చిత్రం: వినరో భాగ్యము విష్ణు కథ
రేటింగ్: 2.5/5
తారాగణం: కిరణ్ అబ్బవరం, కాశ్మీర, మురళి శర్మ, పమ్మి సాయి, రాం, రవిప్రకాశ్, ప్రవీణ్ తదితరులు
సంగీతం: చైతన్ భరద్వజ్
కెమెరా: డేనియల్ విశ్వాస్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్
నిర్మాత: బన్నీ వాస్
రచన- దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు
విడుదల: ఫిబ్రవరి 18, 2023
కిరణ్ అబ్బవరం అంటే యువప్రేక్షకులకి గుర్తొచ్చే సినిమా “ఎస్ఆర్ కల్యాణమండపం” అదొచ్చి రెండేళ్లయ్యింది. తర్వాత మరొక మూడు సినిమాలతో ముందుకొచ్చినా అతని కెరీర్ మరో మెట్టు ఎక్కిందనైతే చెప్పలేం. అయితే ఈ “వినరో భాగ్యము విష్ణుకథ” ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అంచనాలు పెరిగాయి. కిరణ్ కి ఇది మంచి హిట్ అవుతుందనే భావనలు కలిగాయి. పైగా గీతా ఆర్ట్స్ స్తాంప్ కూడా పడడంతో ఈ సారి ఢోకా లేదనిపించింది.
విషయంలోకి వెళ్తే విష్ణు (కిరణ్) తిరుపతి వాసి. ఎవరికి ఏ అవసరం వచ్చినా సాయం చేయడం అతని హాబీ మాత్రమే కాదు, దినచర్య. దర్శన (కాశ్మీర) ఒక యూట్యూబర్. తన ఫోన్ నెంబర్ కి అటు ఇటు ఉన్న నెంబర్స్ కి ఫోన్ చేసి “ఏ డే విత్ నైబర్ నెంబర్” అనే వీడియో చేసి అప్లోడ్ చేయ్యాలన్నది ఆమె ఆలోచన. ఆ క్రమంలో ఆమెకు అటు నంబర్ విష్ణు అయితే ఇటు నెంబర్ శర్మ (మురళి శర్మ).
వీళ్ల ముగ్గురి మధ్యన జరిగే కథే ప్రధాన సినిమా. అయితే ఇక్కడ శర్మకి, విష్ణుకి బ్యాక్ స్టొరీలుంటాయి. ఆ రెండూ సబ్ ప్లాట్స్. ఈ కథంతా వినేందుకు కొన్ని పాత్రలుంటాయి. వాళ్లది వేరే ప్లాట్. ఇలా నానా ప్లాట్లతో పాట్లు పడి కాస్తంత గందరగోళం స్క్రీన్ ప్లేతో తీసిన వినోదకథాచిత్రం ఈ “వినరో భాగ్యము”.
అనుకున్న కథ బాగానే ఉన్నా పేపర్ మీదనుంచి తెర మీదకు తీసుకువెళ్లడంలో పొరపాట్లు జరిగి కంగాళీ అయ్యింది. ఎక్కడా గూజ్బంప్స్ వచ్చే సీన్ కానీ, కథలోకి పూర్తిగా లాక్కుపోయే కథనం కానీ ఉండవు. హీరో బిల్డప్పులు అవసరానికి మించి ఉన్నాయి. ఒక చోటైతే పొలంలో ఫైట్ సీన్ చూస్తే “అతడు” సినిమాలో మహేశ్ బాబు రేంజులో ఊహించుకుని చేసాడేమో కిరణ్ అబ్బవరం అనిపిస్తుంది. ఊహించుకోవడం, చేయడం తప్పుకాదు. కానీ ఎంచుకున్న కథకి, అందులోని పాత్రకి అంత బిల్డప్ అవసరమా అనేది చూసుకోవాలి. రైటర్ గా పరిణితి ఉన్నట్టు కనపడే కిరణ్ కూడా ఇలా స్టార్డం మాయలో పడిపోతే మళ్లీ లెవడం కష్టమవ్వచ్చు.
