రివ్యూ: అడవి కాచిన వెన్నెల
రేటింగ్: 1/5
బ్యానర్: మూన్‌లైట్ డ్రీమ్స్
తారాగణం: అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్, వినోద్ కుమార్, పూజా రామచంద్రన్, రిషి, తాగుబోతు రమేష్ తదితరులు
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: కార్తీక్ రోడ్రిగ్విజ్, డా॥ జోస్యభట్ల
కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
రచన, నిర్మాత, దర్శకత్వం: అక్కి విశ్వనాధరెడ్డి
విడుదల తేదీ: ఆగస్ట్ 1, 2014
అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాధరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘అడవి కాచిన వెన్నెల’ కథా కమామీషు…
కథేంటి?
ఎలాంటి రోగాన్ని అయినా నయం చేసే సుతర్మం అనే దివ్య శక్తులున్న రత్నం కోసం అన్వేషిస్తుంటాడు అరవింద్ కృష్ణ. ఆస్తులన్నీ ధారపోసి, కుటుంబాన్ని గాలికి వదిలేసి దానికోసం తిరుగుతుంటాడు. మైనింగ్ వ్యాపారి (వినోద్ కుమార్) ఇతని ప్రతిభని తన స్వార్థం కోసం వాడుకోవాలని అనుకుంటాడు. అతడిని లొంగదీయడానికి తన అస్త్రాన్ని (మీనాక్షి) ప్రయోగిస్తాడు. అరవింద్ అన్వేషణ ఫలించి సుతర్మం అతని చేతికి దక్కుతుందా? అసలు ఈ మీనాక్షి ఎవరు? ఆమె ఎందుకు వినోద్‌కుమార్‌కి సహకరిస్తోంది?
కళాకారుల పనితీరు:
అరవింద్ కృష్ణ ఇందులో దాదాపుగా ఒకటే ఎక్స్‌ప్రెషన్‌తో గడిపేసాడు. ‘ఋషి’ చిత్రంలోను అతను ఇదే చేసాడు కనుక అతనికి ఇది ఒకటే వచ్చు అనుకోవాలో లేక… రెండూ ఒకే తరహా పాత్రలని సరిపెట్టుకోవాలో మరి. మీనాక్షి దీక్షిత్ ఓకే. రిషి, పూజా రామచంద్రన్‌లకి పెద్దగా స్కోప్ లేదు. వినోద్ కుమార్ ఆర్టిఫిషియల్‌గా అనిపించాడు. ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీరాజ్ కామెడీ ట్రాక్ విసుగు పుట్టిస్తుంది. సురేష్, చిత్రం శ్రీను, ప్రవీణ్, జోగి బ్రదర్స్‌లాంటి తెలిసిన ముఖాలున్నాయి కానీ వారు చేయగలిగింది కూడా ఏమీ లేకపోయింది.
సాంకేతిక వర్గం పనితీరు:
అత్యంత లో బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం టెక్నికల్‌గా కూడా చాలా వీక్‌గా ఉంది. సిరివెన్నెల సాహిత్యం అందించారనే ఒక్క హైలైట్ మినహా తెర వెనుక నుంచి ఆకట్టుకునే అవుట్‌పుట్ ఎవరి నుంచి రాలేదు. సినిమాటోగ్రఫీ పరంగా కొన్ని సిలౌట్ షాట్లు బాగున్నాయంతే. సంగీతం గురించి చెప్పుకోవడానికేమీ లేదు. సిజి వర్క్ చాలా అవసరమైన ఈ కథలో ఆ విజువల్ ఎఫెక్టులు మరీ టీవీ సీరియల్ స్టాండర్డ్‌లో కూడా లేకపోవడం శోచనీయం. దర్శకుడికి తన క్రాఫ్టు మీదే సరైన కమాండ్ లేనపుడు ఇక ఇతర విభాగాల నుంచి ఏమాత్రం రాబట్టుకోగలడు?
విశ్లేషణ:
రొటీన్ సినిమా తీయకుండా కొత్త అనుభూతిని ఇవ్వాలనే ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. దర్శకుడు ఇందులో చాలా కొత్త టాపిక్స్‌ని టచ్ చేస్తూ… కాస్త ఫిక్షన్‌ని, ఇంకాస్త సైన్స్‌ని జోడిరచాడు. దర్శకుడి మదిలో మెదిలిన కథ నిజంగానే అద్భుతంగా ఉండి ఉండొచ్చు. అతను ఈ సినిమాని తనే నిర్మించాలని కూడా నిర్ణయించుకున్నాడంటే అతడిని ఆ కథ అంతగా ఎక్సయిట్ చేసి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అయితే మైండ్‌లో పుట్టిన ఒక ఐడియాని పేపర్‌పైకి తేవడం… దానిని అంతే ఎక్సయిటింగ్‌గా వెండితెరకి ఎక్కించడం ఆషామాషీ వ్యవహారం కాదు.
రెగ్యులర్‌గా తీసే కమర్షియల్ సినిమాలకి కథ రాసుకోవడం… సన్నివేశాలు కూర్చుకోవడం తేలికే. కానీ ఏదైనా కొత్తగా చెప్పాలనుకుంటున్నప్పుడు ఆ క్లారిటీ కేవలం మన మైండ్‌లో ఉంటే సరిపోదు. ఇలాంటి కథలకి కథనం రాసుకోవడమే అతి పెద్ద ఎక్సర్‌సైజ్. నిజానికి ‘అడవి కాచిన వెన్నెల’ పేపర్ పైనే ఫెయిల్ అయింది. కథనం ఒక స్పష్టమైన దిశలో సవ్యంగా ఒక గమ్యం వైపు ముందుకి సాగుతున్నట్టు ఏ దశలోను అనిపించదు. క్యారెక్టర్లకి దేనికీ ఆత్మ, శరీరం లేవు. క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌పై పెద్దగా దృష్టి సారించని దర్శకుడు తను అనుకున్న కథకి క్రిస్టల్ క్లియర్ స్క్రీన్‌ప్లే రాసుకోవడంలో కూడా పూర్తిగా విఫలమయ్యాడు.
దర్శకుడికి సినిమా సెట్లో పని చేసిన అనుభవం లేదట. ఆ అనుభవ రాహిత్యం అడుగడుగునా కనిపించింది. సన్నివేశాల మధ్య పొంతన లేదు. ముందు సీన్‌లో ఎంతటి కీలక ఘట్టం జరిగినా కానీ దానిని అక్కడితో వదిలేసి తదుపరి సీన్లోకి సినిమా జంప్ అయిపోతుంటుంది. ఆరంభంలో తడబడుతున్నాడేమో అని సరిపెట్టుకున్నా కానీ పతాక సన్నివేశం వరకు ఈ తంతు కొనసాగుతుంది. మొత్తమ్మీద ఈ దర్శకుడు చేద్దామని అనుకున్న వినూత్న ప్రయత్నం కాస్తా ‘అడవి కాచిన వెన్నెల’గా మిగిలింది.
బోటమ్ లైన్: మసక బారిన వెన్నెల!
-జి.కె.