Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: సవ్యసాచి

సినిమా రివ్యూ: సవ్యసాచి

రివ్యూ: సవ్యసాచి
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: మైత్రి మూవీ మేకర్స్‌
తారాగణం: నాగచైతన్య, మాధవన్‌, నిధి అగర్వాల్‌, భూమిక, వెన్నెల కిషోర్‌, రావు రమేష్‌, కౌసల్య, సత్య, తాగుబోతు రమేష్‌ తదితరులు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: యువరాజ్‌
నిర్మాతలు: నవీన్‌ యేర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి (సివిఎం)
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: చందు మొండేటి
విడుదల తేదీ: నవంబర్‌ 2, 2018

ఏ కథ అయినా రాసుకునే ముందే దర్శకుడికి అవగాహన వుండి తీరాల్సిన విషయం... 'టార్గెట్‌ ఆడియన్స్‌ ఎవరు?' అనేది. మన కథని ఇష్టపడేవాళ్లు, మన సినిమాని ఆదరించే వాళ్లు ఎవరనేది అంచనా వేయగలిగినపుడు ఆ కథని సినిమాగా మలచడం ఈజీ అయిపోతుంది. కాన్సెప్ట్‌ బేస్డ్‌ కథలని కాన్సెప్ట్‌కి కట్టుబడకుండా కమర్షియల్‌ రీచ్‌ పేరిట లార్జర్‌ ఆడియన్స్‌ని శాటిస్‌ఫై చేసే సినిమాలుగా మలిస్తేనే సమస్య వస్తుంది. కమర్షియల్‌ అంశాలు లేకుండా ఎక్కువ బడ్జెట్‌ చిత్రాలు చేయడం ఒకప్పుడు ప్రాబ్లమ్‌ అనిపించేదేమో కానీ కథకి కట్టుబడ్డ సినిమాల్లో స్టార్‌ వున్నా 'మసాలా అంశాలు' లేవనే కంప్లయింట్‌ ఎక్కువ మంది చేయడం లేదు.

'ధృవ' చిత్రాన్నే తీసుకుంటే, రామ్‌ చరణ్‌ ఇమేజ్‌కి అనుగుణంగా కథని కల్తీ చేయకపోవడమే ఆ చిత్రానికి ప్లస్‌ అయింది. కార్తికేయ చిత్రాన్ని ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మలచిన చందు మొండేటి 'సవ్యసాచి'కి వచ్చేసరికి రాజీ పడిపోయిన విషయం క్లియర్‌గా తెలుస్తుంది. ఒక ఆసక్తికరమైన కథాంశాన్ని ఎంచుకున్న చందు మొండేటి ఆ కాన్సెప్ట్‌కి అనుగుణమైన స్క్రీన్‌ప్లే రాసుకోకుండా కమర్షియల్‌ ఛట్రంలో ఇరుక్కుపోయాడు. దీంతో తన క్రియేటివిటీకి తానే పరిమితులు పెట్టుకుని కథని చేజేతులా పక్కదారి పట్టించేసాడు.

'వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌' అనే కాన్సెప్ట్‌కి సంబంధించిన రీసెర్చ్‌, ఎక్స్‌ప్లెనేషన్‌ బాగానే ఇచ్చినా అది నిజంగా కథలో రోల్‌ ప్లే చేసే సన్నివేశమే వుండదు. యాడ్‌ ఫిలింస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ అనుకుని ఏదో చేస్తూ అటునుంచి అటే హీరో తాలూకు లవ్‌స్టోరీకి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి అక్కడ కూడా 'కామెడీ లాంటిదేదో' చేస్తూ కాలక్షేపం చేసి, అటు లవ్‌స్టోరీని కానీ, ఇటు హ్యూమర్‌ని కానీ పండించకుండా... కేవలం అసలు కథని ఇంటర్వెల్‌ దగ్గర మొదలు పెట్టడానికి కాలక్షేపం చేస్తున్నారనే సంగతి ఎలుగెత్తి చాటుకుంటారు.

