రివ్యూ: రఘువరన్ బిటెక్
రేటింగ్: 2.75/5
బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్
తారాగణం: ధనుష్, అమలా పాల్, అమితాష్ ప్రధాన్, సముద్రఖని, శరణ్య పొన్‌వణ్ణన్, సురభి, వివేక్ తదితరులు
మాటలు: కిషోర్ తిరుమల
సంగీతం: అనిరుధ్ రవిచందర్
కూర్పు: ఎం.వి. రాజేష్‌కుమార్
నిర్మాత: ‘స్రవంతి’ రవికిషోర్
రచన, ఛాయాగ్రహణం, దర్శకత్వం: ఆర్. వేల్‌రాజ్
విడుదల తేదీ: జనవరి 1, 2015
నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ తన అద్భుతమైన అభినయంతో ‘వేలై ఇల్లా పట్టదారి’ (విఐపి) చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని డబ్ చేయాలా లేక రీమేక్ చేయాలా అని కొన్ని నెలల పాటు ఆలోచించి… ఫైనల్‌గా ధనుష్ పాత్రకి న్యాయం చేసే తెలుగు నటుడు లేడనిపించిందో ఏమో ‘రఘువరన్ బి.టెక్’ పేరుతో అనువదించి విడుదల చేసారు. ఈ చిత్రం అంత విజయం సాధించడానికి ధనుష్ ఎంత కారణమనేది ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. సగటు ‘జీరో టు హీరో’ థీమ్‌తో రూపొందిన ఈ చిత్రంలో టైటిల్ రోల్‌కి ధనుష్ అతికినట్టు సరిపోయాడు.
కథేంటి?
సివిల్ ఇంజినీర్ అయిన రఘువరన్ (ధనుష్) చాలా తెలివైన వాడు అయినా కానీ తాను కోరుకున్న ఉద్యోగం తప్ప ఇంకోటి చేయనని ఖాళీగా ఇంట్లో కూర్చుంటాడు. తండ్రి (సముద్రఖని) చేత చీవాట్లు తింటూ.. తన తల్లి (శరణ్య) చనిపోవడానికి పరోక్షంగా కారణమవుతాడు. ఆ తర్వాత అతనికి ఓ కంపెనీలో ఇంజినీర్‌గా ఉద్యోగం వస్తుంది. తనకి పెద్ద ప్రాజెక్ట్ దక్కితే… ఆ కాంట్రాక్ట్ దక్కించుకోలేకపోయిన అరుణ్ (అమితాష్) అనే బిల్డర్ రఘువరన్ లక్ష్యానికి అడుగడుగునా అడ్డు పడతాడు. బుద్ధి బలం, కండ బలంతో తాను అనుకున్నది రఘువరన్ ఎలా సాధిస్తాడు?
కళాకారుల పనితీరు:
ముందే చెప్పినట్టు ఇది ధనుష్‌కి టైలర్‌మేడ్ రోల్. పనీ పాటా లేకుండా ఆవారాగా తిరుగుతూ తండ్రితో తిట్లు తినే పాత్రలో ధనుష్ లీనమైపోయాడు. హీరో పాత్రని తీర్చి దిద్దిన విధానానికి దర్శకుడికి క్రెడిట్ ఇవ్వాలి. అన్ని ఎమోషన్స్ ఒకే పాత్రలో పలికించే అవకాశం నటులకి చాలా అరుదుగా దక్కుతుంది. అలాంటి అరుదైన పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించి తానెంత గొప్ప నటుడనేది చూపించాడు. తన తల్లి వేరొకరు బ్రతకడానికి కారణమైందని తెలుసుకునే సన్నివేశంలో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యే సీన్‌లో ధనుష్ నటన ఆకట్టుకుంటుంది.
అమలాపాల్ మేకప్ లేకుండా సగటు మధ్య తరగతి యువతి పాత్రలో బాగా నటించింది. అమితాష్ లుక్ బాగున్నా కానీ నటన అంతంత మాత్రమే. మరింత పవర్‌ఫుల్ విలన్ ఉంటే యాక్షన్ డ్రామా రక్తి కట్టేది. సముద్రఖని సహజ నటన తండ్రీ కొడుకుల సన్నివేశాలకి జీవం పోసింది. సురభి, శరణ్య సపోర్టింగ్ రోల్స్‌లో బాగా చేసారు. చాలా గ్యాప్ తర్వాత కనిపించిన కమెడియన్ వివేక్ చేసిన ‘ఫేస్‌బుక్’ కామెడీ అక్కడక్కడా బాగానే వర్కవుట్ అయింది.
