Advertisement

Advertisement


Home > Movies - Reviews

Salaar Review: మూవీ రివ్యూ: సలార్-పార్ట్1-సీజ్ ఫైర్

Salaar Review: మూవీ రివ్యూ: సలార్-పార్ట్1-సీజ్ ఫైర్

చిత్రం: సలార్-పార్ట్1-సీజ్ ఫైర్
రేటింగ్: 3/5
నటీనటులు: ప్రభాస్, శృతిహాసన్, పృథ్విరాజ్ సుకుమారన్, టిను ఆనంద్, జగపతిబాబు, బాబీ సింహ, ఈశ్వరీరావు, ఝాన్సి, జాన్ విజయ్, శ్రేయారెడ్డి, రామచంద్రరాజు, షఫీ తదితరులు
కెమెరా: భువన్ గౌడ
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
సంగీతం: రవి బస్రూర్
నిర్మాత: విజయ్ కిరగండూర్
దర్శకత్వం: ప్రశాంత్ నీల్
విడుదల తేదీ: 22 డిసెంబర్ 2023

ఈ సినిమా మీద ఆసక్తి నెలకొనడానికి, విడుదల అర్ధరాత్రి అయినా కూడా అన్ని చొట్లా హౌస్ ఫుల్ అవ్వడానికి ప్రధానమైన కారణాలు రెండు "ప్ర" లు- ప్రభాస్, ప్రశాంత్ నీల్.  బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్టుకోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి కేజీఎఫ్ లాంటి భారీ విజయాన్ని అందించిన ప్రశాంత్ నీల్ తోడయ్యే సరికి ఆశలు చిగురించాయి, అంచనాలు మిన్నంటాయి. మరి ఆ అంచనాలు అక్కడే ఉన్నాయా లేక పైకో కిందకో స్థానం మార్చుకున్నాయా అనేది చూద్దాం. 

కథలోకి వెళ్తే ... వరదరాజమన్నార్ (పృథ్విరాజ్ సుకుమారన్) దేవాకి చిన్ననాటి మిత్రుడు. కొన్ని కారణాల వల్ల దేవా, అతని తల్లి ఊరు వదిలి పాతికేళ్లుగా అస్సాం లో నివసిస్తుంటారు. తల్లికిచ్చిన మాట ప్రకారం దేవ ఆయుధం పట్టడు, ఆవేశం తెచ్చుకోడు.

ఇదిలా ఉంటే ఆద్య (శృతిహాసన్) అనే అమ్మాయి విదేశం నుంచి కలకత్తలో దిగుతుంది. అయితే ఆమెకు ప్రాణహాని ఉందని ఆమె తండ్రి ఆమెను ఒక సహాయకుడి ద్వారా అస్సాంలోని దేవ తల్లివద్దకు చేరుస్తాడు. ఇంతకీ ఎవరామె? ఆమెకున్న ప్రమాదమేంటి? ఆమెను ప్రమాదం నుంచి దేవ ఎందుకు రక్షిస్తున్నాడు? 

ఈ ప్రశ్నల నడుమ కొన్ని కారణాల వల్ల దేవాకి, వరదరాజమన్నర్ కి మధ్య గ్యాప్ వస్తుంది. దానికి కారణమేంటి? ఈ కథంతా జరిగే ఖాన్-సార్ నగర నేపథ్యమేంటి? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఒక్కొక్కటిగా విప్పుకుంటూ సాగుతుంది కథనం. 

చెప్పుకోవడానికి సింపుల్ గా అనిపించే ఈ ప్రధాన కథకి అనేక ఉపకథలు జోడించి.. లెక్కలేనన్ని పాత్రలు పెట్టడం వల్ల చాటభారతమంత అయ్యింది. అన్నేసి పాత్రలని అర్ధం చేసుకుంటూ, వాళ్ల మధ్యలో రిలేషన్స్ ని అర్ధం చేసుకుంటూ చూడడం మెదడుకి పెద్దపని. ఈ విషయంలో దీని కంటే "పొన్నియన్ సెల్వన్" చాలా నయమనిపిస్తుంది. 

ఇంతకీ సినిమాలో ప్రతి సీన్ ఎలివేషనే. సినిమా మొత్తం యూనిఫాం కలర్ టోన్, క్లోజప్ షాట్లు, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్, హాల్లో కూర్చున్న సీట్లు దద్దరిల్లిపోయేలా నేపథ్య సంగీతం... మొత్తం ఇవే! ఇది ప్రశాంత్ నీల్ స్టైల్ అనుకుని ఆ యాంబియన్స్ లోకి, ఆ మూడ్ లోకి వెళ్తే ఆసాంతం ఆస్వాదించొచ్చు. 

కంప్లైంట్ గా కాదు కానీ కాస్త లైటర్ వీన్ లో చెప్పుకోవాలంటే... కథనానికి మాత్రం ఒకచోట నిలకడ లేదు. కలకత్తాలో మొదలై, అస్సాం వెళ్లి, అక్కడ నుంచి రాయపూర్ దగ్గర మలుపు తిరిగి, హైదరాబాదులో కాసేపు ఆగి, బర్మా బోర్డర్ దగ్గర తేలి చివరికి పాకిస్తాన్ దగ్గర్లో ఉన్న ఖాన్-సార్ అనే ఒక ఫిక్షనల్ ప్లేస్ కి చేరుతుంది. బహుశా పాన్-ఇండియా సినిమా కాబట్టి అలా దేశం మొత్తాన్ని ఒక రౌండేసాడేమో! అలాగని ఇండియాతోనే ఆగిపోలేదు. రకరకాల ప్రైవేట్ ఆర్మీలని వేరు వేరు దేశాలనుంచి దింపి వాటి పేర్లు కూడా వరసగా చెప్పడం జరిగింది. అలా ఇది ప్యాన్-ఇంటర్నేషనల్ సినిమా అయ్యిందనుకోవాలి. 

