Advertisement

Advertisement


Home > Movies - Reviews

Skanda Review: మూవీ రివ్యూ: స్కంద

Skanda Review: మూవీ రివ్యూ: స్కంద

చిత్రం: స్కంద
రేటింగ్: 2/5
తారాగణం:
రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్, ప్రిన్స్ సెసిల్, శరత్ లోహితాశ్వ, దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ, ఊర్వశి రౌతేల, పృథ్వి తదితరులు 
కెమెరా: సంతోష్ 
ఎడిటింగ్: తమ్మిరాజు
సంగీతం: ఎస్. తమన్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, పవన్ కుమార్
దర్శకత్వం: బోయపాటి శ్రీనివాస్ 
విడుదల తేదీ: 28 సెప్టెంబర్ 2023

బోయపాటి సినిమాలంటేనే హై వోల్టేజ్ యాక్షన్ సరుకని వేరే చెప్పక్కర్లేదు. రామ్ పోతినేని అంటేనే ఎనెర్జీకి మారుపేరు. శ్రీలీల డ్యాన్సుల విషయంలో మంచి పేరు తెచ్చుకున్న క్రేజీ నటి. ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అంటే ఆసక్తిగానే ఉంటుంది సగటు మాస్ ప్రేక్షకుడికి. ఇంతకీ ఇందులో ఆశించిన అంశాలు ఎంతవరకూ ఉన్నాయో, టార్గెట్ ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పించిందో, ఓవరాల్ గా సినిమా చూసిన అనుభూతి ఎలా ఉందో పరిశీలిద్దాం. 

కథలోకి వెళ్తే...ఆంధ్రా సీయం (అజయ్ పుర్కర్) కూతుర్ని తెలంగాణా సీయం (శరత్ లోహితాశ్వ) కొడుకు పెళ్లి పీటలమీద ఉండగా లేపుకుపోతాడు. దాంతో ఇద్దరి సీయం ల మధ్య శత్రుత్వం పెరుగుతుంది. తెలంగాణా సీయం ని చంపేసి తన కూతుర్ని తెమ్మని ఆంధ్రా సీయం ఒకడికి సుపారి ఇచ్చి పంపిస్తాడు. 

అదలా ఉండగా రామకృష్ణ రాజు (శ్రీకాంత్) అనే ఒక సుప్రసిద్ధ ఐటీ పారిశ్రామికవేత్త జైల్లో మగ్గుతుంటాడు. అతని కూతురు (సియ మంజ్రేకర్) చావుబతుకుల మధ్య ఆసుపత్రి బెడ్ మీద ఉంటుంది. వీళ్లదొక ప్యారలెల్ ట్రాక్. 

ఆ సీయం లకి, ఈ పారిశ్రామికవేత్త రాజుకి గతంలో ఒక లింకుంటుంది. అదేంటంటే, ఐదు లక్షల కోట్ల రూపాయల తమ బ్లాక్ మనీని ఇతని కంపెనీల ద్వారా వైట్ మనీగా మార్చే ప్రతిపాదన పెడతారు అంధ్రా, తెలంగాణా సీయం లు. దానికి రాజు ఒప్పుకోడు. ఫలితంగా తప్పుడు కేసులు బనాయించి, వ్యాపారాన్ని దెబ్బ తీసి అతన్ని జైలు పాలు చేస్తారు సీయం లు.

ఈ కథలో మన హీరో (రామ్) దున్నపోతుని ఆడించేవాడిగా ఎంట్రీ ఇచ్చి, క్రమంగా తెలంగాణా సీయం కూతురుకి (శ్రీలీల) లైనేసి క్లైమాక్సులో తన పల్లెటూరిలో శ్రీరామనవమి వేడుకలో తేలి, క్లైమాక్స్ ఫైటింగ్ చేస్తాడు. 

అక్కడికి సర్ప్రైజ్ గా మరొక హీరో (రామ్) వస్తాడు. అదే క్లైమాక్స్ ట్విస్ట్. అతను భీకరమైన పోరులో శ్రీరామనవమి ప్రాంగాణాన్ని శత్రువుల రక్తంతో తడిపి, అక్కడికి ఫైటింగ్ చేయించడానికి తమ గ్యాంగుతో వచ్చిన ఇద్దరు సీయం లని కత్తులతో పొడిచాక, ప్రెస్సు వారు రావడంతో కథని సుఖాంతం చేస్తాడు. 

