రివ్యూ: సర్దార్ గబ్బర్‌సింగ్
రేటింగ్: 2.5/5
బ్యానర్: నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈరోస్ ఇంటర్నేషనల్, పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్
తారాగణం: పవన్‌కళ్యాణ్, కాజల్ అగర్వాల్, శరద్ ఖేల్‌కర్, ముఖేష్ రిషి, అలీ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సంజన, ఊర్వశి తదితరులు
మాటలు: సాయిమాధవ్ బుర్ర
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: ఆర్ధర్ ఏ విల్సన్
నిర్మాతలు: శరత్ మరార్, సునీల్ లుల్లా
కథ, కథనం: పవన్ కళ్యాణ్
దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర (బాబీ)
విడుదల తేదీ: ఏప్రిల్ 8, 2016
ఓ ఇంటర్వ్యూలో పవన్‌కళ్యాణ్‌ని ‘బాహుబలి’ చూసారా అంటూ అడిగితే, ‘లేదు చూడలేదు. డబ్బింగ్ చెబుతున్నపడు చూసేదే తప్ప ఈమధ్య నా సినిమాల్ని కూడా చూడట్లేదు’ అంటూ పవన్ జవాబిచ్చాడు. సినిమా అనే పరిశ్రమ కేవలం మనకొచ్చే ఆలోచనల మీద, మనకి నచ్చే కథల మీద నడిచేది కాదు. జనాలకి ఏం నచ్చుతుందో, ఎలా తీస్తే వాళ్లు ఆమోదిస్తున్నారో, ప్రస్తుతం వాళ్ల అభిరుచి ఏమిటో తెలిస్తేనే అందుకు తగ్గ కథలు రాసుకునే వీలుంటుంది. ఎంత పనిలో ఉన్నా, బాహుబలి బృహత్తర ప్రయత్నానికి కార్యాచరణలో ఉన్నా కానీ ముఖ్యమైన సినిమాలు, చూడాల్సిన సినిమాలని రాజమౌళి మిస్ అవ్వడు. ఎంత పని ఉన్నా మార్నింగ్ షో చూసేసి వచ్చి దానిని అనలైజ్ చేసుకుంటాడు. అతననే కాదు ఇపడున్న అగ్ర హీరోలందరూ కూడా వేరే సినిమాలు ఎలా ఉన్నాయి, ఎందుకు ఆడుతున్నాయి అనేది విశ్లేషించుకుంటూ ఉంటారు. అలా ఉండకపోతే అప్‌డేట్ అవలేరు. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకోలేరు. మనకి తెలిసినదే ప్రపంచమనుకుంటారు, మనం నవ్వుకున్నదే సినిమా అనేసుకుంటారు.
స్మార్ట్ ఫోన్ల యుగంలో కీప్యాడ్‌లతో పదేళ్ల క్రితం వచ్చిన నోకియా ఫోన్‌నే తయారు చేస్తానంటే ఎంతమంది కస్టమర్లుంటారు? సినిమా కూడా అంతే. ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఇపడు కొత్త ఆలోచనలున్న సినిమాలని, ఎమోషన్లని కొత్తగా ప్రెజెంట్ చేసిన చిత్రాలనే ఆదరిస్తున్నారు తప్ప మూస కథల్లో ఎంతటి హీరో ఉన్నా తిప్పి కొడుతున్నారు. బహుశా పవన్‌కళ్యాణ్ ‘ఆగడు’ చూసినట్టయితే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తీసేవాడు కాదేమో. ఎట్‌లీస్ట్ ఇలా తీసి ఉండేవాడు కాదేమో. ‘రభస’ చూసినట్టయితే మనకిలాంటివి వద్దని డిసైడ్ అయ్యేవాడేమో. సింపుల్‌గా వేరే సినిమాలు చూసి కరెక్ట్ చేసుకునే తపల్ని ‘ఉచితంగా’ సరిదిద్దుకోకుండా కొన్ని కోట్లు వెచ్చించి ఎవరికి వారే తెలుసుకోవాల్సిన పని లేదు. ఎదుటివారి తపలనుంచి తెలుసుకునే అవకాశం ఉన్నపడు స్వీయానుభవం అక్కర్లేదు.
