cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: వైల్డ్ డాగ్

మూవీ రివ్యూ: వైల్డ్ డాగ్

చిత్రం: వైల్డ్ డాగ్
రేటింగ్: 2.75/5
నటీనటులు: నాగార్జున, దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, ఆలి రేజా, మయాంక్, ప్రకాష్, సుదర్శన్, ప్రదీప్, బిలాల్, అనీష్ కురువిల్ల తదితరులు
మాటలు: కిరణ్ కుమార్
సంగీతం: తమన్
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
కెమెరా: షనీల్ దేవ్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
దర్శకత్వం: అహిషోర్ సోలొమన్ 
విడుదల తేదీ: 2 ఏప్రిల్ 2021

నాగార్జున అనగానే హీరోయిన్స్ లేకుండా సినిమాని ఊహించలేం. ఆయనకున్న ఇమేజ్ అలాంటిది. కమర్షియల్ సినిమా అన్నాక పాటలు, కామెడీ, డ్యూయెట్స్ తప్పనిసరి అని ఒక అభిప్రాయం. తెలుగు సినిమాకున్న ఇమేజ్ అలాంటిది. కానీ ఈ రెండింటినీ పక్కన పెట్టి సూటిగా కథ చెప్పేస్తే ఎలా ఉంటుంది? ఆ దిశగా చేసిన ప్రయోగమే "వైల్డ్ డాగ్". 

ఇది ఒక జరిగిన కథకి సినిమా రూపకల్పన. గోకుల్ చాట్, లుంబినీపార్క్, దిల్ సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్టుల గురించి తెలియని తెలుగువాళ్లు దాదాపు ఉండరు. ఆ బ్లాస్టుల సూత్రధారి అయిన ఖాలిద్ అనే టెర్రరిస్టుని పట్టుకుని లోపలేయడమే ఈ ఆపరేషన్ వైల్డ్ డాగ్. 

పూనేలోని ఒక బేకరీలో జరిగిన బాంబు పేలుడుతో సినిమా మొదలవుతుంది. విజయ్ వర్మ అనే పవర్ఫుల్ మాజీ ఎన్.ఐ.ఏ ఆఫీసర్ ని మళ్లీ సర్వీసులోకి పిలిచి ఆ కేస్ డీల్ చేయవల్సిందిగా ఆదేశిస్తుంది ప్రభుత్వం. గతంలో ఈ విజయ్ వర్మ కూతురు గోకుల్ చాట్ పేలుడులో మరణిస్తుంది. ఆ పేలుడుకి, ఈ పూనే బేకరీ పేలుడుకి సూత్రధారి ఒక్కడే. వాడి పేరు ఖాలిద్ అలియాస్ యాసిన్ బత్కల్. ఆ టెర్రరిస్టుని ఎలా పట్టారు? ఎక్కడ పట్టుకున్నారు? పట్టుకున్నాక ఏం చేసారు? ఈ ప్రశ్నలకి సమాధానాలే ఈ సినిమా. 

దొరక్కుండా ఉండేందుకు ఖాలిద్ పన్నే పన్నాగలు, అతనిని ట్రాప్ చేసేందుకు విజయ్ వర్మ వేసే పథకాలు ఒక చదరంగం ఆట చూస్తున్నట్టుగా ఉంటుంది. నేరస్థుడు పోలీసుకంటే ఎక్కువ ఆలోచిస్తాడు..అలాగే పోలీసు కూడా నేరస్థుడి ఐక్యూని దాటి ఆలోచించాలి..అప్పుడే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఒక్క ఈ "వైల్డ్ డాగ్" ఆపరేషన్ అనే కాదు, ప్రపంచంలో ఏ క్లాసిఫైడ్ ఆపరేషన్ అయినా జరిగేది ఇదే. 

ప్రపంచ ప్రఖ్యాత తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ ని చంపడానికి రచించిన "ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్" నేపథ్యంలో "జీరో డార్క్ థర్టీ" అనే సినిమా ఒకటొచ్చింది. ఆధ్యంతం గోళ్లు కొరుక్కునేలా చేసే ఉత్కంఠభరితమైన సినిమా అది. నిజంగా జరిగిన దానిని తెర మీదకు తీసుకొచ్చేటప్పుడు పడాల్సిన తపన చాలా ఉంటుంది. ఏ ఎపిసోడ్ ఎంత నిడివిలో చెప్పాలి, ఏ సన్నివేశానికి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వాడితే టెన్షన్ పెరుగుతుందనే తూకం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ సినిమాలో అవన్నీ సమపాళ్లలో ఉన్నాయి కనుకనే అదంత థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. 

