cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రాక్షసుడు

సినిమా రివ్యూ: రాక్షసుడు

రివ్యూ: రాక్షసుడు
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: స్టూడియో గ్రీన్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌
తారాగణం: సూర్య, ప్రేమ్‌జీ అమరన్‌, నయనతార, ప్రణీత, పార్తీబన్‌, సముద్రఖని, బ్రహ్మానందం, శ్రీమాన్‌ తదితరులు
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
కూర్పు: ప్రవీణ్‌ కె.ఎల్‌.
ఛాయాగ్రహణం: ఆర్‌.డి. రాజశేఖర్‌
నిర్మాత: కె.ఈ. జ్ఞానవేల్‌రాజా
కథ, కథనం, దర్శకత్వం: వెంకట్‌ ప్రభు
విడుదల తేదీ: మే 29, 2015

అటు కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే ఇటు ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి వెనకాడరు కనుకే తమిళ హీరోల నుంచి వెరైటీ మూవీస్‌ వస్తుంటాయి. నటుడిగా తమ సామర్ధ్యాన్ని ఛాలెంజ్‌ చేసే పాత్రల్ని ఎంచుకోవడంతో పాటు కమర్షియల్‌ లెక్కలకి అతీతంగా ఉండే సబ్జెక్టులు ఎంచుకుని రిస్క్‌ చేయడానికి కూడా తమిళ హీరోల్లో చాలా మంది జంకరు. బహుశా అక్కడి ప్రేక్షకులు కేవలం వినోద ప్రధాన చిత్రాలనే కాకుండా భిన్న అనుభూతిని అందించే చిత్రాలని ఆదరిస్తారు కనుకే హీరోలు ఇలాంటి రిస్క్స్‌ తీసుకోవడానికి ఒక కారణమని అనుకోవచ్చు. అదే తెలుగునాట ఒక్కసారి డెమీగాడ్‌ స్టేటస్‌ వచ్చిందంటే మాత్రం హీరోలు కాస్త కొత్తగా ట్రై చేసినా ఫలితమేంటనేది ముందే తేల్చి చెప్పేయవచ్చు. 

సింగంలాంటి పక్కా మాస్‌ మసాలా సినిమాలు చేస్తూనే సూర్య తరచుగా కొన్ని ప్రయోగాలకి కూడా సై అంటూ ఉంటాడు. ‘రాక్షసుడు’ చిత్రం సూర్య, వెంకట్‌ ప్రభు ఇద్దరూ చేసిన డేరింగ్‌ ఎటెంప్ట్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది రెగ్యులర్‌ కమర్షియల్‌ సూత్రాలకి భిన్నంగా ఉంటుంది కానీ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏమీ మిస్‌ కాదు. అవుట్‌లైన్‌ చూస్తే పక్కా రివెంజ్‌ స్టోరీ అనిపిస్తుంది. అయితే దానిని వెంకట్‌ ప్రభు డీల్‌ చేసిన విధానం చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఏదో ఒక జోనర్‌ అని కాకుండా వివిధ జోనర్స్‌ని మిక్స్‌ చేస్తూ అల్లుకున్న స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది. దీని గురించి ఏం తెలీకుండా వెళ్లి థియేటర్లో కూర్చుంటే... ఇది ఏ తరహా సినిమా అనేది అర్థం కావడానికే చాలా సమయం పడుతుంది. స్టార్టింగ్‌ సీన్స్‌ చూస్తే హీరో మాయగాడు అనిపిస్తుంది. ఇదేదో క్రైమ్‌ కామెడీ మూవీ అని సెటిల్‌ అయ్యేంతలో ఒక ట్విస్టుతో హారర్‌ కామెడీగా మలుపు తీసుకుంటుంది. అలా అని ఫిక్స్‌ అయ్యేలోగా ఇంకో ట్విస్ట్‌ వచ్చి కథని మరో ఊహించని కోణంలోకి తీసుకెళుతుంది. 

ఇలాంటి కథని ఊహించడానికే సిల్లీగా అనిపించే అవకాశముంది. దానికి ఒక రూపమిచ్చి... దాంతో సూర్యలాంటి పెద్ద స్టార్‌ని మెప్పించాడంటేనే వెంకట్‌ ప్రభుని మెచ్చుకోవాలి. అలాగే ఈ కథని విని, దీనిని చేయడానికి ఓకే చెప్పాడంటే సూర్య గట్స్‌కి హేట్సాఫ్‌ చెప్పాలి. అయితే ఇందులో పాజిటివ్స్‌తో పాటు ప్రాబ్లమ్స్‌ లేకపోలేదు. ఈమధ్య తొంభై శాతం సినిమాల్లో స్టోరీ లేక తేలిపోతున్నాయి. కానీ ఈ చిత్రంలో కథ ఎక్కువైపోయింది. ఎన్నో కోణాలు, మలుపులు ఉన్న కథని రెండున్నర గంటల్లో చెప్పడానికి దర్శకుడు కష్టపడాల్సి వచ్చింది. అదే సమయంలో వివిధ జోనర్స్‌ని మిక్స్‌ చేసే క్రమంలో కాస్త గందరగోళం కూడా చోటు చేసుకుంది. ప్రథమార్థం ఎంటర్‌టైన్‌మెంట్‌ బేస్డ్‌గా సాగితే, సెకండ్‌ హాఫ్‌లో మెలోడ్రామా ఎక్కువైంది. ఒకానొక దశలో వేగం పూర్తిగా మందగించి భారంగా మారినా కానీ మళ్లీ కమర్షియల్‌ క్లయిమాక్స్‌తో పర్‌ఫెక్ట్‌ ఎండిరగ్‌ ఇవ్వడంతో ‘రాక్షసుడు’ పాజిటివ్‌ నోట్‌లో ఎండ్‌ అవుతుంది. ఓవరాల్‌గా ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చిన సినిమాగా ఈ చిత్రం వెరైటీ కోరుకునే ప్రేక్షకులకి గుర్తుండిపోతుంది. 

