రివ్యూ: మిణుగురులు
రేటింగ్: నాట్ అప్లికబుల్
బ్యానర్: రెస్పెక్ట్ క్రియేషన్స్
తారాగణం: ఆశిష్ విద్యార్థి, సుహాసిని, రఘువీర్ యాదవ్, జయవాణి తదితరులు
సంగీతం: రాజశేఖర్ శర్మ
కూర్పు: కిరణ్ గంటి
ఛాయాగ్రహణం: డేవిడ్ పుల్లర్
రచన, నిర్మాత, దర్శకత్వం: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి
విడుదల తేదీ: జనవరి 24, 2014
సినిమా అంటే కేవలం వినోదానికో, ప్రేక్షకులని థ్రిల్‌కి గురి చేయడానికో మాత్రమే అన్నట్టుగా కేవలం వ్యాపారానికే ఈ కళని పరిమితం చేసేస్తుంటారు. అయితే కఠిన వాస్తవాలని కళ్లకి కట్టి, మనసుల్ని కదిలించడానికి, మనుషుల్లో మార్పు తీసుకురావడానికి కూడా సినిమాలు తోడ్పడతాయి. కాకపోతే వ్యాపార సూత్రాలకి అతీతంగా, పెట్టిన డబ్బులు ఏమైపోయినా ఫర్వాలేదని తెగించి ముందడుగు వేసే ధైర్యం కావాలి. అప్పుడప్పుడూ వచ్చే ఆ కొన్ని ఉత్తమ చిత్రాలు ఎక్కువ మంది చూడకుండానే వెళ్లిపోతుంటాయి. ఏవో కాసిని అవార్డులకి మాత్రం నోచుకుని అదే పదివేలు అని సరిపెట్టేసుకుంటూ ఉంటాయి.
అయోధ్యకుమార్ తెరకెక్కించిన ‘మిణుగురులు’ అంధ బాలబాలికల హాస్టళ్లలో జరిగే అకృత్యాలని, అడుగంటిపోతున్న మానవత్వాన్ని కళ్లకి కడుతుంది. ఈ చిత్రం ఎంత మంది ప్రేక్షకుల్ని చేరుతుందనేది తెలీదు కానీ… చూసిన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ప్రపంచాన్ని చూసేందుకు మనకి కళ్లు ఉండడం మాత్రమే కాకుండా… మూడు పూటలా కడుపునిండా తినే అదృష్టానికి నోచుకున్నందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తుంది. కళ్లు ఉన్నా మానవత్వం మరిచిపోయిన మృగాలు కళ్లు లేని పిల్లలపై ప్రదర్శించే కర్కశత్వాన్ని చూసి మనసు చలించిపోతుంది. మనవంతుగా వీరికోసం చేతనైనంత చేయాలనే ఆరాటం తప్పక కలిగి తీరుతుంది. అయోధ్యకుమార్ తీసిన ఈ సినిమాతో కోట్లు కురవకపోవచ్చు… కానీ చూసిన ప్రేక్షకుల కంట కన్నీటి బొట్లు రాలతాయి. అదే ఈ చిత్రం సాధించిన అతి గొప్ప విజయం. అదే ఒక ఉత్తమ చిత్రానికి సిసలైన అభిషేకం.
అయోధ్యకుమార్ ఏమీ సినిమా కోసమని డ్రామా సృష్టించలేదు. లేనిదానిని చూపించి ప్రేక్షకుల్ని ఏడిపించాలనుకోలేదు. నిత్యం వార్తా ఛానళ్లలో, న్యూస్ పేపర్లలో ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. చూపులేని వారిపై జాలి చూపించకపోయినా ఫర్వాలేదు. కనీసం వారి నోటి దగ్గర కూడు లాక్కోకుంటే అదే పదివేలు. అంధ బాలబాలికల్ని అడ్డు పెట్టుకుని, తమ జల్సాలకి, సరదాలకి గవర్నమెంట్ నిధుల్ని ఎలా వాడుకుంటున్నారో, బాలలపై తమ జులుం చూపిస్తూ, బాలికలపై అత్యాచారాలకి ఏ విధంగా పాల్పడుతున్నారో, జంతువులు కూడా ఉండలేని పరిసరాల్లో దుర్భర జీవితాన్ని గడుపుతూ చూపు లేని జీవితాలు ఇంకెంతగా మసకబారిపోతున్నాయో… దర్శకుడు సజీవంగా తెరకెక్కించాడు.