సాంకేతిక వర్గం పనితీరు:
అనిరుధ్ స్వరపరిచిన పాటలు తమిళ ఆడియన్స్ అభిరుచికి దగ్గరగా ఉన్నాయి. అనువాద సాహిత్యం వల్ల పాటలు అంతగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా ఎడిటర్ తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. దర్శకుడు వేల్‌రాజ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. అతని సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
దర్శకుడిగా కూడా వేల్‌రాజ్ తన ముద్ర వేసాడు. కథాపరంగా గొప్ప కాన్సెప్ట్ ఉన్నదేం కాదు కానీ… దానిని కమర్షియల్ ఫార్మాట్‌లో పకడ్బందీగా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ధనుష్‌కి తమిళనాట ఉన్న స్టార్ ఇమేజ్ ఈ చిత్రానికి ప్లస్ అయిందనడంలో సందేహం లేదు. అయితే ధనుష్‌కి అంతగా ఫాలోయింగ్ లేని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దర్శకుడి బలహీనత బయటపడుతుంది.. ప్రధానంగా ద్వితీయార్థంలో.
హైలైట్స్:
- ధనుష్ పర్‌ఫార్మెన్స్
- ఫస్ట్ హాఫ్
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
డ్రాబ్యాక్స్:
- డల్ సెకండ్ హాఫ్
- వీక్ విలన్స్
విశ్లేషణ:
కథకి తగ్గ నటుడు కుదరడం వల్ల ఒక సినిమా ఎంత బెనిఫిట్ అవుతుందనే దానికి ఈ చిత్రం మంచి ఉదాహరణ. ధనుష్ కాకుండా వేరెవరు చేసి ఉన్నా తమిళంలో ఈ చిత్రం అంత విజయం సాధించి ఉండేది కాదేమో. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి మన హీరోల్లో ఎవరూ సాహసించకపోవడానికి కూడా ఇదే కారణం. ధనుష్ మాదిరిగా ఈ పాత్రలోని అన్ని షేడ్స్‌కి తగ్గట్టు మౌల్డ్ అవడం… అయి మెప్పించడం కష్టం. చాలా రిస్కుతో కూడుకున్న ఈ వ్యవహారానికి దూరంగా ఉండడానికి మన హీరోలు మొగ్గు చూపారు. ఫలితంగా ధనుష్ వర్షన్‌నే మనవాళ్లు చూడగలిగారు.
జీరో టు హీరో కథాంశానికి మదర్ సెంటిమెంట్, ఎంటర్‌టైనింగ్ లవ్ ట్రాక్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్ అన్నీ జోడిరచి దర్శకుడు దీనిని పక్కా కమర్షియల్ ఫార్ములా సినిమాగా తీర్చిదిద్దాడు. ధనుష్ నటుడిగా ఈ చిత్రానికి ఎంత హెల్ప్ అయ్యాడో, అతనికి తమిళనాడులో ఉన్న పేరు ప్రఖ్యాతులు కూడా కలిసి వచ్చి, బలహీనంగా ఉన్న సెకండ్ హాఫ్ కూడా పాస్ అయిపోవడానికి కారణమయ్యాడు. ఒక్కసారి హీరోకి ఉద్యోగం దొరికిన తర్వాత ఈ చిత్రంలోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాక్‌సీట్ తీసుకుని సీరియస్ డ్రామాగా తయారవుతుంది. ఈ పార్ట్‌లో విలన్ బాగా వీక్ అవడంతో సెకండ్ హాఫ్ బోర్ కొట్టిస్తుంది. విలన్స్ పాత్రల్ని బలంగా తీర్చి దిద్దినట్టయితే హీరో ఎలివేషన్ బాగా పండేది. అక్కడికీ ఉన్న ఒకటీ అరా సీన్లలోనే హీరోయిజంతో ధనుష్ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ధనుష్ పూర్తిగా తన భుజాలపై మోసేసాడు. తమిళంలో ఈ చిత్రం సాధించిన విజయంలో ఎక్కువ క్రెడిట్ ధనుష్‌కే దక్కుతుంది.
దురదృష్టవశాత్తూ అతనికి తెలుగులో అంత గుర్తింపు రాలేదు. అతను చేసిన సూపర్‌హిట్ చిత్రాల్లో చాలా వరకు ఇక్కడ రీమేక్ అవడం కూడా ధనుష్‌కి ఇక్కడ మార్కెట్ లేకపోవడానికి ఒక కారణం అనుకోవచ్చు. ధనుష్ పర్‌ఫార్మెన్స్ ఈ చిత్రానికి మెయిన్ హైలైట్‌గా నిలిస్తే, వీక్ సెకండ్ హాఫ్ బాక్సాఫీస్ రిజల్ట్‌ని ప్రభావితం చేస్తుంది. ఆకట్టుకునే ప్రథమార్థం వల్ల ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు మొత్తంగా నిరాశ చెందరు. సెకండ్ హాఫ్‌పై దర్శకుడు కేర్ తీసుకుని ఉన్నట్టయితే ఇది హీరో సెంట్రిక్ మూవీగా మిగిలిపోకుండా యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమా అయి ఉండేది.
బోటమ్ లైన్: ధనుష్ వన్ మ్యాన్ షో!
-గణేష్ రావూరి