మొదట్లోనేమో మేం బెయిలే అడగం.. బెయిల్ పిటిషన్ వేసేది తప్పు చేసిన వాళ్లు, క్వాష్ పిటిషన్ వేసేది చంద్రబాబు లాంటి నిప్పులు అంటూ ప్రచారం చేసుకున్నారు! మరి ఈ క్వాష్ పిటిషనే చంద్రబాబు పాలిట బూమరంగ్ మారినట్టుగా ఉంది.
అసలు ఈ కేసులో విచారణార్హమే కాదు, అక్కడ స్కామే లేదు, చంద్రబాబుపై కేసే పెట్టకూడదు, సీఐడీ చంద్రబాబుపై నమోదు చేసిన కేసును విచారణ అవసరమే లేకుండా కొట్టయాలనే ఈ క్వాష్ పిటిషన్ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడా చెల్లనట్టుగా ఉంది!
ఇలాంటి వ్యవహారాలు చంద్రబాబుకు కొత్త కాదంటారు. గతంలో తనపై ఏ కేసు విచారణకు వచ్చినా వాటిపై స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు పరిపాటి అనే అభిప్రాయాలున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, చంద్రబాబు వ్యవహారాల్లో చాలా కేసులపై స్టేలున్నాయి. అందుకే చంద్రబాబును స్టేబీఎన్ అంటూ ప్రత్యర్థులు ఎద్దేవా చేసేవారు.
ఇన్నాళ్లూ చంద్రబాబు అవినీతి చేయక కాదని, తనపై ఎక్కడ చీమ చిటుక్కుమంటున్నా స్టేలు తెచ్చుకుంటూ చంద్రబాబు పబ్బం గడుపుకున్నాడనే విశ్లేషణలు వినిపించాయి. మరి ఇప్పుడు స్టే కాకుండా.. ఏకంగా క్వాష్ పిటిషన్ ను పట్టుకుని తిరుగుతున్నారు చంద్రబాబు తరఫు లాయర్లు.
అయితే ఏ కోర్టకు వెళ్లినా.. క్వాష్ పిటిషన్ కు ఆమోదం లభించడం లేదు. హైకోర్టు అయితే స్పష్టంగా చెప్పింది.. ఈ కేసులో ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరిపి క్వాష్ ఆర్డర్స్ ఇవ్వలేమని! అయినప్పటికీ తగ్గకుండా అదే పిటిషన్ తో సుప్రీంకు వెళ్లారు. అయితే క్వాష్ ఆర్డర్స్ ను సుప్రీం కోర్టు కూడా తేలికగా ఇస్తుందా! అనేది డౌటనుమానం!
ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతున్న అంశం గురించి.. సుప్రీం కోర్టు కూడా అర్జెంటుగా క్వాష్ ఆర్డర్స్ ఇచ్చేసే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ పిటిషన్ ను విచారణకు తీసుకుంటూనే… ఏసీబీ కోర్టు విచారణలో తాము జోక్యం చేసుకోమని కోర్టు వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. మరి హైకోర్టు తరహాలో సుప్రీం కోర్టులో కూడా తీర్పు వస్తే.. ఈ క్వాష్ పిటిషన్ ను పట్టుకుని చంద్రబాబు లాయర్లు ఎక్కడకు వెళ్తారనేది ప్రశ్న! ఆ క్వాష్ పిటిషన్ సమయంలో వీరు వినిపించే వాదనలు కూడా సాంకేతికమైనవే అని ప్రత్యర్థి లాయర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదు.. అనే వాదనలతోనే.. క్వాష్ కు వారు ప్రయత్నిస్తున్నారని… కోర్టులు విచారణ గురించి మాట్లాడుంటే చంద్రబాబు అండ్ కో సాంకేతిక అంశాలను పట్టుకుని వేలాడుతున్నారనే అభిప్రాయాలూ న్యాయనిపుణుల నుంచి వినిపిస్తున్నాయి.