cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: సోలో బ్రతుకే సో బెటర్‍

సినిమా రివ్యూ: సోలో బ్రతుకే సో బెటర్‍

సమీక్ష: సోలో బ్రతుకే సో బెటర్‍
రేటింగ్‍: 2.5/5
బ్యానర్‍: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
తారాగణం: సాయి ధరమ్‍ తేజ్‍, నభ నటేష్‍, రావు రమేష్‍, రాజేందప్రసాద్‍, వెన్నెల కిషోర్‍, సత్య, నరేష్‍ తదితరులు
సంగీతం: తమన్‍
కూర్పు: నవీన్‍ నూలి
ఛాయాగ్రహణం: వెంకట్‍ సి. దిలీప్‍
నిర్మాత: బి.వి.ఎస్‍.ఎన్‍. ప్రసాద్‍
రచన, దర్శకత్వం: సుబ్బు
విడుదల తేదీ: డిసెంబరు 25, 2020

కొత్త సినిమాలను కూడా బుల్లితెరపై చూడాల్సిన పరిస్థితులను కల్పించిన కరోనా కల్లోలం... తొమ్మిది నెలలకు పైగా థియేటర్లు మూసి పెట్టేసింది. సగం కెపాసిటీతో థియేటర్లు నడుపుకోవచ్చునని ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ రెండు నెలలకు పైగా చెప్పుకోతగ్గ సినిమాలేవీ సినిమా హాళ్లలోకి రాలేదు. ధైర్యం చేసి ముందడుగేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్‍’ చాన్నాళ్ల తర్వాత మళ్లీ సినిమాను సినిమాలా చూసే అవకాశమయితే కల్పించింది కానీ ఇన్నాళ్లూ దొరక్కుండా పోయిన అనుభూతిని ఆస్వాదించేంత స్టఫ్‍ మాత్రం అందించలేకపోయింది. 

ఫామ్‍లో వున్న సాయి (ధరమ్‍) తేజ్‍ హీరోగా కొత్త దర్శకుడు సుబ్బు తీసిన ‘సోలో బ్రతుకే సో బెటర్‍’లోని హీరోకి యూత్‍ దృష్టిని ఇట్టే ఆకర్షించే లక్షణం ఒకటి వుంది. ‘నో పెళ్లి దాని తల్లి’ అంటూ పాటందుకునే విరాట్‍కి పెళ్లంటేనే ఎలర్జీ. అందుకు కారణాలేంటనేది దర్శకుడు ముందుగా చెప్పడు. 

హీరో క్యారెక్టర్‍ని హాఫ్‍ వేలో పరిచయం చేసిన దర్శకుడు ఈ పెళ్లి అనే టాపిక్‍పై హీరోకు వున్న వ్యతిరేకతతో పాటు తన కుటుంబ సంబంధాల పట్ల కూడా ఎమోషన్‍ వున్నట్టు చూపించడు. కథానాయకుడు అంత మెటీరియలిస్టిక్‍గా వుండాలంటే అతడిపై అంతటి ప్రభావం చూపించిన సంఘటన ఏదైనా వుండాలి. కానీ దీనికి సంబంధించి దర్శకుడు మొదట్లోనే కాదు... మధ్యలో కూడా ఎక్కడా కారణం చూపించడు. 

కేవలం తన మావయ్య (రావు రమేష్‍) ఒక్కడితోను హీరో కొంచెం కనక్ట్ అయి వుంటాడు. అందుకే ఆ ఒక్క క్యారెక్టర్‍ తాలూకు ఎమోషన్‍తో మాత్రమే కాస్త టచ్‍ చేస్తాడు. కామెడీ సీన్స్ పేలడానికి సదరు సన్నివేశంలోని డైలాగులు లేదా పర్‍ఫార్మెన్సులు సరిపోతాయి కానీ ఎమోషనల్‍ సీన్స్ పే ఆఫ్‍ అవ్వాలంటే ముందు తగిన ప్లాంటింగ్స్ జరగాలి. హీరో ఎందుకంత మెటీరియలిస్టిక్‍గా వుంటున్నాడనేది తెలియనపుడు తండ్రి బర్త్డే విషెస్‍ చెబుతున్నా ఎందుకు పట్టించుకోడో, లేదా తర్వాత తనే తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినపుడు ఎంత ఎమోషన్‍ ఫీలవుతున్నాడో అర్థం కాదు. 

