ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు కొందరికి జీతాలు రావడం ఆలస్యం అయింది… ఇంతకుమించి ఇంకేమీ జరగలేదు. ఈలోగా ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు.. జీతాలు ఇప్పట్లో రావడంలేదు.. అంటూ రాష్ట్రం మొత్తం అట్టుడికి పోయింది. ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వం తరఫున జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ సకాలంలో సజావుగానే జరిగినప్పటికీ.. ఆర్బీఐ ద్వారా జరగాల్సిన చెల్లింపుల్లో చిన్న ‘టెక్నికల్ ప్రాబ్లం’ ఆ వేతనాలు అకౌంట్లో పడడం ఆలస్యం అయింది. అయితే ఈలోగానే.. జగన్మోహన రెడ్డి ప్రభుత్వం దివాలా తీసేసిందన్న స్థాయిలో పచ్చదళాల విపరీతమైన దుష్ప్రచారాన్ని సాగించాయి.
గురువారం ఆగస్టు ఒకటో తేదీ సుమారు నాలుగు లక్షల మందికి వేతనాలు బ్యాంక్ అకౌంట్లలో పడలేదని సమాచారం. దీంతో ఉద్యోగులందరూ గగ్గోలెత్తిపోయినట్లుగా ప్రచారం జరిగింది. సహజంగానే యెల్లో మీడియా.. ఈ వార్తలకు మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను ఇంకాస్త భయపెట్టడానికి తన వంతు కృషిచేసింది. ఆర్థికశాఖ పూనుకుని… ఈ విషప్రచారాన్ని అడ్డుకోవడానికి క్లారిటీ ఇచ్చింది.
ప్రతినెలా ఆర్బీఐ ఈ-కుబేర్ ద్వారా చెల్లింపులు జరుగుతాయి. ఎప్పటిలాగానే జులై 31 నాటికే చెల్లింపులకు సంబంధించిన ఫైల్స్ అన్నీ ఆర్బీఐకు వెళ్లినప్పటికీ.. ఈ ముద్ర సర్టిఫికెట్లు పనిచేయకపోవడం వలన.. కొందరికి అకౌంట్ లలో డిపాజిట్ కావడం ఆలస్యం అయింది.
ఇక్కడ తమాషా ఏంటంటే.. వేతనాలు ఒక్కరోజు ఆలస్యం అయినంత మాత్రాన.. జీవితం తల్లకిందులైపోయే పరిస్థితిలో ఏ ప్రభుత్వోద్యోగి కూడా ఉండరు. అయితే.. ఈ అవకాశాన్ని మాత్రం యెల్లో మీడియా ప్రభుత్వం మీద అపోహలు వ్యాపింపజేయడానికి వాడుకోవడం.
ప్రభుత్వంలో చీమ చిటుక్కుమంటే చాలు.. బ్రహ్మాండం బద్ధలైపోయినట్లుగా దాన్ని ప్రచారం చేయడంలో యెల్లో మీడియా, తెలుగుదేశం సోషల్ మీడియా చెలరేగిపోతున్నాయి. అయిదేళ్ల పాటు జరిగిన మాటల మోసాల్ని ప్రజలు తిప్పికొట్టారు. కొత్తగా ఇలాంటి వంచనలు, వక్రవ్యూహాలు ఆ పార్టీకి ఎంతకాలం లాభిస్తాయి అనేది వేచిచూడాలి.