చిత్రం: తెల్లవారితే గురువారం
రేటింగ్: 1.5/5
నటీనటులు: శ్రీసింహ, చిత్రా శుక్ల, మిష నారంగ్, రాజీవ్ కనకాల, సత్య, వైవా హర్ష, శరణ్య ప్రదీప్ తదితరులు
కెమెరా: సురేష్
ఎడిటింగ్:సత్య గిదుటూరి
సంగీతం: కాలభైరవ
నిర్మాతలు: రజని కొర్రపాటి, రవీంద్ర బెనెర్జీ ముప్పనేని
దర్శకత్వం: మణికాంత్ గెల్లి
విడుదల తేదీ: 27 మార్చ్ 2021
సాయికొర్రపాటి వారాహి బ్యానర్, కీరవాణి గారి చిన్నబ్బాయి శ్రీసింహ హీరోగా రెండో సినిమా, పెద్దబ్బాయి కాలభైరవ సంగీతం, హిలారియస్ కామెడీని సూచించే పోస్టర్, ట్రైలర్…అన్నీ కలిసి ఈ సినిమాపై ప్రాధమిక అంచనాలను ఏర్పరచాయి. పైగా సోలో రిలీజ్ కావడంతో కాస్త ఫోకస్ పడింది. ఫైనల్ గా ఔట్ పుట్ ఎలా ఉందో చూద్దాం.
అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి పైమెతుకు చూస్తే చాలన్నట్టు, ఒక్కోసారి సినిమా ఎలా ఉండబోతోందో మొదటి ఐదు నిమిషాల్లో తెలిసిపోతుంది. కనిపిస్తున్న సీన్, వినిపిస్తున్న డయలాగ్ ని బట్టి ఇదేదో తేడాకొట్టేలా ఉందే అనిపిస్తాయి కొన్ని. ఈ “తెల్లవారితే గురువారం” ఆ టైపే.
మామూలుగా ఇలాంటి సినిమాలు ప్రతి ఏడాది చాలానే వచ్చి పోతుంటాయి. కానీ వారాహి లాంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్ మీద, అంత అనుభవజ్ఞుల మధ్యన, రాజమౌళి కుటుంబానికి చెందిన హీరోతో ఇలాంటి సినిమా ఎందుకు తయారయిందో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కామన్ సెన్స్, డయలాగ్ సెన్స్, టైమింగ్ సెన్స్ లాంటి ఏ బేసిక్ సెన్సూ లేకుండా రెండుగంటలు సినిమా నడపాలంటే అసలు సినిమా రైటింగ్ గురించి ఏ మాత్రం తెలిసుండకూడదు.
పేరుకే 120 నిమిషాల సినిమా కానీ, ముళ్లమీద కూర్చుని నాలుగ్గంటల సినిమా చూసిన ఫీలింగొస్తుంది ఈ “తెల్లవారితే గురువారం” చూస్తే. అసలెందుకు తెల్లవారిందా..! ఎందుకు ఈ సినిమా చూస్తున్నామా..! అనే ప్రశ్నలు, ఆశ్చర్యార్థకాలు, నీరసాలు, నిట్టూర్పులు వెంటాడుతుంటాయి.
ఇందులో ఆకట్టుకునే విషయం ఒక్కటి కూడా లేదు. సంగీతం, సాహిత్యం, సంభాషణ, దర్శకత్వం ఇలా దేని గురించీ పాజిటివ్ గా చెప్పుకోవడానికి లేదు. శ్రీసింహకి నటుడిగా మంచి భవిష్యత్తు ఉంది. బేసిక్ ట్యాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. కానీ ఇలాంటి సినిమాల్ని ఎంచుకుంటే మాత్రం ఏమీ ప్రయోజనం ఉండదు. మిషా నారంగ్ చూడ్డానికి బాగుంది. చిత్ర శుక్లా ఓపెనింగ్ సీన్స్ లో బాగానే ఉన్నా ఆమెకిచ్చిన కేరెక్టరైజేషన్ చిరాకు తెప్పిస్తుంది. అసలే పేలవమైన సినిమా చూస్తున్న పరిస్థితుల్లో ఈ వింత క్యారెక్టరైజేషన్ గాయానికి కారం పూసినట్టుంది.
కథేంటని అడిగితే…ఒకబ్బాయికి (శ్రీసింహ) ఒకమ్మాయికి (మిష) తెల్లవారితే పెళ్లి. కానీ ఇద్దరూ ఒకరికి తెలీకుండా ఒకరు రాత్రికి రాత్రి పారిపోయే పనిలో ఉంటారు. దానికి ఇద్దరికీ కారణాలుంటాయి. ఆ కారణాలేంటి? వాళ్ల ఫ్లాష్ బ్యాకులేంటి? నిజంగా ఇద్దరూ పారిపోతారా? చివరికి ఏమౌతుందనేది మెయిన్ ప్లాట్. హీరోకి ఫ్లాష్ బ్యాకులో ఒక డాక్టర్ (చిత్రా శుక్ల) తో పరిచయం ప్రేమగా మారుతుంది. అదేమౌతుందనేది ఇంకో ట్రాక్.
కథ గురించి గానీ, కథనం గురించి గానీ ఇంకో నాలుగు మాటలు చెప్పుకోవడానికి కూడా ఓపికని మింగేసిన సినిమా ఇది. ఫస్టాఫులో టీవీ సీరియల్స్ ని ట్రోల్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో వాటిని తలదన్నే మేక సీన్ ఒకటి పెట్టి ఫ్యూజులు ఎగరగొట్టేసాడు. హీరో హీరోయిన్స్ మధ్యలో ప్రేమ పుట్టించడం కోసం పెట్టిన ఈ సీక్వెన్స్ ని చూసి ఠక్కున లేచి జేబులో చేతులు పెట్టుకుని ఎక్జిట్ డోర్ వైపుకి వెళ్లిపోవాలనిపిస్తుంది.
సత్య పాత్రని మన్మధుడు సినిమాలో సునీల్ టైపులో రాసుకున్నారు. డయలాగ్స్ లో దమ్ములేకపోవడం వల్ల అతని ఓవర్ యాక్షన్ చూసి విసుగొస్తుంది తప్ప నవ్వురాదు. తన వయసుకి మించిన క్యారక్టర్లో అస్సలు సరిపోలేదతను. వైవా హర్ష, రాజీవ్ కనకాల, శరణ్య ప్రదీప్ ఏదో కనిపించారు తప్ప చెప్పుకోవడానికేమీలేదు.
2 గంటల సినిమాకి ప్రతి పది నిమిషాలకొకసారి టైం చూసుకునేలా చేసింది. ఇంటర్వెల్ వరకు ఆగకుండానే జారుకున్న ప్రేక్షకులున్నారు. సమీక్షకులకి మాత్రం సహనానికి పరీక్షలాంటి శిక్ష.
బాటం లైన్: తెల్లవారకపోతే బాగుండేది…ఈ సినిమా చూసే భాగ్యం తప్పేది.