పవన్‌కళ్యాణ్ ‘జాని’ కథ రాసాడు. వినోదం లేకుండా మరీ సీరియస్‌గా సాగింది. డిజాస్టర్ అయింది. ‘వినోదం లేకపోతే ఎలా?’ అంటే కేవలం కామెడీ మీదే ఫోకస్ పెడుతూ ‘గుడుంబా శంకర్’ చేసాడు. హీరోయిజమ్ పక్కన పడేయడంతో ఫాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో వాళ్లకి కావాల్సిన మిశ్రమం ఏంటనేది అర్థమైందన్నట్టు వినోదాన్ని, హీరోయిజాన్ని మిక్స్ చేస్తూ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ప్లాన్ చేసాడు. ఈ మిశ్రమం సరిగ్గా కలిపినట్టయితే ఫలితం మామూలుగా ఉండదు. అది వేరెక్కడో ఎందుకు ‘గబ్బర్‌సింగ్’ రిజల్ట్‌తోనే తేలింది కదా. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో ఫాన్స్ విజిల్స్ కొట్టే సందర్భాలు చాలానే ఉన్నాయి. నవ్వుకునే సన్నివేశాలు వచ్చి పోతూనే ఉంటాయి. కానీ ఓవరాల్‌గా కథతో ట్రావెల్ చేసేట్టు చేసే నెరేటివ్ లేదు. బ్యాడ్ స్క్రీన్‌ప్లే! సన్నివేశాలని తీర్చిదిద్దిన తీరు చూస్తే పవన్‌కళ్యాణ్ టేస్ట్ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. తనదైన శైలి హ్యూమర్ ఏంటనేది పవన్ సినిమాల్ని ఫాలో అయ్యేవారికి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘మూల కథ’ని మాత్రం తాను రాసి, కథ, స్క్రీన్‌ప్లే వేరే దర్శకుడికో, రచయితకో ఇచ్చేద్దామన్నదే మొదట్లో పవన్‌కళ్యాణ్ ఐడియా. కానీ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ పూర్తయ్యేసరికి తానే ‘కథ, స్క్రీన్‌ప్లే’ రచయిత అయ్యాడు. నిర్మాత శరత్‌మరార్ మాటల్ని బట్టి ఫైట్లు, పాటలు కూడా పవనే డిజైన్ చేసుకున్నాడు.
దీంతో సినిమా అంతటా పవన్‌కళ్యాణే కనిపించాడు. దర్శకుడిగా బాబీ ముద్రేమీ కనిపించలేదు. రైటర్‌గా పవన్ చేసిన తపల్ని సరిదిద్దడానికి, లేదా కప్పిపుచ్చడానికి యాక్టర్‌గా పవన్ పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. పవన్‌కళ్యాణ్ ఇంత యాక్టివ్‌గా కనిపించిన సందర్భాలు గత పదేళ్లలో చాలా తక్కువ. పవన్‌లోని ఎనర్జీని సరిగ్గా వాడుకుంటే ఒక గబ్బర్‌సింగ్, ఒక అత్తారింటికి దారేది అయితే, ఆ ఎనర్జీ వృధాగా పోతే ఒక గుడుంబా శంకర్, ఒక సర్దార్ గబ్బర్‌సింగ్! సీన్, సీన్‌గా జెమిని కామెడీ ఛానల్‌లో వేస్తుంటే చాలా సీన్లని ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఒక సినిమాగా దాదాపు మూడు గంటల పాటు చూసే వారిని ఎంగేజ్ చేసే, ఎంటర్‌టైన్ చేసే కథనం ఇందులో లేదు. పాటలున్నాయ్, పవన్ డాన్సులున్నాయ్, ఫైట్లున్నాయ్, కామెడీ సీన్లున్నాయ్, పంచ్ డైలాగులున్నాయ్. సాధారణంగా ఒక కమర్షియల్ మసాలా సినిమాతో కాలక్షేపానికి ఇంతకంటే ఏమక్కర్లేదు. కానీ వాటిన్నిటినీ ఎంజాయ్ చేసేలా కూర్చోపెట్టేలా కథ చెప్పలేదు. ఫస్ట్ హాఫ్ వరకు సరదా సరదాగానే సాగిపోయినా, సెకండ్ హాఫ్‌కి వచ్చే సరికి సీన్‌కి, సీన్‌కీ సంబంధం లేకుండా సినిమా సాగిపోతూ ఉంటుంది.