కాలేజ్‌ నుంచి యుఎస్‌కి షిఫ్ట్‌ చేసినా కానీ ఆ లవ్‌స్టోరీ రక్తి కట్టించకపోగా తెగ విసిగిస్తుంది. దానికితోడు షకలక శంకర్‌తో 'మన్మథుడు'లో బ్రహ్మానందం కామెడీ చేయించేస్తున్నామని ఫీలవడం మరింత ఇరిటేట్‌ చేస్తుంది. అత్యంత పాయింట్‌లెస్‌గా, అసలు కథకి సంబంధం లేకుండా ఒక గంటకి పైగా తినేసిన తర్వాత విలన్‌ ఎంట్రీ ఇస్తాడు. ఇతనిదో (మాధవన్‌) విచిత్ర కథ. తనని చిన్ననాటి నుంచి అవమానాలకి గురిచేసి, తన మేథస్సుని గుర్తించని వారందరినీ కలిపి మూకుమ్మడిగా చంపేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు.

అందరినీ చంపినా ఒక్కడు (నాగ చైతన్య) మిస్‌ అవుతాడు. అతను ఇతడిని ఎందుకు టార్గెట్‌ చేసాడు, అతని ఉచ్చునుంచి ఈ సవ్యసాచి ఎలా తప్పించుకుంటాడు? మాధవన్‌ పాత్ర చుట్టూ కథ నడుస్తున్నపుడు అతని పాత్రకి తగిన బ్యాక్‌గ్రౌండ్‌ చూపించి తీరాలి. అతను ఎందుకలా మారాడనే దానికి తగిన ఎక్స్‌ప్లెనేషన్‌ వుండాలి. ఏవో నాలుగు మాటలు చెప్పేసి అతనితో కనక్ట్‌ అయిపోండి, అతని పగలో భాగం కండి అంటే ఎలా కుదురుతుంది? అంత వృధాగా ఎందుకూ కొరగాని  ప్రేమకథపై అన్నిరోజులు, అన్ని కోట్లు ధారబోసినపుడు కథకి అతి కీలకమైన ఈ క్యారెక్టర్‌ డెవలప్‌మెంట్‌ని తేలిగ్గా తీసుకుంటారా? వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌ అంటూ హీరో ఎడమ చేతికి అత్యంత బలం వుందనే బిల్డప్‌ బాగుంది.

కానీ ఆ ఎడమ చెయ్యి ఈ కథలో పోషించిన పాత్ర ఏమిటనేది ఒక్కసారి తరచి చూసుకుంటే... అది లేకుండా కూడా ఈ సినిమాని ఇదే విధంగా తీసే వీలుంది. ఆలోచించి, రీసెర్చ్‌ చేసి పెట్టుకున్నది కాస్తా రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా 'పురచేతి'కి మణికట్టు గొలుసు మాదిరి అలంకారంగా తప్ప కథకి భూషణంగా మారలేకపోయింది. నాగ చైతన్య పాత్ర ఇందులో వివిధ పార్శ్వాలని, అనేక భావోద్వేగాలని చవిచూస్తుంది. నటుడిగా ఇది స్కోప్‌ ఇచ్చిన క్యారెక్టరే అయినా చైతన్య దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

ఉదాహరణకి తాను ఎంతో ప్రేమించే మేనకోడలు ఇక లేదనే విషయం తెలిసినపుడు అతని అభినయం ఏమాత్రం మెప్పించలేకపోయింది. స్టయిలింగ్‌ పరంగా కేర్‌ తీసుకుని, క్యారెక్టర్‌కి అనుగుణమైన ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సాధించిన చైతన్య పాత్రలోకి లీనమై వుంటే అవుట్‌పుట్‌ ఇంకాస్త మెరుగ్గా వుండేది. మాధవన్‌ విషయానికి వస్తే ఆసక్తికరమైన పాత్రే అతడిని ఇండోర్స్‌కి పరిమితం చేసేసి, సరయిన క్యారెక్టర్‌ ఆర్క్‌ లేకుండా ఎంత నటుడు అయినా ఏమీచేయలేని అశక్తుడిగా మారిపోయేట్టు చేసారు.

ధృవలో అరవిందస్వామి, అభిమన్యుడులో అర్జున్‌ తరహాలో కనిపించకపోయినా అత్యంత బలవంతుడిగా కనిపించాల్సిన విలన్‌ కేవలం వెకిలి నవ్వులు, ఫుల్‌స్టాప్‌లు, కామాలు అనే అర్థంలేని డైలాగులకి పరిమితమైపోయాడు. హీరోయిన్‌ క్యారెక్టర్‌ని బలవంతంగా కథలోకి ఇరికించిన భావన కలుగుతుంది. అలాగే కమెడియన్లని కూడా. హీరో సోదరి పాత్రలో భూమిక చివర్లో విలన్‌ ముందు కూర్చుని 'ఒక్కడు' క్లయిమాక్స్‌ సీన్‌ రిపీట్‌ వేసుకుంటుంది.

