హీరో విక్రమ్, దర్శకుడు బాల.. ఈ కాంబినేషన్ ను విడదీసి చూడలేం. విక్రమ్ కు శేషు, శివపుత్రుడు లాంటి బ్రహ్మాండమైన సినిమాలు అందించాడు బాల. ఈ దర్శకుడంటే విక్రమ్ కు ఎక్కడలేని గురి. అందుకే తన కొడుకు అరంగేట్రానికి కూడా బాలనే దర్శకుడిగా ఎంచుకున్నాడు. చేసేది రీమేక్ సబ్జెక్ట్ అయినప్పటికీ బాల చేతిలో కొడుకును పెట్టాడు.
విక్రమ్-బాల మధ్య పైకి ఇలా ఎన్ని కనిపిస్తున్నప్పటికీ, వాళ్లిద్దరికీ పడదంటూ ఎప్పటికప్పుడు కోలీవుడ్ సర్కిల్ లో కథనాలు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా గడిచిన ఈ నాలుగేళ్లలో వీళ్లిద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయని కూడా అంటారు. ఇప్పుడు వాటికి బలమైన సాక్ష్యంగా నిలిచింది వర్మ సినిమా.
అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా బాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పూర్తిగా ఆపేశారు. లెక్కప్రకారం ఈ నెలలో ఈ సినిమా విడుదల కావాలి. కానీ సినిమా క్వాలిటీ, మేకింగ్ అస్సలు బాగాలేదని స్వయంగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. దర్శకుడితో పాటు యూనిట్ మొత్తాన్ని మార్చేస్తామని ప్రకటించింది. దీని వెనక హీరో విక్రమ్ ఉన్నాడనేది అందరికీ తెలిసిన విషయం.
కొడుకు డెబ్యూపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన విక్రమ్, వర్మ సినిమాను చూశాడు. బాల టేకింగ్ విక్రమ్ కు అస్సలు నచ్చలేదు. మేకింగ్ టైమ్ లోనే విక్రమ్ చెప్పిన ఎన్నో సూచనలు, సలహాల్ని బాల పట్టించుకోలేదు. దీంతో ఫైనల్ అవుట్-పుట్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాడు విక్రమ్. ఫలితంగా ఏకంగా ఈ ప్రాజెక్టు నుంచి బాల తప్పుకున్నాడు. మొత్తం సినిమాను మళ్లీ రీషూట్ చేయబోతున్నారు.
ఉత్తమ దర్శకుడిగా లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నాడు బాల. ఆర్యను హీరోగా పెట్టి తీసిన నేను దేవుడ్ని అనే సినిమాతో ఏకంగా జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. అలాంటి దర్శకుడ్ని విక్రమ్ పక్కనపెట్టాడు. తను తీసిన అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ పై పూర్తి అసంతృప్తిని వ్యక్తంచేశాడు. రీషూట్ కోసం బాల స్థానంలోకి ఎవరొస్తారో చూడాలి.