ఆ గందరగోళం నడుమ మాంఛి డైలాగ్ చెప్పినా, హీరోయిజమ్ చూపించినా, ఒక నవ్వించే సీనొచ్చినా, పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేనట్టుగా, ఇన్‌స్టంట్‌గా కనక్ట్ కాలేనట్టుగా, ఇమ్మీడియట్‌గా రియాక్ట్ అవలేనట్టుగా అయిపోతుంది ప్రేక్షకుల పరిస్థితి. దీనిని ఫాన్స్‌కి అంకితమిచ్చిన పవన్‌కళ్యాణ్ నిజంగానే దీంట్లో చాలా వరకు వాళ్లేకం కావాలనేదే చూసుకున్నాడు. తానేం చేస్తే అభిమానులు ఇష్టపడతారనేది తనకి తెలుసు కనుక అవన్నీ ఉండేలా రాసుకున్నాడు. అయితే ఒక సినిమా సెక్సస్‌కి బేస్ అయిన కథ, కథనాల పరంగా కేర్ తీసుకోలేదు. ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలంటే గొప్ప గొప్ప కథలే అక్కర్లేదు. వాటిని సవ్యంగా చెపకుంటూ పోతూ, ఇదిగో ఇందులో ఉన్న అంశాలనే పొందిగ్గా అమరస్తూ పోతే చాలు. ఘుమఘుమలాడే కమర్షియల్ మసాలా బాక్సాఫీస్ దగ్గర ధూమ్ ధామ్ చేసేస్తుంది. కథలుగా చెపకుంటే గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేదిలో ఏముందని అవి అంతగా జనాదరణ పొందాయి?
అలాగే ఇందులో కొన్ని రైట్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్ పరంగా ఫెయిలయ్యాయి. హీరో, విలన్ కాన్‌ఫ్రంటేషన్ కోసం జనం ఎదురు చూసేలా చేయాలనేది అసలు ఐడియా. కానీ అది ఎస్టాబ్లిష్ అవలేదు. ఇంటర్వెల్ సీన్‌లో విలన్‌కి హీరో ఎదురు నిలిస్తే జనాలు ఊగిపోవాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ఆడెవడన్నా’ పాట పెట్టడానికి, ఎమోషన్‌ని హైలైట్ చేయడానికి అదే కారణం. కానీ ఆ సీన్ పండడానికి అవసరమైన ప్లే ఎక్కడ ఉంది? హీరో అంతవరకు ఎక్కడా కండ బలం చూపించకపోతే, అతను కొట్టే సందర్భం కోసం మనం ఎదురు చూసేట్టు చేసినట్టయితే ఆ సీన్ పండుతుంది? ఉదాహరణకి ‘బాషా’లో రజనీకాంత్ మొదటిసారిగా రౌడీని కొట్టే షాట్, ‘ఛత్రపతి’లో ప్రభాస్ ‘చాలు’ అంటూ అడుగు ముందుకి వేసే షాట్. ఇలాంటి సీన్లు పండాలంటే ముందు అలాంటి బిల్డప్‌తో పాటు హీరోయిజమ్ కోసం ఎదురు చూసేలా చేయగలగాలి. కానీ ‘తోబ తోబా’ పాట తర్వాత అంత పెద్ద ఫైట్ చేసేసిన హీరో, విలన్‌కి ఆల్రెడీ ఎదురు మాట్లాడేసిన హీరో ఇంటర్వెల్ సీన్‌లో కొడుతుంటే ఎమోషన్ ఏమీ రాదు. ఆలోచనలు మైండ్‌లో అయితే ఉన్నాయి. కానీ అవి తెర మీదకి సవ్యంగా రాలేదు. ఎగ్జిక్యూషన్‌లో ఫెయిలవడంతో ఇంపాక్ట్ ఉండాల్సిన సీన్లు కూడా తేలిపోయాయి. చాలా వరకు మనమే ఇదీ అంటూ అజ్యూమ్ చేసుకోవాలి. విలన్ రత్తన్‌పూర్ జనాల్ని పీల్చి పిప్పి చేస్తున్నాడనేది మనకి విజువల్‌గా కనిపించదు. అలా మనం ఫీలవ్వాలి. యువరాణి వచ్చి గబ్బర్‌సింగ్‌ని అంతలా ప్రేమించేయడానికి బలమైన కారణాలుండవు. కానీ ఆమె ప్రేమ లోతుల్ని మనం ఫీలవ్వాలి. ఇలా ఎక్కడికక్కడ మైండ్‌లోని ఆలోచనలు తెర మీదకి ఎఫెక్టివ్‌గా రాక ఇబ్బంది పడ్డాయి. కొన్ని బలమైనవి కూడా బలహీనంగా మారిపోయాయి.
ఇక అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్ ఏమిటంటే, గబ్బర్‌సింగ్ పాత్ర ఇంటర్వెల్ తర్వాత ఒక్కసారిగా మూడీగా మారిపోతుంది. ఎనర్జీ మిస్ అయిపోతుంది. విలన్ ఎపడైతే ఇంటర్వెల్ సీన్లో వెనకడుగు వేసాడో అక్కడితో అతని పాత్ర కూడా తేలిపోయింది. దీంతో సెకండ్ హాఫ్‌ని నడిపించే కాన్‌ఫ్లిక్ట్ లేక, హీరో పాత్రలో ఎనర్జీ కూడా లేక, కామెడీ కోసం పెట్టుకున్న సీన్లేమో కథలోకి ఇమడక, ఒకవేళ ఇమిడినా అవి నవ్వించలేక అబ్బో ద్వితీయార్ధంలో ‘సర్దార్’ పాట్లు అన్నీ ఇన్నీ కావులెండి. పవన్‌కళ్యాణ్ అన్నీ తానై నడిపించాడు. ఈ చిత్రాన్ని నిలబెట్టడానికి నటుడిగా తనకి తెలిసిన విద్యలన్నీ చూపించాడు. బట్ ముందే చెపకున్నట్టు కేవలం నటుడి తపన వల్ల మూలాలు సరిగ్గా లేని సినిమాలు నిలబడవు. పవన్‌ని అమితంగా ఆరాధించే వారికి ఇదంతా ఓకే అనిపించవచ్చు కానీ మిగిలిన వారికి ‘సర్దార్’తో ‘సరదా’గా గడిపేయడం కష్టమైన విషయమే. డెబ్బయ్ శాతం సినిమాని చివర్లో ఆదరాబాదరాగా తీసేసామని వాళ్లే చెప్పినపడు క్వాలిటీ పరంగా ఎవరినుంచయినా బెస్ట్ అవుట్‌పుట్ ఆశించనక్కర్లేదు. సర్దార్ గబ్బర్‌సింగ్‌కి స్క్రిప్ట్ పరంగా ఉన్న బలహీనతలు చాలదన్నట్టు, టెక్నికల్‌గా స్టాండ్ అవుట్ అయ్యే ఎస్సెట్ కూడా లేకుండా పోవడంతో ఎంతో పొటెన్షియల్ ఉన్న ఐడియా (గబ్బర్‌సింగ్ క్యారెక్టర్‌కి కొనసాగింపు) వృధా అయిపోయింది.
బోటమ్ లైన్: మిస్‌ఫైర్!
గణేష్ రావూరి