ఈ గణపతి చాలా రిచ్‌ గురూ.!

ఏటా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో విగ్రహాల్ని ప్రతిష్టించడం, వాటిని ఆ తర్వాత నిమజ్జనం చేయడం చూస్తూనే వున్నాం. ఈ వేడుకల కోసం ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా లక్షల నుంచి…

ఏటా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో విగ్రహాల్ని ప్రతిష్టించడం, వాటిని ఆ తర్వాత నిమజ్జనం చేయడం చూస్తూనే వున్నాం. ఈ వేడుకల కోసం ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా లక్షల నుంచి కోట్లలో ఖర్చవుతూ వస్తోంది. హైద్రాబాద్‌లో ఖైరతాబాద్‌ గణేష్‌ విగ్రహం ప్రతిష్టాత్మకం అయితే, విశాఖలోనూ ప్రతిష్టాత్మకంగా గణేష్‌ ఉత్సవాలు జరుగుతున్నాయి. గాజువాక ప్రాంతంలో ఏర్పాటు చేసే విగ్రహానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది ఇటీవలి కాలంలో.

ఇక, జాతీయ స్థాయిలో అయితే ముంబైలోని లాల్‌ భాగ్‌ గణపతికి వున్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. లాల్‌ భాగ్‌ గణపతి ఉత్సవాల కోసం చేసే ఖర్చు ఓ రేంజ్‌లో వుంటుంది. ఆ ఉత్సవాల ఖర్చు సంగతి అలా వుంచితే, ఈ ఏడాది లాల్‌ భాగ్‌ గణపతికి ఏకంగా ఏడు కోట్ల రూపాయల నగదు కానుకల రూపంలో లభించింది. అంతే కాదండోయ్‌ ఆరు కేజీల బంగారు నగలు కూడా కానుకల రూపంలో అందిపుచ్చుకున్నాడు లాల్‌ భాగ్‌ గణపతి.

ప్రతియేడాదీ లభించే కానుకలతో లాల్‌ భాగ్‌ గణపతి రిచ్చెస్ట్‌ గణపతిగా వార్తల్లోకెక్కుతున్నాడు. ఓ సంవత్సరానికి మించి మరో సంవత్సరం ఉత్సవాల్ని మరింత వేడుగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. కానుకలు ఆ రేంజ్‌లో వస్తోంటే, ఉత్సవాలు ఘనంగా ఎందుకు జరగవు.? కానుకల సంగతి అలా వుంటే, లాల్‌భాగ్‌ గణపతిని ఏం కోరుకున్నా వెంటనే ఆ కోరిక నెరవేరిపోతుందని బాలీవుడ్‌ ప్రముఖులూ చెబుతుంటారు. అదీ అసలు సంగతి.