రివ్యూ: యాత్ర
రేటింగ్: 3/5
బ్యానర్: 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్
తారాగణం: మమ్ముట్టి, జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, సచిన్ ఖేడేకర్, పోసాని కృష్ణమురళి, తోటపల్లి మధు, కళ్యాణి, ఆశ్రిత తదితరులు
సంగీతం: కె
కూర్పు: ఏ. శ్రీకర్ ప్రసాద్
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
రచన, దర్శకత్వం: మహి వి. రాఘవ్
విడుదల తేదీ: ఫిబ్రవరి 08, 2019
వైఎస్‌ఆర్ బయోపిక్‌గా ప్రచారం పొందిన 'యాత్ర' నిజానికి పూర్తి బయోపిక్ కాదు. వైఎస్‌ఆర్ జీవితంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని మాత్రమే చూపిస్తుందీ చిత్రం. అలాగని ఆ ఘట్టాన్ని యథాతథంగా వాస్తవాలకి దగ్గరగా చూపించడం కాకుండా… వాస్తవ పాత్రలు, సంఘటనలకి సినిమాటిక్ డ్రామా జోడించి… వైఎస్‌ఆర్ అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. ఒక విధంగా ఇది వైఎస్‌ఆర్ బయోపిక్ అనడం కంటే… దర్శకుడు మహి వి. రాఘవ్ ఆయనకి ఇచ్చిన 'ట్రిబ్యూట్' (నివాళి) అనడం సబబేమో.
అధికార తెలుగుదేశం పార్టీ (సినిమాలో మనదేశం అన్నారు) మళ్లీ పవర్‌లోకి రావడం ఖాయమనిపించినపుడు, 'ఇప్పుడు కాకపోతే ఇక మళ్లీ గెలవలేం. రాజకీయాలు వదిలేయడం తప్ప' అని వైఎస్ రాజశేఖరరెడ్డి బలంగా భావించినపుడు… ముందస్తు ఎన్నికలకి ఏమాత్రం సిద్ధంగా లేని తన పార్టీని గెలిపించుకోవడానికి వైఎస్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం… 'పాదయాత్ర'. ఆ పాదయాత్ర చేపట్టడానికి ఆయనని ప్రేరేపించిన సంఘటనలు, ఆ పాదయాత్ర కారణంగా ప్రజల కష్టాలని స్వయంగా తెలుసుకున్న ఉదంతాల సమాహారమే 'యాత్ర'.
'గెలవడం అసాధ్యం' అనే లెవల్ నుంచి ఆయన ఎలా గెలిచారు అనేది యాత్ర ఫోకస్ చేస్తుంది. ఆయన ప్రకటించిన ప్రతి ప్రజా సంక్షేమ పథకం వెనుక ఎలాంటి కారణాలు ఆయనని ప్రేరేపించి వుంటాయనేది దర్శకుడు మహి వి. రాఘవ్ తన ఆలోచనలతో డ్రామా నింపి వాటిని కథనంలో భాగం చేసాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం నిజానికి మంచి 'బయోపిక్' మెటీరియల్‌గా పనికొస్తుంది. కానీ అదంతా వదిలేసి ఒక 'పాసివ్' ఎపిసోడ్ అయిన 'పాదయాత్ర'ని హైలైట్ చేసి, దాని మీదే పూర్తి సినిమా తీయడం ఆషామాషీ వ్యవహారం కానే కాదు. పాదయాత్ర పేరు చెప్పి దర్శకుడు మహి వి. రాఘవ్ 'రోప్ వాక్' చేసాడనే చెప్పాలి. ఏమాత్రం పట్టు తప్పినా అటు పొలిటికల్ ప్రాపగాండా సినిమాగానో, లేదా ఇటు ఒక నీరసమైన డాక్యుమెంటరీగానో మిగిలిపోయే ప్రమాదం వున్న కాన్సెప్ట్ ఇది.
ఎమోషన్స్ ఎంత పండితే, వాటితో ప్రేక్షకులు ఎంత కనక్ట్ కాగలిగితే సదరు దృశ్యాలు అంత పండుతాయి అనిపించే సన్నివేశాలు సుదీర్ఘంగా వున్నాయి. మమ్ముట్టి అద్భుతమైన అభినయానికి తోడు, ఆయా సన్నివేశాల్లో కనిపించిన సహజత్వం వాటిని చాలా ఎఫెక్టివ్‌గా తెరమీదకి తీసుకొచ్చింది. వృద్ధాప్య పించన్లు అందని వృద్ధులు తమ గోడు వెళ్లబోసుకునే సన్నివేశంలో 'ఊళ్లో పది మందికే నెలకి డెబ్బయ్ అయిదు రూపాయల పించను వస్తోంది. ఆ పది మందిలో ఒకరు పోతే మనకి ఆ డబ్బులొస్తాయని మరొకరి చావుకోసం ఎదురు చూడాల్సి వస్తోంది' లాంటి కదిలించే సంభాషణలు ఇన్‌స్టంట్‌గా టచ్ చేస్తాయి.
