుడు గొప్ప సింగర్. తాగుడుకి బానిసగా మారి తన కెరీర్ నాశనం చేసుకుంటాడు. తన కెరీర్ పతానవస్థలో ఉండగా అతనికి గాయత్రి నందన (నజియా) తారసపడుతుంది. ఆమె పాట విని ఫిదా అయిపోతాడు. ఆమె గానంలో ఏదో మ్యాజిక్ ఉందని తనని పెద్ద సింగర్ చేయాలని నడుం బిగిస్తాడు. ఈ ప్రాసెస్‌లో ఇద్దరూ ప్రేమలో పడి సహజీవనం కూడా మొదలు పెడతారు. గాయత్రి సింగర్‌గా ఎత్తులకి ఎదిగిపోతూ ఉంటే… తాగుడు మానలేక ఆర్జే పూర్తిగా నాశనం అయిపోతాడు. గాయత్రి కెరీర్‌కి ప్రతిబంధకంగా మారిన ఆర్జే అప్పుడేం చేస్తాడు?
కళాకారుల పనితీరు:
సరదా కొద్దీ నటిస్తోన్న సచిన్ జోషి.. సినిమాకి కాస్త సీరియస్‌గా తీసుకుంటే మంచిదేమో. తెలుగులో మూడు, హిందీలో రెండు సినిమాల్లో నటించిన సచిన్ ఇంతదాకా కనీసం బేసిక్స్ కూడా నేర్చుకోలేదు. అతని ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ వెతికే ప్రయత్నం చేస్తే నీరసంతో మన ఫేస్ కళ తప్పిపోయే ప్రమాదం లేకపోలేదు. నటుడిగా పేరు తెచ్చుకోవడానికి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్‌ని ఎంచుకుని… సినిమా మొత్తమ్మీద ఒక్కసారి కూడా రైట్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వలేకపోవడమూ ఆర్టే. ఈ విషయంలో సచిన్‌తో పోటీకొస్తే ఎలాంటి వుడెన్ ఫేస్ అయినా ఓడిపోవడం తథ్యం.
సచినే గొప్ప నటుడని అనుకుంటే నజియా అతని క్లోజ్ కజిన్‌లా అనిపించింది. అయితే అప్పుడప్పుడు అయినా ఈమె ఫేస్‌లో కొన్ని ఎక్స్‌ప్రెషన్లు అలా కెమెరాతో దోబూచులాడతాయి. కానీ ఆమె చేసిన పాత్రకి వచ్చీ రాని నటన సరిపోదు కనుక నజియా సైతం ఈ చిత్రానికి పెద్ద మైనస్ అయింది. వీళ్లిద్దరి పక్కన రావు రమేష్, శశాంక్ ఆస్కార్ రేంజ్ ఆర్టిస్టుల్లా అనిపించకపోతే అడగండి.
సాంకేతిక వర్గం పనితీరు:
ఆషికీ 2 ట్యూన్లకి వంక పెట్టడానికేమీ లేదు. హిందీ పాటని గుర్తు చేసుకోకపోతే ‘వింటున్నావా నేస్తం..’ పాటని ఎంజాయ్ చేయవచ్చు. చంద్రబోస్ అనువాద సాహిత్యం పాటల పరిమళాన్ని పాడు చేసింది. చాలా పాటల్లో బ్యాడ్ లిరిక్స్ మ్యూజిక్ బ్యూటీని దెబ్బ తీస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. దర్శకుడు హిందీ వెర్షన్‌ని ఒక బైబిల్‌లా, భగవద్దీగతలా ఫాలో అయిపోయాడు. అక్షరం పొల్లుపోతే పాపం చేసినట్టు ఫీలయ్యాడు. డైలాగులు, కెమెరా ఫ్రేమింగులు… దేనినీ మార్చకుండా అచ్చు గుద్దేసాడు. కానీ ఈ లవ్‌స్టోరీతో ఫీల్ పుట్టించి కదిలించడంలో దర్శకుడిగా ఫెయిలయ్యాడు. అయితే దీంట్లో అతను చేసిన తప్పుల కంటే… లీడ్ పెయిరే అతని చేతులు కట్టి పారేసారు.
హైలైట్స్:
- మ్యూజిక్
డ్రాబ్యాక్స్:
- హీరో సచిన్
- హీరోయిన్
- ఫీల్ లేని నెరేషన్
- బ్యాడ్ డైరెక్షన్
విశ్లేషణ:
‘ఆషికీ 2’ బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయింది. లో బడ్జెట్‌లో రూపొందిన ఆ చిత్రం దాదాపు తొంభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఇండియాలోనే సాధించింది. స్టార్లు లేని సినిమా ఇంత వసూలు చేసిందంటే… నిజంగా గొప్ప చిత్రమై ఉంటుందని భ్రమ పడవచ్చు. కానీ ఆషికీ 2 అంత గొప్ప సినిమాయేం కాదు. కేవలం బ్లాక్‌బస్టర్ ఆడియో ఆల్బమ్ వల్ల, శ్రద్ధా కపూర్ అద్భుత అభినయం వల్ల ఒక సాధారణ ప్రేమకథా చిత్రం అసాధారణ విజయాన్ని అందుకుంది. అయితే ఈ రీమేక్ చేసిన వాళ్లు ఆషికీ 2 బలాలు, బలహీనతలేంటనేది తరచి చూసుకోలేదు. అదేదో లోపాలే లేని ప్యూర్ బ్లాక్‌బస్టర్ మెటీరియల్ అన్నట్టు తు.చ. తప్పకుండా దానిని అచ్చంగా ముద్ర గుద్దేశారు.
