కెసియార్‌కు ఎవరు సలహాలు యిస్తున్నారో తెలియదు. ప్రతీదాన్ని సంక్లిష్టం చేసి చిక్కులు తెచ్చుకుంటున్నారు. ఈ సర్వే విషయమే చూడండి – మొదట్లో జనాల్ని ఊదరగొట్టారు, అడలగొట్టారు. పెళ్లిళ్లు, చావులూ అన్నీ వాయిదా వేసుకోండి అని గర్జించారు. ఆస్తి వివరాలు యివ్వకపోతే అమ్ముకునేటప్పుడు అవస్థ పడతారన్నారు. ఇంట్లో యావన్మంది కట్టకట్టుకుని సర్వేయర్లు ఎప్పుడు వస్తారా అని కళ్లల్లో వత్తులు వేసుకుని కూర్చోవాలన్నారు. ఆయన వస్తే డాక్యుమెంట్లు చూపించాలి, గ్యాస్ సిలండర్లు ఆయన ముందు పెరేడ్ చేయాలి అన్నారు. అంతా చెప్పి చివరకు కోర్టులో వారి న్యాయవాది 'అబ్బే యిదంతా ఐచ్ఛికం, సర్వేలో పాల్గొన్నా, పాల్గొనకపోయినా, అడిగిన ప్రశ్నలకు సమాధానం యివ్వకపోయినా ఏమీ అనం. ఇంట్లో అందరూ వుండనక్కరలేదు' అంటూ నీళ్లు నమిలారు. న్యాయమూర్తి గడుసువాడు. ఆ అండర్‌టేకింగ్‌ను రికార్డు చేయించి అప్పుడు సర్వేకి అనుమతి యిచ్చాడు. కోర్టులో అలా చెపుదామనుకున్నపుడు మరి యింత హంగామా ఎందుకు చేసినట్లు? అసలు ఆ ఒక్క రోజే సర్వే అనడం ఏమిటి, వారం రోజుల పాటు చేస్తే కొంప లంటుకుంటాయా? దేశంలో ఎక్కడా జరగని విధంగా అంటున్నారు, ప్రపంచంలో కూడా ఎక్కడా జరిగి వుండదు. రాజులు, సుల్తానుల కాలంలో కూడా!
అసలు సర్వే ఉద్దేశం ఏమిటి? ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరుతున్నాయా లేదా పరీక్షించడం! మంచిదే! బోగస్ రేషన్ కార్డులున్నాయని అందరికీ తెలుసు. ఈ నాయకులే కదా, దగ్గరుండి గతంలో యిప్పించినది. ప్రతీ ప్రభుత్వం రాగానే బోగస్‌వి ఏరేస్తానని ప్రతిన బూనడం, తమ హయాంలో 50 వేలు తీసేయడం, రెండు లక్షలు కొత్తవి యివ్వడం..! దీన్ని ఆపాలంటే ఒకటే మార్గం – ఫలానా తేదీలోగా ప్రజలు డాక్యుమెంట్లు చూపించి రెన్యూ చేసుకోవాలి, చేసుకోనివి కాన్సిల్ అని ఒక నెల్లాళ్లు టైము యిస్తే చాలు. సరైన వాళ్లు వెళతారు. వెళ్లనివాళ్ల కార్డులు ఆటోమెటిక్‌గా మురిగిపోతాయి. సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లు సరైనవో కావో సంబంధిత శాఖలు చెక్ చేసుకోవడానికి మరో నెలో, రెండు నెలలో తీసుకుంటాయి. అప్పుడే రెన్యూ అవుతాయి. ఇంత చిన్న ఐడియా ఘనత వహించిన ప్రభువులకు, అధికారగణానికి తోచలేదంటే నమ్మలేం. దీనికి బదులు యింటింటికి ప్రభుత్వోద్యోగులు తిరగడం దేనికి? ప్రభుత్వ పథకాల రంగు, రుచి, వాసన కూడా ఎరగని వాళ్లను కెలకడం దేనికి? దస్తావేజులు చూపమని వాళ్లను సతాయించడం దేనికి? ఉద్యోగం కానీ, అప్పు కానీ .. ఎక్కడైనా ఎవడైనా అప్లయి చేసుకునేవాణ్ని తగిన పత్రాలు చూపమని అడుగుతారు. ఇక్కడ ఏ స్కీముకి అప్లయి చేయని నా బోటివాణ్ని చూపమనడం దేనికి? అన్నిటి కంటె అన్యాయం బ్యాంకు ఖాతా నెంబరు చెప్పాలట. ఎందుకంటే ప్రభుత్వం చేసే సహాయాన్ని ఆ ఖాతాలో డైరక్టుగా వేస్తారట. వాళ్లు వేసే సమయానికి ఆ ఖాతా వుంచుకుంటానో, మూసేసుకుంటానో ఎవరు చెప్పగలరు? సహాయం కోసం నేను అడిగినప్పటి మాట, వాళ్లు యిచ్చినప్పటి మాట, అప్పుడు ఎక్కడ ఖాతా వుంటే దాని వివరాలే యిస్తాను. ఇప్పుడెందుకు అర్జంటుగా? అసలు సెల్‌ఫోన్ నెంబరు యివ్వడమే డేంజర్. ఆ లిస్టు ఎవరికైనా అమ్మేస్తే యిక అప్పులిస్తామంటూ ఫోన్లే ఫోన్లు.
