Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

సినిమా రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

సమీక్ష: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
రేటింగ్: 2.75/5
బ్యానర్:
ఆర్కా మీడియా వర్క్స్, మహాయాన మోషన్ పిక్చర్స్
తారాగణం: సత్యదేవ్ కంచరాన, హరిచందన, రూప కొడువాయూర్, వికె నరేష్, సుహాస్, కె. రాఘవన్, టిఎన్‌ఆర్ తదితరులు
సంగీతం: బిజిబల్
కూర్పు: రవితేజ
ఛాయాగ్రహణం: అప్పు ప్రభాకర్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి
దర్శకత్వం: వెంకటేష్ మహా
విడుదల తేదీ: జులై 30, 2020
వేదిక: నెట్‌ఫ్లిక్స్ ఇండియా

లాక్‌డౌన్‌లో మలయాళ చిత్రాలు ట్రెండ్ అవుతున్నట్టుగా మరే ఇతర భాషా చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం లేదంటే అతిశయోక్తి కాదు. సినిమా తీయడానికి భారీ తారాగణం, బలమైన కథావస్తువు, కళ్లు చెదిరే హంగుఆర్భాటాలు వుండాలని మలయాళ సినీ రచయితలు, దర్శకులు భావించరు. ఒక చిన్న సంఘటన లేదా న్యూస్ ఐటెమ్ చుట్టూ ఒక సహజమైన కథని అల్లుకుని, దానిని అత్యంత వాస్తవికంగా ప్రెజెంట్ చేస్తుంటారు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ కథ కూడా కేరళలో పుట్టినదే. నటుడు, దర్శకుడు దిలీష్ పోతన్ ఒక సగటు మనిషి ప్రతీకారేఛ్ఛని తన సినిమా ‘మహేషింటె ప్రతిగారమ్’కి కథావస్తువుగా ఎంచుకున్నాడు. 

రివెంజ్ కథలు వెండితెరకు కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే దాదాపు యాభై శాతం సినిమాలకు ప్రతీకారమే డ్రైవింగ్ ఫోర్స్ అనవచ్చు. అయితే హీరో ఉగ్రరూపం చూపిస్తాడంటే... అంతవరకు అత్యంత సౌమ్యుడిగా వున్నవాడు సడన్‌గా కత్తి పట్టుకుని రక్తం రుచి చూడాలని రగిలిపోడు. ఊరందరి ముందు తనను కొట్టి, అవమానించిన వాడికి ఉమామహేశ్వరుడి ఉగ్రరూపం చూపిస్తానని, అంతవరకు చెప్పులు ధరించనని మహేష్ (సత్యదేవ్) శపథం చేస్తాడు. ఆ మాటలకు పక్కనున్న వ్యక్తి ‘ఏంట్రా సినిమా డైలాగులు చెబుతున్నావ్’ అని కొట్టి పారేస్తాడు. మహేష్ అరకులో చిన్న ఫోటో స్టూడియో ఓనర్. బతకలేక బడి పంతులు మాదిరి ‘చిన్ అప్, చిన్ డౌన్, ఐస్ వైడ్’ అంటూ ఏ ఫోటో అయినా ఒకేలా తీయగల టాలెంట్! చిన్నప్పట్నుంచీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఎదురు చూస్తుంటాడు. 

ఒక రోజు తన స్టూడియో ముందు రోడ్డు మీద జరుగుతోన్న గొడవలోకి వెళ్లి దెబ్బలు తింటాడు. తిరిగి కొట్టాలనే అనుకుంటాడు కానీ బలం సరిపోదు. ఆ కొట్టినవాడు అంతటితో ఆగకుండా తన ప్యాంటు కూడా ఊడదీసేసి అవమానిస్తాడు. ఊరందరి ముందు పరువు పోతుంది. దాంతో వాడిని తిరిగి కొట్టా‌క చెప్పులేసుకుంటానని అంటాడు. ఆ అవమానభారంలో వుండగానే మరో షాక్. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తననొక ఆప్షన్‌లా చూస్తోందని తెలిసి హతాశుడవుతాడు. మోసపోయిన మగాడిగా అతను ఆమెని దుర్భాషలాడడు. వేరే వాళ్లు ఆమెని తక్కువ చేసి మాట్లాడినా కానీ తప్పని అంటాడు. ఇంత సాఫ్ట్ మనిషి మరి ఆ పహిల్వాన్‌ని ఎలా కొట్టగలడు? సగటు సినిమా హీరో అయితే ఒక్కసారిగా తనలో తనేక తెలియని హనుమంతుడి బలాన్ని కనుగొంటాడు. కానీ ఇక్కడి ఉమామహేశ్వరుడికి తన బలమెంతో తెలుసు. అందుకే ఫైటింగ్‌కి వెళ్లేముందు తన ఊళ్లోని కంగ్‌ఫూ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి శిక్షణ తీసుకుంటూ వుంటాడు. 

