రివ్యూ: రన్ రాజా రన్
రేటింగ్: 3.25/5
బ్యానర్: యు.వి. క్రియేషన్స్
తారాగణం: శర్వానంద్, సీరత్ కపూర్, సంపత్, అడివి శేష్, వెన్నెల కిషోర్, కోట శ్రీనివాసరావు తదితరులు
సంగీతం: ఘిబ్రాన్ .ఎం
కూర్పు: మధు
ఛాయాగ్రహణం: మధి
నిర్మాతలు: వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
రచన, దర్శకత్వం: సుజిత్
విడుదల తేదీ: ఆగస్ట్ 1, 2014
ఆకర్షణీయమైన ప్రోమోలు, పోస్టర్లతో ‘రన్ రాజా రన్’ సినీ ప్రియుల దృష్టిలో పడింది. టాలెంట్ ఉన్నా కానీ అందుకు తగ్గ సక్సెస్ సాధించలేకపోతున్న శర్వానంద్ ఈసారి కొత్త దర్శకుడు సుజిత్‌తో ‘మిర్చి’ అందించిన నిర్మాణ సంస్థలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. పబ్లిసిటీతో అంచనాలు పెంచిన ఈ రాజా.. స్క్రీన్‌పై ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడో లేదో చూద్దాం.
కథేంటి?
రాజా హరిశ్చంద్రప్రసాద్ (శర్వానంద్) ప్రేమించిన ప్రతి అమ్మాయి హ్యాండిస్తుంటుంది. చాలా మందిని ప్రేమించి విసిగిపోయిన దశలో అతనికి ప్రియ (సీరత్) తారసపడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ప్రియ ఆ సిటీ పోలీస్ కమీషనర్ (సంపత్) కూతురు. తన కూతురి ప్రేమ విషయం తెలిసిన తర్వాత ఆ కమీషనర్ రాజాకి ఎలాంటి పరీక్ష పెట్టాడు? దాంట్లో రాజా ఎలా నెగ్గుకొస్తాడు?
కళాకారుల పనితీరు:
శర్వానంద్ తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. ఫస్ట్ సీన్ నుంచి ఎనర్జిటిక్‌గా సాగే ఈ పాత్రలో శర్వానంద్ చాలా ఎంటర్‌టైన్ చేసాడు. ఎక్కువగా సీరియస్ రోల్స్ చేసిన శర్వానంద్ ఇందులో తన వయసుకి తగిన చలాకీ యువకుడిగా కనిపించాడు. కామెడీ సీన్స్‌లో కూడా మంచి టైమింగ్‌తో అలరించాడు. సీరత్ కపూర్ బాగానే చేసింది. సంపత్ క్యారెక్టరైజేషన్ బాగుంది. మరీ వయలెంట్‌గా చూపించకుండా ఈ క్యారెక్టర్‌కి కొంచెం ఫన్నీ టచ్ ఇచ్చారు. దాని వల్ల విలన్ పాత్ర కూడా వినోదాన్ని పంచుతుంది. అడివి శేష్ కీలకమైన క్యారెక్టర్ చేసాడు. తన క్యారెక్టర్‌కి అనుగుణంగా బాగా అండర్ ప్లే చేసాడు. కోట శ్రీనివాసరావు గురించి కొత్తగా చెప్పేదేముంది. వెన్నెల కిషోర్, విద్యుల్లేఖ తదితరులు తమకిచ్చిన క్యారెక్టర్స్‌కి తగ్గట్టు నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఘిబ్రాన్ అందించిన సంగీతం సినిమాకి అనుగుణంగా ఉంది. సాంగ్స్ ఆడియోలో కంటే స్క్రీన్‌పై ఇంకా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సినిమాకి ఎస్సెట్టే. మధి సినిమాటోగ్రఫీ మరో పెద్ద బోనస్. స్క్రీన్ చాలా వెబ్రెంట్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపించింది. సాంగ్స్ షూట్ చేయడానికి ఎంచుకున్న లొకేషన్లు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ పర్‌ఫెక్ట్‌గా ఉంది. సినిమాలో ఎక్కడా ల్యాగ్ అస్సల్లేదు. చిన్న సినిమా అయినా కానీ నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. క్వాలిటీ పరంగా రన్ రాజా రన్ పెద్ద సినిమాలకి తీసిపోని విధంగా తెరకెక్కింది.
