కాకి పిల్ల కాకికి ముద్దు. ఎవరి పిల్లలు వారికి ముద్దు. అందరి పిల్లలూ ముద్దు ముద్దు మాటలు మాట్లాడతారు..ఆడతారు..పాడతారు..ఈతలు కొడతారు. ఎవరికి వారు వాళ్ల వాళ్ల వాట్సాప్ లో దగ్గర వాళ్లతో షేర్ చేసుకుంటారు. ఇంకా కాదంటే వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండేవారు ఏ ఫేస్ బుక్ లోనో అప్ లోడ్ చేసుకుని తమ స్నేహితులకు చూపించుకుంటారు.
సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. వారికీ పుత్రోత్సాహం లేదా పుత్రికోత్సాహం వుంటుంది. అందుకే తరచు పిల్లల పిక్స్ తీసి ఇన్ స్టా లో పోస్ట్ చేస్తుంటారు. లేదా ట్విట్టర్ లో పడేస్తుంటారు. పైగా వారి ఫ్యాన్స్ వుంటారు. వారు చూసి ఎంజాయ్ చేస్తారు అని.
కానీ వీటితో మీడియాకు ఏం పని? మరీ రేర్ గా ఒకసారి లేదా రెండుసార్లు అయితే ముద్దు. చంద్రబాబు మనవడి పిక్ అప్పుడెప్పడో కనిపించింది. జగన్ కుమార్తెల పిక్స్ చాలా రేర్. అలాంటపుడు మీడియా ఉత్సాహపడుతుంది.
కానీ నిత్యం..భంగిమ..వన్, భంగిమ టూ..భంగిమ త్రీ అంటూ ఫోటొలు వదలుతుంటే మీడియాకు ఏం ఆసక్తి వుంటుంది. పైగా హీరో లు కూడా తాము సోషల్ మీడియాలో వదిలిన పిక్స్ అన్నీ తీసి, పోస్ట్ మాన్ ఉద్యోగం చేయమని తమ పీఆర్ టీమ్ కు చెప్పరనే అనుకోవాలి.
కానీ వీళ్లే అతి ఉత్సాహంతో ఇన్ స్టాలో, ట్విట్టర్ లో ఇలా వేసిన ప్రతీదీ తీసి మీడియాకు అందిస్తుంటారు. అవి చూసి మళ్లీ మరోటి అనుకోవడం తప్ప చేసేది ఏమీ వుండదు.