cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: వకీల్ సాబ్

మూవీ రివ్యూ: వకీల్ సాబ్

చిత్రం: వకీల్ సాబ్
రేటింగ్: 3/5
బ్యానర్: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూవ్ ప్రాజెక్ట్స్
నటీనటులు: పవన్ కల్యాణ్, శృతి హాసన్,  ప్రకాష్ రాజ్, నివేతా థామస్, అంజలి, అనన్య, మీర్, నరేష్, ముకేష్ రిషి, దేవ్ గిల్, సుబ్బరాజు, వంశీ కృష్ణ, అనసూయ, ఆనంద చక్రపాణి తదితరులు  
కెమెరా: పి. ఎస్. వినోద్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: తమన్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: వేణు శ్రీరాం
విడుదల తేదీ: 9 ఏప్రిల్ 2021

2016 లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో వచ్చిన "పింక్" ఒక వర్గం ప్రేక్షకులని ఆకట్టుకుంది. చాలా సీరియస్ గా కేవలం కోర్ట్ రూం డ్రామాగా సాగే ఆ సినిమాని మాస్ హీరో పవన్ కల్యాణ్ తో చేస్తున్నారన్న 2019 నాటి ప్రకటనే ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే పింక్ లో అమితాబ్ ది వృద్ధ‌ వకీలు పాత్ర. ఎక్కడా సగటు హీరోతనం కనిపించని క్యారెక్టర్ అది. అయితే "వకీల్ సాబ్" యథాతథంగా చేస్తున్న రీమేక్ కాదని, పవన్ కల్యాణ్ మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని తగినన్ని మార్పులు, చేర్పులు చేశారని క్లారిటీ రావడంతో సినీ అభిమానులు, ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

పోస్టర్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ని మెప్పించేదిగా ఉంటే, ట్రైలర్ మాత్రం అటు ఫ్యాన్స్, ఇటు సీరియస్ ఫిల్మ్ లవర్స్ దృష్టిని తిప్పుకునేలా చేసింది. 2021 లో ఇప్పటి వరకూ ఇంత హడావిడితో ఏ సినిమా రాలేదు. ఇది పవన్ కల్యాణ్ కి కమ్ బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయాలనుంచి ఇక సినిమాలకు తిరిగిరానని చెప్పిన తర్వాత వచ్చిన తొలి చిత్రం ఇది. 

అత్యంత భారీ అంచనాలతో, బెనిఫిట్ షోల హంగామాతో విడుదలైన "వకీల్ సాబ్" ఎలా ఉందో చెప్పుకుందాం. 

తెలుగు రాష్ట్రాల్లోని వేరువేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురమ్మాయిలు (నివేత, అంజలి, అనన్య) హైదరాబాదులో వేరు వేరు ఉద్యోగాలు చేసుకుంటూ ఒకే ఇంట్లో అద్దెకుంటుంటారు. ఒక రాత్రి ఈ ముగ్గురూ ఎక్కిన క్యాబ్ నిర్మానుష్యమైన రోడ్ మీద ఆగిపోతుంది. ఆ సమయంలో అటుగా వస్తున్న ఒక కార్ ఆగుతుంది. అందులో నలుగురబ్బాయిలుంటారు. వాళ్లు ఈ ముగ్గురికీ లిఫ్ట్ ఇస్తారు.  కొద్ది సేపటి తర్వాత ఆ నలుగురిలో ఒకతనికి తల పగలి ఆసుపత్రి పాలవడం, ఈ ముగ్గురమ్మాయిలూ పారిపోయి ఇల్లు చేరుకోవడం జరుగుతాయి. ఈ సంఘటన తర్వాత నుంచీ ఆ హై ప్రొఫైల్ అబ్బాయిలు ఈ అమ్మాయిలని వేధిస్తూ ఉంటారు, మానసికంగా శారీరకంగా హింసిస్తుంటారు.

వారిని లీగల్ గా కాపాడేందుకు వచ్చినవాడే వకీల్ సాబ్ అనబడే సత్యదేవ్. భార్య చనిపోవడంతో చాలా ఏళ్ళుగా ఏ కేసూ వాదించకుండా ఉన్న సత్యదేవ్ ఈ అమ్మాయిల కేస్ టేకప్ చేస్తాడు. ఆ తర్వాత ఏమౌతుంది? అసలు సత్యదేవ్ భార్య ఎలా చనిపోతుంది? ఆ అమ్మాయిలకి, అబ్బాయిలకి మధ్యన నిజంగా ఏం జరిగిందనేది మిగతా కథ.