ఇలాంటి సినిమాలు తీయడం కనిపించినంత సులువేమీ కాదు. ఏమాత్రం మెలోడ్రామా ఎక్కువైనా, జీవనచిత్రాన్ని యథాతథంగా చూపించే ప్రయత్నంలో ఏ కొంచెం ఎక్కువ డీటెయిల్స్ జోలికి పోయినా… సినిమాలా కాకుండా డాక్యుమెంటరీలా అనిపించే ప్రమాదముంది. కథ చెబుతున్నట్టుగానే ఉంటూ… జీవితాలని ఆవిష్కరించాలి. ఈ విషయంలో దర్శకుడు నేర్పు ప్రదర్శించాడు. ఫిలిం మేకింగ్‌పై ఆసక్తి ఉండి, కళ్లు పోగొట్టుకున్న పిల్లాడి పాత్ర కోణంలో కథ నడిపించడం వల్ల బరువైన కథాంశమైనా కానీ ఆసక్తికరంగా ముందుకి సాగింది. తమ హాస్టల్‌లో జరుగుతున్న దారుణాలని కలెక్టర్‌కి డాక్యుమెంటరీ రూపంలో చూపించాలని ఒక అంధ బాలుడు తన సహచరులతో కలిసి అదంతా ఎలా షూట్ చేస్తాడు, దానిని కలెక్టర్ దగ్గరకి ఎలా చేరుస్తాడు అనేది పట్టు సడలకుండా తెరకెక్కించారు.
అలాగే కొంచెం కొంచెంగా తన పశు లక్షణాలని బయటపెడుతూ, క్లయిమాక్స్‌కి వచ్చే సరికి పూర్తిగా దిగజారిపోయే ఆశిష్ విద్యార్థి పాత్ర ద్వారా సినిమాలో ఆద్యంతం ఒక టెన్షన్ అండర్‌కరెంట్‌గా రన్ అవుతూ ఉంటుంది. అతనికి తగిన శాస్తి జరగాలనే కోరిక కలిగించి, ఆ పిల్లలు చేసే ప్రయత్నం విజయవంతమవ్వాలని ఆడియన్స్ ఎదురు చూసేలా పాత్రలకీ, ప్రేక్షకులకీ నడుమ ఎమోషనల్ బాండ్ క్రియేట్ అవుతుంది. అత్యంత సహజమైన వాతావరణంలో, నిజంగా అలాంటి ఒక అంధ బాలల ఆశ్రమానికి వెళ్లినట్టు అనిపించేలా ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగా చేసుకున్నారు. తమకి ఉన్న వనరులలోనే ఆకట్టుకునే కెమెరా పనితనంతో ఆకట్టుకున్నారు.
తెరవెనుక ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులంతా తమవంతు సహకారం అందించారు. సంగీతం సినిమాకి తగ్గట్టుగా సాగింది. దర్శకుడి ప్రతిభ పలు సందర్భాలలో దివిటీలా వెలుగుతుంది. తెరముందు కూడా ఈ చిత్రానికి నటీనటులంతా తమ సహజ నటనతో ప్రాణం పోసారు. కొత్తవాళ్లు, నిజంగా అంధులైన బాలలు నటించిన ఈ చిత్రంలో వంక పెట్టడానికి ఏమీ లేదు. ఇలాంటి సినిమాల్ని ఆదరించే ప్రేక్షకులు పెరిగితే, ఈ తరహా ప్రయత్నాలు చేసే వారికి కొండంత బలం వస్తుంది. ఎయిర్‌టెల్ డిటిహెచ్ ద్వారా విడుదల రోజునే డైరెక్టుగా ఇంట్లో ‘మిణుగురులు’ సినిమా చూసే అవకాశాన్ని కల్పించారు. ఇలాంటి చిన్న చిత్రాలకి రీచ్ పెరగడానికి ఇది మంచి ఆప్షన్. ఎప్పుడూ ఆ అయిదు పాటలు, నాలుగు ఛేజులు, మూడు కామెడీ సీన్లున్న సినిమాల్నే కాకుండా… మనసుపెట్టి తీసిన ఈ మంచి ప్రయత్నాలని కూడా వెన్నుతట్టి ప్రోత్సహిస్తే బాగుంటుంది. మరిన్ని ఇలాంటి మంచి చిత్రాలు తీయడానికి ఈ ‘మిణుగురులు’ మిణుకుమిణుకుమనే ఆశలు కలిగించే స్థాయికి గుర్తింపు పొందితే దీనికో సార్ధకత చేకూరుతుంది.
బోటమ్ లైన్: మిణుగురులు – మానవత్వం కళ్ళు తెరిపించే మెరుపులు
– గణేష్ రావూరి
http://twitter.com/ganeshravuri