హీరో తాలూకు భావజాలానికి తగిన కారణాలు చూపించకపోయినా కానీ అతడిలో పరివర్తన ఎలా వచ్చిందనే దానిని మాత్రం అంచెలంచెలుగా చూపించడం బాగుంది. ఇక్కడున్న డీటెయిలింగ్‍ వల్ల ప్రీ ఇంటర్వెల్‍ సీక్వెన్సెస్‍ బెటర్‍ ఫీల్‍ ఇస్తాయి. ఇంటర్వెల్‍కి మంచి కమర్షియల్‍ ట్విస్ట్ ఇచ్చిన దర్శకుడు పోస్ట్ ఇంటర్వెల్‍లో స్క్రీన్‍ప్లే లాక్‍ కూడా బాగా వేసుకున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్‍ అని హీరో బోధించినంత సేపు హీరోయిన్‍ పరిచయం కాదు. అతడిలో తోడు కావాలనే ఆలోచనలు వచ్చాక కానీ హీరోయిన్‍ని కథలో పరిచయం చేయకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్‍లో అసలు హీరోయినే లేకపోవడం ఓ విధంగా కొత్త ఎలిమెంటు. 

హీరోయిన్‍ పరిచయానికి ముందు, పరిచయం అయిన తర్వాత కాసేపు సోల్‍ఫుల్‍ అనిపించిన ఈ బ్రతుకులో ఆ తర్వాత సోల్‍ లేకపోవడంతో ఫ్లాట్‍ అయిపోయింది. అడపాదడపా హాస్య సంభాషణలు కొన్ని అలరించినా కానీ గమ్యమేమిటో ఇట్టే తెలిసిపోయే కథనంలో ఎక్కడా హైస్‍ లేకపోవడం ఈ చిత్రానికి అతి పెద్ద బలహీనత అయింది. రావు రమేష్‍, రాజేందప్రసాద్‍, నరేష్‍ లాంటి సీనియర్‍ నటులున్నా కానీ ఆ పాత్రలతో కనక్ట్ కాగలిగే ఎమోషనల్‍ త్రెడ్స్ డెవలప్‍ చేయకపోవడం మరో ఇబ్బంది. 

ఉదాహరణకు రావు రమేష్‍ క్యారెక్టర్‍ ముగించిన విధానం వల్ల కథకు అదనంగా యాడ్‍ అయినదేమిటనేది అర్థం కాదు. అలాంటి సన్నివేశం వున్నపుడు కథా పరంగా అది పెద్ద ‘ఇన్సిడెంట్‍’ అవ్వాలి లేదా హీరో క్యారెక్టర్‍ గమనం మార్చడానికి కారణమవ్వాలి. హీరో పాత్ర ఎందుకు సోలోగా వుండాలనుకుంటున్నదీ రీజన్‍ ఇవ్వని దర్శకుడు అతడు అది వద్దనుకోవడానికి రీజనబుల్‍ రీజన్సే ఇచ్చాడు. హీరోయిన్‍ పాత్ర సోలో అవడానికి సింపుల్‍ రీజన్‍ అయినా ఏదోకటి ఇచ్చిన దర్శకుడు ఆమె రియలైజ్‍ అవడానికి రెండు మాటలు చాలనుకున్నాడు. 

సాయి తేజ్‍ కామెడీ టైమింగ్‍ చాలా ఇంప్రూవ్‍ అయింది. మునుపటి కంటే హాస్య సన్నివేశాలలో కంఫర్టబుల్‍గా కనిపించాడు. నభా నటేష్‍ నటన ఫరవాలేదు. వెన్నెల కిషోర్‍, సత్య అక్కడక్కడా తమ హావభావాలతో నవ్విస్తారు. రావు రమేష్‍ పాత్రను సరిగా తీర్చిదిద్దలేదు. అలాగే నరేష్‍, రాజేందప్రసాద్‍ పాత్రలను కూడా.

సాంకేతిక విభాగంలో తమన్‍ రెండు మంచి బాణీలు అందించాడు. దర్శకుడు సుబ్బుకి కమర్షియల్‍ మీటర్‍ బాగానే తెలుసు. హ్యూమర్‍ కూడా బాగానే పండించాడు. కానీ ఎమోషనల్‍ డెప్త్ ఇవ్వడంలో విఫలమవడంతో ద్వితియార్థంలో ఆ బలహీనత మిగిలిన బలహీనతలను మరింత ఎత్తి చూపించినట్టయింది. 

పేపర్‍ మీద ఇది మంచి యూత్‍ఫుల్‍ ఎంటర్‍టైనర్‍ కాదగ్గ లక్షణాలున్న కథ అనిపిస్తుంది కానీ తెర మీదకు వచ్చేసరికి సన్నివేశ రచన పరంగా అలసత్వం చొరబడింది. కొన్ని కామెడీ సీన్స్, సాయి తేజ్‍ కాన్ఫిడెంట్‍ పర్‍ఫార్మెన్స్, రెండు సాంగ్స్, గుడ్‍ మిడిల్‍ పోర్షన్స్ ఈ చిత్రానికి దోహదపడగా, వీక్‍ సెకండ్‍ హాఫ్‍, ఇంకా వీక్‍ అనిపించే క్లయిమాక్స్ ప్రధాన అవరోధాలయ్యాయి. 

బాటమ్‍ లైన్‍: సోల్‍ లేదు బ్రదరూ!

 


×