డీటెయిల్డ్‌గా అనలైజ్‌ చేసుకుంటే స్పాయిలర్స్‌కి స్కోప్‌ ఎక్కువ ఉంటుంది కనుక కథాపరంగా ఎక్కువ లోతుకి వెళ్లడం లేదు. ఈ సినిమాకి సంబంధించి ఎంత తక్కువ ఇన్‌ఫర్మేషన్‌తో వెళితే అంతగా ఎంజాయ్‌ చేయడానికి ఆస్కారముంటుంది. వెంకట్‌ ప్రభు ఆలోచనలు బాగున్నా కానీ తన సినిమాల్లో నిలకడ లేమి బాగా డామినేట్‌ చేస్తుంటుంది. ఒక సీన్‌ని తెలివిగా తీసిన వాడే మరో సీన్‌లో సిల్లీగా అనిపిస్తాడు. ఆ సమస్య ఈ చిత్రంలోను కనిపించింది. యువన్‌ శంకర్‌ రాజా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగుంది. ఎడిటింగ్‌ బాగున్నా కానీ షార్ప్‌ కట్స్‌ ఒక్కోసారి కన్‌ఫ్యూజ్‌ చేస్తాయి. రాజశేఖర్‌ ఎప్పటిలానే టాప్‌ క్వాలిటీ సినిమాటోగ్రఫీతో టెక్నికల్‌ సైడ్‌ ఈ మూవీకి బ్యాక్‌బోన్‌గా నిలిచాడు. 

సూర్య సామర్ధ్యం ఏంటనేది మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. నటుడిగా తన పాత్రలకి సంపూర్ణ న్యాయం చేసాడు. చెవిపోగుకి బదులు సేఫ్టీ పిన్‌ని చెవికి పెట్టుకోవడం సూర్యకి తెలిసిన ‘మాస్‌’ స్టయిల్‌ అనుకోవాలి! నయనతారది లిమిటెడ్‌ రోల్‌. ఉన్నంతలో బాగా చేసింది. ప్రణీతది కూడా అతిథి పాత్రే. పార్తీబన్‌ వాల్యూస్‌ ఉన్న కరప్ట్‌ పోలీస్‌గా ఎంటర్‌టైన్‌ చేసాడు. వెంకట్‌ ప్రభు చిత్రాల్లో తప్పనిసరిగా కనిపించే ప్రేమ్‌జీ ఇందులోను కీలక పాత్ర పోషించాడు. తనదైన శైలిలో బాగానే చేసాడు. 

ఈ తరహా చిత్రాల నిడివి రెండు గంటల లోపు ఉండేలా చూసుకుంటే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటాయి. మైనస్‌లు ఉన్నా కానీ రాక్షసుడు చిత్రం కంటెంట్‌ పరంగా సాలిడ్‌ మూవీ. ఎక్స్‌పెరిమెంటల్‌ కనుక అందరు ప్రేక్షకులకి నచ్చకపోవచ్చు కానీ విభిన్నమైన అనుభూతి కోసమైతే తప్పకుండా చూడాలి. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా ఆకట్టుకోవడమే కాదు, అప్పుడప్పుడూ దర్శకుడు వెంకట్‌ ప్రభు చిన్న చిన్న చమక్కులతో అలరించాడు. కార్ల వెనుక కుక్కలు ఎందుకు పరిగెడుతుంటాయి అనే దానికి ఇందులో ఇచ్చిన రీజన్‌, జర్నీ సినిమాలో సీన్‌ని ఇందులోని ఒక కీలక సన్నివేశానికి లింక్‌ చేసిన విధానం లాంటివి బాగా పండాయి. సూర్యని స్టార్‌గా కంటే పర్‌ఫార్మర్‌గానే మనవాళ్లు ఎక్కువ లైక్‌ చేస్తారు కాబట్టి, అతడి సినిమాల నుంచి రొటీన్‌ వినోదం కంటే వైవిధ్యం కోరుకుంటారు కాబట్టి రాక్షసుడికి మెజారిటీ నుంచి మంచి మార్కులే పడాలి మరి. 

బోటమ్‌ లైన్‌: వెరైటీ రాక్షసుడు!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

 


×