రావు రమేష్‌ లాంటి నటుడు కూడా కనిపించిన ఆ కొద్ది సీన్లలో అన్యమనస్కంగా అనిపించడంలోనే కథాబలం తేటతెల్లమవుతుంది. కీరవాణి సంగీతంలో 'సవ్యసాచి' థీమ్‌ సాంగ్‌ పవర్‌ఫుల్‌గా వుంది. 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు' రీమిక్స్‌ని కూడా కమర్షియల్‌ మైలేజ్‌ కోసం ఇరికించాల్సి వచ్చింది. ఆ పాట, లీడ్‌ సీన్‌ (బీభత్సమైన కామెడీ అనుకున్నారు) అక్కినేని అభిమానులకి ఎలా అనిపిస్తుందో కానీ సగటు ప్రేక్షకులకి అయితే ఈ సందర్భంలో ఈ సీనేంటి, ఈ సాంగేంటి అనిపించక మానదు.

పోరాట సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగుంది. ఛాయాగ్రహణం మెప్పిస్తుంది. మైత్రి మూవీస్‌ నిర్మాణ విలువలు భారీగా వున్నాయి. ప్రథమార్ధం పూర్తిగా వృధా కాగా, ద్వితియార్థంలో రక్తికట్టాల్సిన హీరో వర్సెస్‌ విలన్‌ తాలూకు 'క్యాట్‌ అండ్‌ మౌస్‌ గేమ్‌' చాలా ఆర్డినరీ అనిపిస్తుంది. ఉత్కంఠకి గురి చేయాల్సిన యాక్షన్‌ దృశ్యాలు తేలిపోయాయి. విలన్‌ తాలూకు మిస్టరీని చేధించడంలో హీరో చేసే కృషి కూడా ఫస్ట్‌ డ్రాఫ్ట్‌ స్క్రిప్ట్‌లోకి కూడా యాక్సెప్ట్‌ చేయలేని స్థాయిలో అనిపిస్తుంది. ఎక్కడున్నాడో తెలియని విలన్‌ని కనుక్కోవడానికి హీరోకి దొరికే క్లూస్‌, చివరకు అతని వద్దకి అతను చేరిపోయే సీన్‌ సిల్లీగా అనిపిస్తాయి.

హీరో ఎడమ చేతికి అంత బలం వున్నపుడు దానిని కౌంటర్‌ చేసే బలం విలన్‌కీ ఇవ్వాలిగా. ఒకరి చేతిలో మారణాయుధాన్ని పెట్టి, మరొకరి చేతికి వాటర్‌ గన్‌ ఇచ్చి ఫైట్‌ చేసుకోండంటే ఎలా? అసలు సవ్యసాచి విలనే అయితే, అతడి ఎడమ చేతికే అంత బలముంటే హీరో అతడిని ఎలా టాకిల్‌ చేస్తాడనేది ఇంకా ఆసక్తికరమైన అంశమేమో. విచిత్రమేమిటంటే... ఇందులోని విలన్‌కి హీరో అసలు బలం ఏమిటనేది అతడిని చివర్లో కలిసాక కానీ తెలియదు.

కనీసం అతని బలాన్ని తెలుసుకుంటే తన తెలివితో దానిని కౌంటర్‌ చేయడానికి ట్రై చేసి కాస్తో కూస్తో ఉత్కంఠకి చోటిచ్చేవాడు. చందు మొండేటి బేసిక్‌ విషయాలని కూడా లెక్కలోకి తీసుకోకపోవడమే ఈ చిత్రాన్ని ఎడమ చెయ్యి స్ట్రాంగ్‌, మిగతా బాడీ అంతా వీక్‌ అన్నట్టు చేసేసాయి.

సవ్యసాచి ఎడమ చెయ్యిమాట ఏమోకానీ చూసేవాళ్లకి ఇదంతా భరించే సహనం లేనపుడు కనీసం వేగంగా అక్కడ్నుంచి బయటకి తీసుకుపోయే బలమైన కాళ్ళయినా వుండడం కంపల్సరీ!

బాటమ్‌ లైన్‌: అపసవ్యం!
- గణేష్‌ రావూరి

చిలక.. 'ఛీ'బీఐ.. భళా మోడీ భళా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ లో 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?