రివ్యూ: సన్ ఆఫ్ సత్యమూర్తి
రేటింగ్: 2.75/5
బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
తారాగణం: అల్లు అర్జున్, సమంత, నిత్య మీనన్, అదా శర్మ, రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, ప్రకాష్‌రాజ్, రావు రమేష్, స్నేహ, అలీ, బ్రహ్మానందం, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, సింధు తులాని తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కూర్పు: ప్రవీణ్ పూడి
ఛాయాగ్రహణం: ప్రసాద్ మురెళ్ళ
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్
విడుదల తేదీ: ఏప్రిల్ 9, 2015
ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు.. ఒక బ్లాక్‌బస్టర్ ఇచ్చిన కథానాయకుడు… ఇద్దరూ కలిసి గతంలో ఒక సూపర్‌హిట్ ఇచ్చారు. ఈ కలయికలో ఒక సినిమా వస్తుందంటే దానిపై అంచనాలు అవధులు దాటక తప్పదు. విద్యుల్లతలా ఎనర్జీకి డెఫినిషన్ ఇచ్చే హీరో.. ఎంటర్‌టైన్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీ పొందిన డైరెక్టర్… ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై ఏర్పడే అంచనాలకి పరిమితులు పెట్టలేరెవరూ! అన్ని అంచనాలున్న సినిమాకి హంగులుంటే సరిపోదు… బలమైన కథ, కథనాలు కూడా ఉండాలి. అలాగే ఫలానా అంచనాలుండే సినిమాకి అవన్నీ ఉండేట్టు చూసుకుని తీరాలి.
త్రివిక్రమ్‌కి అది తెలియని కొత్త సంగతేం కాదు. పవన్‌కళ్యాణ్‌లాంటి హీరోని తీసుకొచ్చి ఫ్యామిలీ డ్రామాలో పడేసి ఆల్ క్లాసెస్‌తో యాక్సెప్ట్ చేయించి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఘనుడు. అల్లు అర్జున్‌తోను అదే చేసే ప్రయత్నం జరిగింది కానీ… ఈసారి అత్తారింటికి దారేదిలో ఉన్న మ్యాజిక్ మిస్ అయింది. అందులో వినోదానికి, భావోద్వేగాలకి కుదిరిన సమన్వయం ఇందులో లోపించింది. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్‌ల మిశ్రమం ఇక్కడికొచ్చే సరికి వికటించింది. ఫలితంగా ఈ ద్వయం నుంచి ఊహించని ఒక బరువైన, భారమైన సినిమా తెరమీదికొచ్చింది.
తెరనిండా తారాగణం, ముగ్గురు కథానాయికలు, అద్భుతమైన నిర్మాణ విలువలు ఇలా సకల హంగులున్న ఈ చిత్రంలో కథనం అస్సలు ఆసక్తి రేకెత్తించకుండా చప్పగా సాగిపోతుంది. తండ్రి పాటించిన విలువల్ని ఎల్లకాలం ఫాలో అవ్వాలనుకునే కొడుకు (అల్లు అర్జున్), తండ్రి చనిపోయినా ఆయన పేరు మాత్రం ఎల్లప్పటికీ నిలిచిపోవాలనుకునే వాడు.. దాని కోసం ఏం చేస్తాడనేదే ఈ చిత్ర కథ. పైపైన చెప్పుకోవడానికి ఇంతే అనిపిస్తున్నా… దిగితే లోతు బాగానే తెలుస్తుంది. కానీ ఈ పాయింట్‌ని కన్వే చేయడానికి దర్శకుడు ఎంచుకున్న దారి చాలా నిస్సారంగా, కథానాయకుడి ప్రయాణం నీరసంగా తోస్తుంది. తనతో నిశ్చితార్ధం కాన్సిల్ చేసుకున్న అమ్మాయి (అదా) పెళ్లికే వెడ్డింగ్ ప్లానర్‌గా వెళ్లి వచ్చిన అవరోధాలు తొలగించి పెళ్లి జరిపిస్తాడు హీరో. వినడానికి చాలా బలమైన పాయింటే అనిపించినా తెరపైకొచ్చిన విధానం మాత్రం ఏమంత ఎక్సయిటింగ్‌గా లేదు. అదే పెళ్లిలో పెళ్లికూతురు స్నేహితురాలితో (సమంత) ప్రేమలో పడతాడు. అన్నట్టు ఈమె డయాబెటిక్ అట. అసలు ఆమెకి షుగర్ ఉండడం వల్ల కథకి ఒరిగేదేంటో అర్థం కాదు. హీరో తాలూకు విలువల్లో అదీ ఒకటనుకోవాలేమో… వ్యాధిగ్రస్తురాలిని సైతం ప్రేమించే పెద్ద మనసున్నోడని! ఈ ప్రేమ వ్యవహారం అయినా హుషారు లేకుండా సాగిపోతున్న సినిమాకి కాస్త జోరు ఇస్తుందనే ఆశలు ఏ క్షణంలోను కలిగించకపోవడం ఈ లవ్ ట్రాక్‌కున్న స్పెషాలిటీ.
