సినిమా రివ్యూ: వంగవీటి

రివ్యూ: వంగవీటి రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: రామదూత క్రియేషన్స్‌ తారాగణం: శాండీ, వంశీ చాగంటి, శ్రీతేజ్‌, నైనా గంగూలి, కౌటిల్య, వంశీ నెక్కంటి తదితరులు రచన: చైతన్య ప్రసాద్‌, రాధాకృష్ణ సంగీతం: రవిశంకర్‌ కూర్పు:…

రివ్యూ: వంగవీటి
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌:
రామదూత క్రియేషన్స్‌
తారాగణం: శాండీ, వంశీ చాగంటి, శ్రీతేజ్‌, నైనా గంగూలి, కౌటిల్య, వంశీ నెక్కంటి తదితరులు
రచన: చైతన్య ప్రసాద్‌, రాధాకృష్ణ
సంగీతం: రవిశంకర్‌
కూర్పు: సిద్ధార్థ తాతోలు
ఛాయాగ్రహణం: రాహుల్‌ శ్రీవాస్తవ్‌, దిలీప్‌ వర్మ, సూర్య చౌదరి
నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌
దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ
విడుదల తేదీ: డిసెంబరు 23, 2016

రామ్‌ గోపాల్‌ వర్మ ఇటీవల తీసిన చిత్రాల్లో చాలా వరకు తీవ్రంగా నిరాశ పరిచినప్పటికీ ఆయన 'వంగవీటి' కథని తెరకెక్కిస్తున్నాడంటే చాలా మందికి ఆసక్తి కలిగింది. ఎందుకంటే బెజవాడ రౌడీయిజం, గ్యాంగ్‌ వార్లు, హత్యల గురించి బాగా తెలిసిన వారి కంటే, ఆ నోట, ఈ నోట కథలు, కథలుగా విన్నవారే ఎక్కువ. వర్మ విజయవాడలో చదువుకున్నాడు కనుక, అక్కడి వ్యక్తులు, అప్పటి పరిస్థితులు తెలిసిన వాడు కనుక, అన్నిటికీ మించి ఎవరినీ లెక్క చేయకుండా కాంట్రవర్షియల్‌ పాయింట్స్‌ని హైలైట్‌ చేస్తాడు కనుక 'వంగవీటి'లో చాలా సంచలనాలు ఉంటాయని ఆశించారు. కానీ ఎందుకో వర్మ వివాదాల జోలికి పోలేదు. కనీసం 'వంగవీటి' కథని కూలంకషంగా అయినా చెప్పలేదు. కేవలం మనం పైపైన విని ఉన్న కథనే సినిమాగా తీసి, అతి కీలకమైన నాలుగు హత్యోదంతాలని విపులంగా చిత్రీకరించి 'మ మ' అనిపించేసాడు. 

వంగవీటి కుటుంబం సామాన్యుల స్థాయి నుంచి, బెజవాడని శాసించే శక్తిగా ఎదిగిన వైనాన్ని కానీ, వంగవీటి రంగా ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరు కానీ, అతను చనిపోయినపుడు పెల్లుబికిన ఆగ్రహావేశాలని కానీ ఏదీ చూపించలేదు. మరి ఇంతకీ వర్మ ఇందులో చూపించిందేంటి? చలసాని వెంకటరత్నంని వంగవీటి రాధా ఏ విధంగా చంపి రౌడీగా ఎదిగాడో, తర్వాత ఎలా హత్యకి గురయ్యాడో చూపించడంతో ఒక అంకం ముగుస్తుంది. రాధా తమ్ముడు రంగా తన అన్నయ్య స్థానంలోకి రావడం, సెటిల్‌మెంట్లు చేస్తుండడంతో పాటు అతని ప్రేమ, పెళ్లి ఎపిసోడ్‌తో కథ ముందుకెళుతుంది. రాధాకి చేదోడు వాదోడుగా ఉన్న అన్నదమ్ములు గాంధీ, నెహ్రూ స్టూడెంట్స్‌లో పాపులర్‌ అవడం నచ్చక, చెప్పుడు మాటలు విని వాళ్లతో రంగా గొడవ పడడం, ఆ తర్వాత గాంధీ వేరే యూనియన్‌ పెట్టడం నచ్చక అతడిని చంపించడంతో ఇంటర్వెల్‌ పడుతుంది. 

