ఒకవైపు లాక్ డౌన్ పటిష్టంగానే అమలవుతూ ఉంది. జనాలు కూడా క్రమక్రమంగా అర్థం చేసుకుంటున్నారు. ఇళ్లకు పరిమితం కావడం అలవాటు అవుతూ వస్తోంది. అయితే కరోనా నంబర్లు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో ఒక్క శుక్రవారమే కొత్తగా మరో పది మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరిందని ఆయన ప్రకటించారు. అయితే ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని కేసీఆర్ ప్రకటించారు.
కరోనాను ఎదుర్కొనడానికి లాక్ డౌన్ ఎంతో కీలకం అని, ఎవరూ ఇళ్లను దాటి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. కరోనాను ఎదుర్కొనడానికి ప్రభుత్వం వైపు నుంచి అన్ని చర్యలూ సిద్ధంగా ఉన్నాయని కూడా ఆయన తెలిపారు. హోం క్వారెంటైన్లు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉన్న వారు.. ఇలా మొత్తం 25 వేల మందిని పర్యవేక్షణలో ఉంచినట్టుగా ఆయన ప్రకటించారు.
మొత్తం 60 వేల మందికి చికిత్స చేయడానికి తగిన రీతిలో ఏర్పాట్లు చేసినట్టుగా, 11 వేల మందిని ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నట్టుగా కేసీఆర్ తెలిపారు. 1400 ఐసీయూ బెడ్ లు రెడీగా ఉన్నట్టుగా ఆయన వివరించారు. ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల్లో ఒకరికి చికిత్స ద్వారా నయం చేసినట్టుగా ప్రకటించారు. ప్రజలు సహకరించాలని,ఇళ్లను దాటి అనవసరంగా బయటకు రావొద్దని విన్నవించారు తెలంగాణ సీఎం.
హైదరాబాద్ లోని పక్క రాష్ట్రాల వారి విషయంలో కూడా కేసీఆర్ స్పందించారు. ఎవ్వరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, హాస్టల్స్ ను మూసి వేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడివారు అక్కడ ఉండాలని ఊరికే గత్తరబిత్తర కారాదని ఆయన వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ వల్ల పరిస్థితి ఈ మాత్రం అయినా మెరుగ్గా ఉందని, పోలీసులు- వైద్య అధికారులకు ప్రజలు సహకరించి పరిస్థితి మెరుగయ్యే విషయంలో సహకారం అందించాలని కేసీఆర్ విన్నవించారు.