Watch Son of Satya Murthy Public Talk
ఆమెతో పెళ్లి జరిపించమని అడగడానికి ఇంటికెళితే… ఆమె తండ్రి మరెవరో కాదు, తన పద్ధతుల్ని క్వశ్చన్ చేస్తూ, తన వ్యవహారాన్ని చిన్నచూపు చూసే వ్యక్తి (రాజేంద్రప్రసాద్). ఆస్తులు తప్ప ఇంకేమీ అక్కర్లేదని, డబ్బులు తప్ప మనుషుల్ని లెక్క చేయని ఆ మనిషి వివాదంలో ఉన్న తన రెండెకరాల భూమిని తెచ్చిస్తే కూతుర్నిచ్చేస్తానంటాడు. యాభై కోట్ల విలువ చేసే భూమిని తెచ్చిస్తే అన్ని కోట్లకి వారసురాల్ని కట్టబెట్టేస్తాననే ఆ లాజిక్కేంటో అర్థం కాదు. అయితే కథలో కాస్తయినా చలనం వచ్చేది ఈ పాయింట్‌లోనే. ఎందుకంటే ఆ భూమిని కబ్జా చేసినోడికి (ఉపేంద్ర) ఇచ్చే బిల్డప్ అలా ఇలా ఉండదు. ఆహా.. రసవత్తరమైన ఘట్టానికి తెర లేచింది అనుకునేలోగానే తుస్సుమనేస్తుంది. ఒకే సీన్‌లో మన విలువల నాయకుడి వీరోచిత విన్యాసాలకి అంతలేసి విలన్ లక్షణాలున్నవాడు కూడా వారెవ్వా అంటూ చెల్లినిచ్చేస్తానంటాడు. ఆ చెల్లిదో (నిత్య) వింత మెంటాలిటీ. ప్రేమించిన వాడిని (చైతన్యకృష్ణ) చేసుకోవాలంటే డైరెక్ట్ దారి కుదర్దు కనుక… ఇతగాడ్ని చేసుకుని, తొలి రాత్రినాడే చంపేసి, తర్వాత సింపతీతో ప్రేమించిన వాడికిచ్చి తన అన్నే కట్టబెట్టేట్టు చేసుకుంటుందట. అర్థమయి ఉండదు కదా. ఆమె లాజిక్ ఏంటనేది మీరే చూసి తెలుసుకోవాలి.
ఎక్సయిటింగ్‌గా మలచడానికి వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక, వినోదానికని ఎన్నుకున్నవేమో సరిగ్గా పండక, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ డీలా పడిపోతాడు. డైనింగ్ టేబుల్ వద్ద జరిగే సీన్ బాగా పండింది. త్రివిక్రమ్ మార్కు స్పష్టంగా కనిపించిన అలాంటి ఎంటర్‌టైనింగ్ సీన్స్ ఇంకో రెండు, మూడున్నా పైసా వసూలనిపించేది. తండ్రి గురించి చెప్పుకుంటూ సమంత దగ్గర కన్నీళ్లు పెట్టుకునే బన్నీ సీన్ బాగా కదిలిస్తుంది. అలాంటి కదిలించే క్షణాలు ఎన్ని ఉంటే అంతగా ఈ డ్రామా రక్తి కట్టేది. కానీ వాటన్నిటినీ లిమిటెడ్‌గా, అవసరమే లేదనిపించే వాటిని అన్‌లిమిటెడ్‌గానూ అందిస్తూ రెండు గంటల నలభై నిముషాలకి పైగా సాగే ఈ చిత్రంలో మేజర్ పార్ట్ నిరాశకి గురి చేస్తుంది. అత్తారింటికి దారేది తరహాలో పతాక సన్నివేశంలో అయినా ఎత్తులు చూస్తుందేమో అనుకుంటే అదీ అప్స్ అండ్ డౌన్స్‌తో అటు పైకీ వెళ్లలేక, ఇటు కిందకీ పడలేక అవస్థలు పడుతుంది.