ఒక సన్నివేశంలోని ఎమోషన్‌తో ప్రొటాగనిస్ట్ ఎలాంటి ఉద్వేగానికి లోనవుతాడో అదే భావ తరంగం ప్రేక్షకులని కూడా తాకేట్టు చేయాలి. ఆ విషయంలో దర్శకుడు మహి సక్సెస్ అయ్యాడు. మరో సన్నివేశంలో మాట్లాడలేకపోతున్న 'రైతు' గోడు వింటోన్న రాజశేఖరరెడ్డితో 'అతను మాట్లాడలేడు' అని డాక్టర్ చెబుతోంటే… 'నాకు వినబడుతోందయ్యా' అనడం.. 'నేను విన్నాను, నేనున్నాను' అంటూ రైతులకి భరోసా ఇవ్వడం లాంటి సన్నివేశాల్లో డ్రామా చక్కగా పండింది. ఎమోషనల్ సన్నివేశాల్లో తక్కువ మాటలతో ఎక్కువ అర్థాన్ని, భావోద్వేగాన్ని పలికించిన తీరు మెప్పిస్తుంది. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకం వెనుక ఒక కథని మహి చెప్పాడు. కొన్ని సందర్భాల్లో మెలోడ్రామా మితి మీరినా కానీ రాజశేఖరరెడ్డి మనోభావాలకి దృశ్య రూపం ఇవ్వడంలో దర్శకుడు సఫలమయ్యాడు.
అయితే ఈ చిత్రాన్ని టోటల్‌గా వన్‌సైడెడ్‌గా తీసేయడం, రాజశేఖరరెడ్డిలోని నెగెటివ్స్‌ని అన్యాపదంగా మాత్రమే ప్రస్తావించడం, ఆయన గతం జోలికి గానీ, తనపై వున్న ఆరోపణల వైపు కానీ వెళ్లకపోవడం అందర్నీ మెప్పించలేకపోవచ్చు. ముఖ్యంగా హైకమాండ్‌ని కమాండ్ చేసే నాయకుడన్నట్టు చూపించడం, ఆయన ఏనాడూ పార్టీ అధిష్టానాన్ని లెక్క చేయలేదన్నట్టుగా చిత్రీకరించడం సినిమాటిక్‌గా వైఎస్‌ని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడినా కానీ వాస్తవాతీతంగా అనిపిస్తుంది. అయితే సదరు సన్నివేశాల్లో వైఎస్ డైనమిజమ్ అభిమానుల్ని ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ పర్టిక్యులర్ సీన్స్ ఇప్పుడు వైసిపి పార్టీకి అనుకూలత కోసం చేసినట్టుగా, కాంగ్రెస్‌ని కావాలని బ్యాడ్‌లైట్‌లో చూపించారనే విమర్శలకి తావిచ్చే అవకాశముంది. తెలుగుదేశం పార్టీపై సెటైర్లు కూడా బాగానే పేలాయి.
యాత్రకి సంబంధించి దర్శకుడు మహి వి. రాఘవ్ ఫస్ట్ సక్సెస్ ఏమిటంటే… వైఎస్ పాత్రకి మమ్ముట్టిని ఎంచుకోవడం. వైఎస్‌ఆర్‌లా 'నటించాలని' కాకుండా, ఆ పాత్ర తాలూకు భావోద్వేగాలని మాత్రమే పలికించిన విధానం, ఆ పాత్రకి ఆయన తీసుకొచ్చిన హుందాతనం వేరొకరి వల్ల కాదనిపిస్తుంది. చివర్లో వైఎస్‌ఆర్ నిజ రూపం కనిపించే వరకు మమ్ముట్టినే మనకి తెలిసిన వైఎస్ అని భ్రమ పడేంత అద్భుతంగా ఈ పాత్రని పోషించారు. తెలుగు సరిగా పలకలేని ఆయన బలహీనత కూడా ఎక్కడా ఈ పాత్రని రక్తి కట్టించడంలో అవరోధం కాలేదు. సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ తమ వంతు బాధ్యతలు నిర్వర్తించారు. తెరపై మాత్రం ఇది పూర్తిగా మమ్ముట్టి షో అంటే అతిశయోక్తి కాదు.
సాంకేతికంగా ఇంకా ఉన్నతంగా తెరకెక్కించి వుంటే బాగుండేదనిపిస్తుంది. మేకింగ్ క్వాలిటీ గొప్పగా లేదు. తెరవెనుక సాంకేతిక వర్గం పనితీరులో సంభాషణలు, సాహిత్యం మినహా ముద్రించిపోయే గొప్పతనం మరెందులోను గోచరించదు. నేపథ్య సంగీతం పరంగా అయినా శ్రద్ధ వహించాల్సింది. పలు సన్నివేశాల ఇంపాక్ట్‌ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తగ్గించేసింది. మరీ సినిమాటిక్‌గా వుందని, ద్వితియార్థంలో వన్ సైడెడ్ పొలిటికల్ అజెండా అయిపోయిందనే ఫీల్ కలిగించే సన్నివేశాలని మినహాయిస్తే… ఎమోషనల్‌గా వైఎస్‌ఆర్ అంతరంగంతో కనక్ట్ అయి, ఆయన యాత్రలో భాగమయ్యేట్టు చేయడంలో ఈ చిత్రం సక్సెస్ అయింది.
రాజకీయ పరంగా విబేధించే వాళ్లని మినహాయిస్తే సినిమా పరంగా భావోద్వేగాలు, డ్రామా పండించే విషయంలో యాత్ర విజయవంతమయింది. యాత్రలో అక్కడక్కడా ఒడిదుడుకులు వున్నా ఒక పొలిటీషియన్ ఓ మాస్ లీడర్‌గా ఎదిగిన జర్నీని డాక్యుమెంట్ చేసిన విధానం ఓవరాల్‌గా మెప్పిస్తుంది.
బాటమ్ లైన్: కదిలించే 'యాత్ర'!
– గణేష్ రావూరి