తెదేపా కామెడీ షో- ‘ఎవడి గోల వాడిదే-2’

అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ “ఎవడిగోల వాడిదే” అని ఒక సినిమా తీసారు. దాదాపు అప్పటి టాలీవుడ్ కమెడియన్స్ అంతా అందులో నటించారు. అంతమంది కమెడియన్స్ ఏకకాలంలో ఉన్న సినిమా ఇండష్ట్రీ తెలుగు పరిశ్రమ తప్ప…

అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ “ఎవడిగోల వాడిదే” అని ఒక సినిమా తీసారు. దాదాపు అప్పటి టాలీవుడ్ కమెడియన్స్ అంతా అందులో నటించారు. అంతమంది కమెడియన్స్ ఏకకాలంలో ఉన్న సినిమా ఇండష్ట్రీ తెలుగు పరిశ్రమ తప్ప మరొకటి లేదని గొప్పగా కూడా చెప్పుకున్నారు.

ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకి అలాంటి క్రెడిట్ ఒక పొలిటికల్ పార్టీకి దక్కింది. తెలుగుదేశంలోనూ, దాని అను”కుల” మీడియాలోనూ ఉన్నంతమంది కమెడియన్స్ ఇంకెక్కడా లేరని సోషల్ మీడియా ట్రోల్స్ చూస్తుంటే అనిపిస్తోంది. “ఎవడిగోల వాడిదే” నిర్మాత లగడపాటి శ్రీధర్ అదే టైటిల్ తో పార్ట్-2 తీస్తానని ప్రకటించినట్టు గుర్తు. కానీ ఆయన ప్రమేయం లేకుండా ఆ తరహా కామెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది.  

సాధారణంగా తెదేపా వాళ్ల మీద వచ్చే రెండు ట్రోల్స్ చూస్తే, వరసగా అలాంటివే మనకి కనిపిస్తుంటాయి. అదే వైకాపా వాళ్ల మీద వచ్చే ట్రోల్స్ చూస్తే అవే వెంటాడుతుంటాయి. కానీ పనిగట్టుకుని రెండు వైపులా వస్తున్న ట్రోల్స్ చూస్తుంటే తెదేపా సోషల్ మీడియా వైకాపా మీద ట్రోల్స్ చేయడంలో పూర్తిగా విఫలమవుతోంది అని తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం వైకాపా సైడ్ కామెడీ చేయడానికి వీలుండే మనుషులు లేకపోవడమే. 

అయితే ఉన్నంతలో జగన్ మోహన్ రెడ్డి కొన్ని పదాలు తప్పు పలికినప్పుడో, పేపర్ పెట్టుకుని స్పీచ్ చదువుతున్నప్పుడో ట్రోల్స్ చేస్తుంటారు. లోకేష్ మీద వచ్చే ఈ తరహా ట్రోల్స్ కి ఇది రివెంజ్ అనుకోవచ్చు. 

అలాగే రోజా మీద విరిచుకుపడుతూ కొన్ని వీడియోలు వస్తుంటాయి. అవన్నీ విషం కక్కేవే తప్ప పెద్దగా నవ్వించే వీడియోలైతే కావు. 

కొంతలో కొంత రఘురామరాజు కొన్ని వీడియోల్లో తన కామెంట్స్ వింపిస్తుంటారు. అవి కాస్త నవ్విస్తాయి. అంతే! అంతకు మించి ఎంటెర్టైన్ చేస్తున్న వీడియోలే లేవు తెదేపా సైడ్ నుంచి. 

మహాసేన రాజేష్, స్వాతి రెడ్డి లాంటి వాళ్లు కొందరున్నారు తెదేపా-జనసేన వైపు. వాళ్లకి ప్యారలెల్ గా వైకాపా అభిమానులు పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్లు ఉండనే ఉన్నారు. వీళ్ల వీడియోలు మరీ హార్ష్ గా ఉంటూ గీత దాటేవిగా ఉంటాయితప్ప కామెడీ జానర్లో పూర్తిగా ఇమడవు. అయితే ప్రదీప్ చింతా తెదేపా వాళ్ల మీద చేసే వీడియోలు సున్నితమైన హాస్యంతో నవ్విస్తాయి! 

ఇక వైకాపా వాళ్లు తెదేపా బ్యాచ్ మీద చేసే ట్రోల్స్ వైపు చూస్తే ప్రతి రోజు లెక్కలేనన్ని వస్తున్నాయి. దానికి కారణం లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణలే కాకుండా వారి ఇతర కుటుంబ సభ్యులు సుహాసిని, చైతన్య కృష్ణ, రామకృష్ణ..ఇలా అందరూ తమ వీక్ కమ్యూనికేషన్ స్కిల్స్ తో కామిడీ పీసుల్లాగ జనానికి దొరికేయడమే! 