ఆస్తి వివరాలు యివ్వాలట. భూమి ఎక్కడుందో, రిజిస్ట్రేషన్ నెంబరుతో సహా యివ్వాలట. దాని మీద అప్పులుంటే మాత్రం ఆ వివరాలు అక్కరలేదట. ఫైనల్‌గా యీ ఫారాలన్నీ ఏం చేస్తారు? కంప్యూటరైజ్ చేస్తున్నాం అంటూ ఔట్‌సోర్సింగ్‌కి యిస్తారు. అడ్డమైనవాడికి సమాచారం చేరిపోతుంది. ఇండియాలో డేటా ప్రొటక్షన్ చట్టం లేదు. మనందరి ఆస్తుల వివరాలు వూరంతా తెలుస్తాయి. పిల్లలు విదేశాల్లో వుండి యిక్కడ ఒంటరిగా వుండే వితంతువు తన భూమి వివరాలు యిచ్చిందనుకోండి. ఆవిడ నిస్సహాయురాలు కదాని ఎవరైనా కబ్జా చేస్తే..? ఆవిడ దాకా ఎందుకండి, అది మనకు జరగదని నమ్మకం వుందా? పవన్ కళ్యాణ్ ఎన్నికల సభల్లో మాట్లాడుతూ 'వైయస్ పాలనలో గూండాలు వచ్చి తెలంగాణలో కబ్జాలు చేయడం వలననే విభజనోద్యమం వచ్చింది' అన్నారు. అప్పుడప్పుడు ఉద్రేకం తెచ్చుకుని రాజకీయాలు నడిపే కుర్రవాడు కాబట్టి ఆయనకు స్థానికుల శక్తిసామర్థ్యాల గురించి తెలియక వారిని కించపరిచాడు. నేను 1977-78లో మియాపూర్‌లో మాతృశ్రీ వెంచర్‌లో 500 గజాల స్థలం కొన్నాను. చాలాకాలం స్తబ్దంగానే వుంది. 1995 వచ్చేసరికి కబ్జాలు, సూపర్ కబ్జాలు ప్రారంభమయ్యాయి. నా అడ్రసు సేకరించి పదేసిమంది రోజూ యింటికి వచ్చి కూర్చునేవారు – 'అన్నా అమ్మేయ్' అంటూ! ఈ న్యూసెన్సు భరించలేక రూ. 2 లక్షలకు అమ్మేశాను. నా పాటికి నన్ను వదిలేసి వుంటే, ఆ స్థలం యిప్పుడు – మెట్రో కూడా వచ్చింది కాబట్టి – కనీసం వంద రెట్లు పెరిగి వుండేది. ఆ మాటకొస్తే మా మేనమామ 1950లలో కొనుక్కున్న స్థలం కూడా కబ్జాకు గురైంది. ఆయనెంత బాధపడాలో మరి! ఇటువంటి పరిస్థితుల్లో మన ఆస్తి వివరాలన్నీ వీళ్లకు అప్పగించి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాలా?
