మద్యపానాన్ని నిషేధిస్తామన్నారు, ప్రభుత్వమే మద్యం అమ్మితే ఎలా? అంటూ ఇటీవల కాలంలో టీడీపీ తెగ విమర్శలు చేస్తోంది. ఇలాంటి వారందరి నోళ్లు మూతపడేలా నిషేధంపై తొలి అడుగుపడింది. పర్మిట్ రూమ్ ల రద్దుకి కార్యాచరణ సిద్ధమైంది. రోజుల వ్యవధిలోనే ఇది అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో మద్యపాన నిషేధం దిశగా ప్రజలు గమనించదగ్గ మార్పు మనకి కనిపించనుంది.
పర్మిట్ రూమ్ లు రద్దయితే మందు బాబులుకి చిక్కులు తప్పవు. ఇప్పటివరకూ షాపులో బాటిల్ కొనుక్కుని, ఆ పక్కనే ఉన్న పర్మిట్ రూమ్ లో దూరి, తాగి ఇంటికి పోయేవారు. ఇక ఇలాంటి వారికి చుక్కలే. మందుబాటిల్ కొనుక్కుంటే నేరుగా ఇంటికెళ్లి తాగాల్సిందే. షాపు చుట్టుపక్కల బాటిల్ ఓపెన్ చేశారా అంతే సంగతులు. ఇలా జరిగితే వైన్ షాప్ యజమానులను కూడా బాధ్యులు చేసేలా కొత్త నియమావళి రూపొందుతోంది. దీంతో ఇకమందు బాబులకు ఇబ్బందులు తప్పేలాలేవు.
పబ్లిక్ గా బరితెగించేవాళ్లు తప్పితే.. నలుగురి కంటపడకుండా గుట్టుచప్పుడు కాకుండా చుక్కేయాలనుకునేవాళ్లు నోరు కట్టేసుకోవాల్సిందే. దీంతో కొత్తగా ఈ వ్యసనానికి బానిసయ్యే యువత సంఖ్య కూడా తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే పర్మిట్ రూమ్ లు ఎత్తివేస్తే.. మందు బాబులు పబ్లిక్ గా బరితెగించే ప్రమాదముందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బస్టాండ్ లు, రోడ్డు కూడళ్లలో సెక్యూరిటీ పెంచితే ఇలాంటి ఆగడాలకు అడ్డుకట్ట వేసినట్టవుతుంది. ఇవన్నీ ఆలోచించే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద పర్మిట్ రూమ్ ల ఎత్తివేతతో గణనీయమైన మార్పు కనిపించడం మాత్రం ఖాయం. దశలవారీగా మద్యపాన నిషేధానికి ఇదే తొలి ముందడుగు.