రివ్యూ: పవర్
రేటింగ్: 3/5
బ్యానర్: రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.
తారాగణం: రవితేజ, హన్సిక, రెజీనా, బ్రహ్మానందం, సంపత్ రాజ్, ప్రకాష్‌రాజ్, ముఖేష్ రిషి, సప్తగిరి, కోట శ్రీనివాసరావు, అజయ్, సుబ్బరాజు తదితరులు
మాటలు: కోన వెంకట్
కథనం: కె.ఎస్. రవీంద్ర, కె. చక్రవర్తి, మోహనకృష్ణ
సంగీతం: థమన్
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్
నిర్మాత: రాక్‌లైన్ వెంకటేష్
కథ, దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర (బాబీ)
విడుదల తేదీ: సెప్టెంబర్ 12, 2014
ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేసే రవితేజ ‘బలుపు’కి ముందు వచ్చిన పరాజయాలతో స్పీడు తగ్గించాడు. బలుపుతో వచ్చిన విజయాన్ని నిలబెట్టుకోవడానికి తన తదుపరి చిత్రం కోసం ఏడాదికి పైగానే కేటాయించాడు. రవితేజ అంత జాగ్రత్త పడి, ఏరి కోరి చేసిన ఆ చిత్రమే ‘పవర్’. రవితేజకి ఇందులో అంత నచ్చిందేంటో తెలియదు కానీ… సినిమాలో ఉన్న కంటెంట్ కంటే రవితేజ ఎనర్జీనే పవర్‌కి కవచంగా నిలిచింది.
కథేంటి?
తిరుపతి (రవితేజ) ఎలాగైనా పోలీస్ కావాలని కలలు కంటుంటాడు. తన బావ (బ్రహ్మానందం) యూనిఫారం వేసుకుని తను డ్యూటీ చేసేస్తుంటాడు. ఎప్పటికీ పోలీస్ కాలేనేమో అని బాధ పడుతున్న టైమ్‌లో తిరుపతికి బంపర్ ఆఫర్ దొరుకుతుంది. అచ్చం తనలానే ఉండే ఏసీపీ బలదేవ్ సహాయ్ (రవితేజ) చనిపోవడంతో, అతని స్థానంలో తనని రమ్మని హోమ్ మినిస్టరే కోరతాడు. అసలు బలదేవ్ సహాయ్ ఎందుకు చనిపోతాడు, అతని ప్లేస్‌లోకి తిరుపతి రావాల్సిన అవసరమేంటి?
కళాకారుల పనితీరు:
రవితేజ అటు ఎంటర్‌టైన్‌మెంట్‌ని పండిస్తూనే, పవర్‌ఫుల్‌గాను కనిపించి మెప్పించగలడు. ఇంతకుముందు ఈ బ్లెండ్‌ని విక్రమార్కుడు సినిమాలో రాజమౌళి చూపించాడు. దర్శకుడు బాబీ కూడా అదే రూట్లో వెళ్లాడు. దాదాపుగా విక్రమార్కుడు తరహాలోనే ఇందులోను రవితేజ క్యారెక్టర్‌లో వేరియేషన్స్ ఉంటాయి. అయితే విక్రమార్కుడులో సిన్సియర్ కాప్ అయితే ఇందులో కరప్టెడ్ కాప్ అన్నమాట. తిరుపతిగా మాస్‌ని మెప్పించే వినోదంతో, బలదేవ్‌గా స్టయిలిష్ పర్‌ఫార్మెన్స్‌తో రవితేజ ఆకట్టుకుంటాడు.
హన్సిక ప్రతి సినిమాలోను చేసేదే చేసింది. రెజీనాకి చిన్న సినిమాలనుంచి దీంతో ప్రమోషన్ వచ్చినట్టే కానీ ఆమె పాత్ర మరీ చిన్నది కావడంతో హైలైట్ అవడానికి స్కోప్ లేకుండా పోయింది. మెయిన్ విలన్ క్యారెక్టరే చేసాడు కానీ సంపత్ రాజ్ క్యారెక్టర్‌లో చెప్పుకోతగ్గ ప్రత్యేకతలేమీ లేవు. సుబ్బరాజు, అజయ్, ముఖేష్ రిషి ఫర్వాలేదనిపిస్తారు. బ్రహ్మానందం కామెడీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. గతంలో రవితేజ కాంబినేషన్‌లో చేసిన సినిమాలతో పోలిస్తే ఇందులో బ్రహ్మానందం కామెడీ యావరేజ్ అనిపిస్తుంది. సప్తగిరి టాలెంట్‌ని కూడా సరిగా వాడుకోలేదు.
