టీడీపీ రాజకీయ పల్లకీ మోయడంపై కాపుల్లో అంతర్మథనం మొదలైంది. ఆత్మాభిమానమా? పవన్‌కల్యాణా?… ఈ రెండింటిలో ఏది ముఖ్యమో తేల్చుకునే సమయం ఆసన్నమైందనే చర్చకు తెరలేచింది. ముఖ్యంగా పవన్‌కల్యాణ్ పొత్తు ప్రకటన తర్వాత టీడీపీ వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కారణాలేంటో తెలియదు కానీ, తమను టీడీపీ నేతలు ఒక తిట్టు తిట్టినా నోరెత్తకూడదని పవన్‌కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు.
అలాగే టీడీపీ నేతలు ఎలా మాట్లాడినా, వారిని గౌరవించాలని, వారి జెండాలు మోయాలని పవన్‌కల్యాణ్, నాగబాబు ఊరూరా తిరుగుతూ ప్రచారం చేయడాన్ని కూడా కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీ రాజకీయాలు కులపరంగా విభజన జరిగాయన్నది వాస్తవం. జనసేనకు మెజార్టీ కాపులు అండగా నిలిచారన్నది నిజం. ఏపీలో బీసీల తర్వాత తమ ఓటు బ్యాంకే ఎక్కువగా ఉందని కాపులు భావిస్తున్నారు. అయినప్పటికీ ఇంత వరకూ రాజ్యాధికారం (సీఎం పదవి) తమ సామాజిక వర్గానికి దక్కకపోవడం వారిని వెంటాడుతోంది.
కనీసం తమకంటూ పవన్‌కల్యాణ్ రూపంలో ఒక నాయకుడొచ్చాడని, ఆయన్ను ముఖ్యమంత్రిగా చూసుకోవాలని కాపుల్లోని వివిధ తెగలు ఆశిస్తున్నాయి. ఇదేమీ గొంతెమ్మ కోరిక కూడా కాదు. ఎందుకంటే నాలుగైదు శాతం మాత్రమే జనాభా కలిగిన కమ్మ, రెడ్ల సామాజిక వర్గాల నేతలు సీఎంలవుతుండగా, తామెందుకు కాలేకపోతున్నామనే ఆవేదన వారిలో వుంది. ఎవరైతే తన పార్టీకి బలమో, వారి ఆకాంక్షలను పవన్‌కల్యాణ్ ఏ మాత్రం పట్టించుకోలేదు.
టీడీపీతో పొత్తు ప్రకటించడంతో పాటు వారి జెండాలు మోయాలని పవన్ దిశానిర్దేశం చేశారు. అప్పటికీ కాపులు సహించారు. కానీ కాపులకు సొంత రాజకీయ అభిప్రాయాలు ఉండకూడదని, చంద్రబాబును కీర్తించాలని, టీడీపీ జెండా భుజాన మోయాలంటూ టీడీపీ నేతలు కొందరు సోషల్ మీడియా వేదికగా సున్నితంగానే జనసైనికులకు హితవు చెప్పడం గమనార్హం.
ఇంతకాలం జనసేన కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా వుంటేనే టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని పవన్‌కల్యాణ్ చెబుతుంటే, నిజమే అని నమ్మామని, కానీ ఇప్పుడు ఆచరణలో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితుల్ని చూస్తున్నట్టు కాపు యువత సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోంది. ఈ సందర్భంగా ఈ ఏడాది మే 11న దర్శకుడు ఆర్జీవీ చేసిన రెండు ట్వీట్లను కాపు యువత గుర్తు చేయడం విశేషం.
“ఆ రోజు చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈ రోజు పవన్‌కల్యాణ్ తన జన సైనికులని, తన ఫ్యాన్స్ ని వెన్నుపోటు పొడిచి చంపేసాడు.. వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి”
“తన సొంత ఫ్యాన్స్‌నే కాకుండా, తన కాపుల్ని, చివరికి తనని తానే వెన్నుపోటు పొడిచేసుకున్నాడు”
ఆ రోజు మంగళగిరిలో జనసేన కార్యాలయంలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ టీడీపీతో పొత్తు వుంటుందని ప్రకటించారు. అలాగే తనకు ముఖ్యమంత్రి సీటు టీడీపీ నేతలెందుకు ఇస్తారని ప్రశ్నించారు. దీంతో జనసైనికులు పవన్‌ను సీఎంగా చూడాలనే ఆకాంక్షల్ని పవనే భూస్థాపితం చేశారని నాడు ఆర్జీవీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆర్జీవీ అనుమానమే నిజమైంది. అయితే టీడీపీ రాజకీయ పల్లకీ మోయడానికి పవన్‌కల్యాణ్ సిద్ధమైనప్పటికీ, కాపు యువత మాత్రం తమకు ఆత్మాభిమానమే ముఖ్యమని తేల్చి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మేరకు తమను కించపరుస్తున్న టీడీపీకి జన సైనికులు సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీతో పొత్తును కాపు యువత వ్యతిరేకిస్తోందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.
రోజులు గడిచే కొద్ది వారిలోని అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు మరింతగా ఎగిసిపడే అవకాశం వుందని అంటున్నారు. పవన్‌కల్యాణ్ అంటే అభిమానిస్తామని, అంతే తప్ప మనసు చంపుకుని తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే టీడీపీ పల్లకీ మోయలేమని కాపు యువత తేల్చి చెప్పడం జనసేనను కలవరపెడుతోంది.