రివ్యూ: శంకరాభరణం
రేటింగ్: 2/5
బ్యానర్: ఎంవివి సినిమా
తారాగణం: నిఖిల్, నందిత, అంజలి, పృధ్వీ, సంజయ్ మిశ్రా, సప్తగిరి, సుమన్, రావు రమేష్, సితార, సంపత్ రాజ్, రఘుబాబు, షకలక శంకర్ తదితరులు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
కూర్పు: చోటా కె. ప్రసాద్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
నిర్మాత: ఎంవివి సత్యనారాయణ
కథ, కథనం, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ: కోన వెంకట్
దర్శకత్వం: ఉదయ్ నందనవనం
విడుదల తేదీ: డిసెంబరు 4, 2015
'గీతాంజలి'లాంటి రొమాంటిక్ క్లాసిక్ టైటిల్ పెట్టి హారర్ కామెడీతో సక్సెస్ అయిన కోన వెంకట్ ఈసారి మరో క్లాసిక్ 'శంకరాభరణం' టైటిల్‌తో క్రైమ్ కామెడీ తెరకెక్కించాడు. 'ఫస్ గయా రే ఒబామా' అనే హిందీ చిత్రానికి అఫీషియల్ రీమేక్ అయిన 'శంకరాభరణం'కి కథ, కథనం కోన వెంకటే అందించాడు. రీమేక్ సినిమాకి కథ కూడా కోన ఎలా రాసినట్టు అనుకోకుండా… ఆ కథకి తన మార్కు అతుకులు జోడించాడు. ఫస్ట్ హాఫ్‌లోని ఫ్యామిలీ డ్రామా మొత్తం అసలు కథకి కోన అతికించినదే అన్నమాట. చాలా కొత్త రకం సినిమా, రొటీన్ కథలు రాస్తున్నాననే విమర్శలకి ఇదే సమాధానం అంటూ కోన వెంకట్ చెబుతూ వచ్చిన 'శంకరాభరణం'లో కొత్తగా అనిపించేదంతా హిందీ చిత్రంలోని సరంజామానే. ఇక్కడ యాడ్ చేసిందంతా కోన రెగ్యులర్‌గా చేసేదే. ఎలాగైనా కామెడీ పండించడం కోసం వివిధ క్యారెక్టర్లని కథలోకి ప్రవేశ పెట్టడం, ఒక ఇంటి నిండా జనాన్ని నింపేసి ఫ్యామిలీ డ్రామా పిండడం కోనకి అలవాటైన పద్ధతి.
'ఫస్ గయా రే ఒబామా' ఒక సెటైరికల్ కామెడీ. రిసెషన్ టైమ్‌లో ప్రపంచం మొత్తం ఎలాంటి ఇబ్బందులు పడిందీ, ఆ క్రమంలో బిహార్‌లోని కిడ్నాప్ గ్యాంగ్‌లు కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదీ వ్యగ్యంగా చూపిస్తూ ఇంటిల్లిజెంట్ స్క్రీన్‌ప్లేతో సరదాగా సాగిపోతుందది. గంటన్నర పాటుండే ఆ చిన్ని రత్నంలాంటి సినిమా కథని తీసుకుని దానికి అక్కర్లేని పాటలు, అతకని ఫ్యామిలీ డ్రామాని జోడించి విషయమున్న కథని కూడా కకావికలం చేసేశారిందులో. 'స్క్రీన్‌ప్లేలో ఏదో తేడా ఉంది' అంటూ ఓ లేడీ డాన్ క్యారెక్టర్ పదే పదే అంటూ ఉంటుంది. ఆ డైలాగ్ రాసిన కోన వెంకట్‌కి తన స్క్రీన్‌ప్లేలోని లోపాలు తెలియకపోవడమే ఐరనీ! సప్తగిరి ల్యాగింగ్ ఇంట్రడక్షన్ సీన్ నుంచి, నందిత మాట్లాడే బట్లర్ ఇంగ్లీష్ వరకు ఏదీ పండకపోవడంతో, మిగతా డ్రామా అంతా తేలిపోయి కనీసం కామెడీ కూడా సపోర్ట్ చేయక 'శంకరాభరణం' ఫస్ట్ హాఫ్ హరణమైపోతుంది. కోన వెంకట్ అసలు కథకి జోడించిన ఫస్ట్ హాఫ్ దాదాపుగా వేస్ట్ అయిపోయింది. సినిమాపై ఇంట్రెస్ట్ కూడా హరించుకుపోతుంది.
