రజనీకాంత్ చిన్నకూతురు సౌందర్య మరో 3 రోజుల్లో రెండో పెళ్లి చేసుకోబోతోంది. ఈ మేరకు చెన్నైలోని రజనీకాంత్ స్వగృహంలో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. మరోవైపు రజనీకాంత్ కొంతమంది ప్రముఖులకు స్వయంగా తనే వెళ్లి శుభలేఖలు అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా, కాబోయే భర్తతో సౌందర్య దిగిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సౌందర్య, విశాగన్ వసంగమూడి కలిసి దిగిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టిట్లో చక్కర్లు కొడుతోంది. ఇద్దరి జంట బాగుందంటూ కామెంట్లు పడుతున్నాయి. ఇద్దరూ సినీపరిశ్రమకు చెందిన వ్యక్తులే కావడంతో, ఈసారి వీళ్లిద్దరి బంధం చిరకాలం నిలుస్తుందంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు.
సౌందర్యకు పదేళ్ల కిందటే పెళ్లయింది. పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్ తో జరిగిన ఆ వివాహం విడాకులకు దారితీసింది. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. వీళ్లిద్దరూ విడాకులు తీసుకొని దాదాపు రెండేళ్లు అవుతోంది. ఈ గ్యాప్ లో విశాగన్ కు దగ్గరైంది సౌందర్య. దాదాపు ఏడాదిగా వీళ్లిద్దరికీ పరిచయం.
ఇదే విషయాన్ని తండ్రి రజనీకాంత్ కు కూడా చెప్పి అతడి ఆమోదం కూడా తీసుకుంది. అలా పెద్దల అంగీకారంతో సౌందర్య-విశాగన్ పెళ్లికి రంగం సిద్ధమైంది. పెళ్లి తర్వాత కూడా తను దర్శకురాలిగా కొనసాగుతానని సౌందర్య ప్రకటించగా, విశాగన్ మాత్రం ప్రస్తుతం మీడియాకు అందుబాటులో లేడు.