ఈ "వైల్డ్ డాగ్" ఆ విషయంలో కాస్త వెనకబడింది. ఉదాహరణికి ఖాలిద్ పాత్ర ముఖం చూపించకుండా చాలా సేపు ఇచ్చిన బిల్డప్ బాగుంది. కానీ అతని ఫేస్ రివీల్ అయిన తర్వాత బిల్డప్ డైల్యూట్ అయిపోయింది. "జీరో డార్క్ థర్టీ" లో అసలు సినిమాలో ఎక్కడా ఒసామా పాత్ర కనపడదు..చివర్లో శవంగా తప్ప...అది కూడా స్పష్టంగా కాదు. ఒక తీవ్రవాది కనిపించనప్పుడు ఉన్నంత భయం కనిపించాక ఉండదు. ఈ పాయింట్ ని దృష్టిలో పెట్టుకుని మొదలు పెట్టిన బిల్డప్ ని చివరి దాకా నడిపేలా స్క్రీన్ ప్లే రాసుకునుంటే సినిమా వేరే లెవెల్లో ఉండేదేమో. 

ఏది ఏమైనా "వైల్డ్ డాగ్" ని మరీ తక్కువ చేయలేం. ఉన్నంతలో విసిగించకుండా తీసినందుకైనా మెచ్చుకోవాలి. ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్న విషయం ఇది. తొలి 40 నిమిషాలు కూడా పెద్దగా హుక్ చేసే అంశాలు లేవు. తర్వాత నెమ్మదిగా ఒకానొక మలుపు దగ్గర కథనంలో గ్రిప్ వచ్చింది. అది చివరిదాకా కొనసాగింది. టెక్నికల్గా చూస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంది. కానీ కీలక సన్నివేశాల్లో ఇంకాస్త మూడ్ ని ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా వాడుకోలేదేమో అనిపించింది. 

యాక్షన్ కోరియోగ్రఫీ మాత్రం రోటీన్ గా ఉంది. ఇలాంటి సినిమాకి అదే ఆయువుపట్టు. సర్ప్రైజ్ ఏటాక్స్, షార్ప్ రెఫ్లెక్సెస్ కొత్తరకంగా కంపోజ్ చేసుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో అడివిలో తీసిన ఫైట్ సీన్ మరీ కృతకంగా అనిపించింది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్ చెప్పుకోదగ్గవిగా ఉన్నాయి.  

ఇక నటీనటవర్గానికొస్తే నాగార్జున ఫిట్ గా కనిపించారు. యాక్షన్ ఫీట్ చేసారు. రొటీన్ పాత్రల నుంచి బ్రేక్ తీసుకుని ఇది తనని తాను రీడిఫైన్ చేసుకోవడానికన్నట్టుగా ఉంది. పంచ్ డయలాగ్స్, లౌడ్ చాలెంజులు లేకుండా డరెక్ట్ గా యాక్షన్ లోకి దిగిపోయే పాత్రకి నాగార్జున న్యాయం చేసారు. 

బిగ్ బాస్ ఫేం ఆలి రేజాకి మంచి పాత్ర దొరికింది. మిగిలిన ముగ్గురు కాప్స్ కూడా అవసరానికి సరిపోయారు. ఖాలిద్ పాత్రధారి కూడా సరైన చాయిస్. రా ఏజెంట్ గా సయామీ ఖేర్ బాగుంది. ఆమెతో మన హీరోగారి రొమాంటిక్ ట్రాక్ చూడాల్సొస్తుందేమోనన్న అనుమానం నిజం కానందుకు డైరెక్టర్ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అది కనుక జరిగుంటే సీరియస్ స్క్రీన్ ప్లేని కెలికేసినట్టయ్యేది.

సినిమా బిగినింగ్ లో కాసేపు అతిధి పాత్రలో దియా మిర్జా కనిపించింది. అతుల్ కులకర్ణి కూడా సీనియర్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. ఆ ఏంబియన్స్ లో హిందీ సినిమా చూస్తున్న ఫీలింగుస్తుంది. ఎక్కడా నస లేకుండా ముక్కుసూటిగా కథ చెప్పి రెండు గంటల్లో ముగించిన తీరు బాగుంది. రొటీన్ కి భిన్నంగా ఒక సిన్సియర్ అటెంప్ట్ ని చూడాలనుకుంటే ఆ అభిరుచి ఉన్న ప్రేక్షకులకి ఈ "వైల్డ్ డాగ్" ఒక చాయిస్. 

"మొరిగే కుక్క కరవదు- కరిచే కుక్క మొరగదు" అంటారు. ఒకరకంగా చూస్తే ఈ "వైల్డ్ డాగ్" రెండో రకం. అరుపులు, కేకలు లేకుండా అన్నీ డైరెక్ట్ ఏటాక్సే. 

బాటం లైన్: మొరగడాల్లేవు- కరవడాలే.

కమల్ తో కలిసి నటించాలని వుంది

సాయం చేయడం నా తల్లి నుంచే నేర్చుకున్నా

 


×