ఎప్పుడు కొంప మునుగుతుందో…!

కొంప మునగడమేమిటి? ఎవరి కొంపలు మునుగుతాయి? ఇప్పుడు వానాకాలం కాబట్టి భారీవర్షాలు కురిసి, వరదలు వచ్చి కొంపలు ముగుతాయా? మునిగితే సామాన్య ప్రజల కొంపలే కదా మునిగేది. మనం చెప్పుకునేది సామాన్య జనం గురించి…

కొంప మునగడమేమిటి? ఎవరి కొంపలు మునుగుతాయి? ఇప్పుడు వానాకాలం కాబట్టి భారీవర్షాలు కురిసి, వరదలు వచ్చి కొంపలు ముగుతాయా? మునిగితే సామాన్య ప్రజల కొంపలే కదా మునిగేది. మనం చెప్పుకునేది సామాన్య జనం గురించి కాదులెండి. ఈ కొంప మునగడానికి వానలకు సంబంధం లేదండి. ఇదంతా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం. 'పెరుగుట విరుగట కొరకే' అనే సామెత నిజమవుతుందేమోనని కొందరు భయపడుతున్నారు కూడా. సరే… అసలు సంగతి ఏమిటంటే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు కేసీఆర్‌, ఏపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు కాగానే ప్రతిరోజూ గొడవే. పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. పరస్పరం శాపనార్థాలు పెట్టుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే స్థాయి మర్చిపోయి పరుష పదజాలంతో బజార్లో అరుచుకున్నట్లు అరుచుకున్నారు.

కేసీఆర్‌ ఓటుకు నోటు కేసును పట్టుకుంటే, చంద్రబాబు టెలిఫోన్‌ ట్యాపింగ్‌ తెర మీదికి తెచ్చారు. నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని బాబును ఉద్దేశించి కేసీఆర్‌ అంటే, ఫోన్‌ ట్యాంపింగ్‌ నిరూపణ అయితే ప్రభుత్వమే కూలిపోతుందని బాబు హెచ్చరికలు చేశారు. ఇద్దరి మధ్యా ఇలాంటి వివాదాలు అనేకం జరిగాయి. ఇక తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లోనైనా సరే కేసీఆర్‌ టీడీపీ అధినేతను టార్గెట్‌ చేసుకొని చెలరేగిపోయారు. ఆ సమయంలో ఆయన నోటికి అడ్డూ అదుపులేకుండా పోయింది. కేసీఆర్‌ను బాబు అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడం, బాబును కేసీఆర్‌ యాగానికి పిలవడం మొదలైన సంఘటనలు తప్పించి మిగతా కాలమంతా వివాదాలతోనే గడిచిపోయింది. కేసీఆర్‌ తెలంగాణలో ముందుగానే ఎన్నికలు నిర్వహించుకొని రెండోసారీ ముఖ్యమంత్రి కాగా, చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. దీంతో ఏపీలో వైఎస్‌ జగన్‌ పరిపాలన మొదలైంది.

ఇక అప్పటినుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు జిగ్రీ దోస్తులైపోయారు. ఇద్దరం కలిసి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని, అన్ని సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందామని అనుకున్నారు. జగన్‌ హైదరాబాదుకు వచ్చి కేసీఆర్‌తో గంటల తరబడి చర్చలు జరుపుతున్నారు. తాజాగా ఇద్దరూ మూడు గంటలపాటు చర్చలు జరిపారు. జగన్‌ పరిపాలనకు కొత్త. రాజకీయంగాను, వయసులోనూ కేసీఆర్‌ సీనియర్‌. అందుకే ఆయనే జగన్‌కు రకరకాల ప్లాన్లు చెబుతున్నారు. అట్ల చేసుకుంటే బాగుంటుందని, ఇట్ల చేస్తే ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. ఉమ్మడిగా ప్రాజెక్టులు కట్టుకుందామంటున్నారు. తాజా సమావేశంలో జగన్‌ను కేసీఆర్‌ ఆకాశానికి ఎత్తేశారు. జగన్‌ పాలన బ్రహ్మాండమన్నారు. వయసులో చిన్నోడైనా పరిపాలన ఆదర్శంగా ఉందన్నారు. గోదావరి జలాల గురించి జగన్‌ అసెంబ్లీలో మాట్లాడిన తీరును మెచ్చుకున్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు చాలా బాగున్నాయని కితాబిచ్చారు.

జగన్‌ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందన్నారు. ఇక జగన్‌ ఏపీ అసెంబ్లీలో కేసీఆర్‌ యమ పొగిడారు. కేసీఆర్‌ మంచి మనసున్న మనిషని అన్నారు. ఏపీ దిగువ రాష్ట్రం కాబట్టి తెలంగాణతో సఖ్యతగా ఉంటే తప్ప మనుగడ సాగించలేమన్నారు. కేసీఆర్‌ పథకాలు, ఆలోచనలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లివచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించారు కదా అని టీడీపీ ప్రశ్నిస్తే దానికేదో చెప్పి సమర్ధించుకున్నారు. హైదరాబాదులో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలను ఇచ్చేశారు. బందరు పోర్టు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌-జగన్‌ బంధం టీడీపీ నేతలకు కంపరం పుట్టిస్తోంది. ఎన్నికల్లో కేసీఆర్‌ ఆర్థికసాయం చేయబట్టే జగన్‌ ఆయన చెప్పినట్లు ఆడుతున్నాడని అంటున్నారు.

సరే.. టీడీపీది రాజకీయ కోణమనుకోండి. అయితే ఈ జిగ్రీ దోస్తానా ఎన్నాళ్లు కొనసాగుతుందని సామాన్యులు సందేహిస్తున్నారు. రాజకీయ చతురతలో కేసీఆర్‌ ముందు జగన్‌ తక్కువేనని చెప్పాలి. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేయడంలో కేసీఆర్‌ దిట్ట. రేపు ఏదైనా విషయంలో ఇద్దరికీ చెడితే మాత్రం జగన్‌ను కేసీఆర్‌ ముప్పుతిప్పలు పెట్టకుండా వదలరని సామాన్యులు భావిస్తున్నారు. చంద్రబాబుతో కేసీఆర్‌ ఎలా వ్యవహరించారో, తెలంగాణలో టీడీపీని ఎలా చావు దెబ్బకొట్టారో చూశారు. తెలంగాణలో వైకాపా లేదు కాబట్టి పార్టీని కాపాడుకునే బాధ జగన్‌కు లేదు. కాకపోతే ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి చికాకు ఉంటుంది. ఏది ఏమైనా కేసీఆర్‌తో సర్దుకుపోవడానికే జగన్‌ ప్రాధాన్యమిస్తారు. 

అప్పుడు భూమాలా ఇప్పుడు పయ్యావుల?