విలువల గురించి మాట్లాడే సన్నివేశాల్లో త్రివిక్రమ్ కలం బలం తెలుస్తుంటుంది. కానీ ఒకప్పటి పదును ఇప్పుడు తగ్గిందనేది మాత్రం సుస్పష్టమవుతుంది. భావోద్వేగాలతో కూడిన సీన్లలో త్రివిక్రమ్ ముద్ర కనిపిస్తుంది. కానీ మునుపటి మాదిరిగా బలంగా ముద్రించలేకపోతుంది. త్రివిక్రమ్ సినిమాలకి స్టాండర్డ్‌గా కనిపించే పద్ధతుల్లోనే ఉన్న సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. దేవి పాటల్లో కొన్ని ఆడియోలోనే ఎక్కువ హుషారుగా అనిపించాయి. అదే హుషారు తెరపైకి రాలేదంటే లోపం ఎక్కడ జరిగిందో మరి.
అల్లు అర్జున్ తన ఇమేజ్‌కి భిన్నమైన ప్రయత్నాన్ని చేసాడు. నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. కాకపోతే అతడినుంచి కోరుకునే ట్రేడ్‌మార్క్ ఎనర్జీని, ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్ అవుతారు. సమంత కొత్తగా చేసిందేమీ లేదు. నిత్య ఇంత చిన్న పాత్ర ఎందుకు చేసిందో తెలీదు. అదా శర్మ కాసేపే కనిపించినా ఆకట్టుకోదు. ఉపేంద్ర తెరమీదకి రాకముందు ఇచ్చిన బిల్డప్, తెరపైకొచ్చాక కానరాదు. జులాయిని దృష్టిలో పెట్టుకుని రాజేంద్రప్రసాద్ నుంచి ఎక్కువ ఆశిస్తే నిరాశ తప్పదు. ప్రకాష్‌రాజ్‌కి ఇలాంటివి కొత్తేం కాదు. అలీ ఎంత సేపున్నా వినోదం పండలేదు. బ్రహ్మాస్త్రాన్ని (బ్రహ్మానందం) చివర్లో వాడినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. స్నేహ, సింధు, పవిత్ర, రావు రమేష్, కోట… ఇలా లిస్టు పెద్దదే ఉన్నా గుర్తుంచుకోతగ్గ సీన్ ఎవరికీ ఇవ్వలేదు.
ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులు, హుషారు కలిగించే కొన్ని పాటలు, ఆలోచింపచేసే ఒకట్రెండు మాటలు, అల్లు అర్జున్ పర్‌ఫార్మెన్సు, త్రివిక్రమ్ బ్రాండు.. ఇంతకుమించి ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’కి చూడదగ్గ ప్రత్యేక విలువలేం లేవు. ఇవి చాలనుకుంటే ఓసారి నిక్షేపంగా చూడొచ్చు. ‘అంతకుమించి’ కోరుకుంటే నిరాశతో తిరిగిరావచ్చు. వేసవి సెలవుల్లో ఈ విలువల పాఠానికి ఎంత మంది కుటుంబ ప్రేక్షకులు ఓట్లేస్తే అన్ని కోట్లు. అంచనాలు ఎంత తక్కువ చేసుకుని వెళ్లగలిగితే మీకంత మేలు.
బోటమ్ లైన్: విలువల పాఠంలో వినోదం తగ్గింది!
-గణేష్ రావూరి