Lagadapati Sridhar, Lingu Swamy, Samantha, Sikindar, Surya"> Lagadapati Sridhar, Lingu Swamy, Samantha, Sikindar, Surya" /> Lagadapati Sridhar, Lingu Swamy, Samantha, Sikindar, Surya" />

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: సికిందర్‌

సినిమా రివ్యూ: సికిందర్‌

రివ్యూ: సికిందర్‌
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: తిరుపతి బ్రదర్స్‌ ఫిలిం మీడియా, రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌
తారాగణం: సూర్య, సమంత, విద్యుత్‌ జమావాల్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌, మురళీ శర్మ తదితరులు
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
కూర్పు: ఆంటోనీ
ఛాయాగ్రహణం: సంతోష్‌ శివన్‌
నిర్మాత: లగడపాటి శిరీష శ్రీధర్‌
కథ, కథనం, దర్శకత్వం: లింగుసామి
విడుదల తేదీ: ఆగస్ట్‌ 15, 2014

లింగుసామి ట్రాక్‌ రికార్డ్‌ చూస్తే ఎక్కువ శాతం హిట్లే ఉంటాయి. కమర్షియల్‌ సినిమాలు తీయడంలో ఎక్స్‌పర్టు అనిపించుకున్న లింగుసామికి మాస్‌ పల్స్‌ బాగా తెలుసు. సూర్యలాంటి టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌తో లింగుసామి సినిమా అంటే అంచనాలు ఖచ్చితంగా హై లెవల్లో ఉంటాయి. కానీ సికిందర్‌ అన్నిటినీ తలకిందులు చేసి ప్రేక్షకుల సహనాన్ని మూడు గంటల పాటు పరీక్షించింది. 

కథేంటి?

కృష్ణ (సూర్య) తన సోదరుడు రాజు భాయ్‌ని (సూర్య) వెతుక్కుంటూ ముంబయి వస్తాడు. ఆచూకీ కనిపించకుండా పోయిన రాజు భాయ్‌ ఒకప్పుడు తన స్నేహితుడు చందుతో (విద్యుత్‌) కలిసి ముంబయిలో కిడ్నాపులు గట్రా చేస్తూ డాన్‌గా చలామణీ అవుతుంటాడు. ఓసారి రాజు, చందు ఇద్దరినీ మాఫియా డాన్‌ ఇమ్రాన్‌ (మనోజ్‌ బాజ్‌పాయ్‌) అవమానిస్తాడు. దాంతో రాజు అతడిని కిడ్నాప్‌ చేసి అండర్‌వేర్‌తో నిలబెడతాడు. పగబట్టిన ఇమ్రాన్‌ ఏం చేస్తాడు? రాజు భాయ్‌ ఎందుకు కనిపించకుండా పోతాడు? 

కళాకారుల పనితీరు:

ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే టాలెంట్‌ ఉన్న సూర్య ఇందులో రాజు భాయ్‌గా, కృష్ణగా రెండు గెటప్స్‌లో కనిపిస్తాడు. రాజు భాయ్‌ గెటప్‌లో స్టయిలిష్‌ లుక్‌తో డాన్‌కి కొత్త అర్థం చెప్పాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో బాగా రాణించాడు. విద్యుత్‌ జమావాల్‌కి కీలకమైన పాత్రనిచ్చారు. అతను కూడా బాగానే చేసాడు. సమంతది అసలు ప్రాధాన్యం లేని క్యారెక్టర్‌. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ ఉన్నాయి కానీ సెకండాఫ్‌లో అసలు సూర్య గుర్తు చేసుకుని పాటలు పాడుకుంటే తప్ప ఆమె క్యారెక్టర్‌ అవసరం కనిపించదు. తనకిచ్చిన క్యారెక్టర్‌తో ఇంప్రెస్‌ చేయడం ఇంపాజిబుల్‌ అని అర్థమైందో ఏమో... తన ఉనికిని చాటుకోవడానికి సమంత స్కిన్‌ షోని ఆశ్రయించింది. విలన్‌ క్యారెక్టర్‌ మరీ వీక్‌గా ఉంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌లాంటి టాలెంటెడ్‌ యాక్టర్‌ చేయాల్సిన క్యారెక్టర్‌ కాదది. బ్రహ్మానందం ఒక సీన్‌లో కనిపిస్తాడు. చిత్రాంగద ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. 

సాంకేతిక వర్గం పనితీరు:

సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లోను సినిమాటోగ్రాఫర్‌ స్టాంప్‌ తెలుస్తుంది. యువన్‌ శంకర్‌ రాజా స్వరపరిచిన బాణీలు ఆకట్టుకోవు కానీ నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటర్‌ కత్తెరకి ఇంతకంటే పని చెప్పే సినిమా ఇంకోటి దొరకదు. కానీ ఎడిటర్‌కి కత్తెర దొరక్కుండా లింగుసామి దాచేసినట్టున్నాడు. నిర్మాణ విలువలు టాప్‌ క్లాస్‌ అనిపిస్తాయి. 