ఎలా ఉంది కథ? ఒక సీయం కొడుకు మరొక సీయం కూతుర్ని లేపుకుపోవడమనే ఎత్తుగడే వింతగా లేదూ! ఆద్యంతం లాజిక్, కామన్ సెన్స్ అనేవి నలకంతైనా లేకుండా మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసి, భారీ బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో హడావిడి చేసేస్తే అది కమెర్షియల్ సినిమా అయిపోతుందా? 

ఎంత బోయపాటి సినిమా అయినా మరీ ఇంత "అతి" అవసరమా అనిపిస్తుంది. ఇంతోటి కథకి సీయం లు కాకుండ సింపుల్ గా ఫ్యాక్షనిష్టులంటే సరిపోయేది.

ఎందుకంటే ఈ సీయం పాత్రలకి పక్కన రౌడీల్లాంటి వాళ్లే ఉంటారు తప్ప వేరే సెక్యూరిటీ కనపడదు. వీళ్లు కూడా చాలా పనులకి సుపారీ రౌడీల్నే నమ్ముకుంటారు తప్ప పోలీసులకి, వ్యవస్థలకి ఏమీ పని చెప్పరు.  

కథ సంగతి అలా ఉంచితే అసలు తెర మీద కనిపించే ఒక్క నటుడూ పరిచయమున్న మొహం కాదు. సినిమా మొదలైన చాలాసేపటి వరకు ఏ కన్నడ సినిమానో తెలుగు డబ్బింగులో చూస్తున్న ఫీలింగొస్తుంది. ప్రధానపాత్రల్లో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా నటించిన నటుల పేర్లు చెప్పడం తరచూ సినిమాలు చూసే వారికి కూడా అంత ఈజీ కాదు. 

ప్రధమార్ధమంతా వ్యర్ధంగా సాగితే, ద్వితీయార్ధం అర్ధం పర్ధం లేకుండా నడుస్తుంటుంది. అయితే ఉన్నంతలోనే ఏదో తెచ్చిపెట్టుకున్న డ్రామా, అందులోనే ట్విష్టు...పెట్టుకుని మాస్ దంపుడు దంపాడు దర్శకుడు. 

సినిమా మొత్తంలో చిన్న నవ్వుకూడా రాదు. కనీసం హీరో-హేరోయిన్ ట్రాక్ అయినా ఆకట్టుకుందా అంటే అదీ లేదు. లవ్ ట్రాక్ చాలా పేలవంగా ఉంది. డైలాగులు కూడా బిలో యావరేజ్.

తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరయితే హెవీగా ఉంది. తెర మీద ఏమీ విషయం లేకపోయినా ఏదో జరిగిపోతోందన్న ఫీలింగుని బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో కలిగేలా చేసాడు. పాటలు పెద్ద క్యాచీగా లేవు. అన్నీ హడావిడిగా వినిపించాయి తప్ప గుండెల్లోకి దూసుకెళ్లలేదు. మొదటి సాంగ్ మాత్రం మైకేల్ జాక్సన్ పాట స్టైలుని అనుకరించినట్టుగా వినిపించింది. అదొక్కటీ కాస్త పర్వాలేదు. ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్ కూడా తేలిపోయింది. 

సాంకేతికంగా కెమెరా, ఎడిటింగ్ ఓకే. నిడివి ఎక్కువగానే ఉన్నా పెద్దగా కొయ్యడానికి ఏమీ కనిపించలేదు. నిర్మాణ విలువల్లో మేకింగ్ స్టాండర్డ్స్, లొకేషన్స్ ఓకే కానీ ఆర్టిష్టులు మాత్రం అందరూ లో బడ్జెట్ బాపతే అనిపించారు! 

రామ్ నటన ఎప్పటిలాగానే హై వోల్టేజులో బానే ఉంది. అయితే అతని క్యారెక్టరైజేషన్లో భిన్నమైన వేరియేషన్స్ కానీ, బలమైన వ్యక్తిత్వం కానీ లేవు. రొటీన్ రొట్టకొట్టుడు హీరోగా కనిపించాడంతే. 