మైకిస్తే ఎవరు ఏ పదాన్ని ఎలా ఉచ్చరిస్తారో అని వెయిట్ చేస్తూ దానిని ట్రోల్ చేసి కామెడీ చేసుకుంటున్నారు తప్ప వాళ్లు మాట్లాడే దాంట్లో ఎమోషన్ ఎవరూ పట్టించుకోవడంలేదు. ఎందుకంటే అసలా మాటల్లో ఎమోషనే ఉండట్లేదు. 

వీళ్లే కాదు, ఈ లిస్టులో తెదేపా నాయకులు కూడా ఉన్నారు. అచ్చెన్నాయుడుని, వనగలపూడి అనితని, కొలికిపూడి శ్రీనివాసరావుని, జడ శ్రవణ్ కుమార్ ని కూడా ట్రోలర్స్ వదిలిపెట్టడం లేదు. వీళ్లు చూపే తెదేపా రక్తి, సీబీయన్ భక్తి ఆ రేంజులో ట్రోలబుల్ గా ఉన్నాయని అర్ధం. 

వీళ్లని పక్కన పెడితే జర్నలిష్టులైన టీవీ5 సాంబశివరావు, ఏబీయన్ వెంకటకృష్ణ, మహా వంశీలు కూడా తరచూ వైకాపా వాళ్ల ట్రోల్స్ కి గురౌతుంటారు. ఎందుకంటే వీళ్లు వెర్రితలలు వేసిన స్వామిభక్తితో చేసే కామెడీ అంతా ఇంతా కాదు. ఈ బ్యాచ్ మొత్తంలో స్టార్ కమెడియన్ మాత్రం సాంబశివరావే అన్నట్టుగా ఉంటుంది ట్రోల్స్ చూస్తుంటే. 

చంద్రబాబు అరెష్టయ్యి నేటికి 19 రోజులయింది. ఒక్కసారి టీవీ5 థంబ్ నెయిల్స్ చూస్తే “రేపు బెయిల్” అని రామకోటి రాసినట్టు ప్రతి రోజూ వేసుకుంటూ వచ్చారు. ఇలాంటి వాటి వల్లే కదా ట్రోలర్స్ యాక్టివ్ అయ్యేది! 

ప్రత్యర్థులంటే అలా చేస్తూనే ఉంటారులే అని జనరలైజ్ చేయడానికి లేదు. ఎందుకంటే తెదేపా సానుకూల మీడియా జర్నలిష్టుగా పేరెన్నికగన్న టీవీ5 మూర్తి మీద ట్రోల్స్ కనపడవు. ఎందుకంటే ఉన్నంతలో తన బుర్రని వాడుతూ అతి స్వామిభక్తి ప్రదర్శించకుండా ఉండడమే కారణం కావొచ్చు. 

మరి ఆ గట్టునున్న జర్నలిష్టుల్ని ట్రోలర్స్ ఆడుకుంటుంటే ఈ గట్టునున్న జర్నలిష్టులని కూడా ఆ గట్టు సోషల్ మీడియా ఆడుకోవాలిగా!. కానీ సాక్షి టీవీ ఈశ్వర్ ట్రోలబుల్ మెటీరియల్ గా కనిపించడు. తన పని తాను సీరియస్ గా చేసుకుంటూ పోవడమే తప్ప అతి స్వామిభక్తి చూపే మాటలు మాట్లాడడు.

ఇతన్నిపక్కన పెడితే ఇతర వైకాపా సానుకూల టీవీలు లేవనే చెప్పాలి. ఒకటీ, అరా ఉన్నా వాటిల్లో ట్రోల్స్ కి గురయ్యేటంత వెర్రిగా ఎవరూ పెద్దగా వీడియోలు వదలడం లేదల్లే ఉంది. 

ఏది ఏమైనా గత కొన్నాళ్లుగా తెలుగుదేశం ఒక బ్లాక్ బస్టర్ కామెడీ చిత్రంలా నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ఆ వర్గానికి ట్రాజెడీయే అయినా, చుట్టూ ఉన్న ఈ బ్యాచ్ వల్ల ఆ ట్రాజెడీని కామెడీ మింగేస్తోంది. అంతా చంద్రబాబు గారి దురదృష్టం! 

– శ్రీనివాసమూర్తి