మినిమమ్‌ గ్యారెంటీ సినిమాలు అందించే లింగుసామి నుంచి అనూహ్యమైన చిత్రమిది. మామూలుగా లింగుసామి సినిమాలకి పరుగులు పెట్టే కథనం యుఎస్‌పిగా నిలుస్తుంది. కానీ ‘సికిందర్‌’ సినిమాకి అన్నీ నిదానంగా సాగుతాయి. ఇలాంటి రొటీన్‌ రివెంజ్‌ డ్రామాని మూడు గంటల పాటు చూపించాలని ఎందుకు అనిపించిందో కానీ రేపట్నుంచి థియేటర్లలో స్పాట్‌ ఎడిటర్లకి చేతి నిండా పని పెడుతుంది. 

హైలైట్స్‌:

  • సూర్య అభినయం
  • ఛాయాగ్రహణం

డ్రాబ్యాక్స్‌:

  • కథ, కథనం
  • శుభం కార్డు కోసం పడిగాపులు పడేలా చేసే ద్వితీయార్థం

విశ్లేషణ:

రొటీన్‌ రివెంజ్‌ డ్రామాని కొత్తగా ప్రెజెంట్‌ చేసే ప్రయత్నం ప్రథమార్థంలో జరిగింది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఏంటనేది ముందే అర్థమైపోయినా కానీ ఫస్టాఫ్‌ వరకు సికిందర్‌ ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపిస్తుంది. స్టయిలిష్‌ టేకింగ్‌, సూర్య పర్‌ఫార్మెన్స్‌ సినిమాని ఇంటర్వెల్‌ వరకు ఎలాగోలా లాక్కెళ్లిపోతాయి. ఇంటర్వెల్‌ తర్వాత ఇక నడిపించడానికి కథంటూ ఏమీ లేదు. సరాసరి విలన్‌తో అమీ తుమీ తేల్చుకోవడం మినహా హీరో చేయడానికంటూ ఏమీ ఉండదు. 

కానీ లింగుసామి ఆ కార్యక్రమాన్ని గంటన్నర డిలే చేస్తాడు. మరి ఈ గ్యాప్‌ని ఎలా ఫిల్‌ చేయాలి? అందుకని అయిపోయిన ఫ్లాష్‌బ్యాక్‌లో... ఆల్రెడీ అర్థమైపోయిన విషయాల్నే మళ్లీ తవ్వి తీసి పోస్టుమార్టమ్‌ మొదలెడతాడు. ఇదంతా తాపీగా, డీటెయిల్డ్‌గా జరుగుతుంటుంది. దర్శకుడు ఏ క్షణంలోను హడావుడి పడకుండా ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. బురఖా వేసుకుని తిరుగుతున్నది సమంత అనే విషయం నుంచి చివర్లో విలన్‌ని చంపే సీన్‌ వరకు అన్నీ మనకి ముందే తెలిసిపోతున్నా కానీ దర్శకుడు వాటిని ఎప్పుడు రివీల్‌ చేస్తాడు... ఈ సినిమా చూసే బాధ నుంచి మనల్ని ఎప్పటికి రిలీజ్‌ చేస్తాడు అని ఎదురు చూడాలి. 

తెలుగులో ఇలాంటి రివెంజ్‌ డ్రామాలు తరచుగా వస్తున్నా కానీ కనీసం మన దర్శకులు ఆ రొటీన్‌ సీన్లతో దంచకుండా, కాస్త వేగంగా ముగించేసి పంపేస్తున్నారు. సినిమాలో మేటర్‌ లేకపోయినా కనీసం తొందరగా వదిలేసాడనే శాటిస్‌ఫాక్షన్‌ అయినా కలిగిస్తున్నారు. లింగుసామి మాత్రం తన శైలికి భిన్నంగా నత్త నడకన సాగే కథనంతో ఓ మారథాన్‌ యాక్షన్‌ ఫిలిం తెరకెక్కించాడు. సినిమాలో ఏమి ఉన్నా లేకపోయినా ఫైట్లు  ఎక్కువ ఉంటే పైసా వసూల్‌ అనుకుంటే తప్ప ఈ సోదిని చివరిదాకా భరించడం చాలా కష్టం. సూర్యకి ఉన్న స్టార్‌డమ్‌ వల్ల తమిళనాడులో ఫాన్స్‌ సపోర్ట్‌ అయినా ఈ సినిమాకి ఉంటుందేమో కానీ మన వాళ్లకోసం ఇలాంటివి చేయడానికి ఇక్కడే మాస్‌ హీరోలు చాలా మంది ఉన్నారు. వారంతా క్రమం తప్పకుండా ఇలాంటిదో సినిమా చేసి వంతుల వారీగా వదులుతున్నారు. ఇప్పుడీ పొరుగింటి పగ ప్రతీకారాల అవసరం మనకి సుతారము లేదు. 

బోటమ్‌ లైన్‌: నాన్‌స్టాప్‌ నాన్సెన్స్‌!

-జి.కె.