త్వరగా వాడిని కొట్టేసి మళ్లీ చెప్పులు వేసుకుందామనుకుంటే... వాడేమో పొట్ట పట్టుకుని సౌదీ వెళ్లిపోతాడు. మళ్లీ అతను ఎప్పటికి తిరిగొస్తాడా అని కాళ్లకు చెప్పుల్లేకుండా ఎదురు చూస్తుంటాడు. సగటు మనిషి, సగటు మనిషి కసిపంతం, ఒక సగటు మనిషి తనలో తనకి తెలియని మరో కొత్త కోణం కనుగొనడం, బెటర్ హ్యూమన్‌గా మారడం ఈ చిత్రం ఇతివృత్తం. దర్శకుడు మహా మలయాళ కథ, కథనాలను మార్చే పని పెట్టుకోలేదు. అక్కడి నేటివిటీకి తగ్గట్టు వున్న సినిమాను మన నేటివిటీకి, ఇక్కడి మనుషుల అలవాట్లు, మాటలకు అనుగుణంగా మలిచేందుకు ప్రయత్నించాడు. స్ట్రాంగ్ కాన్‌ఫ్లిక్ట్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే వున్న సినిమాలను రీమేక్ చేయడం తేలికే కానీ... ఇలా ఎమోషన్స్, ఫీల్ ప్రధానంగా సాగే చిత్రాల సోల్ పట్టి, తిరిగి అదే ఫీల్ తెప్పించడం మాత్రం తేలిక కాదు. అందుకే ఎంత సహజమైన డ్రామా పండించాలని చూసినా... అక్కడక్కడా స్టేజ్‌డ్ అనే భావన కలుగుతుంది. ఒరిజినల్ చూడని వారికి ఎలా అనిపిస్తుందో కానీ... చూసి వుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మహేష్‌లో ఆ సహజత్వం కాస్త తక్కువే అనిపిస్తుంది. 

కేరళ బ్యాక్‌డ్రాప్‌కి దగ్గరగా వుంటుందని అరకులో సెట్ చేసారు. మామూలుగా మన సినిమాల నేపథ్యంతో పోలిస్తే ఇది ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది కానీ ఒరిజినల్ చూసిన వారికి కేరళ నేపథ్యం ఈ కథకు ఎంత ఎస్సెట్ అనేది తెలుస్తుంది. దర్శకుడు మహా ఈ చిత్రానికి ‘స్క్రీన్‌ప్లే’ క్రెడిట్ తీసుకున్నాడు కానీ అతను చేసిన మార్పుచేర్పులు అతి స్వల్పమనే చెప్పాలి. ఈ రీమేక్‌లో సంభాషణలతో సహా అనువదించిన సందర్భాలే చాలా వున్నాయి. సత్యదేవ్‌ని నటుడిగా ఇదో రెండు, మూడు మెట్లు పైకి తీసుకెళుతుంది. సహజమయిన అతని నటన మంచి మార్కులేయించుకుంటుంది. కానీ ఒరిజినల్‌లో చేసిన ఫహాద్ ఫాజిల్ పర్‌ఫార్మెన్స్‌ని మరిపించడం అంత తేలిక కాదు. కేరాఫ్ కంచరపాలెం లాంటి ఒరిజినల్ సినిమా తీసిన దర్శకుడు రెండవ చిత్రంగా ఒక రీమేక్ చేయాల్సి రావడం చిన్న డిజప్పాయింట్‌మెంట్. తన ముద్రని చాటుకునేందుకు మహా ప్రయత్నించినా కానీ ఒరిజినల్‌నుంచి డీవియేట్ కాకుండా చూసుకోవాల్సి రావడం వల్ల అతని సృజనకు సంకెళ్లేసినట్టయింది. 

మహేష్‌ఎన్టీఆర్ అభిమానుల మధ్య జరిగే వాదనలలాంటి వాటితో పాటు ఊళ్లో జరిగే చిన్న చిన్న పంచాయతీలు, కుశలాలు అడిగే వారికి వెటకారంతో కూడిన సమాధానాలు ఓ సినిమా చూస్తున్నట్టు కాకుండా సహజంగా పల్లెలలో జరిగే తంతునే కళ్ల ముందుకి తెచ్చినట్టు అనిపిస్తాయి. అయితే వీటిలో చాలా వరకు ఒరిజినల్ నుంచి యథాతథంగా తీసేసారనుకోండి. సంగీతం, ఛాయాగ్రహణం కథలో లీనం చేస్తాయి. నటీనటుల్లో కొందరు తెలిసినవాళ్లున్నారు కానీ అంతగా తెలియని వారితో సహా సహజమయిన నటనతో ఈ చిత్రానికి దోహదపడ్డారు. 

ఆహ్లాదంగా మొదలయ్యే ఈ చిత్రం మధ్యలోకి వచ్చేసరికి మందగిస్తుంది. మహేష్ తనలో దాగిన ఛాయాగ్రాహకుడిని కనుగొనడం, మళ్లీ ప్రేమలో పడడం, అలాగే తన ప్రతీకారం తీర్చుకోవడం కోసం తనను కొట్టినవాడు సౌదీ నుంచి తిరిగి వచ్చే వరకు ఎదురు చూడడం వగైరా అంతా మందకొడిగా సాగుతుంది. చివరికేం జరుగుతుందనేది కూడా ఊహించగలగడం దీనికి మరో వీక్‌నెస్. కొన్ని విషయాలలో ఈ ఉగ్రరూపం కొంచెం విసుగు కలిగిస్తుంది కానీ తెలుగు సినిమా రొటీన్ కథానాయకుల మధ్య ‘ఉమామహేశ్వరుడి’ ప్రత్యేకత అయితే ఆకట్టుకుంటుంది. ఒకవేళ మలయాళ సినిమా చూడని పక్షంలో ఇంకొంచెం ఎక్కువ స్పెషల్‌గా అనిపిస్తుంది. ఈ చిత్రబృందం సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టింది కానీ... ఒరిజినల్ పెయింటింగ్‌ని తిరిగి అలాగే వేయాలనే ప్రయత్నంలో ఎంత శ్రమ పడినా అది నకలే అవుతుంది కానీ అసలు అనిపించుకోలేదు మరి. 

బాటమ్ లైన్: జిరాక్స్ రూపశ్య!

గణేష్ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?