సాంకేతిక వర్గం పనితీరు:
కోన వెంకట్ సంభాషణల్లో కొన్ని బాగున్నాయి. ‘100 డయల్ చేస్తే పోలీస్ రావడం లేదురా… వంద కొడితే వస్తున్నాడు’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. థమన్ స్వరపరిచిన బాణీల్లో ‘చంపేసిందే చంపేసిందే’ చాలా బాగుంది. రవితేజ పాడిన ‘నోటంకీ నోటంకీ’ మాస్‌కి జోష్ ఇస్తుంది. నేపథ్య సంగీతం ఒక సీన్‌లో బాగుంటే, మరో సీన్‌లో బ్యాడ్‌గా ఉంది. థమన్ ఈ వీక్‌నెస్‌ని మాత్రం కరెక్ట్ చేసుకోవడం లేదు.
సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్‌గా సినిమా చాలా గ్రాండ్‌గా, ప్రతి ఫ్రేమ్ చాలా లావిష్‌గా అనిపిస్తుంది. నిర్మాత ఈ చిత్రంపై బాగానే ఖర్చు పెట్టాడు. రచయితగా కె.ఎస్. రవీంద్ర రొటీన్ కథలు రాసేసుకుంటున్నాడు. ‘బలుపు’, ‘అల్లుడు శీను’.. ఇప్పుడు ఇది.. ఎందులో చూసినా కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. కేవలం ఒక టెంప్లేట్ ఫాలో అయిపోతూ ఫార్ములాకి కట్టుబడి ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేయడానికే చూస్తున్నాడు.
దర్శకుడిగా ఇది తనకి తొలి సినిమానే అయినా కానీ అనుభవం ఉన్న దర్శకుడిలానే ఈ కమర్షియల్ చిత్రాన్ని హ్యాండిల్ చేసాడు. అలా అని అతను పొరపాట్లు చేయకుండా అయితే లేడు. ఈ చిత్రంలో చాలా లూప్‌హోల్స్ ఉన్నాయి. హీరో ఎలివేషన్ కోసమో, లేదా ట్విస్టు కోసమో తనకిష్టం వచ్చినట్టుగా తీసుకుంటూపోయాడు.
హైలైట్స్:
- రవితేజ పర్‌ఫార్మెన్స్
- ఎంటర్‌టైన్‌మెంట్
డ్రాబ్యాక్స్:
- రొటీన్ స్క్రిప్ట్
- ట్విస్టులెక్కువయ్యాయ్
విశ్లేషణ:
రవితేజ చిత్రాల్లో చాలా వరకు ఒకే పద్ధతిలో సాగిపోతాయి. కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే రొటీన్ స్టోరీని కూడా రవితేజ సేఫ్‌గా లాక్కొచ్చేస్తాడు. అందుకే రవితేజతో సినిమాలు తీసే రచయితలు, దర్శకులు పెద్దగా కష్టపడిపోరు. సింపుల్ కథ రాసుకుని, దాంతో వినోదం ఎలా పండిరచాలనేది చూసుకుంటారు. రవితేజతో హిట్ సినిమాలు తీసిన దర్శకులు చాలా మంది ఇదే పద్ధతి ఫాలో అయిపోయారు. రవితేజకి తగ్గ పాత్ర రాసుకోలేక, ప్రేక్షకులు ఆశించే వినోదాన్ని పండిరచలేక కొందరు ఫెయిలయ్యారు కానీ హిట్లు కొట్టిన వాళ్లంతా అతనితో గొప్ప సినిమాలైతే తీయలేదు.
