విభజన తర్వాత ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కి తొలిసారిగా సరికొత్త అతిథి విచ్చేశాడు. అతనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. పరిచయం అక్కర్లేని పేరిది. క్రికెట్ అభిమానులు ‘దేవుడి’గా కొలిచే సచిన్ టెండ్కూలర్ తమ నగరానికి వస్తున్నాడని తెలియగానే, అక్కడ పెద్దయెత్తున సంబరాలు చేసుకున్నారు అభిమానులు. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అవుతుందని చాలాకాలంగా వార్తల్లో విన్పిస్తోన్న ఆ రెండు నగరాల్లో ఒకటైన విజయవాడలోనే సచిన్ హల్‌చల్ చేశాడు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే రాజకీయ రాజధానిగా విజయవాడకు ప్రత్యేకమైన స్థానం వుంది. ఇక్కడే ఆర్థిక రాజధానిని నిర్మించాలన్న దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హైద్రాబాద్‌లోని పేరొందిన షాపింగ్ మాల్స్‌కి ధీటుగా ఇక్కడో పెద్ద షాపింగ్ మాల్ వెలసింది. పొట్లూరి వరప్రసాద్ నేతృత్వంలోని పీవీపీ సంస్థ ఈ మాల్‌ని నిర్మించింది. ఈ పీవీపీ మాల్‌ని సచిన్ ప్రారంభిస్తున్నాడన్న వార్త తెలుసుకుని, ఓ పక్క షాపింగ్ మాల్ సంతోషం.. ఇంకోపక్క సచిన్ వస్తున్నాడన్న ఆనందంతో అభిమానులు పోటెత్తారు.
షాపింగ్‌తోపాటు, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సినిమా థియేటర్లనూ ఈ షాపింగ్ మాల్‌లో ఏర్పాటు చేశారు. సినీ నటి అనుష్క కూడా ఈ కార్యక్రమానికి హాజరవడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇప్పటిదాకా హైద్రాబాద్‌కే పరిమితమైన షాపింగ్ మాల్ ట్రెండ్ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని నగరాల్లోనూ ఎంతో కొంత విస్తరించినా, హైద్రాబాద్ స్థాయి షాపింగ్ మాల్ పీవీపీయేనని విజయవాడ వాసులు భావిస్తున్నారు.