శ్రీలీల ఇలాంటి పసలేని కథానాయకిగా కనిపిస్తే ఆమె కెరీర్ త్వరగా ముగిసిపోవడం ఖాయం. ఆమె ప్రత్యేకత డ్యాన్సులు. అవి కూడా సరిగ్గా కంపోజ్ చేయలేదు. ఆకట్టుకునే స్టెప్ ఒక్కటి కూడా లేదు. బాగా సన్నపడడం వల్లనో ఏమో పెళ్లిసందడి నాటి ఆకర్షణ కూడా ఆమెలో కనిపించలేదు. 

శ్రీకాంత్, ఇంద్రజ కొన్ని సీన్స్ లో కనిపించారు తప్ప పెద్ద నిడివి ఉన్న పాత్రలు కావవి. 

దగ్గుబాటి రాజాకి కాసిని డైలాగ్స్, పర్ఫార్మెన్స్ ఉన్న సీన్స్ పెట్టారు. గౌతమి ప్యాడింగ్ కి సరిపోయింది. మిగిలిన నటీనటులు ఓకే. 

ఎలా చూసుకున్నా ఇది ప్రేక్షకుల్ని మరీ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుని తీసిన చిత్రం. బిల్డప్పులు, స్లో మోషన్లు, ప్రతి రియాక్షన్ కి పాత్రల మొహాల మీద ఫ్యాన్ బ్లోయర్ పెట్టి గాలొచ్చేలా చేసి, వెనుక ఒక భారీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేయడం...చూసి చూసి బోయపాటి జూసైపోయిందా అని డౌటొస్తుంది. 

కథలో, కథనంలో ఈ తరానికి కావాల్సిన బేసిక్ ఇంటిలిజెన్స్, గ్రిప్ ల నుంచి ఈ చిత్రంతో బోయపాటి దూరంగా జరిగిపోయాడు! 

తన కూతురు పెళ్లికొచ్చిన గవర్నర్ ని "ఈమె మా గవర్నర్ గారు" అంటూ చత్తీస్గడ్ సీయం కి పరిచయం చేసి, "ఈయన చత్తీస్ గడ్ సీయం అండీ" అని గవర్నర్ కి పరిచయం చేస్తాడు ఆంధ్రా సీయం.

ఇంతకంటే దరిద్రమైన డైలాగ్ సీన్ ఉంటుందా? 

తరచూ మీడియాలో కనిపించే సీయం లు, గర్వర్నర్లు ఈ రోజుల్లో ముఖపరిచయం లేకుండా ఉంటారా?!

ఇక్కడ అప్పలమ్మని అప్పారావుకి పరిచయం చేసేలాంటి సీన్ అవసరమా? 

అలాగే మరొక సీన్లో మన హీరోగారు తెలంగాణా సీయం ఇంట్లో చొరబడి సీయం కూతుర్ని, కోడల్ని కిడ్నాప్ చేసి వాళ్ల కళ్ల ముందే హెలికాప్టర్లో లేపుకుపోతాడు. సీయం తో సహా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోతారు. 

అప్రెంటీస్ కథా రచయిత కూడా ఇలాంటి చెత్త సినిమా కథ రాసుకోడు! 

ఏ లాజిక్కు ఆలోచించకుండా, కథలో సెన్సిబిలిటీ గురించి పట్టించుకోకుండా జస్ట్ బిల్డప్పుల్ని చూడాలనుకుంటే ఏమో కానీ, కామన్ సెన్స్ వాడుతూ చూస్తే మాత్రం తల గోక్కోవడం ఖాయం. బోయపాటి సినిమాల్లో "వినయవిధేయ రామా" గురించి ఒక రకంగా చెప్పుకుంటారు. ఈ "స్కంద" దానిని బీటౌట్ చేసింది. కూరగాయల్లో కందకి దురదెక్కువ అంటారు. సినిమాల్లో ఈ "స్కంద"కి కూడా తల దురద పెట్టించే గుణాలున్నాయి. ఇక మీ ఇష్టం. 

బాటం లైన్: బొంద

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?