ఆషికీ 2 చిత్రానికి పాటలే పెద్ద ప్లస్ కాబట్టి తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు… ఇక నీరాజనం లేదా అభినందన లాంటి ఆడియో ఆల్బమ్‌ని తయారు చేసుకుని ఉండాలి. కానీ హిందీ పాటల్నే అచ్చంగా తర్జుమా చేసి సినిమాలో పెట్టేసారు. దాంతో హిందీ అనువాద పాటలకి సినిమాని ఆదుకునే బలం లేకుండా పోయింది. ఆషికీ 2 చిత్రానికి ప్రధాన బలమైన ఆడియోనే ఇక్కడ బలహీనం అయినప్పుడు ఇక దానిపై ‘నీ జతగా నేనుండాలి’ ఎలా నిలబడుతుంది? ఆషికీ 2 చిత్రానికి మరో ఎస్సెట్‌గా చెప్పుకున్న శ్రద్ధా కపూర్‌లాంటి హీరోయిన్ దీంట్లో లేదు. ఏమాత్రం ఎక్స్‌ప్రెషన్ పలకని, యాక్టింగ్‌లో ఓనమాలు కూడా తెలియని నజియాపై ఆ భారం వేసి ఒరిజినల్‌కి ఉన్న మరో స్ట్రెంగ్త్‌ని కూడా తీసి అవతల పారేసారు. ఇక ఈ రీమేక్… ఆడియన్స్ పాలిట ‘మేకు’ కాకుండా ఎలా ఉంటుంది?
ప్రేమకథా చిత్రాల్లో ప్రధాన జంట మధ్య కెమిస్ట్రీనే సరిగా కుదరనపుడు ఇక ఆ లవ్‌స్టోరీ ఎలా రక్తి కడుతుంది. ‘ఆషికీ 2’లో ఇంటెన్స్ రొమాన్స్ ఏమీ ఉండదు. చాలా సింపుల్ ఎమోషన్స్‌తో, సటిల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లవ్‌స్టోరీ డెవలప్ అవుతుంది. అంటే.. ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ ఇద్దరూ చూపుల్తోను, తమ హావభావాలతోను తమ మధ్య ఎంతటి గాఢమైన ప్రేమానుబంధం ఉందనేది తెలియజేస్తారన్నమాట. కానీ ఇక్కడ సచిన్‌కి కానీ, నజియాకి కానీ ముఖంలో ఎక్స్‌ప్రెషనే పలకదు. ఇక మూగగా లవ్ ఫీలింగ్స్ ఎలా పుట్టించగలరు? ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బొత్తిగా లోపించడంతో ఏ క్షణంలోను ఈ ప్రేమజంట కలిసి కలకాలం ఉండాలనే కోరిక చూసే వారికి కలగదు. తన బలహీనతని జయించలేక శిధిలమైపోతున్న కథానాయకుడు కనీసం తన పెయిన్‌ని కూడా అభినయించలేకపోవడంతో అతనెంతటి విపరీత నిర్ణయం తీసుకున్నా కానీ చివుక్కుమని కూడా అనిపించదు.
ఉన్న బలాల్ని వాడుకోలేక… కొత్త బలహీనతల్ని తెచ్చి పెట్టుకున్న ఈ ఆషికీ 2 రీమేక్ ఆద్యంతం సహనానికి పరీక్ష పెడుతుంది. అది చూసిన తర్వాత పొరపాట్న ఈ చిత్రం చూడాల్సి వస్తే… ఈ జ్ఞాపకాల్ని వెంటనే తుడిచేసుకోవడానికి, ఈ పాటల గుర్తులు కూడా మిగలకుండా చేయడానికి వెంటనే ఆషికీ 2 పాటలు మళ్లీ ఓ నాలుగు సార్లు వినేసి, ఆ సినిమాని మరో రెండు సార్లు చూడాల్సి వస్తుంది. ఒరిజినల్‌తో పరిచయమే లేని వారు ఇది చూసినట్టయితే.. అసలు ఆషికీ 2నే బక్వాస్ సినిమా అనిపించినా అనిపిస్తుంది.
బోటమ్ లైన్: వీళ్ల జతగా మనం ఉండలేము!!
-జి.కె.