అటుపై రంగా, నెహ్రూ ఇద్దరూ రాజీ పడి వేర్వేరు పార్టీల్లో చేరి లీడర్స్‌ అవడం, అన్నయ్య అండ చూసుకుని రంగాపై నెహ్రూ తమ్ముడు మురళి కాలు దువ్వితే అతడిని దారి కాచి చంపేయడం, ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల నిరాహారదీక్షకి దిగిన రంగాని అయ్యప్ప వేషధారణలో వచ్చిన దుండగులు హత్య చేయడంతో ముగుస్తుంది. ఈ హత్యలు, వాటి తాలూకు ప్లాన్‌లతోనే పుణ్య కాలం గడిచిపోతుంది. రంగాని చంపిందెవరో ఇప్పటికీ తెలీదని, అది కేవలం కనకదుర్గమ్మకి మాత్రమే తెలుసునని, ఆవిడేమో నోరు విప్పదని చెప్పి రోలింగ్‌ టైటిల్స్‌ వేసేసారు. వంగవీటి అనే టైటిల్‌ పెట్టినపుడు వంగవీటి రంగా జీవితంలో అతి ముఖ్య ఘట్టాలని చూపించకుండా వదిలేస్తారని ఎవరూ అనుకోరు. రంగా రాజకీయ ఎదుగుదలని, పోలీసాఫీసర్‌ వ్యాస్‌తో అతనికి ఏర్పడిన ఇబ్బందులని, ప్రజల దృష్టిలో అతనెందుకు దేవుడయ్యాడో, అతను చనిపోయినప్పుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నలభై రోజుల పాటు బెజవాడలో కర్ఫ్యూ ఎందుకు విధించారో వంటి ఆసక్తికర అంశాల జోలికే వర్మ పోలేదు. 

కీలకమైన ఘట్టాలని వర్మ వాయిస్‌ ఓవర్‌తో సరిపెట్టేసి కేవలం అప్పుడు జరిగిన హత్యలని మాత్రమే డీటెయిల్డ్‌గా చూపించారు. రత్నకుమారి, రంగాల ప్రేమకథ చూస్తే 'సత్య' ట్రాక్‌ రిపీట్‌ చేయడానికి చేసిన ప్రయత్నంలా అనిపిస్తుంది. కానీ ఆ హీరోయిన్‌ సోలో సాంగ్‌, ఆ తర్వాత వచ్చే పెళ్లి పాట చూస్తే రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో అప్పటికీ, ఇప్పటికీ మిస్‌ అయిపోయిన మెరుపులేంటనేది స్పష్టంగా తెలుస్తుంది. బెజవాడ రౌడీయిజం స్ఫూర్తిగా వర్మ తీసిన శివ, గాయం లాంటి చిత్రాలు టైమ్‌లెస్‌ క్లాసిక్స్‌గా నిలిచిపోతే, రియల్‌ క్యారెక్టర్లతో తెరకెక్కించిన ఈ చిత్రంలో కనీసం వాటిలో ఒకటో వంతు ఇంపాక్ట్‌ కూడా లేకుండా పోయింది. సత్య చిత్రంలో ఉండే ఇంటెన్సిటీలో కాస్తయినా ఇందులో కనిపించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 

వర్మ సినిమాలంటే క్వాలిటీకి అద్దం పట్టేవి. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఉండేవి. అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు, పేరున్న తారాగణంతో తనదైన శైలిలో సినిమాలు తీసి భారతీయ సినిమాపై చెరిగిపోని ముద్ర వేసిన వర్మ ఇప్పుడు సాంకేతిక విలువలకి అంతగా విలువ ఇవ్వకపోవడం విడ్డూరమనిపిస్తుంది. శివ, సత్య, గాయం, కంపెనీ లాంటి చిత్రాలు గ్యాంగ్‌స్టర్‌ చిత్రాలకి ఒక దిక్సూచిలా నిలిచిపోయాయి. 'నేను మారిపోయాను. క్వాలిటీ సినిమాలే తీస్తాను' అంటూ వర్మ చెప్తుండొచ్చు, దానికోసం నిజంగానే తపిస్తుండవచ్చు, కానీ ఆయన సినిమాల్లో మునుపు కనిపించిన గొప్ప లక్షణాలు, వాటిని చరిత్రలో నిలిపిన ఉత్తమ సాంకేతిక విలువలు మాత్రం ఇప్పుడు కానరావడం లేదు. 

