ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగి, ఆర్థికంగా బాగా సెటిలైన తర్వాత చాలామంది హీరోయిన్లకు పరిశ్రమలోనే ఇతర రంగాలపై ప్రేమ కలుగుతుంది. డబ్బులు ఇబ్బడిముబ్బడిగా సంపాదించాలనో, సినిమా మీద ప్రేమతోనో వారు అక్కడే పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే అక్కడే తేడాకొడుతూ ఉంది.
ఇది చాలామంది హీరోయిన్ల చరిత్ర చెబుతున్న మాట. నిర్మాణ రంగంలోకి వెళ్లి చాలామంది హీరోయిన్లు సంపాదించిన డబ్బులను పోగొట్టుకున్న దాఖలాలున్నాయి. మహానటి సావిత్రి నుంచి, జయసుధ వరకూ నిర్మాతలుగా మారి నష్టపోయిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.
సంపాదించుకున్న సొమ్ములు ఏదో విధంగా పోగొట్టుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు, వారిలో నిర్మాతలుగా పోగొట్టుకున్న వాళ్లూ ఉన్నారు. మరి ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ కూడా నిర్మాతగా మారబోతున్నట్టుగా కొన్నాళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి.
తనే లీడ్ రోల్స్ చేసేంత స్థాయికి వచ్చిన కాజల్ తన మార్కెట్ ను క్యాష్ చేసుకోవాలంటూ నిర్మాతగా మారబోతోందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ప్లాన్స్ డ్రాప్ అయ్యాయని సమాచారం. కాజల్ నిర్మాతగా మారడంలేదట. వీలైనంతగా నటిగా మాత్రమే కొనసాగాలని డిసైడ్ అయ్యిందట. మరి ఇది నిజమే అయితే తెలివైన నిర్ణయం తీసుకున్నట్టే అని పరిశీలకులు అంటున్నారు.