సెకండ్ హాఫ్‌కి వచ్చాకే 'ఫస్ గయా రే' కథలోకి 'శంకరాభరణం' ఎంటర్ అవుతుంది. అయితే అక్కడ పండించిన కామెడీని, ఒరిజినల్‌లోని జెన్యూన్ హ్యూమర్‌ని మ్యాచ్ చేయలేకపోతుంది. ఒరిజినల్ చూడని వారికి అంతో ఇంతో ఓకే అనిపించవచ్చునేమో కానీ అది చూసిన వారికి మాత్రం ఇది మరీ పేలవంగా అనిపిస్తుంది. కామెడీ కోసమని పెట్టిన షూటింగ్ ఎపిసోడ్ తేలిపోయింది. ఏమాత్రం అలరించలేకపోతున్న సినిమాకి 'థర్టీ ఇయర్స్' పృధ్వీ కాస్త వినోదాన్ని జోడించాడు. అతనికి రాసిన కొన్ని పంచ్‌లు పేలడంతో అక్కడక్కడా నవ్వుకునే వీలు చిక్కుతుంది. శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఎంతో కామెడీ పండించిన కోన, ఎన్నో సూపర్ క్యారెక్టర్లు తీర్చి దిద్దిన కోన ఈ చిత్రంలో కేవలం ఒక్క పృధ్వీ క్యారెక్టర్‌ని మాత్రమే ఫర్వాలేదనిపించేలా రాసాడు. క్లయిమాక్స్‌లో సంపత్ రాజ్‌ని బకరాని చేయడమనే ఎపిసోడ్ కూడా ఓకే అనిపిస్తుంది. కేవలం ఆ కాసిని నవ్వుల కోసమని 'శంకరాభరణం'ని రెండున్నర గంటల పాటు భరించడం కష్టమే మరి.
నిఖిల్ క్లూలెస్‌గా కనిపించాడు. తన పాత్రని పండించడానికి అతను ఎఫర్ట్స్ అయితే పెట్టాడు కానీ ఆ డ్రామా అంతటిలో తన పాత్ర ఏంటో తెలియని అయోమయం అయితే దాచలేకపోయాడు. నందిత కూడా డిట్టో. అంజలి లేడీ డాన్ క్యారెక్టర్‌లో బాగానే చేసింది. పృధ్వీ టైమింగ్‌లో కొన్ని డైలాగ్స్ పేలాయి. సప్తగిరి ఎంత ట్రై చేసినా కామెడీ పండలేదు. ఒరిజినల్‌లో అదరగొట్టిన సంజయ్ మిశ్రాకి ఇక్కడ తగిన ఎలివేషన్ లేదు. సంపత్ రాజ్ ఫర్వాలేదు. తెర నిండా ఆర్టిస్టులు ఉన్నా కానీ చెప్పుకోతగ్గ పాత్రలేమీ లేవు. పాటల అవసరమే లేని కథలో చాలా చోట్ల సాంగ్స్ అడ్డు పడ్డాయి. కనీసం అవి బాగున్నా బాగుండేది కానీ పాటల్లో ధ్వని కాలుష్యమే ఎక్కువైంది. నేపథ్య సంగీతం గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. ఛాయాగ్రహణం బాగానే ఉంది. ఇలాంటి సినిమాలకి ఎంత తక్కువ నిడివి ఉంటే అంత రక్తి కడతాయి. కానీ లెంగ్త్ మరీ ఎక్కువై ఇంకాస్త విసిగించింది. దర్శకుడిగా ఉదయ్ నందనవనం రోల్ ఏమిటో క్లారిటీ లేదు.
దర్శకత్వ పర్యవేక్షణ సైతం తానే చేశానని కోన చెబుతున్నాడు. స్క్రిప్ట్‌లోని డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నప్పుడు ఏ దర్శకుడైనా చేయడానికేం ఉండదు. కోన వెంకట్ మ్యాజిక్ ఈ చిత్రంలో పూర్తిగా మిస్ అయింది. ఎలాంటి బ్యాక్‌డ్రాప్ తీసుకున్నా కానీ ఫన్నీ క్యారెక్టర్లు, సిట్యువేషన్లు సృష్టించి టైమ్ పాస్ చేసేసే కోన ఈసారి తన అమ్ములపొదిలోని అస్త్రాలని సరిగా వాడలేకపోయాడు. బహుశా తాను ఎంచుకున్న కథకీ, తన శైలికీ సమన్వయం కుదరకపోవడం వల్ల వచ్చిన సమస్య అయి ఉండొచ్చు కానీ రచయితగా ఇది తన వైఫల్యమే. కొత్తరకం ఎక్స్‌పీరియన్స్ అందించాలనే తపన ఉన్నప్పుడు దానికోసం కొంత రిస్క్ చేయాలి, కొన్ని సేఫ్టీస్ వదులుకోవాలి. కానీ కమర్షియల్‌గా అన్నిటినీ ఇరికించడానికి కొన్ని కథలు సహకరించవు. శంకరాభరణం అలాంటి కథే కావడం వల్ల కోన పెన్నులో ఇమడలేకపోయింది. టైటిల్‌తో సహా టోటల్‌గా మిస్ ఫైర్ అయింది.
బోటమ్ లైన్: శ్రుతి తప్పింది!
– గణేష్ రావూరి