"పింక్" సినిమా నుంచి ప్రధానంగా కోర్ట్ రూం ఎపిసోడ్ ని యథాతథంగా తీసుకుని, పవన్ కల్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా మిగతా కథ రాసుకున్నాడు దర్శకుడు. అయితే అలా రాసుకున్నప్పుడు పవన్ (సత్యదేవ్) ఫ్లాష్ బ్యాక్ మీద పెద్దగా అటెన్షన్ పెట్టినట్టు కనపడలేదు. చాలా పేలవంగా ఉంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో అనవసరపు ఫైట్స్ కూడా రొటీన్ గా అనిపించాయి. టెక్నికల్ గా సంగీతం, పాటలు పర్వాలేదు. కోర్ట్ రూమ్ డైలాగ్స్ దాదాపు హిందీనుంచే తీసుకున్నా నేటివిటీకి తగ్గట్టుగా కాస్త వినోదాన్ని కూడా జోడించడం బాగుంది. కెమెరా, ఎడిటింగ్ వగైరాలు ఓకే. ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది థ‌మ‌న్ సంగీతాన్ని. సినిమా ప్ర‌చారంలోనే పాట‌లు కీల‌క పాత్ర పోషించాయి. థియేట‌ర్లో కూడా అవి అల‌రిస్తాయి. సంద‌ర్భానికి అనుగుణ‌మైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విన‌సొంపైన పాట‌ల‌తో థ‌మ‌న్ ప్ర‌తి పెద్ద సినిమాతోనూ త‌న ఇంపాక్ట్ ను పెంచుకుంటూ ఉన్నాడు. వ‌కీల్ సాబ్ తోనూ అదే జ‌రిగింది.

ఇక పవన్ కల్యాణ్ కి రాసుకున్న తెలంగాణా యాస సంభాషణలు నప్పలేదు. ఫేక్ యాక్సెంట్ లాగ ఉంది. దానికన్నా పవన్ సహజమైన మాండలికంలో డైలాగ్స్ చెప్పుంటే ఇంకా పవర్ఫుల్ గా ఉండేది.

సెకండ్ హాఫ్ లో కోర్ట్ సీన్ కాసేపు సీరియస్ గా నడిచాక జడ్జ్ గారు "కోర్ట్ ఈజ్ అడ్జాండ్" అనగానే టాయిలెట్లో పవన్ కల్యాణ్ ఫైట్...! ఫ్యాన్స్ కి, హిందీ రైట్స్ కి ఇలాంటి అక్కర్లేని ఫైట్స్ ఓకే ఏమో గానీ కథనానికి మాత్రం చాలా అడ్డంగా ఉంది. ఒక లాయర్ అన్నేసి సార్లు ఫైట్స్ చేస్తుంటే చాలా అసహజంగా ఉంటుంది. దానికన్నా ఆ అమ్మాయిల ఫ్యామిలీ మెంబర్స్ మీద కొన్ని ఎమోషనల్ సీన్స్ నడిపించినా బాగుండేది.

ఇలాంటి కొన్ని మైనస్ లు పక్కన పెడితే మిగతా సినిమాతో కంప్లైంట్ పెద్దగా ఉండదు. ముఖ్యంగా నివేతా థామస్ నటన, కోర్ట్ సీన్స్ లో పవన్  కల్యాణ్ ఫెర్మార్మెన్స్ హైలైట్. అంజలి కూడా కోర్ట్ సీన్ ని బాగా పండించింది.  పవన్- ప్రకాష్ రాజ్ ల మధ్యన నువ్వా నేనా అన్నట్టుగా జరిగే ఆర్గ్యుమెంట్స్ చాలా ఆసక్తిగా సాగుతాయి. ముందునుంచీ పవన్ క్యారెక్టర్ ని ఎగ్రెసివ్ గా ఎస్టాబ్లిష్ చేయడంతో అది క్లైమాక్స్ సీన్స్ కి బాగా ఉపయోగపడింది. 

అసలు పక్కన పెట్టి కొసరు గురించి కూడా చెప్పుకోవాలంటే

"మీరు దూరమై జనాలు జీవితాలనే పొగొట్టుకుంటున్నారు" అని అంజలి పవన్ తో అనే లైన్;

"వాళ్లు నాతో ఉన్నా లేకపోయినా నేను వాళ్లతోనే ఉంటాను" అనే పవన్ కల్యాణ్ డయలాగ్;

"ఇప్పుడు జనానికి నువ్వు కావాలి.." అని శరత్ బాబు చివర్లో పవన్ తో అనడం..

ఇవన్నీ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నవే అనిపిస్తుంది.

సమాజానికి కావల్సిన సందేశం, ఫ్యాన్స్ కి కావల్సిన మసాలా కలిసిన ఈ వకీల్ సాబ్ వసూల్ సాబ్ అయ్యే చాన్స్ లేకపోలేదు. 

బాటం లైన్: కేస్ గెలిచినట్టే

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×