దర్శకుడు బాబీ కూడా రవితేజ కోసం బ్రహ్మాండమైన కథేమీ రాయలేదు. కమర్షియల్ ఫార్ములాకి తగ్గట్టు అడపాదడపా కొన్ని మలుపులున్న ఒక సాధారణ కథనే రాసుకున్నాడు. రవితేజకి వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ సిద్ధం చేసుకున్నాడు. మిగతాది రవితేజ చూసుకున్నాడు. కొత్త దర్శకుల్లో చాలా మంది తమ ముద్ర చూపించాలని, కొత్తగా ఏదైనా చేయాలని చూస్తుంటారు. బాబీ అలాంటి లక్ష్యాలేమీ పెట్టుకున్నట్టు లేడు. బ్రాండ్ రవితేజ సినిమాని తీయాలని ఫిక్సయ్యాడో ఏమో ఎక్కడా తన స్టాంప్ కనిపించాలని చూసుకోలేదు.
‘పవర్ ` అన్‌లిమిటెడ్’ అనే టైటిల్ అయితే పెట్టారు కానీ ఇందులో రవితేజ ఎనర్జీ మినహా అన్నీ లిమిటెడ్‌గానే ఉన్నాయి. పగలబడి నవ్వే కామెడీ సీన్లు లేవు. ఔరా అనిపించే యాక్షన్ సన్నివేశాలు లేవు. అన్నట్టు యాక్షన్ సీన్స్ అంటే గుర్తొచ్చింది… తెలుగు సినిమాని పట్టి పీడిస్తోన్న ‘బౌన్సింగ్’ ఫైట్స్ స్టయిల్ ఈ చిత్రాన్నీ వదిలిపెట్టలేదు. ఒకేసారి అయిదారుగురిని ఎగరేసి కొట్టే సీన్లు ‘ఓవర్’గా ఉంటాయి కానీ ‘పవర్’ఫుల్‌గా ఉండవని ఎప్పటికి గ్రహిస్తారో.
స్టార్టింగ్‌లో భారీ ఛేజ్‌తో సహా ‘తిరుపతి’ పాత్ర పరిచయ సన్నివేశాల వరకు డల్‌గా సాగినా.. ఆ తర్వాత కథనం కుదురుకుంటుంది. హన్సిక క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర్నుంచి ఒక మూడ్‌లో సాగిపోతున్న సినిమా సెకండాఫ్‌లో సడన్‌గా సెంటిమెంట్‌తో హెవీ అవుతుంది. పోలీస్ వ్యవస్థ గురించి ఇందులో సందేశాన్ని కూడా ఇరికించి ఇదో ‘పర్పస్‌ఫుల్ సినిమా’ అనిపించడానికి కూడా ప్రయత్నం జరిగింది. ఆ ప్రాసెస్‌లో కథనం బరువుగా ముందుకి కదలడంతో మళ్లీ కాసేపు కామెడీ చేసారు. బలుపులో ‘జంపింగ్ జపాంగ్’లా ఇక్కడ విలన్స్‌తో ‘లుంగీ డాన్స్’ చేయించారు. ఈ ప్రయత్నాల్లో కొన్ని నవ్విస్తే… కొన్ని వారు పడుతున్న తాపత్రయం చూసి నవ్వుకునేట్టు చేస్తాయి. అలాగే ఈ సినిమా చూసి ‘విక్రమార్కుడు 2’ అనకుండా ఉండడానికో ఏంటో… చివర్లో ఒక ట్విస్టిచ్చారు. అది చాలా కామెడీగా అనిపిస్తుంది. సినిమా అంతా రొటీన్‌గా సాగిపోయినా, లాజిక్స్‌కి ఏమాత్రం చోటు లేకపోయినా… బలదేవ్ క్యారెక్టర్‌పై తీసిన కొన్ని సీన్లలోని హీరోయిజం మాస్ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుంది. ఏ సెంటర్స్‌లో కంటే ఈ చిత్రానికి బి, సి సెంటర్స్‌లో రెస్పాన్స్ బాగుండే అవకాశముంది. ఓపెనింగ్స్‌కి ఢోకా ఉండదు కానీ… అటుపై మాత్రం ‘ఆగడు’ ప్రభావంపై ‘పవర్’ పర్‌ఫార్మెన్స్ ఆధారపడుతుంది.
బోటమ్ లైన్: రవితేజ వన్ మ్యాన్ షో!
-గణేష్ రావూరి