ఇలా కబ్జా చేశారని వెళ్లి ఎవరికి ఫిర్యాదు చేయగలరు? ప్రభుత్వం వాళ్లను కంట్రోలు చేస్తుందా? టీవీ ఛానెల్స్‌ను సెన్సార్ చేయడానికి మీరెవరు? లైసెన్సు రద్దు చేస్తాం అంటూ కేంద్రం హుంకరించినా ఎంఎస్‌ఎంలు ఖాతరు చేయడం లేదు. ఇదేమిటి అని కెసియార్‌ను అడిగితే, నాకూ వాళ్లకూ సంబంధం లేదంటున్నారు. పోనీ పరిస్థితి చక్కదిద్దారా అంటే అదీ లేదు. రేపు మనకూ యిలాటి సమాధానమే వస్తే…? కేంద్రమంత్రులు తమ ఆస్తిపాస్తుల వివరాలను సీల్డు కవర్లో పెట్టి ప్రధానికి యిస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు ఏటా ఆస్తుల, అప్పుల పట్టికను సీల్డు కవర్లో హెడాఫీసుకి పంపిస్తారు. వాళ్లపై ఏదైనా అభియోగం వస్తేనే వాటిని తెరుస్తారు. ఏ అభియోగమూ లేని మనం మాత్రం అన్నీ వీళ్లకి చెప్పేసి పిలక వాళ్ల చేతిలో పెట్టాలా!? మనం అక్రమంగా ఆర్జించామా, సక్రమంగా ఆర్జించామా అనే అంశానికి వస్తే దాన్ని కనిపెట్టడానికి వేరే డిపార్టుమెంట్లు వున్నాయి. గ్యాస్ కనక్షన్లు అవీ కేంద్రం చేతిలో వున్నాయి. ఆధార్ కార్డుతో లింకు అన్నారు. తర్వాత లేదన్నారు. ఏది ఏమైనా ఆ సమాచారం వాళ్ల దగ్గర వుంది. వాహనాల సంఖ్యగాని, నెంబరు గాని వీళ్ల కెందుకు? ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తే వాళ్లే వెంటాడి పట్టుకుంటున్నారు. ఆ రికార్డులన్నీ ఆర్‌టిఓ వద్ద వున్నాయి. అడిగి తెప్పించుకోవచ్చు. అసలు మనుష్యులంటూ వున్నారా లేదా అన్నది యీ మధ్యనే ఎన్నికలు జరిగిన సందర్భంగా ఎన్నికల కమిషన్ సర్వే చేయించింది. బోగస్ ఓటరు కార్డులు రద్దు చేయించింది. ఇప్పుడు ఎందుకీ బృహప్రయత్నం? స్థానికేతరులను గుర్తించడానికి అంటున్నారు. గుర్తించి ఏం చేస్తారు? వెళ్లిపోమని నోటీసులు యిస్తారా? వాళ్లు తమ పిల్లలకు ఫీజు రీఎంబర్స్ చేయమని అడిగినప్పుడు కదా స్థానికత వివాదం రంగంపైకి వచ్చేది. అప్పటిదాకా స్థానికుడైతేనేం? కాకపోతే ఏం? అయినా 1956 ముందు నుండి యిక్కడ వున్నామని చూపించడం తెలంగాణవారికే కష్టమని టి-నాయకులే మొత్తుకుంటున్నారు. వాళ్లు ఏ సర్టిఫికెట్లు చూపించగలరు? చూపించలేదు కాబట్టి ఫాస్ట్ పథకం వర్తించదంటే ఘొల్లుమనరా?
ఇవన్నీ కోర్టులో అడుగుతారన్న తెలివి ఆలస్యంగా కలిగింది. అక్కడకు వెళ్లేసరికి అబ్బే… ఉత్తినే… సరదాగా అననారంభించారు. మళ్లీ బయటకు వచ్చి ఆ రోజు నమోదు చేయించుకోనివారికి మళ్లీ ఛాన్సివ్వం. ఫారాలే దొరకవు. వాళ్లకు అరిచి గీపెట్టినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయం అంటోంది. ఎమ్‌సెట్ ఎడ్మిషన్ల విషయంలో కూడా యిలాటి పట్టుదలలకే పోయి, కోర్టు చేత ఆదేశాలిప్పించుకుంది. ప్రతీ దానికి దూకుడుగా వెళ్లడం, కేంద్రం లేదా కోర్టు జోక్యంతో వెనక్కి తగ్గడం.. అవసరమా యిది మనకు? ప్రభుత్వ పథకాలపై ఆశ లేనివాళ్లు వచ్చిన ఎన్యూమరేటరును పేర్లు రాసుకుని వెళ్లు చాలు అంటే యిది సమగ్ర సర్వే కాదు అసమగ్ర సర్వేయే అవుతుంది. అయినా ప్రభుత్వానికి కలిగే నష్టం ఏమీ లేదు. బోగస్ కార్డులు ఏరివేతకు యిదేమీ అడ్డు రాదు. సొంత ప్రజలను భయభ్రాంతులను చేయడం తప్ప కెసియార్ సర్కారు దీనివలన సాధించేది ఏమీ కనబడటం లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)