‘మా తండ్రికి కరోనా పాజిటివ్. ఆయనకు సేవలు అందించే క్రమంలో నాకు కూడా కరోనా బారిన పడ్డాను. కానీ కరోనాకు భయపడాల్సిన పని లేదు. నేను ఆయుర్వేద వైద్యం తీసుకున్నాను. ఇంకా ఇతరత్రా వైద్యుల సూచనలతో మందులు వాడి వారానికి కోలుకున్నాను’…ఇదీ ప్రముఖ హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా చెప్పిన మాటలు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోగం నయం కావడంటో ఆయుర్వేద వైద్యానికి మించిన వైద్యం లేదు.
కానీ చిత్తూరు జిల్లా , టీటీడీ ఉన్నతాధికారులు కలిసి భారతీయ వైద్యమైన ఆయుర్వేదానికి మంగళం పాడుతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తిరుపతిలో టీటీడీ అనుబంధంగా శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల, వైద్యశాల ఉంది. వైద్యశాల విషయానికి వస్తే 200 పడకలున్నాయి. దీర్ఘకాలిక రోగాలకు ఇక్కడ అద్భుతమైన వైద్యం లభిస్తుందనే ఆశ, నమ్మకంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడ, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రోగులు వస్తుంటారు. ప్రతిరోజూ 500 మంది ఔట్ పేషంట్లకు వైద్యం అందిస్తారు.
ఏడుకొండల పాదాల చెంత ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఈ ఆస్పత్రి రోగుల మనసును గెలుచుకుంటూ దినదినాభి వృద్ధి చెందుతోంది. ఇక్కడ ఎంతో అనుభవజ్ఞులైన వైద్యులున్నారు. పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా నయం కాని జబ్బులు ఇక్కడ బాగై సంతోషంగా గడుపుతున్న వారెందరో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయుర్వేదానికి ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో తిరుపతి ఆయుర్వేద వైద్యశాలలో కూడా సౌకర్యాలు మెరుగు పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయుర్వేద వైద్యానికి నైవేద్యం పెట్టేలా చిత్తూరు జిల్లా, టీటీడీ ఉన్న తాధికారుల చర్యలున్నాయని రోగులు, ఆస్పత్రి సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. దీనికి కారణం కరోనాకు ఆయుర్వేద వైద్యం పక్కన పెట్టి…కోవిడ్ నిర్ధారణ పరీక్షల కేంద్రంగా ఈ ఆయుర్వేద వైద్యశాలను ఎంపిక చేయడమే. నిజానికి ఆయుర్వేద వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన నాలెడ్జ్ ఉండదు. ఇది పూర్తిగా అల్లోపతి వైద్యులు, వైద్య సిబ్బందికి సంబంధించిన వ్యవహారం.
ఆయుర్వేద వైద్యులతో వాళ్ల జ్ఞాన సంపదతో కరోనాకు వైద్యం చేయిస్తే ప్రయోజనం ఉంటుందే తప్ప…సంబంధం లేని పని చేయించడం వల్ల అసలుకే ఎసరు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయుర్వేద వైద్యశాలలో రోగులకు ఆయుర్వేద వైద్యం అందించకపోవడం వల్ల వందలాది మంది రోగులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఒక రోగానికి ట్రీట్ మెంట్ ఇవ్వడం అంటే మరో రోగానికి స్వస్తి చెప్పడం కాదు కదా? మరెందుకు ఆ దిశగా ఉన్నతాధికారులు ఆలోచించడం లేదో అర్థం కావడం లేదు. ఉన్న ఆ ఒక్క ఆయుర్వేద వైద్యశాలలో సంబంధిత వైద్యం చేయకపోతే… రోగుల వైద్య దారేది?