'రాధాని గుర్తు పట్టడం ఎలా?' అని అడిగితే, 'నమస్కారం చెప్తే ఎవరైతే తిరిగి నమస్కారం చెప్తాడో అతనే రాధా' సీన్‌ని తీసిన విధానంలో మునుపటి వర్మ అలా తళుక్కున మెరుస్తాడు. కొన్ని హత్య సీన్లని సహజంగా చూపించిన తీరులో అప్పటి వర్మ ఛాయలు అలా లీలగా తెలుస్తుంటాయి. నిజంగా వర్మ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నప్పుడు ఈ చిత్రాన్ని తలపెట్టి ఉంటే ఎలా ఉండేదన్న అనే ఊహే థ్రిల్లిస్తుంది. థర్డ్‌ పర్సన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఈ చిత్రాన్ని తీస్తాడని ఆశిస్తే, వర్మ తీసిన కథ నెహ్రూ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చెప్పినట్టు అనిపిస్తుంది (అదేంటో తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో నంబర్‌వన్‌ టీవీ ఛానల్‌తో నెహ్రూ ఇంటర్వ్యూ లింక్‌ చూడండి). 

ఈ కథలోని పాత్రలన్నిటిలో మురళి క్యారెక్టర్‌ ఒక్కటే ఎమోషనల్‌ డెప్త్‌ ఉన్న క్యారెక్టర్‌లా అనిపిస్తుంది. పర్‌ఫెక్ట్‌ క్యారెక్టర్‌ స్కెచ్‌ ఉండడం వల్లే, అతని ఎమోషన్లు ఫీలవడం వల్లే ఆ క్యారెక్టర్‌ని చంపినపుడు ఫీల్‌ వస్తుంది. మిగతా క్యారెక్టర్స్‌ని అలా తీర్చిదిద్దడంలో వర్మ సక్సెస్‌ కాలేకపోయాడు. కాస్టింగ్‌ పరంగా వర్మ ఇప్పటికీ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. రంగా, మురళి, నెహ్రూ పాత్రలకి వారి పోలికలు కనిపించే నటులని ఎంచుకోవడం చెప్పుకోతగ్గ అంశం. అయితే రక్త చరిత్ర మాదిరిగా పేరున్న నటులని తీసుకుంటే ఆయా పాత్రలు మరింతగా హైలైట్‌ అయి ఉండేవి. 

అన్నేళ్ల పాటు జరిగిన దానిని రెండున్నర గంటల సినిమాలో చెప్పడం కష్టమే కావచ్చు కానీ ఏది ఇంపార్టెంట్‌, ఏది కాదు, దేనికి ప్రాధాన్యతనివ్వాలి అనే దానిపై జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. చరిత్ర పొరల్లోకి వెళ్లి సగటు జనానికి తెలియని విశేషాలని తెలియజెప్పే ప్రయత్నం చేసుండాల్సింది. వంగవీటిపై అమితాసక్తితో వెళ్లిన వారికి వర్మ చూపించిన దాంతో సంతృప్తి దక్కడం చాలా కష్టం. ఆనాటి విజయవాడ ఎలా ఉండేది, అప్పటి పరిస్థితులు, రాజకీయాలు, రౌడీయిజాలు వగైరా గురించి 'వంగవీటి' కాస్త అవగాహనని అయితే ఇవ్వగలిగింది కానీ స్ట్రాంగ్‌ సోర్స్‌ మెటీరియల్‌ని పూర్తిగా వాడుకుని చిరస్థాయిగా గుర్తుండిపోయే ఒక బయోపిక్‌ని అందించే ఒక గొప్ప అవకాశాన్ని వృధా చేసుకున్నట్టయింది. 

బాటమ్‌ లైన్‌: బెజవాడ రౌడీలు!

– గణేష్‌ రావూరి