డైరెక్టర్ సుజిత్‌కి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. రెగ్యులర్‌గా తెలుగు సినిమాల్లో చూసే కామెడీ కాకుండా అతను కొత్త రకంగా వినోదాన్ని పంచాడు. తన క్యారెక్టర్స్ అన్నిటినీ క్లియర్‌గా డెవలప్ చేసుకున్నాడు. కొత్తవాడైనా కానీ సినిమాని హ్యాండిల్ చేయడంలో తడబాటు కనిపించడం లేదు. తాను ఏం తీస్తున్నాననే క్లారిటీ ఉండడం వల్ల ట్విస్టులు వచ్చినపుడు కూడా గందరగోళం లేకుండా స్పష్టంగా కథ చెప్పగలిగాడు. ఇటీవల సక్సెస్ అయిన కొత్త దర్శకుల జాబితాలో ఇతనూ చేరతాడు. ఇకపై ఎలాంటి సినిమాలు తీస్తాడనేది ఆసక్తికరం.
విశ్లేషణ:
‘రన్ రాజా రన్’ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిలిం. స్టార్ట్ టు ఎండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవకుండా సరదాగా సాగిపోతుంది. ఏ దశలోను ఈ సినిమా సీరియస్‌గా మారదు. బేసిక్‌గా యాక్షన్‌కి స్కోప్ ఎక్కువ ఉన్నా కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా భారీ ఫైట్ లేకపోవడం ఈ సినిమా స్పెషాలిటీ. సిట్యువేషన్స్‌ని సింపుల్‌గా, కూల్‌గా ఎలా డీల్ చేయాలో దర్శకుడు తన పాత్రల ద్వారా చూపించాడు. క్యారెక్టర్స్‌ని పరిచయం చేయడంతోనే వాటికో ఫన్నీ యాంగిల్ కూడా ఇచ్చి సదరు పాత్రలపై సీరియస్ ఇంప్రెషన్ కలగకుండా చూసుకున్నాడు. ఉదాహరణకి కమీషనర్ క్యారెక్టర్ మైఖేల్ జాక్సన్ సాంగ్ ప్లే అవుతుంటే డాన్స్ వేస్తూ ఇంట్రడ్యూస్ అవుతుంది. దాని వల్ల ఆ తర్వాత ఆ పాత్రని కూడా వినోదానికి వాడుకోవడానికి వీలు చిక్కింది. అదే ఈ క్యారెక్టర్‌ని ఏ ఎన్‌కౌంటర్ చేస్తున్నట్టో.. ఎవర్నో ఇంటరాగేట్ చేస్తున్నట్టో చూపించి ఉంటే.. ఆ తర్వాత ఆ పాత్రని కామెడీగా మలచడం ఇబ్బంది అయ్యేది.
దర్శకుడు ఇలాంటి సింపుల్ విషయాలపై శ్రద్ధ పెట్టాడు. ప్రథమార్థం సాఫీగా ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లా సాగిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో సడన్ టర్న్ వస్తుంది. యాక్షన్ పెరుగుతుంది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ని మాత్రం ఎక్కడా మిస్ అవలేదు. అసలు కథని ప్రీ క్లయిమాక్స్‌లో రివీల్ చేస్తారు. ఎంటర్‌టైనర్స్ అంటే అసలు కథే లేని డొల్లతనం ఎక్కువవుతోంది. కానీ ఈ చిత్రంలో ఆ లోటు లేకుండా విషయమున్న కథనే రాసుకున్నారు. అయితే ఆ ట్విస్టులు మరీ ఎక్కువయ్యాయేమో అనిపిస్తాయి. ఒక దాని తర్వాత ఒకటిగా చాలా విషయాలు ఒకేసారి రివీల్ అయిపోవడం వల్ల కథనం కాసేపు బరువెక్కుతుంది. అయితే మళ్లీ క్లయిమాక్స్‌లో యథాతథంగా ఫన్ నింపేసి హ్యాపీగా పంపేసారనుకోండి.
ఈ చిత్రం ప్రధానంగా యూత్‌ని, సిటీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఉంది. మసాలా ఎలిమెంట్స్ కానీ, మాస్ కోరుకునే అంశాలు కానీ ఇందులో లేవు. కనుక ‘రన్ రాజా రన్’ మెయిన్‌గా ఏ సెంటర్స్‌కి పరిమితం అయ్యే అవకాశముంది. శర్వానంద్‌కి చాలా కాలంగా దక్కకుండా పోతున్న సక్సెస్ ఈసారి రన్ రాజాతో కైవసం అయినట్టే. రొటీన్ కామెడీ నుంచి బ్రేక్ కోరుకుంటోన్న వారిని, ఒక డిఫరెంట్ ఎంటర్‌టైనర్ కోరుకునే వారిని ఈ చిత్రం డిజప్పాయింట్ చేయదు.
బోటమ్ లైన్: ఫన్ రాజా ఫన్!
-జి.కె.