మూస పద్ధతిలో కాకుండా ఉన్నంతలో వెరైటీ సినిమాలు చేస్తాడని రచయిత మరియు నటుడిగా తనకంటూ ఒక గుర్తింపుని పొందాడు కిరణ్ అబ్బవరం. అయితే క్రమంగా తాను కూడా మాస్ మూసలో పడి పెద్ద కమెర్షియల్ స్టార్ అనిపించుకోవాలనే కంగారులో గాడి తప్పి గారడీ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. తన బాడీ లాంగ్వేజ్ కి హై వోల్టేజ్ ఫైట్స్, మాస్ పంచ్ డైలాగ్స్ సెట్ కావు. పక్కింటి అబ్బాయి తరహా సినిమాలు మంచి కామెడీ టైమింగ్ తో తీసుకుంటూ వస్తే బాక్సాఫీస్ వద్ద అతనికి ప్రమాదాలు తప్పుతాయి.
కాశ్మీరా తనవరకు తన పాత్రకి న్యాయం చేసింది. మురళి శర్మ యూట్యూబ్ వీడియో డాన్సులు అవీ బాగున్నాయి. కానీ క్రమంగా అతని పాత్రలో కనిపించే షేడ్స్ బలవంతంగా అనిపిస్తాయి తప్ప కన్విన్సింగ్ గా అనిపించవు.
పమ్మి సాయి చేత అతి చేయించారో అతడే చేసాడో తెలియదు కానీ “అతడు” సినిమాలో సుపారి ఇచ్చే కోట శ్రీనివాసరావు తరహా పాత్రలో ప్రతిభ చూపించాలనుకున్నాడు.
రాజన్ అనే పాత్రకి గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చారు కానీ చచ్చే దాకా చచ్చినట్టు కథ వినే పాత్ర మాత్రమే తనది.
సాంకేతికంగా చూస్తే చైతన్ భరద్వాజ్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. అయితే “ఆరెక్స్ 100” స్థాయిలో కట్టిపారేసే సంగీతాన్నైతే ఇవ్వలేకపోతున్నాడు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగులో మాత్రం చాలా లోపాలున్నాయి. కొన్ని సన్నివేశాల్లో డైలాగ్ లిప్ సింక్ కూడా సరిగ్గా లేదు. అది డబ్బింగ్ లోపమైనా, ఒక సీనియర్ ఎడిటర్ చేతిలో పడినప్పుడు అటువంటి షాట్స్ పడకుండా జాగ్రత్తపడడం మినిమం బాధ్యత. ఇక డైలాగ్స్ కూడా సాదాసీదాగా అనిపిస్తాయి.
ఓపెనింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగున్నాయి. సెకండాఫులో క్లైమాక్స్ కి దారి తీసే క్రైసిస్ పాయింట్స్ బలంగా లేవు. తన కథ ఒక కాన్సెప్ట్ తో మొదలై, లవ్-కామెడీ గా నడిచి, అటు నుంచి క్రైం డ్రామాగా మారి సస్పెన్స్ తో ముగుస్తుందని కిరణ్ అబ్బవరం ఒక పాత్రకి చెప్తాడు. ఈ సినిమా సరిగ్గా అదే. ఇలా నానారకాల జానర్స్ ఉండడం వల్ల ఒక టికెట్ కి నాలుగైదు చిన్న సినిమాలు చూసిన ఫీలింగొస్తుంది. దీనికి తోడు సీక్వెల్ కి కూడా గ్రౌండ్ సెట్ చేసుకుని ఎండ్ సీన్ పెట్టారు.
అక్కడక్కడ పర్వాలేదనిపిస్తూ, అప్పుడప్పుడు నిట్టూర్పులు తెప్పిస్తూ..ఇంటర్వెల్ కోసం, క్లైమాక్స్ కోసం వేచి చూసేలా చేస్తూ మొత్తమ్మీద అనుకున్న భాగ్యం కలిగించని విష్ణుకథ ఇది.
బాటం లైన్: అంత భాగ్యం లేదు