ఇక సినిమా మేకింగ్ మొత్తం కేజీఎఫ్ పంథాలోనే సాగింది. ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో, ఏ షాట్ లో ఏ విషయముందో అనిపించేలా అన్-ప్రెడిక్టిబిల్ ప్యాటర్న్ లో నడిచింది సినిమా అంతా. అయితే ఎక్కడా కూడా మనసుని పిండే సన్నివేశాలు, భావోద్వేగాలు లేవు. అయినా కూడా ఒకానొక అనుభూతికి గురి చేసి పాజిటివ్ ఫీలింగుతో బయటికొచ్చేలా చేస్తుంది. 

"బాహుబలి"లో సభలో తల నరికే సీన్ లాంటిది ఇందులో కూడా ఉంది. ఆ మొత్తం ఎపిసోడ్ మాత్రం ఆసక్తిగా ఉంది. అలాగే ఒక గిరిజన బాలికని ఇబ్బంది పెట్టే ఒక ప్రతినాయకుడిని సంహరించే సీన్ హైలైట్ గా నిలిచింది. 

ఇక మిగిలిన యాక్షన్ సన్నివేశాలన్నీ ఒక్కోటీ ఒక్కో మహాఘట్టంలా అనిపించాయి. ప్రభాస్ మీద కనుక ఎంత భారీ ఫైట్స్ పెట్టినా కన్విన్సింగ్ గా అనిపించాయి. 

కంటెంట్ మీద కంప్లైంట్లున్నా టెక్నికల్ గా మాత్రం చాలా పైస్థాయిలో ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఆయువుపట్టు. మూడు గంటల సినిమాని మోయడానికి ఆ నేపథ్యసంగీతమే కారణమయ్యింది. అలాగే కెమెరా వర్క్ కూడా చెప్పుకోదగ్గ విధంగా ఉంది. 

ప్రధమార్ధం బాగుందనిపిస్తుంది. సెకండాఫులో చాలా కాంప్లెక్సిటీ ఉన్నా రెండు మూడు సీన్స్ లో డెప్త్ మూలాన పాసైపోయిందనిపిస్తుంది. 

ప్రభాస్ లుక్ గానీ, సటిల్ నటన గానీ పూర్తిగా ఆకట్టుకున్నాయి.

శృతిహాసన్ పాత్రలో బరువు లేదు. హీరోగారిని ఎలివేట్ చేయడానికి పనికొచ్చే సీన్స్ లో కనపడిందంతే. 

పృథ్విరాజ్ సుకుమారన్ ఓకే. అతని పాత్రలో సింహభాగం సెకండ్ పార్ట్ లో చూడాలంతే.

ఈశ్వరీరావు బాగా చేసింది. ఒక పాత్రలో ఝాన్సి చాలా ఇంటెన్స్ గా చేసింది. శ్రేయారెడ్డి కూడా ఆకట్టుకుంది. 

జగపతి బాబుది కూడా కాసేపు కనిపించే పాత్ర లాగానే ఉంది.

మిగిలిన నటీనటులంతా ఓకే. 

ఏది ఏమైనా ఇది పూర్తిగా ముగిసిన కథ కాదు... పార్ట్ 1 మాత్రమే. మిగిలిపోయిన చాలా ప్రశ్నలకి సమాధానాలు రెండవ భాగంలో చూస్తే తప్ప సంపూర్ణంగా చూసిన ఫీలింగ్ రాదు, పూర్తిగా జడ్జ్మెంట్ ఇచ్చినట్టూ అనిపించదు. 

మార్వెల్ తరహా సూపర్ హీరో సినిమాలకి, రెగ్యులర్ కమెర్షియల్ హీరో సినిమాలకి మధ్యన ఉన్న జానర్ ని ప్రశాంత్ నీల్ ఎంచుకున్నాడు. అందుకే రెగ్యులర్ కమెర్షియల్ సినిమాలకంటే అతిగా, మార్వెల్ టైపు హీరోయిజం లో కాస్త తక్కువగా నడుస్తాయి కేజీఎఫ్ అయినా, సలార్ అయినా. వెరైటీ ఆయుధాలు, భారీ గన్స్ షూటింగులు ఇందులో కూడా ఉన్నాయి. 

ప్రభాస్ ని ఈ స్థాయి యాక్షన్ బ్యాక్డ్రాపులో ఈ మధ్యన చూడలేదు. ఫ్యాన్స్ కి మాత్రం ప్రభాస్ యాక్షన్ సీన్స్ ఫుల్ మీల్స్ అనిపించే అవకాశముంది. లాజిక్కులు వెతక్కుండా ఖాన్-సార్ నగరం యాంబియన్స్, ఆ గన్స్, ఆ వయోలెన్స్ నచ్చితే మాత్రం మరింతా బాగా ఎక్కుతుంది. 

బాటం లైన్: హై వోల్టేజ్ యాక్షన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?